Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 21

    "కాదు సర్, సుధను తీసికొని అలా తిరిగొద్దామని....."
   
    "ఓ ఐసీ. పిక్ నిక్ కు వెళుతున్నారా? దట్ ఈజ్ గుడ్! ఎక్కడ కెళుతున్నారు?"
   
    "జూకు వెళదాం అనుకుంటున్నాం."
   
    "జూ ఏమిటోయ్ జూ! ఏ హిమాయత్ సాగర్ కో, గండిపేటకో పోక! ఒక రాత్రి స్పెండ్ చేసి రండి."

    "అలాగే సర్! థాంక్యూ!"
   
    "ఓ....కే...బై" అవతల రిసీవర్ పెట్టిన శబ్దం.
   
    "జూకు వెళ్ళడానికి శలవు పెడుతున్నారా?"
   
    కృష్ణ రిసీవర్ పెట్టేసి గిర్రున వెనక్కు తిరిగాడు.
   
    కాఫీకప్పు పట్టుకొని నిలబడివుంది సుధ.
   
    సుధ చేతిలోని కప్పు అందుకున్నాడు.
   
    "జ్యూలో ఏముందండీ!" పైటచెంగుకు చేతులు తుడుచుకుంటూ అడిగింది.
   
    "పులులూ-సింహాలూ-కోతులూ-"
   
    సుధ బిత్తరపోయినట్టు భర్తకేసి చూసింది.
   
    "అది కాదండీ. ఇవ్వాళ జూలో ఏదయినా ప్రత్యేకంగా వుందా అని అడుగుతున్నాను."
   
    "ఇప్పుడు జూకు ఎవరెళుతున్నారంటా?" అతని కంఠం తీవ్రంగా వుంది.
   
    "మీరే కదండీ చెపుతున్నారు ఫోనులో!" సుధకుకూడా కొద్దిగా వేడి పుట్టింది.
   
    "ఆయన బోర కొడుతూవుంటే అలా చెప్పాను. వంట్లో బాగా లేదంటే డాక్టరును పంపుతానంటున్నాడు మరి!"
   
    "అందుకని జూకు వెళుతున్నానని చెప్పి శెలవు అడిగారా?"
   
    "మరేం చావమంటావా చెప్పక?" చిరాగ్గా అన్నాడు కృష్ణ.
   
    "మీకు నిజంగానే వంట్లో బాగులేనట్టుందండీ!" అంటూ సుధ భర్త  నుదురుమీద చెయ్యివేసి చూసింది.
   
    "జ్వరం ఉన్నట్టులేదు. రాత్రి ఆ పాడుది తాగారుగా? దాని ఫలితమే ఇది. అంకుల్ బలవంతంచేస్తేమాత్రం మీరు తాగాలా ఏం?" సాగదీసింది.
   
    "బుద్ది తక్కువయి!"
   
    "అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు, తెలుస్తూనే వుందిగా?"
   
    ఫెడేలున ముఖంమీద కొట్టినట్టు అయింది కృష్ణకు. మిగిలిన కాఫీని గుటుక్కున మింగి ఖాళీ కప్పు సుధకు అందించాడు.
   
    సుధ కప్పును విసురుగా అందుకుంది.
   
    "సుధా!"
   
    చరచరా వంటగదికేసి నడుస్తున్న సుధ ఆగింది. వెనక్కు చూసింది.
   
    "ఏమిటి?"
   
    "ఏమీ లేదు."
   
    "మరెందుకు పిల్చారూ?"
   
    "నాకు వంటిలో బాగానే వుంది. నీతో మాట్లాడాలని వుంది."
   
    సుధ కృష్ణ దగ్గిరకు వచ్చింది.
   
    "సాయంకాలం గండిపేట వెళదామా?"
   
    "మీకు వంటిలో బాగుంటే అలాగే వెళదాం."
   
    సుధ మనసులో మల్లెలు విరిసాయి.
   
    "అంకుల్ కు కూడా వెళతామని చెప్పాను."
   
    "బాస్ కు చెప్పారుగనక వెళదామంటున్నారా?"
   
    "అది కాదు."
   
    "ఫర్వాలేదు. నేను ఫోన్ చేసి చెబుతాలే ఆయన ఏమీ అనుకోరు."
   
    "అబ్బే! అదేంకాదు సుధా. వూరికే చెపుతున్నాను. సరదాగా వెళదాం. అక్కడ నీటిఒడ్డున చల్లగా హాయిగా వుంటుంది. సాయంకాలం వంట చెయ్యొద్దు! 'నయాగరా'లో భోజనంచేసి వద్దాం, సరేనా?"
   
    "ఊఁ మీ ఇష్టం!"
   
    కళ్ళు గుండ్రంగా తిప్పింది సుధ.
   
    గత రాత్రి జరిగిన సంఘటనకు పాపం ఆయన బాధ పడుతున్నట్టున్నారు.
   
    పైకి చెప్పలేక చిరాకుపరాకుగా మాట్లాడుతున్నాడు. అంకుల్ చాలా పొరపాటు చేశారు. అలవాటులేని ఆయనచేత బలవంతంగా తాగించారు.
   
    ఆయన బుర్రను అది ఇంకా తినేస్తూనే వుంది.
   
    అలా బయటికి వెళ్ళొస్తే కాస్త తేరుకుంటాడు.
   
    ఆయన మనసు బహు సున్నితం.
   
    మనసులోని బాధను పైకి చెప్పుకోడు.
   
    తనే కృష్ణ మనసును అర్ధం చేసికొని ప్రవర్తించాలి. అది తన కర్తవ్యం.
   
    ఆలోచిస్తూ సుధ వంటగదిలోకి నడిచింది.
   
                                                                        14
   
    మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి.
   
