"షల్ ఉయ్ హావ్ వన్ మోర్ రౌండ్!"
మూడో బాటిల్ చేత్తో పట్టుకొని అతిధులకేసి చూశాడు చౌదరి.
"నో! థాంక్సు" దాదాపు అందరూ అన్నారు.
"మిస్టర్ కృష్ణా వాట్ అవుట్ యూ?" అంటూ ఒకాయన కృష్ణ దగ్గిరకు వచ్చాడు.
"నో.....నో....స....ర్" తడబడుతూ అన్నాడు కృష్ణ.
"సో లెటస్ జాయిన్ ద లేడీస్!" చౌదరి అన్నాడు.
కొందరు మెల్లగా నవ్వారు.
కొందరు పెద్దగా నవ్వారు.
మరికొందరు చప్పట్లు చరుస్తూ నవ్వారు.
"అఫ్ కోర్స్ ఇన్ ద డిన్నర్" జోక్ పూర్తిచేసి చౌదరి పకపకా నవ్వాడు. అతని నవ్వుతో నవ్వులు కలిపేశారు.
కృష్ణకూడా నవ్వడానికి ప్రయత్నించాడుకాని నవ్వలేకపోయాడు. ఏదో అనాలని నోరు తెరిచాడు. మాట పెగిలిరాలేదు. లోపల తొలుస్తున్న పురుగుకు మంచి ఆహారం దొరికింది. కరకరా నమిలేస్తున్నది. గుండె గుల్లగా అయిపోయినట్టుంది.
ఇప్పుడే! ఇక్కడే చెప్పేస్తాడు.
వన్స్ ఫర్ ఆల్ పీడ విరగడైపోతుంది.
ఏమనీ?
ఏమనా?
అదే! తన భార్య కుంతీదేవికి చెల్లెలని!
కుంతీదేవికి చెల్లెలా?
అవును! కుంతీదేవికి చెల్లెలే!
అసలు కుంతీదేవికి చెల్లెళ్ళు లేరేమో!
లేకపోతే పోనియ్.
అపరకుంతీదేవి అంటే తప్పేముంది?
కలియుగ కుంతీదేవి అంటే మరీ బాగుంటుందేమో?
లేక మరో కుంతీదేవి__
పెళ్ళికాకముందే బిడ్డను కన్నది.
కుంతి! మరో కుంతి! కలియుగ కుంతి!
"ఓ....ఓ....కే...." కుర్చీలోంచి లేచి ముందుకు వంగాడు.
చౌదరి వెనకనుంచి గబుక్కున పట్టుకున్నాడు.
"ఈజీ మై బాయ్, ఈజీ!" చౌదరి వీపు నిమిరాడు.
రెండుసార్లు వాంతి చేసుకున్నాడు కృష్ణ. కళ్ళు తేలేశాడు.
ఐస్ వాటర్ తో ముఖం కడిగి, టవల్ తో తుడిచాడు చౌదరి.
పది నిముషాల్లో తేరుకున్నాడు కృష్ణ.
"ఐయాం సారీ సర్!"
"ఫర్వాలేదులేవోయ్. మొదటిసారి గదూ? ఐ థింక్ యు హావ్ టేకెన్ ఎబిట్ ఫాస్ట్!"
పరీక్షలో కుర్రాడు తప్పడానికి కారణాలు వివరిస్తున్న ట్యూషన్ మాస్టరులా అన్నాడు అంకుల్ చౌదరి.
డిన్నర్ మొదలయింది.
ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది తినకుండా మాట్లాడుతున్నారు. కొంతమంది తింటూనే మాట్లాడుతున్నారు. కొందరు తినడం పూర్తిచేసి మాట్లాడుతున్నారు.
"సుధా! ఇవ్వాళ మీ ఆయనకు తీర్థాభ్యాసం అయింది" కృష్ణను చూపిస్తూ అన్నాడు చౌదరి.
ఒక్కక్షణం అర్ధంకాక అంకుల్ కేసి చూపింది.
మరుక్షణం అర్ధం అయింది.
లాన్స్ లో జరిగింది సుధ వింది.
ఆమెకు భర్తకేసి చూడాలంటేనే సిగ్గుగా వుంది.
అలవాటు లేనివాడు ఎందుకు తీసుకోవాలి?
అంత తీసుకున్నా పీకలదాకా తాగాలా?
అలా అతాగి కక్కడంకూడా___ఛ! ఛ!
నలుగుర్లో తలవంపులపని అయింది.
సుధ మదనపడసాగింది.
ఆమె చిత్తశోభను గ్రహించాడు చౌదరి-
సుధ దగ్గరకు వచ్చాడు.
"కృష్ణ తప్పేమీలేదమ్మా నేనే బలవంతం చేశాను. బాస్ ఆదేశాలను అమలు జరిపాడు. హి ఈజ్ ఎనైస్ బాయ్. ఫర్ ఫెక్ట్ జెంటిల్ మన్. కృష్ణ నీకు భర్తగా లభించడం నీ అదృష్టం. అతడిని చూసి గర్వ పడుతున్నాను."
అంకుల్ చౌదరి కంఠం గంభీరంగా వుంది. అతని మాటల్లోని ప్రతి అక్షరంలో నిజాయితీతోపాటు అభిమానం నిండి వుంది.
