Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 2


    గ్లాసులో విస్కీ వంపుతూ అడిగింది.

     "తీసుకుంటారా!" అని.

     భారతికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కానీ తనని తాను సంభాళించుకొని.

     "అలవాటు లేదు" అంది.

     "అలవాటు అనేది ఏదీ ముందు వుండదు. దానికి ముందు ప్రారంభం అంటూ వుండాలి" ఆమె నవ్వింది.
 
     భారతి మాట్లాడలేదు.

     "నీ పేరు?" ఏకవచనంలో అడిగిందామె ఆమె గొంతు హస్కీగా వుంది. వినడానికి చాలా బాగుంది. కానీ విస్కీ వాసనకి కడుపులో తిప్పుతోంది.

     "నిన్నే! పేరు చెప్పడానికి కూడా రహస్యం ఏదన్నా వుందా?"

    "రహస్యాలు నాకేం లేవు"

    "ఈ అపార్టుమెంటులో ఏం జరిగినా అంతా రహస్యంగానే వుంచుతాడు ప్రశాంత్. లేకపోతే నేనిన్ని సార్లు ఎలా రాగలను?"

    భారతికి కంపరం పుట్టుకొస్తోంది.

     "ఇదెవరో దెయ్యంలా పట్టుకుంది. ప్రశాంత్ గురించి కూడా చాలా అసందర్బంగా మాట్లాడుతోంది. అతను త్వరగా వస్తే బావుండును." అనుకొంటుండగా.

     "నేమ్ మాత్రం చెప్పలేదు" మళ్లీ రెట్టించింది. విడిచి పెట్టేలాలేదు.

    "భారతి!"

    "పెన్ నేమ్ కాదుగా!" కన్నుగీటుతూ అందామె.

     "కొంతమంది అభిమానులు దొంగ పేర్లతో ఉత్తరాలు రాయడం, ప్రశాంత్ ని కలుసుకోవడం నాకు తెలుసు" అందామె.

     "నాకు తెలీదు"

    "నువ్వు కూడా ప్రశాంత్ అభిమానివేనా?" లిప్ స్టిక్ వేసుకొన్న ఎర్రని పెదిమలని నాలుకతో తడి చేసుకుంటూ అడిగిందామె.

     ఆమె కెలో సమాధానం చెప్పాలో తెలీడం లేదు భారతికి. నువ్వు'కూడా' అంటోందీ అంటే ఆమె ఖచ్చితంగా ప్రశాంత్ అభిమాని అయి వుండాలి.

     అయితే?

    ఆమె గ్లాసులో విస్కీని చప్పరిస్తోంది.

     అభిమాని??

    అయితే ఇలాంటి పరిస్థితిలో ఇక్కడెందుకున్నట్టు? పైగా తాగుతోంది.

     అతను నిద్రపోతున్నాడని చెప్పింది.

     ఆమె అలంకరణలో లోపాలెన్నో!చెదిరిన కళ్లకాటుక.

     పెదిమ కిందికి పాకిన ఎర్రని రంగు... .చెంప మీద పంటి గాటు....

     ప్రశాంత్ కీ ఈమెకీ....!?

     భారతికి దుఃఖం వస్తోంది.

     "సిగ్గు పడతావెందుకు?"

    "నేను అతని అభిమానిని, ఫాన్ ని. నా అభిమాన రైటర్ కోసం ఇలా అప్పుడప్పుడూ కాంపుపేరుతో వస్తుంటాను. బైదిబై అయాం మిస్ శిరీష ఫ్రమ్ వైజాగ్. అక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో డైరెక్టర్ కి పర్సనల్ స్టెనోగా చేస్తున్నాను" చెప్పింది శిరీష.

     ఆమె మాటలని బట్టి ఆమెకి గల తెగింపు ఎలాంటిదో భారతికి అర్దం అయిపోయింది. వస్తున్న కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

     కానీ ఆమె పెదవులు అదురుతున్నాయి.

     ఆమె తనని కూడా లిస్ట్ లోకి  ఎక్కించేస్తున్నందుకు ఉద్రేకం వస్తోంది.

     బహుశా దానికి తన గురించీ ప్రశాంత్ గురించీ తెలిసి వుండదు.

     అతనికి వేల సంఖ్యలో అభిమానులున్నారు. తనలా ఒకప్పుడు అభిమానిగానే అతనికి పరిచయం అయింది.
 
     ఆ పరిచయం ప్రేమగా మారింది. అతనికి తన సర్వస్వాన్ని అర్పించుకొంది.

     ప్రసాంత్ కి తనంటే ఎంత ప్రేమో ఈ పిచ్చి  ముండకి తెలిసి వుండదు.

     "నేను ప్రశాంత్ ని పెళ్లి చేసుకోబోతున్నాను" అంది భారతి.

     శిరీష కళ్లల్లో ఆశ్చర్యం.

     "వ్వాట్ ది హెల్ ఈజ్ బ్యూటిఫుల్" అని అరిచింది. పగలబడి నవ్వేటం మొదలు పెట్టింది.

     ఆమె పవిట జారిపోయి ఎత్తుగా బయటపడిపోయిన వక్షోజాలు ఆమె నవ్వుకి మరింత బయటికి దూసుకొచ్చాయి.

     "పిచ్చిపట్టిందా? ఎందుకా నవ్వు!"కోపంగా అంది భారతి. శిరీష ఆగింది. చేతిలోకి గ్లాసుని తీసుకొని అందులోని విస్కీని  రెండు గుక్కల్లో తాగేసింది.

     "డేస్ బెస్ట్ జోక్ చెప్పావు భారతీ! ఎందుకో తెలుసా! ప్రశాంత్ నిన్ను పెళ్లి చేసుకొంటానని అని అవుంటే అది న్యూస్. నువ్వు ప్రశాంత్ ని చేసుకొంటున్నానని అనడం జోక్. అర్దమైందా?"

    ఛెళ్లుమని  కొరడాతో కొట్టినట్టయిపోయింది భారతికి.

     "వ్వాట్ నాన్స్ న్స్?" అరిచింది భారతి.

     "నాన్సెన్స్ ... స్వీట్ నాన్సెన్స్..." నవ్వేస్తోంది శిరీష.

 Previous Page Next Page