ఈ సోదరిది మరీ వింత సమస్య. ఆమెను గాఢంగా ప్రేమించే భర్త, ముద్దులొలికే ఇద్దరు పిల్లలూ వున్నారట. ఆఫీసులో టైపిస్ట్ జాబ్ చేస్తోందట. ఆఫీసుల అనుకోకుండా ఒకతడికి దగ్గరైందట. అతడీమెను పిచ్చిగా ఆరాదిస్తున్నాడట. ఈమె లేకపోతే తను బ్రతకలేనంటున్నాడట. భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి అతడితో ఏ దుర్గుణాలూ లేవట. భర్తను వదులుకోలేక. ,ప్రేమికుడికి దగ్గర కాలేక సందిగ్ధంలో కొట్టుకుంటుందట. ఆమె మనస్సేమో యాంత్రికంగా తయారైన తమ సంసారానికి విసిగిపోయి అతడికి దగ్గరైతేనే బాగుండునని కోరుకుంటూందట. తను జాబ్ చేస్తోంది. కాబట్టి పిల్లలను పెంచడం తమకో సమస్య కాదంటోంది! నా సమస్యకు పరిష్కారమేమిటి? మీరిచ్చే జవాబు మీదే నా జీవితం ఆధారపడింది అని వ్రాసింది. మీరు చెప్పండి -వాళ్ళు పిచ్చివాళ్ళు అవునా? కాదాని" నవ్వుతూ అడిగింది సుభాషిణి.
"వయసు చిత్రమైంది! ప్రేమ చిత్రమైంది అంటాను మేడమ్!"
"వయసు గ్రుడ్డిది........ప్రేమ గ్రుడ్డిది......... అంటే కరెక్టేమో?" అంది సింధు.
"ఒకరు ప్రేమ చిత్రమైంది అంటున్నారు. ఒకరు గ్రుడ్డిదంటున్నారు. పడ్డారా ప్రేమలో ఎప్పుడైనా?"
"దేవుడి దయవల్ల ఇంతవరకు అటువంటి ప్రమాదం ఏమీ సంభవించలేదు!" విశిష్ట అంది.
"ఏం? ప్రేమ ప్రమాదకరమైందంటావా?"
"వీళ్ళంతా పడింది ప్రేమలోనే కద మేడమ్? అది తెచ్చిపెట్టిన సమస్యలు ప్రమాదకరమైనవే కదా?"
"కరెక్ట్! ప్రమాదకరమైన సమస్యలే! ఈ సమస్యలు వాళ్ళని మాత్రమే బాధించవు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళని కూడా బాధిస్తాయి. టీనేజ్ అమ్మాయిల సమస్యలైతే సానుభూతితో అర్ధం చేసుకోవచ్చు.......! ఎందుకంటే ఎదిగీ ఎదగని మనసులు వాళ్ళవి! ఏది మంచో ఏది చెడో అర్ధం చేసుకునే వయసు కాదు. కాని, ఆఫీస్ లో టైపిస్ట్ గా జాబ్ చేస్తూ, ఇద్దరు పిల్లల తల్లి అయ్యి మరో మగాడికి దగ్గర కావడమే చండాలం. ఏదో అనుకోని పరిస్థితిలో అలా జరిగిందే అనుకో......! ఆ సంబంధాన్ని అంతటితో త్రుంచివేసి భర్తకూ, పిల్లలకూ అంకితం కావలసిన మాట.
ఈమె వయసు కనీసం ముప్ఫై ఏళ్ళయినా వుంటుంది. ఈ వయసుకి మనసుకి మంచి మెచ్యూరిటీ వస్తుంది కాని ఈమెకి వచ్చినట్టు లేదు. వచ్చినట్టయితే ఆ ప్రేమికుడు వట్టి అవకాశవాది అని, అందినంతవరకు జుర్రుకొని పలాయనం చిత్తగించే మనిషని గ్రహించేది. లేకపోతే వాడు భర్త, ఇద్దరు పిల్లలున్న ఆడదాన్ని ప్రేమించడమేమిటి నాన్సెన్స్! ఆమె పండంటి కాపురాన్ని పాడుచేసుకొని ఆమెను తనతో ఉంచమనడం కాక, ఉండకపోతే చస్తానని బెదిరించడం ఏమిటి? అతడిది వట్టి అవకాశవాదమని గ్రహించలేకపోతోంది. అందినంతవరకు జుర్రుకొని ఆనక పలాయనం చిత్తగించే రక్తం! అలాంటి వాడిపట్ల ఆమె ఆకర్షితురాలైందంటే అది వట్టి ఉన్మాదం! కన్నూమిన్నూ కానని కామం........!"
ఇంతసేపటికి బిందు కల్పించుకొంది. "వాళ్ళ మధ్య ఏర్పడిన ప్రేమను మీరు చాలా నిర్దాక్షిణ్యంగా ఖండిస్తున్నారు మేడమ్! భర్తా పిల్లలున్న చాలామంది ఆడవాళ్ళు ఒక విధమైన యాంత్రికతతో సంసారం చేయడం మనం చూస్తుంటాం. కలిసి బతకాలి కాబట్టి పిల్లల్ని కంటారు. పెంచాలి కాబట్టి పెంచుతారు. వాళ్ళలో ఏ విధమైన స్పందనలూ, ఉద్వేగాలూ వుండవు. ఒకరి కోసం ఒకరు జీవించడం వుండదు. మానసికంగా ఎవరి లోకం వాళ్ళది. మీరు చెప్పిన ఈ సోదరి తన యాంత్రికమైన జీవితంలో ఒక తుఫాన్ రేపిన పురుషుడికి అనుకోకుండా దగ్గరైతే అది ఉన్మాదంగా కొట్టివేయకూడదేమో! చలంగారి మైదానం చదివారా మేడమ్?"