సుధ పెదవులపై చిరునవ్వు విరిసింది. ఆ విరిసిన చిరునవ్వు వెలుగునీడలా అలాగే వుండిపోయింది ఆమె పెదవులమీద.
"హాయ్! జస్ట్ లుక్ ఎట్ ఇట్!"
కృష్ణ చూశాడు.
"కమాన్! మీరందరూ చూడండి. ఆ పెదవులపై నవ్వు చూడండి మోనాలిసా! ప్రఖ్యాత చిత్రం మోనాలిసా! ద గ్రేట్ ఫైటింగ్!"
అంకుల్ చౌదరి సుధ మొహంమీదినుంచి దృష్టి మరల్చకుండానే ఉద్వేగంతో చెప్పుకుపోతున్నాడు.
మనిషికి అసలే ఉద్రేకం ఎక్కువ.
అందులో నాలుగు పెగ్గులు స్కాచ్ లోపల పడింది. ఇంకేం కావాలి?
శిల్పంలా__చిత్రకారుడు రూపుదిద్దిన చిత్రంలా - అంకుల్ చౌదరిని విస్తుబోయి చూస్తూ నిలబడిపోయింది సుధ.
శిఖరాగ్రంనుంచి లోయలోకి దొర్లుతూన్న కొండరాళ్ళ ధ్వని వినిపించింది కృష్ణకు.
"మోనాలిసా!"
జగన్మోహన్ ప్రియురాలు!
సుధా ప్రియ!
ప్రియ సుధ!
సుధ__తన అర్ధాంగిగా తన ఎదుట సాక్షాత్తూ మోనాలిసాలా నిలబడి వుంది.
ఆలోచిస్తున్నాడు కృష్ణ.
"సుధా! నీకు గుర్తుందా? మీ యూనివర్శిటీ కల్చరర్ ప్రోగ్రాంలో నువ్వు వేసిన బాబ్లో?" అంటూ కృష్ణవైపుకు తిరిగి "ఆ రోజు జడ్జి నేనే నోయ్ కృష్ణా!" అన్నాడు చౌదరి.
కృష్ణ కళ్ళప్పగించి చూస్తూ నిల్చున్నాడు.
"సుధ మోనాలిసా వేషం వేసింది. అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఫ్రెంచి చిత్రకారుడు లియోనార్డోడవిన్సీ చిత్రించిన 'మోనాలిసా' లాగే వుంది. సుధ అదే చూపు. అదే నవ్వు. ఇప్పుడు చూశావు గదా? సుధ ఒక్కొక్క మూడ్ లో అచ్చం మోనాలిసాలాగే కన్పిస్తుంది."
"చూడు ఆంటీ! అంకుల్ మరీనూ?"
"సుధ పక్కనేవుండిన సుభద్రమ్మకు కంప్లయింటు చేసింది.
"మీరుండండీ! ఏది పట్టుకుంటే అదే సుధా నువ్వు స్వీట్ తినలేదుగా?" అంటూ సుభద్రమ్మ స్వీట్ పెట్టినప్లేటు సుధకు అందించింది.
డిన్నర్ పూర్తి అయింది.
అతిధులు ఒక్కొక్కరే చౌదరి దంపతుల దగ్గిర శెలవు తీసుకొని వెళ్ళిపోయారు.
"ఇవన్నీ ఎందుకు అంటీ ఇప్పుడు?"
"ఫర్వాలేదమ్మా! నీ పెళ్ళికి రాలేకపోయాం, తీసికో" సుభద్రమ్మ బొట్టుపెట్టి చీరాబ్లౌజూ అందించింది.
చౌదరి కృష్ణ దంపతులను కారులో తీసికొచ్చి ఇంటిదగ్గర దింపాడు.
కక్కిన విస్కీ కక్కి, ఉన్నదే పనిచేసినట్టుంది. పడుకోగానే నిద్రపోయాడు కృష్ణ ఆ రాత్రి.
13
"సర్! నేనే! కృష్ణను!"
"హల్లో కృష్ణా ఎలా ఉన్నావ్?" ఫోన్ లో అవతలనుంచి చౌదరి అడిగాడు.
"బాగానే వున్నా, కానీ కొద్దిగా నీరసంగా వుంది. ఇవ్వాళా రేపూ శెలవు పెడదామని__"
"నో ప్రాబ్లమ్. కావాలంటే మరో రోజుకూడా తీసికో, నీ ఆరోగ్యం సంగతి ముందు చూసుకో. డాక్టర్ కు ఫోన్ చెయ్యమంటావా? అదే మొన్న పార్టీకి వచ్చాడు చూడు. అదే డాక్టర్ రమేష్, చాలా మంచివాడు. మంచి డాక్టరుకూడా__"
"డాక్టర్ అవసరంలేదుసర్. ఐయాం ఆల్ రైట్. బాగానే ఉన్నాను."
"దెన్ ఓకే! సాయంకాలమో రేపో వచ్చి చూస్తాను. సుధ ఏం చేస్తున్నది? అమ్మాయిని కంగారుపెట్టకు."
"కంగారేం లేదు సర్. ఊరికే పెడుతున్నాను శెలవు."
"ఊరికేనా?"