మేం నలుగురం ప్రాణస్నేహితులం మేడమ్! బాల్యస్నేహితులం కూడా. ఇది బిందు, ఇది సింధు, ఈమె కరుణ, నా పేరు విశిష్ట. మాలో బిందుకు నవలలు చదివే అలవాటు బాగా వుంది. అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా చలించిపోతూ వుంటుంది. ఒకసారి ఒక్క ప్రేమలో పడింది కూడా. ఆ కథ వింటే మీరు నవ్వుతారు. ప్రపంచంలో ఇలాంటి పిచ్చివాళ్ళు కూడా వుంటారా అని ఆశ్చర్యపడతారు."
"ఏయ్ ఆ కథ చెప్పావంటే తంతాను" బిందు కళ్ళురుమింది.
"చెప్పవా అందం! నేనెవరికి చెప్పనుగా! బాగుంటే మాత్రం కథ వ్రాస్తాను, అది నువ్వు పర్మిషన్ ఇస్తేనే" అంది సుభాషిణి నవ్వుతూ.
"ప్రేమ చిత్రమైంది. వయసు మరీ చిత్రమైంది. అన్నది దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే నా కథ అంత పిచ్చిగా కనిపించదు. మేడమ్! నా కథ ఇంకెవరో ఎందుకు చెప్పాలి నేనే చెబుతాను" అంటూ మొదలుపెట్టింది బిందు.
"మేం అప్పుడు డిగ్రీలో చేరిన రోజులు. వచ్చిపోయే దారిలో ఒక బాచిలర్ వుండేవాడు. మేం అతడి రూంనుండి వెళ్ళే టైం. అతడు రూంకి తాళం పెట్టి బయల్దేరే టైం ఒకటిగానే వుండేది. అతడు రూంకి తాళం పెట్టి వచ్చి మేం నిలబడే బస్సు స్టాప్ లోనే నిలబడేవాడు. అతడి చేతిలో చిన్న లెదర్ బాగ్ వుండేది. అప్పుడప్పుడు ఫైల్స్ కూడా వుండేవి. అతడో ఆఫీసులో జాబ్ చేస్తున్నాడని అర్ధమైంది. ఎప్పుడూ మా బస్సులో మాత్రం ఎక్కేవాడు కాదు. మరో బస్సు కోసం వెయిట్ చేస్తుండేవాడు. చూడ్డానికి చాలా అందంగా వుండేవాడు. ముఖ్యంగా అతడి నడక నాకు చాలా నచ్చింది. నల్లగా నిగనిగలాడే షూస్ వేసుకుని హుందాగా నడిచేవాడు. అతడికి మాకూ మాటలెప్పుడూ కలువకపోయినా రోజూ చూడ్డంవల్ల రోజూ బస్సుస్టాపులో కలిసి నిలబడ్డంవల్ల ఒక విధమైన సన్నిహితత్వం ఏర్పడింది. మమ్మల్ని చూడగానే అతడి ముఖంలో చిరునవ్వు కనిపించేది అంతే అతడెప్పుడూ ఎంతో మాట్లాడాలని గాని పరిచయం పెంచుకోవాలని గాని ప్రయత్నించలేదు. చాలా జెంటిల్ మెన్ లా ప్రవర్తించాడు. నాలో అనురాగం మొలకెత్తి పెరగసాగింది., నాకు తెలీకుండానే అది మహావృక్షంగా రూపుదిద్దుకుంది. అతడిని నేనెత గాఢంగా కోరుకుంటున్నానో నాకు ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టాక గాని తెలియలేదు. నా కోసం సంబంధాలేవీ చూడొద్దని, నేను పెళ్ళి చేసుకోనని చెప్పాను. అది విని గోలగోల చేశారు మా వాళ్ళు. మా ఫ్రెండ్స్ తో చెప్పి వాపోయారు. నేనెవరినైనా ప్రేమిస్తున్నానేమో కనుక్కోమన్నారు. నా ఫ్రెండ్స్ నన్ను ఏకాంతంలో కూర్చోబెట్టి అడిగినప్పుడు నా మనసు విప్పకుండా వుండలేకపోయాను. నా మనసులో అతడున్నాడని ఇంకెవరిని భర్తగా వూహించుకోలేనని చెప్పాను. నన్నో పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. ముక్కున వేలేసుకున్నారు. చూడటమే కాని ఎప్పుడూ పన్నెత్తి పలకరించని అతడిని ప్రేమించి పెళ్ళంటూ చేసుకుంటే అతడినేనని" ప్రతిజ్ఞ పట్టడం వాళ్ళని ఆశ్చర్యంలో ముంచింది.
"విశిష్ట నన్ను పూర్తిగా వ్యతిరేకించింది. నీకేం మతిగాని పోలేదు కదా? అతడి వయసు చూస్తే ముప్ఫై పైనే కనబడుతోంది. అతడికి ఈపాటికి పెళ్ళయ్యి పిల్లలు కూడా వుంటారు.
అతడు పెళ్ళయిన వాడిలా కనిపించడే. భార్యాపిల్లలున్నవాడైతే ఒంటరిగా ఎందుకుంటాడు? నాలో రెపరెపలాడే ఆశ.
