Next Page 
అభయారణ్యం  పేజి 1

       
                         అభయారణ్యం

                                                                                  __కొమ్మనాపల్లి గణపతిరావు    



    " ఎక్కడున్నావో తెలీని ఓ నా ప్రియతమా... "

     నా మాటల్లో...... చేతల్లో...... నా తలపుల్లో..... ప్రతి అణువులో.... తనువులోని  ప్రతి కణములో..... విశ్వమంతా కూడా నాకు నువ్వు మాత్రమే అయి ఈ మామూలు జీవన ప్రపంచానికి వ్యర్ధురాలిని చేశావు. నిజం.... ఇప్పుడు నాలో మిగిలింది దిగులు కళ్ళు.... వెర్రి చూపులు.....  నిన్నటి బాసల మెరుపుల మరకలే నేస్తం.

    అప్పటి నీ స్పర్శ..... అప్పుడెప్పుడో విన్న నీ పిలుపు.... స్వప్నాల సందిట్లోని మన సంయోగం  ఇవేగా నాలో ఈ మాత్రమైన  జీవితేచ్ఛని మిగిల్చింది.

     ఎందుకయ్యా నీకింత నిర్దయ.....

    నీ కోసం వెతికి వెతికి అలసిన నా చూపులు తమలోకి తామే చూసుకుంటున్నాయి. ప్రియా.... ప్రియా   అని పిలిచి ఇక పలికే శక్తిలేక నా  హృదయం తనలో తానే గొణుక్కుంటుంది. నన్ను నమ్ము. నీ కోసం నేను పడే ఆరాటానికి దుక్కులే  నవ్వాయి. చుక్కలన్నీ  ఏడ్చాయి.

     ఎలా సాధించావు  నా పై ఇంతటి గెపులుని?

    అసలు నీ చిరునవ్వు ఎలా వుంటుందో తెలుసా? నీకెలా తెలుస్తుందిలే...... అది చూసి, అనుభవించి, పరవశించిపోయే నన్నేవరైనా అడగాల్సిన ప్రశ్నది. యోగులు హృదయంలో  వెలిగించుకునే దివ్వె నీ చురునవ్వు. నీ పెదవులపై విరిసే మనోజ్ఞ మైన  చిరునవ్వు ఒక్కటే కాదు స్వామీ!చల్లని వెన్నెల్ని, మల్లెల సౌరభాన్ని , మంచిగంధపు స్పర్శనీ తలపించే  నీ మనసు పరిచే మమతగానీ, బాధల్నీ ,నిషాదఛాయల్నీ మరిపించగల నీ కౌగిలి స్పర్శనీ  మనిషినైనందుకు , నీ మనసును గెలుచుకున్నందుకు నన్ను పునీతని చేసిందని పులకించిపోయానే..... మరి ఇంతలోనే ఎందుకు చేజారిపోయావు. ఈమరో విశ్వంలో నక్షత్రాలమధ్య  ఎక్కడని నిన్ను వెతికేది?

     నిస్త్ర్రాణతో నలిగిపోతున్నాను ప్రియా!

     ఏ అర్ధరాత్రో లేచి నిన్ను తలుచుకుని, నీ కోసం శూన్యం వైపు చేతులు చాచి-చాచి, ఏడ్చి ఏడ్చి -జబాబు చెప్పని ప్రకృతిని చూస్తూ పడుకుంటాను ప్రతి  రాత్రి. సముద్రంలోకి నిరంతరమూ ప్రవహిస్తూ  విసుగు చెందని నదిలా నిట్టూర్పులతో మిగిలిపోతుంటాను. ఋషుల తపస్సుకి స్పందించిన దేవుడైనా జాలిపడడేం ? ఒకలా మాట్లాడే, ఒకేలా ఆలోచించే మననిద్దరమూ  వేరు వేరు కాదూ ఒకటే అని నిన్నటిదాకా మనల్ని సృష్టించిన దేవుడికి అంజలి ఘటించానే. మరి నాకు ప్రేమగీతాన్ని నేర్పించి, నక్షత్ర మార్గాల  వూరేగించి ఇప్పుడు మన గాథని అగాధంగా మార్చిన నిన్ను వెదికి నాకు అందించడేం?

