Previous Page Next Page 
అభయారణ్యం పేజి 2


      "నిన్నే."

     ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు నిశ్శబ్దంగా . విరిసిన మందారములాంటి ఆమె మోము కాదు అతడు చూస్తున్నది. పసిమి ఛాయతో నిశిరాత్రిలో వెలిగే చందమానలాంటి ఆమె లావణ్యం గురించి కాదు అతడు ఆలోచిస్తున్నది. ఆమె నైటీ మాటున  వున్న పచ్చని మైదానంలాంటి ఆమె కటిభాగాన్ని వూహించుకుంటున్నాడు. అరచేతుల మధ్య  హరివిల్లులా అనిపించే  ఆమె నడుము ఒంపుని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఓ   అయిదు నిమిషాలపాటు ఆవేశంతో ఉప్పెనగా మారాలనుకుంటున్నాడు.

     "ప్లీజ్!" నైటీని పీకేయబోతున్న అతడి ప్రయత్నాన్ని వారిస్తూ అంది ఆర్తి  "నాకు  నీరసంగా వుంది"

    "శ్రమ నాదైతే నీకు  నీరసంగా వుంటేనేం?"

     ఆతర్వాత ఆమెనిక మాట్లాడనివ్వలేదు భాస్వంత్.

     ఆఫీసులో కావాలనుకున్న ఓ ఫైలుని అర్జెంటుగా రేక్ లో నుంచి తీసినట్టు  నైటీలో  నుంచి  ప్రమేయం  లేకుండానే  ఆమెను అలుకుపోతూ,  అలసటగా ఆమెలోకి చొచ్చుకుపోతూ అయిదు నిమిషాల్లో తన దాహాన్ని తీర్చుకున్నాడు.

     ఆతర్వాత భాస్వంత్ ఇక మాట్లాడలేదు. అనుకున్నది పూర్తయిన నిశ్చింతతో నిద్రలోకి జారిపోయాడు.

     ఆర్తి నిద్రపోలేదు.

    అలాగే పైకి చూస్తూ వుండిపోయింది అలసటగా.

     రెండేళ్ళ దాంపత్య జీవితంలో యింతకుమించి అనుభూతుల్లేవు. దాంపత్యమింటే ఇల్లు చూసుకోవటం. అలసి వచ్చిన భర్తకి అన్నం వండిపెట్టడం,  అతడు కావాలనుకున్నప్పుడు శరీరాన్నివ్వడం యిదే ఆమెకు అర్ధమైంది కాదు..... భర్త ద్వారా  ఆమె తెలుసుకున్నది  అది మాత్రమే.

     హాస్టల్లో వుండి 'ఎమ్మే' దాకా చదువుకున్న  ఆర్తి పుట్టి పెరిగింది  ఓ పల్లెటూరూలో. దాంపత్య జీవితమంటే ఫలానా రీతిలో వుండాలని ఆమె ఏనాడూ కలలు కనకపోయినా యిలా వుంటుందని మాత్రం ఆమె వూహించలేదు. ఎవరికెవరూ ఏమీ కాకపోయినా  ఒకరికొకరుగా కలిసి మెలసి బ్రతికే  పల్లెలోని జనం మధ్య పెరగడంతో దాంపత్య జీవితంలోని యాంత్రికతకి ఆమె కలవరపడటం అలవాటుగా మార్చుకుంది.

     పలకరింపులు  లేవు. పరామర్శలుండవు. చీర కావాలీ అంటే డబ్బిస్తాడు. కలిసి సినిమాకి వెళ్ళాలనుకుంటే తోడుగా పనిమనిషి ని పంపిస్తాడు. కానీ తనని  ఆఫీసు  ఫంక్షన్సు  కొన్నింటికి మాత్రం బలవంతంగా తీసుకువెళతాడు.అది భాస్వంత్ పద్ధతి. ఆమె కోసం తను అనుకోవటం కన్నా తన అభిరుచి  కోసం ఆమెను ఉపయోగించుకుంటాడు. అన్నీ ఇస్తాడు ఇవ్వడం బాధ్యతగా భావిస్తాడు కాని ఇవ్వనిదేమన్నా వుందా  అని ఆలోచించడు.

    ఖచ్చితంగా  అతడు యివ్వలేకపోతున్నదేమిటో  ఒకటి  రెండుసార్లు ఆర్తి చెప్పటానికి ప్రయత్నచింది. పచ్చని పంట పొలాలమధ్య వున్న పల్లెల్లో పుట్టి పెరిగిన ఆమె ఏటి ఒడ్డున నీటిపూలతో ఆడుకుంటూ బాల్యాన్ని ఎలా గడిపిందీ, పండగలకి స్నేహితురాళ్ళతో కలిసి గొబ్బిళ్ళను ముంగుళ్ళలో వుంచి ఆప్యాయతల పులకింతల  మధ్య ఎంత  అపురూపంగా పెరిగిందీ చెప్పబోయింది కాని భాస్వంత్  వినలేదు.

