Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 19

    "అసలు విమ్మి ఆ ఉద్యోగం ఎందుకు చేస్తుందో తెలుసా?"
   
    "అదేగా అడుగుతున్నాను."
   
    "పెళ్ళిచేసుకోవడానికి ఇష్టంలేదు. అది ఉద్యోగం మానేసిన తెల్లవారే అంకుల్ వాంటెడ్ కాలమ్స్ లో వేసేయిస్తాడు, విమల భయమదే! అందుకే ఆ ఉద్యోగం పెద్దగా ఇష్టంలేకపోయినా చేస్తున్నది. మద్రాస్-ఢిల్లీ, బాంబే, కలకత్తా, వేలకొద్దీ మైళ్ళు గాలిలో ఎగురుతూ తిరగడం మొదట్లో సరదాగానే ఉండేదట. కానీ రోజులు గడిచేకొద్దీ దానికి ఆ ఉద్యోగం బోరుగా ఉందట."
   
    "ఆవిడకు పెళ్ళెందుకు ఇష్టంలేదట?"
   
    "ఏమిటండీ మీ ప్రశ్నా మీరూనూ ప్రాసిక్యూషన్ లాయర్ లా!"
   
    "ఎవర్నయినా ప్రేమించిందా?"
   
    "ప్రేమిస్తే ఇబ్బందేముందీ? ఆమె తనకు ఇష్టమైనవాడిని చేసుకోవడం, అంకుల్ కు అభ్యంతరముండదు, ఆమాట కూతురితో ఆయన ఎప్పుడో చెప్పేశారు."
   
    "ప్రేమించినవాడెవడైనా మోసం చేశాడా?"
   
    "ఛ! ఛ! అలాంటిదేమీ లేదు."
   
    "ఫ్రీలాన్సర్ గ తిరగడం ఆమెకిష్టమా?"
   
    "ఇంకా నయం, ఆమాటే దానితో అనిఉంటే ఆ విమానంలోనించి అమాంతం బయటికి తోసేసి ఉండేది" అని నవ్వింది సుధ.
   
    అతనూ నవ్వేడు.
   
    "సుధా!"
   
    "అబ్బ! మళ్ళీ ఏమైదండీ?"
   
    "ఒక్కమాట!"
   
    "నాకు కళ్ళు మూసుకుపోతున్నాయి."
   
    "నువ్వు వైజాగ్ లో చదివేటప్పుడు మీ నాన్నా వి.కే, చౌదరి గారూ వైజాగ్ లోనే ఉన్నారన్నావుగదూ?"
   
    "ఊఁ! అన్నాను! అయితే?"

    "ఆఁ హాఁ ఏంలేదు. నువ్వు హాస్టల్లో ఉన్నట్టుగా చెప్పిన గుర్తు. అందుకని...." ఏదోగా అన్నాడు.
   
    జగన్మోహన్ చెప్పినదానికి లింక్ ను వెదకిపట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
   
    సుధ చివాల్న లేచి కూర్చుంది.
   
    భార్తకేసి చిరాగ్గా చూసింది.
   
    "ఏమిటీ మీ యక్షప్రశ్నలు? హాస్టల్లో ఉన్నాను. ఉంటే?" రెట్టించి అడిగింది.
   
    "ఫామిలీ వైజాగ్ లో వుంటే నువ్వు హాస్టల్లో ఎందుకు ఉండాల్సిన అవసరం వచ్చిందీ?"
   
    "అలా అని నేను చెప్పానా?" సుధకు ఒళ్ళుమండిపోయింది.
   
    "నువ్వు చెప్పినదానికి అర్ధమేమిటిమరి?"
   
    "మా నాన్నగారు వైజాగ్ లో వుంటే నాకు హాస్టల్లో ఉండాల్సిన కర్మం ఏం పట్టింది?"
   
    "మరెందుకున్నావ్?"
   
    "నేను బి.ఏ. లో ఉన్నప్పుడు మా నాన్నగారు వైజాగ్ లో ఉన్నారు. ఎం. ఏ. చేరిన మూడునెలలకు ఆయనకు గుంటూరు ట్రాన్సఫర్ అయింది. ఆ రెండేళ్ళూ నేను హాస్టల్లో ఉన్నాను. అప్పుడే చౌదరిగారు ఢిల్లీలో సి.యస్.ఐ. ఆర్. లాబ్ లో చేరారు. ఆ తర్వాత మా నాన్న గారు డెపుటేషన్ మీద ఢిల్లీ సి.బి. ఐ. కి ట్రాన్స్ఫర్ అయ్యారు."
   
    ఆగి భర్త ముఖంలోకి చూసింది.
   
    "ఊఁ"
   
    "అక్కడే మన పెళ్ళిచూపులు ఐనయ్. ఆ తర్వాత పెళ్ళి జరిగింది. ఇక్కడ మీరు కాపరం పెట్టారు. ఇక చాలా? ఇంకా చెప్పాల్సిందేమైనా మిగిలిఉందా?"
   
    సుధ పక్కకు తిరిగి, దుప్పటి కంఠంవరకు లాక్కుంది.
   
    లింకు దొరికింది.
   
    జగన్మోహన్ చెప్పినదానికి సరిపోయింది. ఎం. ఏ. ఫస్టియర్ లోనే హాస్టల్లో చేరింది. రెండో సంవత్సరం చివర్లో వాళ్ళ నాన్నకు ఢిల్లీ బదిలీ ఐంది.
   
    కరెక్టు!
   