    కానియ్..... సృష్టికి ఆ చివర నువ్వు,  ఈ చివర నేను. కానియ్ స్వామీ!చిన్నప్పుడు నేను ఆడుకున్న  బొమ్మల్లో, వూహ తెలిశాక నే చదవుకున్న పుస్తకాల్లో ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణమూ ఎక్కడో  అక్కడ నువ్వు కనిపిస్తావని వెదుకుతూనే వుంటాను. ఎందుకో తెలుసా? నా ఆశలు, నా తలపులు, నా భావాలు, నా ఆలోచనలూ నీ చుట్టూ పరిభ్రమించటం అలవాటుగా మారింది మరి. నా సుఖం, నా దుఃఖం నా సంతోషం, నా విషాదం, నా పగలూ , నారాత్రి, ఉదయాలూ, అస్తమయాలూ అన్నీ నువ్వేగా నవ్వుకోకు.

    ఈ బాధ కూడా సౌఖ్యమే అనిపించే రాధని నేను ప్రియా! అందుకే నా చుట్టూ అలుముకున్న నిశిరాత్రి సైతం నీ చేతుల స్పర్శలా నాకు దైర్యన్నిస్తుంది. నువ్వు లేకపోయినా  చీకటిలో నన్ను తాకే చిరుగాలి కూడా నిన్నటి నీ బాసల్ని జ్ఞాప్తికి తెచ్చి  నాగుండె ఘోషకి ఓదార్పునందిస్తూంది.  అంతెందుకు..... నా క్రింద నలిగే పరువు కూడా నువ్వు ఒలికించిన అనురాగాల సరాగాల మెరుపుల ఊర్పుల్ని గుర్తుచేసి ఊరడిస్తూంది. ఎంతుంటేనేం- నువ్వు లేవుగా..."

     " ఇంకా ఎంతసేపు?"

     భాస్వంత్ పిలుపుతో చదువుతున్న నవల్లో   నుంచి తల పైకెత్తింది  ఆర్తి.

     నిజానికి అది పిలుపు కాదు.... గర్జన.

    "అర్ధరాత్రి దాటుతున్నా ఆ వేధవ చదువేమిటి?"

     బెడ్ మీద నుంచి  విస్సుగా అరిచాడు.

      ఇది ఆమెకు క్రొత్త కాదు.

     ప్రతి రాత్రీ వున్నదే.

     ఆఫీసు నుంచి భాస్వంత్ ఇంటికి రావడం. పక్క గదిలో అపరాత్రి దాకా ఏవో ఫైల్సుతో కుస్తీలు పడుతూ  గడపడం, తన పని పూర్తికాగానే బెడ్ మీద  వాలిపోతూ  ఆర్తిని పిలవడం.....

     " నిన్నే..... ఇంకా  అలా చూస్తున్నావేం?"

     నిద్రపోటానికి  టైం ముంచుకొస్తున్నట్టు తొందర చేస్తున్నాడు.

     ఆర్తి నిర్లప్తంగా నవలని   టేబుల్ మీద వుంచింది. భాస్వంత్  అలా అరుస్తూన్నది కోపంతో కాదని ఆమెకి తెలుసు. అది అతడి మనస్తత్వం. తన పని పూర్తి కాగానే భార్య బెడ్ మీదకి రావాలి. అణకువగా అతడ్ని అల్లుకుపోవాలి. ఆ తర్వాత.....

     "అలా పక్కకి ఒరిగి పడుకున్నావేం?"  ఆమె పై చేయి వేయబోయాడు భాస్వంత్.

     ఆమె సహకరించేదేగాని   ఇప్పుడు మూడ్ లేదు. ఇందాక చదివిన నవల్లోని పంక్తులు ఆమె మనసుని చాలా  కలవరపరిచాయి. ఒక ఆడపిల్ల ప్రేమించిన వ్యక్తికోసం పడే ఆర్తిని చాలా అందంగా రాశాడు. ధర్మతేజ. చాలా స్వల్పకాలంలో అతడంత గొప్ప రచయిత కావటనికి బహూశా భావుకత్వంతో అంతగా ఆకట్టుకోగల శక్తే కారణమేమో కదూ! అయినా మగవాడయ్యుండీ ఓ స్త్ర్రీ అంతర్మధనాన్ని ఇంత పరిపూర్ణంగా ఎలా పూహించగులుగుతున్నాడు....
 

Next Page