      అది నిర్లక్ష్యం కూడా  కాదు. అంతే..... భాస్వంత్ కి అలాంటి టాపిక్స్ మీద  ఆసక్తి వుండదు. ముగ్గురన్నదమ్ముల్లో  చిన్నవాడు. భాస్వంత్ . తండ్రి డిప్యూటీ కలెక్టర్ గా రిటైరయ్య అయిదేళ్ళ క్రితం కాలధర్మం చేశాడు. ఇద్దరన్నలూ సెంట్రల్ గవర్నమెంట్ లో పెద్ద  పొజిషన్  లో వున్నారు. భాస్వంత్ మాత్రం సర్వీస్ కమీషన్ లో  గ్రూప్ ఒన్  పూర్తిచేసి  ఎస్.ఎఫ్. సి ' ఎగ్జిక్యూటివ్ గా జాబ్ చేస్తున్నాడు.

     పుట్టి పెరిగిందీ, చదివిందీ సిటీలో అయినందుకో లేక మెటీరియలిస్టులైనవ్యక్తుల మధ్య పెరగడం మూలంగానో ఎప్పుడూ తన పనీ, తన ఆలోచనలే తప్ప మరో వ్యక్తి ఆలోచనా విధానాన్ని అర్ధం చేసుకోవాలని ప్రయత్నించడు చాలా తెలివయినవాడినన్న అహం  ఆనక సుపీరియారిటీ కాంప్లెక్స్ గా మారి  భార్యంటే ఓ సబార్డినేట్ అన్న భావాన్ని కూడా బలంగా ప్రదర్శిస్తుంటాడు. చెప్పింది చేయడమే తప్ప ప్రశ్నించడం   అతనికిష్టముండదు. అంతకుమించి ఆర్తికి తను  భర్త కావడం ఆమె చేసుకున్న అదృష్టం అన్నట్టూ కూడా ప్రవర్తిస్తుంటాడు.

     భిన్న ధృవాలు ఆకర్షించుకుంటే- భిన్న మనస్తత్వాలు వికర్షించుకుంటాయా? అలసటగా పక్కకి  ఒత్తిగిలిన  ఆర్తికి సమీపంలోని మరో గదిలో నుంచి   అత్తగారి దగ్గు  వినిపించి మూడ్ మరింత  అప్ సెట్ అయ్యింది. భర్తపోయిన సరస్వతమ్మ  తరచూ ముగ్గురు   కొడుకులు దగ్గరికీ ప్రయాణం కడుతూ వుటుంది. ఎక్కువుగా భాస్వంత్ దగ్గరే వుటుంది.

     ఆర్తి సమస్య  అదికాదు. పెద్ద  కుటుంబం నుంచి   వచ్చిన మిగతా ఇద్దరు కోడళ్ళనీ  అభిమానించే సరస్వతమ్మ   ఆర్తిని అదేపనిగా ఈసడించుకుంటుంది. ఆర్తి చుదువుకున్నదయినా  పల్లెటూరిది.  పైగా  పెట్టింది నుంచి  వచ్చింది కాదు. సరస్వతమ్మ కూడా ఒకనాడు  ఇంచుమించు  అలాంటి కుటుంబము నుంచే వచ్చినా భర్త దగ్గర బానిసలానే బ్రతకడంతో అప్పటి దుగ్ధనంతా తీర్చుకోటానికి   ఆర్తిని అవుట్ లెట్ గా వుపయోగించుకుటుంది. పని గట్టుకుని వేదించి- సాధించి అందులో సంతృప్తిని వెదుక్కుంటూంటుంది. అందుకే సరస్వతమ్మ  ఆ  ఇంట వున్నంతకాలమూ ఆర్తి ప్రశాంతంగా వుండలేదు..... కాదు సరస్వతమ్మ వుడంనివ్వదు.


                                                             *    *    *



      "ఖర్మ! నలుగురూ  నవ్వుతారన్న సిగ్గు కూడా లేదు. మా కాలంలో మేం ఇలాంటివి ఎదురుగుదుమా?"

     సరస్వతమ్మ గావుకేకలతో మెలకవ  వచ్చింది ఆర్తికి.

     ఇప్పుడు అత్తగారు మొదలుపెట్టిన స్తోత్రం తన గురించే అని గ్రహించేయగలిగింది.
 

 Previous Page Next Page