భారతి ఆవేశంతో లేచి నించుంది. శిరీష నవ్వు ఆపి ఆమె కేసి చూసింది. భారతికి తను కోపం తెప్పించినట్టు గ్రహించింది.
"కూర్చో!" అంది శిరీష.
ఆమె గొంతులో ఒక్కసారిగా మార్పు. ఆమె ఆజ్ఞాపిస్తున్నట్టుంది. అంతే! భారతి మెల్లగా కూర్చుంది.
శిరీష మళ్లీ బాటిల్లోంచి విస్కీని వంపుకొంది గ్లాసులోకి.
"నిన్ను ఇన్ సల్ట్ చేయాలని కాదు భారతీ! నీకు ప్రశాంత్ తో ఎన్నాళ్లనుంచీ పరిచయం!"అడిగింది శిరీష.
"ఆర్నెల్లు"
ఈసారి రెండేళ్లనించి అతనితో స్నేహం "చెప్పింది.
భారతి ఆశ్చర్యంగా చూసింది.
"నీ వయస్సెంత?"
"ఇరవై మూడు" చెప్పింది భారతి.
"ఐసీ. అయితే వయసులో కూడా నీకంటే నేనే పెద్దదాన్ని. అయాం ట్వంటీ సిక్స్. నేను నీ అక్కలాంటి దాన్ని" అంది శిరీష.
భారతి కెందుకో భయం వేస్తోంది. శిరీష మాటల ధోరణిని బట్టి తను మోసపోయినట్టు అర్దం అవుతోంది.
"భారతీ!" పిలిచింది శిరీష.
భారతి తలెత్తి చూసింది.
"భారతీ! నువ్వు ప్రశాంత్ తో ఎంత దూరం వెళ్లివుంటావో నాకు తెలుసు. అర్దం చేసుకోగలను. ఆ సెంటిమెంట్ తో నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు.
"కాని నీకు తెలుసా?
"నాకు సెంటిమెంట్స్ లేవు. ప్రశాంత్ తో నాకున్న రెండేళ్ల స్నేహంలో ఐ మీన్ పరిచయచంలో నేను అతని దగ్గర ఓ ముప్పై సార్లయినా అనుభవాన్ని పొందాను. 'ఫర్ మీ ఇట్ ఈజ్ జస్ట్ ఏ కాజువాలిటీ ఎ చేంజ్ ఫర్ ఎ ఫన్. ఎందుకో తెలుసా?'
"నాకెవ్వరూ లేరు.
"అయాం ఎలోన్.
"నేనీ క్షణం గురించి ఆలోచిస్తానే తప్ప నెక్ట్స్ మినిట్ గురించి నాకు అనవసరం.
"బతికి వున్న క్షణం కోసమే నేను బతుకుతాను. నాది కాని మరుక్షణం కోసం నేనెప్పుడూ బతకను.
"అవును భారతీ!"
"సినీస్టార్స్ కీ, ప్రముఖ రచయితలకీ, అభిమానుల ఫాలోయింగ్ వుంటుంది. ఉత్తరాలతో ముంచెత్తుతారు. వచ్చి పర్సనల్ గా కలుసుకుంటూ వుంటారు. మనం వెర్రిగా అభిమానించే ఆ ప్రముఖులతో ఒక్కోసారి సంబంధం ఏర్పడుతుంది. అలాని పెళ్లి చేసుకోవాలనుకుంటే పాపం వాళ్లు రోజూ పెళ్లి చేసుకోవాలి.
"నేనెందుకు చెబుతున్నానో అర్దం చేసుకో. ప్రశాంత్ నిన్ను పెళ్లి చేసుకొంటాడనుకుంటున్న నీ నమ్మకాన్ని నేనెంతో జాలిపడుతున్నాను భారతీ!
"నమ్మకు. ఎవర్నీ నమ్మకు. ఆఖరికి నీ నీడనే నువ్వు నమ్మకు." అంది శిరీష.
ఆమె మాటలతో నిర్వీర్యమైపోతున్న మనసుని కూడదీసుకుంటూ అన్నది భారతి.
"అతన్ని నమ్మినందుకు నేను మోసపోతానని అనుకోవడం లేదు." ఆమె మాటలకి శిరీష తెరలు తెరలుగా నవ్వింది.
"ఆ కాన్పిడెన్స్ నీకుంటే ఫర్వాలేదు. కానీ నాకు తెలిసినంత వరకూ అతను తనని నమ్మమని కానీ, తనమీద నమ్మకాన్ని పెంచుకోమని కాని చెప్పడు. దటీజ్ ప్రశాంత్!" అంది శిరీష.
"ఎందుకతని గురించి అలా మాట్లాడి నన్ను భయపెట్టాలనుకొంటున్నావ్!" అడిగింది భారతి వస్తున్న ఏడుపుని ఆపుకోడానికి ప్రయత్నిస్తూ.
అప్పటికే ఆమె కళ్ళలో నీరు తిరుగుతోంది.
"ప్రశాంత్ గురించి నేనెందుకిలా నెగిటివ్ గా మాట్లాడుతున్నానో అనే కదూ నీ ఉద్దేశ్యం. బారతీ, వయసులో నీకంటే పెద్దదాన్ని. ఈ ప్రపంచాన్ని, మనషులనీ నేనీ చిన్న వయసులోనే పడగొట్టేశాను.
అందుకే ప్రశాంత్ ఎలాంటివాడో నాకు నీకన్నా బాగా తెలుసు.
తెలిసే నేను అతని కోసం ఎందుకొచ్చానా అన్న అనుమానం నీకు కలుగుతుంది.