"చదివాను"
"అందులోని ప్లీడరుగారు తన క్లయింట్లూ, తన ఫైళ్ళూ తన లోకంలో తనుండిపోతే, ఆ యాంత్రిక బంధంతో విసిగిపోయిన అతడి భార్య తనను ప్రేమించే యువకుడితో లేచిపోయి నదీతీరాల్లో , మైదానాల్లో స్వేచ్ఛాప్రణయాన్ని అనుభవిస్తుంది."
"ఈ కాలంలో పిల్లలెంత ఫాస్ట్! ఈ వయసుకి తమకి సెక్స్ గురించిగాని, స్వేచ్ఛ గురించిగాని ఆలోచించే ధైర్యమే వుండేది కాదు!" సుభాషిణి లోలోపల ఆశ్చర్యపోయింది.
"అందరు ఇల్లాళ్ళూ అలా అమీనాలను ఎదుర్కొని ఆదాం ఆవుల్లాగా మైదానాలలో సంచరిస్తూ, నదీ గర్భాలలో జలకాలాడుతూ గడిపితే ఈ ప్రపంచం ప్రపంచంలా వుండదు కదమ్మా? ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ విజ్ఞానం, ఈ పురోభివృద్ధి ఈ పెనుగులాటలేవీ వుండవు. కేవలం ఒక మన్మధ సామ్రాజ్యం మిగులుతుంది. వాళ్ళకు పుట్టే పిల్లల సంగతేమీ చెప్పలేదు చలంగారు, అసలు చలంగారి నాయక నాయకులకు పిల్లలు పుట్టరు. వాళ్ళకి ఆకలిదప్పులుండవు. కేవలం సెక్స్ దాహం తప్ప చలం గారిది సుందరమైన కల. సంస్కృతీ సంప్రదాయాలకు విలువిచ్చే మనబోటి వాళ్ళం. అలాంటి కల వినడానికి కూడా భయపడతాం. మనిషి జీవితంలో సెక్స్ ఒక భాగం కావాలి గాని అదే జీవిత పరమార్ధం కాకూడదు. చాలా మంది ఇల్లాళ్ళు యాంత్రికమైన జీవితాలు గడుపుతున్నారన్నావు. ఎందుకని? సంసారం అంటే భార్యాభర్తలిద్దరు కలిస్తేనే కద? తన సంసారం ఉల్లాసపూరితంగా మార్చుకోవడానికి తన వంతు కృషిని తాను చేయొచ్చుగా? స్తబ్దంగా కార్యక్రమాలు నిర్వహించే భర్తను తట్టి అతడిలో స్పందనలు కలుగజేసి ఒక ఆనందమయలోకాన్ని ఆవిష్కరించుకోవచ్చుగా? ఇక్కడ స్పందన కరవైందని, ఆస్తబ్దతకంతా భర్తే కారణమని నెపం పెట్టి మరో మగాడి వెంట పడిపోతే అక్కడ మాత్రం ఈ మురిపెం మూణ్ణాళ్ళ ముచ్చటై యాంత్రిక జీవితం మొదలు కాదని ఏముంది? అప్పుడు స్పందన కలుగజేసే మరో మగవాడిని వెదుక్కోవలసిందే కద? అలాంటి విశృంఖల జీవితాన్ని ఏ సమాజం హర్షిస్తుంది? మగవాడికి బయట లక్ష వ్యవహారాలు, లక్ష సంబంధాలు వున్న ఆడదానికి మాత్రం తన పిల్లలూ, తన భర్త, తన సంసారం, అదే లోకం ఆమెకు. దాంపత్య జీవితాన్ని అందంగా మలుచుకో వలసిన బాధ్యత మగవాడి కంటే ఆడదానికే ఎక్కువగా వుంటుందని నా ఉద్దేశ్యం"
"తను కోరుకున్నది ఏదైనా అది మంచిది గాని, చెడుగాని తను పొందే స్వేచ్ఛ ప్రతి మనిషికి వుండాలి మేడమ్!
అవతలి మనిషిని ఇబ్బంది పెట్టనంతవరకే ఈ స్వేచ్ఛ వుండాలని నేనంటాను."
"మీరు అవివాహితులని విన్నాం, మీరెందుకని పెళ్ళి చేసుకోలేదు? మీకు తగిన వరుడు దొరకకా......." విశిష్ట అడిగింది.
"నేను ఉద్యోగంలో చేరుతూనే మానాన్న గారు పోవడంవల్ల కుటుంబ బాధ్యత పంచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ బరువు దింపుకొన్నా. ముప్పై అయిదేళ్ళొచ్చాయి. ఇహ ఇప్పుడేం పెళ్ళి అన్న స్తబ్దత వచ్చేసింది. లేట్ గా పెళ్ళి చేసుకుంటే వుండే సమస్యలెన్నో. వయసు మీరాక పిల్లలు పుట్టడం, వాళ్ళను పెంచి పెద్దచేసి ఓ ఇంటివాళ్ళను చేయకుండానే మనం పోవడం. ఎందుకొచ్చిన బాధ? ఈ జీవితం హాయిగానే వుంది. అవునూ! మీరు కథలూ నవలలూ బాగా చదువుతారా? ఆధునిక స్త్రీ పట్ల మీకు స్పష్టమైన అభిప్రాయాలున్నట్టున్నాయి.