    ప్రోబ్ మేగ జైన్ తిరగేస్తూ పడుకున్నాడు కృష్ణ.
   
    పక్కనే రెండో మంచంమీద సుధ కళ్ళుమూసుకొని పడుకుంది.
   
    ఫాన్ గాలికి ఆమె ముఖంమీద తుమ్మెదబారుల్లా ముంగురులు ఎగిరిపడుతున్నాయి. ఆమె వదనం ప్రశాంతంగా వుంది. నిర్మలంగా వుంది.
   
    ఆమె నిద్రలో నవ్వుతున్నది.
   
    పెదవులపై అదే నవ్వు!
   
    మోనాలిసా నవ్వు!   
   
    ఏం కలలు కంటుందో?
   
    చేతిలో వుండిన పత్రికను పక్కకు విసిరి ఆమె ముఖంలోకి కన్నార్పకుండా చూడసాగాడు కృష్ణ.
   
    పాపను__మోనాను గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
   
    తల్లి పోలికలు ఆ పాపలో ఉన్నాయా?
   
    ఆ పాపకూడా ఇలాగే నవ్వుతుందా!
   
    "ఏమో? ఏమో?
   
    సందేహంలేదు,
   
    జగన్ ప్రియురాలు ఈ సుధే!
   
    మోనాను కన్నతల్లి సుధే!
   
    తండ్రి పోలీసాఫీసర్.
   
    వైజాగ్ లో చదివింది.
   
    ఎం, ఎ. ఫస్టియర్ లో తండ్రికి గుంటూరు ట్రాన్స్ఫరు అయింది. ఆఖరి సంవత్సరంలో అతను గుంటూరునుంచి ఢిల్లీ వెళ్ళిపోయాడు. జగన్మోహన్ చెప్పింది అక్షరాల సరిపోయింది. చౌదరి చెప్పిందికూడా సరిపోయింది.
   
    సుధ మోనాలిసా వేషం వేసింది.
   
    ఆ వేషంలో చూసే జగన్ సుధను ప్రేమించాడు.
   
    వాళ్ళ ప్రేమ ఊటీలో పరాకాష్ట చేరుకొంది__
   
    అమాంతం గుండెకాయ ఎగబాకి గొంతుకు అడ్డంపడినట్టు ఐంది ఆలోచిస్తున్న కృష్ణకు.
   
    ఆమెకేసి చూస్తున్నాడు.
   
    ఆమె పెదవులమీది నవ్వు హఠాత్తుగా మాయం అయిపోయింది. చందమామమీద కారుమేఘం కమ్మినట్టు ఆమె ముఖం మారిపోయింది. నొసలు చిట్లించింది. పెదవులు మెలితిరిగిపోతున్నాయి. ముఖమంతా చిరు చెమట్లు పట్టాయి.
   
    ఆమె తన మనసును చదవగలుగుతోందా? తన మెదడులో కదులుతున్న భావపరంపర ఆమె మెదడును చేరుతున్నాయా?
   
    ఇది సంభవమా?
   
    మనోవైజ్ఞానిక శాస్త్రం తెలిసినవాళ్ళు ఇది సాధ్యమనే అంటారు.
   
    మేబీ థాట్ రీడింగ్?
   
    కాని ఇది అందరికీ సాధ్యపడేదా?
   
    ఒక్కొక్క సమయంలో, ఆయా ప్రత్యేక సందర్బాలలో ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చునేమో! అవచేతనలో ఉన్న ఆమె మనసు, తన చేతన మనసులో లేస్తున్న ఆలోచనా తరంగాలను గ్రహిస్తోందా?
   
    ఒకసారిగా వెర్రికేక!
   
    సుధ చివ్వున లేచి కూర్చుంది. నిలువెల్లా వణికిపోసాగింది.
   
    "సుధా! ఏమైంది?" కృష్ణ ఆమెను పొదివిపట్టుకున్నాడు.
   
    సుధ ఇంకా వణుకుతూనే ఉంది.
   
    "ఏమైంది సుధా?"
   
    "ఏమిటో పాడుకల పీడకల వచ్చింది. నా బిడ్డను రాక్షసుడొకడు నానుంచి వేరుచేస్తున్నట్టుగా కలవచ్చింది?
   
    "పగటి కలలు నిజంకావంటారులే. భయపడకు."
   
    "మంచినీళ్ళు! నోరెండిపోతోంది" లేవబోయిందామె.
   
    "లేవకు నేను తెస్తాను" కృష్ణ లేచివెళ్ళి నీళ్ళు తెచ్చి సుధకు ఇచ్చాడు.
   
    నీళ్ళుతాగి భర్త  కళ్ళల్లోకి చూస్తూ "ఏమిటండీ ఇలాంటి కలొచ్చిందీ" దిగులుగా అంది.
   
    "పుట్టబోయే బిడ్డను గురించి ఒకటే ఇదిగా ఆలోచిస్తున్నావ్ అందుకే కలొచ్చింది. అంతరాంతరాల్లో ఏదో ఏదో భయం మెదులుతోంది. ఆ భయమే సబ్ కాన్ షస్ లో పనిచేస్తూంది. ధైర్యంగా వుండాలి. గర్భవత్య్గా ఉన్నప్పుడు మానసిక ఆందోళనకు గురికావడం మంచిదికాదు. రేపు లేడీ డాక్టర్ దగ్గిరకు వెళదాం. ప్రతినెలా పరీక్ష చేయించుకొని డాక్టర్ సలహా పాటించడం మంచిది" యాంత్రికంగా చెప్పుకుపోతున్నాడు. అదే సమయంలో మరో ఆలోచన సమాంతర రేఖలా సాగిపోతూంది.

 Previous Page Next Page