Previous Page Next Page 
పావని పేజి 2


    "పంతులూ! బెల్లం కొట్టిన రాయల్లే కూచున్నవేం, పైకం తీసుకో" శివయ్య గద్దించాడు.
    బ్రహ్మయ్య డబ్బు అందించాడు. కృష్ణారావు అందుకున్నాడు.
    "దొరవారూ! నా గతేమంటారు?" బ్రహ్మయ్య కన్నీరు కళ్ళదాకా వచ్చి నిలిచిపోయింది.
    "ఊరికే నసుగుతావు ఎంత కావాల్నో ఏడవరాదు!" శివయ్య విసుక్కున్నాడు.
    "అయిదు రూపాయలు కావాల్నండి" బ్రహ్మయ్య మాటల్లో కన్నీరు కనిపిస్తోంది - కళ్ళలో ఇంకా కనిపించలేదు.
    "అయిదు కావల్నంటే ఏడు లెక్క రాయాల్సి వస్తది_ రెండు సార సుంకం - ఇన్నవా?" పంతులు వ్యంగ్యంగా అన్నాడు.
    "కావల్నంటే ముఖాన కొట్టు- పనిముట్లు ఇచ్చెడిది లేదు" శివయ్య సీరియస్ గా అన్నాడు.
    పనిముట్లు లేకుంటే తన పని ముగిసినట్లే! ఈ మాత్రం ఆధారం జారిపోతుంది అనుకున్నాడు బ్రహ్మయ్య.
    "దొరా! అట్లంటే బతకటమెట్ల? ఆడది అగోరిస్తాందని అడిగిన. పానం కాపాడండి దొరవారూ_ పనిముట్లు ఇప్పించండి" బ్రహ్మయ్య శివయ్య కాళ్ళు పట్టుకునేంతపని చేశాడు. కంట్లో నీరు ఆగలేదు. దుమికింది.
    "పంతులూ! బ్రహ్మయ్య ఏడుస్తాండు, ఇయ్యి మరి ఏం చేస్తం - అయిదియ్యి - ఏడు రాసుకో - వడ్డీకట్టు వాటిమీద"
    పంతులు బ్రహ్మయ్యకు అయిదు రూపాయలిచ్చి రాసుకున్నాడు.
    "దొరవారూ! పనిముట్లు?"
    "నర్సిమ్మా! పనిముట్లు తెచ్చి ముఖాన కొట్టు- పెద్ద బంగారంతో చేయించి పెట్టినట్లు నీలుగుతాడు" చేతులు ఊపుకుంటూ ఎగతాళి చేశాడు శివయ్య.
    నర్సిమ్మ బాడిశ, దూగోడ, రంపం వగైరాలు తెచ్చి బయట విసుక్కున్నాడు.
    "కూలి చేసుకునేటోండ్లకు బంగారం యాణ్ణించి వస్తదండి - కూటికెళ్ళెడిదే కష్టమయితాంది" గునుసుకుంటూ పనిముట్లు అందుకున్నాడు బ్రహ్మయ్య.
    "పైస చేతుల పడెటాల్కల్ల నీతులు పలుకుతాండు. లీడరయితడేమొ బ్రహ్మయ్య. చెక్కుకొని బత్కక నీతులెందుకయ్యా నీకు - పో పో" అని కసిరాడు శివయ్య. బ్రహ్మయ్య మాట్లాడలేదు. పైకం జేబులో వేసుకున్నాడు. బాడిశ భుజాన పెట్టుకుని వెళ్ళిపోయాడు.
    కుమ్మరి కొమరయ్య ముందుకు వచ్చాడు.
    "నీ కతేందిరా కొమరిగా?" శివయ్య అడిగాడు సిగరెట్టు ముట్టించుకుంటూ.
    "అందరి కథ ఒకటే కాదుండి, బాంచను - నాకు ఏరే కథ యాణ్ణించి వస్తది? మా రాతలన్నీ గా పుస్తకాల్ల ఉన్నవి. తెరువుండి తెలుస్తది" కొమరయ్య గులిగాడు, బ్రహ్మయ్య స్థితి చూచి అతనికి అలా అనాలనిపించింది.
    "ఓరి లంజకొడక! నీకెంత నెత్తికెక్కినయిర కండ్లు! నీతులు చెప్తావుర గాడ్ది కొడక" అని చెప్పు విడిచి కొమరయ్య ముఖానికి కొట్టాడు శివయ్య.
