Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 2


    అంగణంలో తల్లి కనిపించింది. అమెది నలుపురంగు, నల్లచీర కట్టుకుంది. మసి అంటిన చేతులు కడుక్కుంటూంది. ఏమిటదంతా, అమ్మను ఉద్దేశించి కవి కవిత చెప్పాడా? లేదే. ఒక నిట్టూర్పు విడిచింది. గదిలోకి వచ్చింది. ఎక్కడా అద్దం కనిపించలేదు. అయినా గోడల్లో తన ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి - పదులు - వందలు. అనేక కోణాల్లో తన ప్రతిమలు తనకే కనిపిస్తున్నాయి. చామనఛాయ, చట్టిముక్కు, వెడల్పయిన వదనంలో చిన్న చిన్న కనులు - చెంపల మీది మొటిమల పంట - కనులు చితికిపోతే ఎంత బావుండేది! ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవారు. కనిపించేవారు కారు. ప్లాస్టిక్ సర్జరీ బొంబాయిలో కూడా చేస్తున్నారట. చేస్తుండవచ్చు, కాని సైంటిస్టులు ఇంతవరకు రంగుమార్చే మందు కనిపెట్టందే! వెధవలు చంద్రుని మీదికి ఉరుకుతున్నారు. మనిషి రంగు మార్చలేనివారు చంద్రుని మీదికి మిడకడం ఎందుకో? ఆ దేవుడు ఇలాంటి అందవికారుల కుటుంబంలో ఎందుకు పడేశాడో? ఇహ ఇంటివాళ్లను ఆ అల్లాయే కాపాడాలి. నాన్నకు అబ్బో ఎంతో గర్వం. ఎండిన నారింజ లాంటి నల్లని అమ్మ ముఖంమీద పడి చస్తాడు. ఒకళ్ళిద్దరు కారు ఏడుగురు నల్లని పిల్లల్ని కన్నారు. అమ్మ బొగ్గు నమిలిందేమో పిల్లలంతా అమావాస్య రాత్రులయినారు అనేది బామ్మ. కూతురుకు పద్నాలుగేళ్ళు వస్తేచాలు నాన్న మార్వాడీ దగ్గరికి ఉరికేవాడు అప్పు అడగడానికి. కొన్ని నెలలు గడుస్తాయీ కొత్త అల్లుడు ఇంటికి వస్తాడు. ఇహ అతనిముందు తమ కష్టాల్ని గురించి ఏడుపు, ఖర్చులను గురించిన రొద. ఆ అల్లుళ్లు ఎలాంటివారయా అంటే ఒంటెల్లాంటివారు. మామిడి వరుగుల్లాంటి క్లార్కులు. వాళ్లు - తమను తాము నలకూబరులనుకొని సురయాను "నీలమణి" నల్లరాతి బొమ్మ" అనేవాళ్లు. సురయా ఏడ్చేది. తన నొసటా అలాంటివాడే రాసి ఉన్నాడనుకునేది. కుమిలిపోయేది. అయితే అలా కాలేదు. మార్వాడీలు ముఖం ముడిచారు. పెళ్లి ముహూర్తం చాలాసార్లు మారింది. ఈలోగా ఆమె తొమ్మిదో క్లాసులో ఫస్టున పాసయింది. ఇంతలో ఆ క్లార్కుకు జనాభా తగ్గుతుందని భయం అయింది. వేరేదాన్ని కట్టుకున్నాడు. తొమ్మిదో క్లాసు పాసైందని తల్లి అంటే మెట్రిక్ కానిమ్మన్నాడు తండ్రి. మగపిల్లలు లేకుంటే ఏం ఆడపిల్లనే చదివింతామనుకున్నాడు. అయితే మిగతా కూతుళ్లకు రూపంతోపాటు తెలివి లేకుండా పోయింది. మూడేళ్లు కాందే రెండో క్లాసు దాటలేదు. పెళ్ళయ్యేవరకు, ఆరో క్లాసుకు వస్తే గగనంగా ఉండేది. అలాంటప్పుడు సురయా మెట్రిక్ పాసయింది. ఆ సంతోషం;లో ఎత్తిపోయిన సంబంధపు దుఃఖం మరచాడు. సురయా దస్తూరి అందమైనది. తండ్రి ఆమె దస్తూరితో తనదాన్ని పోల్చుకొని సిగ్గుపడేవాడు. లెక్కల్లో నలభై, యాభై మార్కులు తెచ్చుకునేది. ఉర్దూలో అనేక కవితలు అప్పజెప్పగలిగేది. పగలంతా వలపు పత్రికలు చదివేది. కూతురు ఆసక్తికి తండ్రి మురిసిపోయేవాడు. ఆమె కోరింది హాజరు పరిచేవాడు. ఆరోజుల్లోనే కొన్ని పత్రికలు