    సందేహం లేదు.
   
    జగన్ చెప్పింది అక్షరాల సత్యం.
   
    భార్యపక్కన పడుకుని ఉన్న కృష్ణ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. కళ్ళముందు కన్పిస్తున్న వాస్తవాన్ని అంగీకరించడానికి అంతవరకూ ప్రతిఘటించిన అతని మనసు లొంగిపోయింది.
   
    ఇంకా ఋజువులేం కావాలి?
   
    చాలు!
   
    ఇక చెయ్యల్సింది సుధచేత నిజాన్ని చెప్పించడమే.
   
    మోనోను తల్లికి అప్పగించడం-తల్లి బిడ్డను జగన్ దగ్గిరకు చేర్చడము-తన కర్తవ్యం.
   
    అది సాధ్యమా!
   
    తనవల్ల అవుతుందా?
   
    తప్పదు. ఎలాగయినా సాధించాలి. మార్గాంతరంలేదు అంత కంటే.
   
    మరిప్పుడు సుధ కడుపులో జీవం పోసుకుంటున్న బిడ్డ మాటేమిటి? ఆ బిడ్డను స్వీకరించడానికి జగన్ అంగీకరిస్తాడా?
   
    ఆ బిడ్డ తన బిడ్డ! ఆ బిడ్డ బాధ్యత తనదే. ఆ బిడ్డను తనే పెంచాలి. జగన్ మోనోను పెంచుతున్నట్లు తను తన బిడ్డను పెంచాలి.
   
    తల్లికి భారమైన బిడ్డ బ్రతికెలా వుంటుందో మోనోను చూస్తే తెలిసింది, తన పాపకూ మోనాగతే పడుతుందా?
   
    ఒక పాపను తల్లిదగ్గిరకు చేరిస్తే, మరో పాప తల్లికి దూరం అవుతుంది.
   
    ఐరన్ ఆఫ్ ఫేట్ అంటే ఇదేనేమో?
   
    ప్రేయసీ ప్రియుల్ని కలపడానికి భార్యా భర్తలు విడిపోవాలా?
   
    శరపరంపరగా సాగిపోతూఉన్న ఆలోచనలను అదుపులో పెట్టుకోగల శక్తిని కోల్పోయాడు కృష్ణ.
   
    తెల్లవార్లూ ఆలోచిస్తూనే ఉన్నాడు.
   
    కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి.
   
    కనుగుడ్లు పేలిపోవడానికి సిద్దంగా ఉన్నట్టుగా అన్పిస్తోంది.
   
    ఐనా అతని మనసుకు విశ్రాంతిలేదు.
   
    అతని ఆలోచనలకు అంతు దొరకడంలేదు.
   
                                              12
   
    వి.కె. చౌదరి లాన్ లో నిలబడి అతిధుల్ని ఆహ్వానిస్తున్నాడు.
   
    ఆయన సతీమణి సుభద్రమ్మ ఆడవాళ్ళను సాదరంగా తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెడుతూంది.
   
    "ఛీఫ్ గెస్ట్సే ఆలస్యంగ వస్తే ఎలా?" అప్పుడే వస్తున్న కృష్ణనూ, సుధనూ చూస్తూ అన్నాడు చౌదరి.
   
    "ఆలస్యం నాదికాదు. మీ అమ్మాయిదే సర్!" సుధను చూపిస్తూ చెప్పాడు కృష్ణ.
   
    "ఓకె. ఓకె. అమ్మాయ్! నువ్వు లోపలకెళ్ళు, ఆంటీ నీకోసం ఎదురుచూస్తూంది" అన్నాడు సుధతో.

    ఆమె లోపలకెళ్ళింది.
   
    చౌదరి కృష్ణను, సోఫాలో కూర్చొని స్కాచ్ సిప్ చేస్తున్న అతిధులకు పరిచయం చేశాడు.
   
    స్కాచ్ లో సోడా కలిపి, ఐస్ ముక్కలువేసి గ్లాసు కృష్ణకు అందించబోయాడు చౌదరి.
   
    "నో సర్! నేను తీసుకోను."
   
    "అసలా - ఎప్పుడూ....?" కృష్ణ ముఖంలోకి చూశాడు చౌదరి.
   
    "లేదు సర్. అలవాటులేదు."

    "అలవాటేమిటోయి. అసలు తీసుకోకపోతే అలవాటెలా ఔతుంది? ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలిగదా? దిసీస్ ద అకేషన్! పార్టీ ఏర్పాటు చేసింది మీ దంపతులకోసమేగదా? కమాన్!" అంటూ చౌదరి కృష్ణ చేతికి గ్లాస్ అందించాడు.
   
    కృష్ణ చెయ్యి ఒణికింది.
   
    తడబడుతూ కుర్చీలో కూలబడ్డాడు.
   
    "ఏంకాదు. భయపడకు. సిప్ స్లోలీ!" చౌదరి కృష్ణకు ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
   
    "ఛీర్స్!"
   
    గ్లాసు పైకెత్తాడు చౌదరి.
   
    "ఛీర్స్!" కృష్ణ గ్లాస్ పెదవులకు ఆనించాడు.
   
    "గుడ్!" కృష్ణ భుజం తట్టాడు చౌదరి.
   
    ఆ తర్వాత లేచి మిగతా అతిధుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు చౌదరి.
   
    అరగంట గడిచింది.
   
    అప్పటికే రెండు బాటిల్స్ ఖాళీ అయ్యాయి.

 Previous Page Next Page