    విసిరిన కాలి చెప్పును చేత్తో అందుకున్నాడు కొమరయ్య. 'హి హి హి' అని ఇకిలించాడు. "మాకేం నీతులు, బాంచెను కొడ్తే పడ్తం పెడ్తే తింటం" అని చెప్పు తెచ్చి శివయ్య కాలు దగ్గర పెట్టి దండం పెట్టాడు కొమరయ్య.
    "చెప్పు దెబ్బ తప్పించుకున్నావ్ గాడ్దికొడక! సార తాగినావుర రాత్రి?" అడిగాడు శివయ్య.
    "పూర రొండ్రూపాయలది తాగిన, బాంచను నిష ఎక్కుతలేదు. సర్కారేమన్న నీలు కలుపుతున్నాదుండి సార?"
    "ఓరి లంజకొడక! పిత్త తాగనేర్చినంక నిష యాడ ఎక్కుతదిర! సర్కారు సారల నీలు కలిపిందంటే జేల్లనూకుతరు - ఎరకయిందా?"
    "మల్ల దొరే కలుపుతుండేమో!" అందామనుకున్నాడు గాని అనలేదు కొమరయ్య.
    "అరే కొమరిగా! ఇంకెన్ని కుండలయితె వామి తయారయితదిరా!"
    "ఇయ్యాల్రేపు చేస్తే సరింగ అయితయి, బాంచెను ఇగ వామి పెట్టుడు- కాల్చుడే"
    "పంతులూ! వీనిలెక్క ?"
    "వాము కాల్చి పట్నం తీస్కపోయి అమ్ముకొస్తే వచ్చింది వడ్డీకి సరిపోతది. అసలు అట్లనే ఉంటది. కొమరయ్య సారె తిప్పుతూనే ఉంటడు, నేను లెక్క రాస్తనే ఉంట"
    "పంతులూ! మాటలు జర తగ్గించు, బాగుపడ్తవు" అని పంతులుకు ఉచితసలహా ఇచ్చిన శివయ్య "కొమరిగా! ఎంత కావాల్రా?" అని అడిగాడు.
    "ఎంతేమున్నది, బాంచను సార పైసలు లెక్క రాసుకోండి, బత్తేనికి జగన్నాథం దుకాణానికి చీటీ రాసియ్యండి. సారె బయటపెట్టించుండ్రి సారేమో నేను తిప్పుతె తిరుగుతది. మా బతుకు సారె ఉన్నది చూసిన్రా - అది మీరు తిప్పుతె తిరుగుతది"
    "మాటలు శాన నేర్చినవుగాని రేపుటికి వామి తయారు కావలె లేకుంటే బత్తెం బంద్"
    "అట్లనే బాంచను" అన్నాడు కొమరయ్య. పంతులు రాసిచ్చిన చీటీ, నర్సిమ్మ తెచ్చిచ్చిన సారె అందుకుని బయటపడ్డాడు.
    చీటీ రాసివ్వడంలో ఒక రహస్యం ఉంది. శివయ్య జగన్నాధాన్ని తెచ్చి ఊళ్ళో దుకాణం పెట్టించాడు. ఆ దుకాణానికి చీటీ రాసిస్తాడు శివయ్య. జగన్నాథం రూపాయికింత చొప్పున కమీషన్ సమర్పించుకుంటాడు శివయ్యకు. శివయ్యకు తన గ్రామసంపద బయటికి పోవడం ఇష్టం ఉండదు.
    మంగలి మల్లయ్య పొది అందుకుని, శివయ్యకు గడ్డం గీకి, చీటీ అందుకుని బయటపడ్డాడు. కమ్మరి బాలయ్య సుత్తె అందుకుని చీటీ రొంటిని దోపుకుని వెళ్తుండగా గేట్లో అడుగుపెడ్తున్న గౌరీనాధశాస్త్రిగారు ఎదురయినారు. బాలయ్య దండం పెట్టాడు. పుత్రపౌత్రాభివృద్ధిగా దీవించారు శాస్త్రిగారు. శాస్త్రిగారు అలగాజనాన్ని ధన కనక వస్తు వాహనాలు కలిగేట్లు దీవించడు. పొరపాటున తమ మాట తధ్యం అవుతుందేమోనని వారి భయం!