ముందరేసుకుని స్త్రీ విద్యను గురించి ఒక వ్యాసం రాసింది సురయా. అది చూచాడు తండ్రి, మురిసిపోయాడు. కనిపించినవాడికల్లా చదివి వినిపించాడు. దాన్ని హెడ్ మిస్ట్రెస్ దాకా చేర్చాడు. ఆమె నిండు క్లాసులో ఆ వ్యాసం చదివి వినిపించింది. సురయా వీపు తట్టింది. శ్లాఘించింది. దాంతో సురయా ఉక్కిరిబిక్కిరయింది. అమెకోదారి కనిపించింది. ఆకర్షించడానికి ఇదొక మార్గం అనుకుంది. తన వ్యాసాలు చూచినవారు కనీసం తనను చూచి ముఖం తిప్పుకోరు అనుకుంది. తొలిసారి పొగడ్త రుచి చూచింది. ఇహ ఆమె శరీరం సాంతం తాపంతో పరితపించింది. అప్పుడామె రచయిత్రి కావాలని నిశ్చయించుకుంది. తాను ఘాటయిన కథలు రాస్తుంది. జనం తనను చూడ్డానికి ఆరాటపడిపోతారు. తాను మసిబొగ్గు అనేమాట మరచిపోతారు. ముఖాన పెరిగిన మొటిమల పంటను పరికించరు. ఆ రాత్రి ఆమె రంగురంగుల కలలు కన్నది. తన ఖ్యాతి సుదూరప్రాంతాలకు వ్యాపించింది. మహా మహా రచయితలు తన వలపువాకిట తలలు వంచి నుంచున్నారు. అప్పుడు తాను తనకు నచ్చిన రచయితను పెండ్లాడింది. రాత్రి సాంతం తన పేరో తరవాత తన అభిమాన రచయితల పేర్లో రాస్తూ ఉండిపోయింది.
    ఆరోజుల్లోనే సురయా మేనత్త ఒక సంబంధం తెచ్చింది. వాడు పోకిరి మజీద్. వాణ్ణి బాగుచేసే ఉపాయం అడగటానికి ఆమె తరచు తమ్ముని దగ్గరికి వస్తూండేది. మజీద్ మహాశయుడు చాలాకాలంగా మెట్రిక్ పరీక్ష ఇస్తున్నాడు. తప్పడానికి కారణం తన మాస్టర్ల దుర్మార్గం అని ఆరోపిస్తుంటాడు. ఆ మాట విని సురయా వాణ్ణి వెక్కిరిస్తుండేది. పగలబడి నవ్వుతుండేది. అయినా పెళ్ళయితే ముక్కుతాడు పడిన ఎద్దులా సురయా లొంగిపోతుందని మజీద్ గారి తల్లిగారి దృఢవిశ్వాసం.
    ఛీ, మజీద్ పేరు విని సురయా ఏవగించుకుంది. ఆ వెధవకు కవిత్వం ఏ చెట్టు పేరో కూడా తెలియదు. ఒకసారి తాను సలీమ్ వెంట కవి సమ్మేళనానికి వెళ్ళింది. అక్కడ ఎంతెంత రసికులయిన కనులను చూచింది. తన కాలేజి వాడే ఒక యువకుని 'షాహిద్ రొమాని' మీదినుంచి దృష్టి మరల్చుకోలేకపోయింది. బక్కపల్చనివాడు-పొడవు వెంట్రుకలవాడు- బలహీన హస్తమున కంపించు సిగిరెట్టు కలవాడు. అతని ముఖం నలుపు - పండ్లు పాకరవి. అయినా ఎంత ఆకర్షణుంది అతనిలో! కాలేజీ అమ్మాయిలంతా అతని పేరువింటే వెర్రివాళ్ళయిపోయేవారు! షాహిద్ కవితలోని ప్రతి పదం సురయా గుండెలో హత్తుకుంటూంది.  
    ఒకనాడు షాహిద్ వికార రూపం చూచి జనం మూతి ముడిచి ఉంటారు. ఇవ్వాళో ఎంతటి హీరోలనయినా అతను కాలదన్నగలడు! మరునాడు సురయా ఆటోగ్రఫీ పుస్తకం కొన్నది. సలీమ్ కు ఇచ్చింది. షాహిద్ సంతకం తెచ్చిపెట్టమన్నది. సంతకం చూచింది. ఆమె గుండె దడదడలాడింది. ఆ రోజు చాటుగా పలుమార్లు తనపేరు పక్కన షాహిద్ రొమానీ పేరు రాసింది. సురయా షాహిద్ రోమాని. మళ్ళీ చెరిపేప్పుడు చాలా దుఃఖం కలిగింది. గుండె క్రుంగింది. సలీమ్ ఆమెను హేళన చేసింది. షాహిద్ మామూలు కవి అన్నది, బచ్చాగాడు అన్నది, కావాలంటే వెంటనే పరిచయం చేస్తానన్నది. అయినా ఆ బచ్చాకవికి పెద్దగా లిఫ్ట్ ఇవ్వొద్దన్నది.