పెళ్ళి కాకపోయినా అతడెవరో ఏమిటో పేరైనా అడగలేదు. ఊరైనా అడగలేదు. మనసేమో అతడిని విడిచి మరలి రాకున్నది. అంటూ పాట పాడుకుంటూ బ్రతుకు" అంది కరుణ.
అతడి గురించి తెలీకపోయినా అతడేమిటో తెలుసు, రోజూ కాలేజీకి వెడుతున్నప్పుడు చూస్తున్నాం. చాలా మంచి మనిషిలా కనిపించడం లేదూ?
ఖర్మ- బస్సు స్టాపుల్లో చూసుకొని ప్రేమించడాలు, రోడ్డుమీద చూసుకొని ప్రేమించడాలు ఎప్పుడైనా కొనముట్టుతాయా? ఏమైనా అర్ధముందా ఈ ప్రేమకి? అతడి కులమేమిటో, మతమేమిటో........." ప్రేమ పుట్టడానికి అతడిని మనిషి బయోడేటా అంతా తెలియక్కరలేదు. విశిష్టా! కొండల మధ్య చిన్న పిల్ల కాలువలాగానో, సెలయేరు లాగానో పుట్టే నదీమతల్లి తను దారంతా చూసుకొని పుట్టదు. పుట్టాక చెట్లనీ, పుట్టల్నీ, గట్లనీ , లోయల్నీ అధిగమించి సాగిపోతుంది. సాగరుడిలో ఐక్యం చెందుతుంది. ప్రేమంటే ఒక విచిత్రం, ఒక అనిర్వచనీయం. ఏ కులమో ఏ మతమో అన్నావు ఏ కుల మైనా అతడే నా కులం. ఏ మతమైనా అతడే నా మతము." ప్రెండ్సు ముగ్గురూ చప్పట్లు చరిచారు. "ప్రేమ ముదిరి పాకాన పడినట్టుందే. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా."
"మీరేమైనా అనండి. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటాను. లేకుంటే అవివాహిత వుండిపోతాను. నా మనసులో దేవతా పీఠం మాత్రం ఎప్పటికీ అతడే. మరో మూర్తిని అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిష్టించడం జరగదు."
"అతడికిదివరకే పెళ్ళయ్యి పిల్లలు కూడా వుంటే........."
"జీవితంలో అతడిని భర్తగా పొందలేకపోవచ్చు. కాని మనసులో అతడినే నా భర్తగా ఊహించుకొని ఆ ఊహల్లో నేను జీవిస్తే ఎవరికి ఏమిటి అభ్యంతరం?"
"అంతకంటే ఆత్మవంచన ఏముంటుంది? ఊహల్లో కాపురాలు మనసులో ఆరాధనలూ...... అదీ మరొక ఆడదాని మగడితో! దాన్ని మానసిక వ్యభిచారమంటారే! ఛీ.....సిగ్గేయడం లేదు. ఇలా మాట్లాడడానికి? ప్రేమంటే అది కేవలం ఊహల్లో, మనస్సుల్లో వుండిపోకూడదు. అది పరస్పరం ఇచ్చిపుచ్చుకొనేది కావాలి. అప్పుడే దానికి అందం చందం! అంతే గాని వూహల్లో మరో అడదాని భర్తకు భార్యగా జీవించడం ఏమిటి! అదొక మానసిక రుగ్మత! ఆరోగ్యవంతమైన ఆలోచన ఎంతమాత్రం కాదు!"
"గాఢమైన ప్రేమ కొందరికి రుగ్మతగా, పిచ్చిగా కనిపిస్తే ఏం చేయను? మీరు ప్రేమలో పడితేగాని ప్రేమంటే ఏమిటో అర్ధంకాదు!"
"ప్రేమించు! ఎవరికీ మొగుడుకాని, ఎవరికీ ప్రియుడు కాని వాడిని చూసి ప్రేమించు! ఇంకెవరి మొగుణ్ణో మాత్రం ప్రేమించుకు. అంతకంటే అసహ్యం, అధమం మరొకటుండదు ఏ ఆడదానికైనా!"
విశిష్ట తీవ్రంగా హెచ్చరిస్తే "అతడు వివాహితుడో, అవివాహితుడో నేను మొత్తం అతడి బయోడేటా కనుక్కుంటాగా? అకడున్న ఇంటి ఓనరు కొడుకు కిశోర్ మా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్. అతడు రోజూ మా ఇంటికి వస్తుంటాడు" అంది సిందు.
"సింధు తెచ్చే వార్తకోసం నా గుండెలు చిక్కబట్టుకుని ఎదురు చూశావు. పిడుగుపాటు వార్త! అతడికి పదేళ్ళ క్రితమే పెళ్ళయింది. ఇద్దరు ట్విన్స్ కి తండ్రి కూడా. ఇతను ఇల్లరికపు అల్లుడు. అందుకే ఆమె ఇక్కడికిరాదు. అతడికి పిల్లలన్నా, భార్య అన్నా పంచప్రాణాలు!