    శాస్త్రిగారి దీవినలంది బాలయ్య నిర్గమించగా, శాస్త్రులవారు సశాస్త్రముగా శివయ్యగారి గేహంబున కుడిపాదంబుంచి బ్రవేశించిన యయ్యవసరంబున గ్రామ ప్రభువరేణ్యులయిన శివ ప్రభువులు అభ్యుత్థాన మొనరించి, నమస్కరించి, స్వాగతం బొసంగి, విప్రోత్తమునకు ఆసనంబు నిర్దేశించి, కుశలప్రశ్నలడిగిన తదనంతర కధాసంవిధానం బెట్టిదనిన-
    "అయ్యా! ఈ రోజు స్వస్తిశ్రీ చాంద్రమాన పింగళనామ సంవత్సర పుష్యబహుళ పంచమీ - ఆదిత్యవారం పంచమి సాయంత్రం వరకున్నది. వర్జ్యము పగలు రెండున్నర మొదలు నాలుగు గంటల వరకున్నది"
    గౌరీనాధశాస్త్రి ఆజానుబాహువు. దబ్బపండులాంటి ఛాయ, ముఖాన విభూతి, మెడలో రుద్రాక్షమాల సాక్షాత్తు శివస్వామిలా ఉంటారు. పౌరోహిత్యం, మంత్రశాస్త్రం, కొంతలో కొంత వైద్యం వారి వృత్తి. తాంత్రిక విద్యలు వారికి బాగా వచ్చని ప్రతీతి. వారు తలచుకుంటే ఎదుటివాణ్ణి రక్తం కక్కించి గంటల్లో ప్రాణాలు హరించగలరని పేరుంది. అందుకే శాస్త్రిగారంటే శివయ్యకు జంకు. శాస్త్రిగారు తప్ప ఆ ఊరి జనం సాంతం శివయ్య పాదచ్చాయన జీవించవలసినవారే.
    "శాస్తుర్లగారూ! నాకెరకలేక అడుగుత, సూర్యుడున్నాడు చూచిన్రా - వాడు మీరు చెప్పినట్లే నడుస్తాడా? ఎప్పుడు రమ్మంటే అప్పుడొస్తాడు. ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతడు. శాస్త్రాన్ని చుట్టచుట్టి చంకన పెట్టిన్రు, మాకేమన్న ఎరక కానిస్తరా?"
    "శివయ్యగారూ! ఈ సూర్య చంద్రాదులు, గ్రహ నక్షత్రాలు, పంచభూతాలూ అన్నీ మీరు చెప్పినట్లే నడుస్తున్నాయండి. శాస్త్రాలన్నీ డబ్బుకు ఊడిగం చేస్తున్నాయి. శాస్త్రిగారి చంకన మిగిలింది తాటాకుల కట్ట - శాస్త్రం కాదు సర్వ ప్రపంచమూ మీ డబ్బుకు దాసోహం అంతా జోహుకందార్లే - విన్నారా మహాప్రభూ!" కృష్ణారావు గబగబా చదివేసినా, నిత్య సత్యం వెల్లడించాడు.
    "పంతులుగారు చాలా చక్కగా శలవిచ్చిన్రు. ఎంతయినా మీ ముందు చేయి చాపెటోండ్లంగాని, ఇచ్చెటోండ్లము కాము మేము యాచకులం మీరు దాతలు" శాస్త్రులవారు వినయం వలక బోశారు.
    "శాస్తుర్లేమొ శాన పొగుడుతున్నాడియ్యాళ. చూడబోతే ఏదో పని మీద వచ్చినట్లు కనబడతాంది"
    "మీతో పనిపడందెన్నడు? ఎప్పుడు పనులు పడ్తూనే ఉంటాయి"
    కృష్ణారావుకు అంతా వింతగా ఉంది. వాళ్ళిద్దరూ పరస్పరం పొగడుకోవడం చాలాసార్లు చూశాడు కాని, శాస్త్రి ఇలా పనికట్టుకుని వచ్చి శ్లాఘించడం తొలిసారి చూస్తున్నాడు.
    పెంటడు పశువులను తోలుకుని పోతున్నాడు. పశువులన్నీ తలవంచుకుని సాగిపోతున్నాయి. ఒక కర్రి ఆవు శివయ్యవైపు సాగింది - ముట్టె చాచింది - ఏదో అడగనున్నట్లు పెంటడు వచ్చి ఆవును మళ్ళించుకు పోయాడు. పెంటడు మల్లమ్మ తమ్ముడు - మరో బానిస.
    "దొరవారూ! నా బిడ్డ- పావని - పట్నంలో మేనమామల ఇంట్లో చదువుకున్నది"

 Previous Page Next Page