    సాయంత్రం సలీమ్ వెంట వెళ్ళడానికి తయారవుతూంది. ఇంతలో అమ్మా, అక్కా గుసగుసలు వినిపించాయి. మజీదును మించిన సంబంధం సురయాకు దొరకదంటుంది అక్క. అక్కకు అయిదో పిల్లాడు కోతిపిల్లలా కొమ్మనంటుకొని కీ, కీ అంటుంటాడు. బలవంతంగా విడిపిస్తే ఏడుపు లంకించుకుంటాడు. ఇంటి చిక్కులకు విసిగి పెళ్ళాం మొగుడు పోట్లాడుకోని రోజంటూ లేదు. అయినా చెల్లెళ్ళ పెళ్లిళ్లు చూడాలని మహా సంబరపడుతుంది.
    సలీమ్ బాగా పురి ఎక్కిస్తే బయల్దేరి ఇంటివాళ్ళందరిముందు తాను బి.ఏ. పాసయ్యేవరకు పెళ్లిచేసుకోనని ప్రకటించింది. ఆ మాట విని తల్లి మూర్ఛపోయింది. అక్క నోట మాట రాలేదు. తండ్రి చాలాసేపటికి తేరుకున్నాడు. సురయాకు బి.ఎ. అయిందాకా పెళ్లి చేయనని ప్రకటించాడు. తాను వకాల్తీ చేసి ఇల్లు కట్టడమే కాక కూతురును బి.ఏ. కూడా చదివించాడనే విషయం తిమ్మాపురం ప్రజలకు ఎరుకపరచాలనుకున్నాడు.
    అంతే అనుకున్నంతే అయింది. కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త అమ్మాయిలు వచ్చారు. అజీమ్ అక్క ఎప్పటిలాగే సురయాను మరచింది. జమాల్ ను ఎన్నుకుంది. సురయా అజీమ్ అక్కకు ఫేర్ కాపీలు రాసిపెట్టడం నుంచి ప్రైవేటు ఉత్తరాలు అందించడం ప్రత్యర్థికూటాల్లో గూఢచార వృత్తి అవలంబించడం వరకు అన్ని విధులూ నిర్వర్తించింది. సురయా మండిపడింది. నానా మాటలన్నది. ప్రొఫెసర్లముందూ, రచయితల ముందూ జమాల్ ను ఆడిపోసింది.
    'జమాల్ వట్టి మొద్దుముండ, పిచ్చిది. మీ అదృష్టం బావుంది షాహిద్ లాంటి తెలివైనవారికి చదువు చెపుతున్నారు. నిజం. అజీమ్ అక్కను చూడండి పాపం' అని చట్టిముక్కు ఉబికించింది.  
    'జమాల్ ఎవరు?' షాహిద్ ఉలికిపడి అడిగాడు. షాహిద్ కాలేజీలో జరిగే కవి సమ్మేళనాల్లో విజయం సాధించిన్నాటినుంచి అమ్మాయిల్లో అతి విఖ్యాతుడయినాడు. అందమైన ప్రతి అమ్మాయి మీదా తనకే తొలి హక్కనుకునేవాడు.
    'కాలేజీకి వచ్చిందిలే ఒక జాగీర్ధారు కూతురు.'
    సురయా షాహిద్ ను శ్రుతిపెట్టిన వీణలా చూచింది. తీగ తెగనుందో? పాడనుందో? షాహిద్ ను చూచుకొని కొన్నిరోజులుగా కలలు కనడం సహితం మానేసింది. ఏదోవిధంగా కాలేజీలో ఈ స్కాండల్ వ్యాపించాలని తహతాహలాడుతోంది.
    "ఏం చెప్పమంటావు, షాహిద్! పాడు ముఖమూ అదీ మామూలు కవితకు కూడా అర్థం చెప్పలేదు. ఒకసారి ఏమైందనుకున్నావు- అజీమ్ అక్క గాలిబ్ కవితకు అర్థం అడిగింది. ఒట్టు - తెలిస్తేనా?"
    "అది సరే ఇంతకూ ఎవరి కూతురు?" షాహిద్ ముఖంలో కలుగుతున్న మార్పులను బట్టి సురయా గ్రహించింది - అతని సర్వేంద్రియాలు జమాల్ ను అన్వేషిస్తున్నాయని.
    "అయ్యో! నాకేం తెలుసు ఆ చచ్చినోడెవడో?"
    "అవును అవునవును - నేనూ చూచాను." షాహిద్ ధ్వనిలో పరాకు పసికట్టింది సురయా - మాటా మార్చింది.
    "నిన్నటి నుంచీ గాభరాగా ఉంది. నిజం భయం. ఒట్టు - రాత్రంతా నిద్దరలేదంటే నమ్ము."

 Previous Page Next Page