'ఒరే నారాయడూ! ఏమైపోయినావురా నువ్వు? గవర్నరుగారి నాహ్వానించి సమ్మానపత్రాలు సమర్పించి సాగనంపి వచ్చాము మేమంతా. నువ్వు జాతీయవాదివి. అవును. గవర్నరుగారికి దర్శనమివ్వవు. ఆ మాట మరచిపోయినాం' అంటూ రాజేశ్వరరావు నారాయణుని చేతిలోని గ్రంథము అందిపుచ్చుకొని పేర్లు చూచుచు 'అన్నట్లు మా జమీందారుగారు గవర్నర్ని ఇంటర్వ్యూ చేశారిక్కడ. ఆయనకు కనిపించావటగా నీవు!' అని ప్రశ్నించెను.
అంతలో పరమేశ్వరు డందుకొని 'అవును, ఆయన ఏమిటో నీ భోగట్టా తెగ విచారిస్తున్నాడు!?'
నారాయణరావు చిరునవ్వుతో 'మరి నేనేమి సామాన్యుడ ననుకున్నావుటరా! నేను కూడా ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చాను' అనెను.
రాజా " నువ్వు పెటగోనియనువురా బాబూ! సామాన్యుడ వెందుకవుతావు?
రాజే: నీ గోత్రం కూడా అడిగాడు రా! ఎందుకో?
నారా: పెటగోనియనులకు గోత్రము ఉండదనుకున్నాడేమో?
రాజే: లక్ష్మీపతి చెప్పాడు. మీది కౌండిన్యసగోత్రమని.
ఆలం: కాదురా భాయి. ఆయన నీకీ నిఖ్కా సేస్తాడు రా.
నారా: నీ మొఖం, ఆయన సాయిబు గాదురా, మొగాడికి నిఖ్కా చేయడమా!
రాజే" అవునురోయ్! ఆయనకో కూతురుందిరా. ఆ పిల్లకింకా పెళ్ళి కాలేదు. నిజమే.
పర: ఇకనేమి! నారాయుడి రొట్టె నేతిలో పడింది.
రాజా: నారాయుడి రొట్టెకాదు, నాదీని. నేనింక హిజ్ హైనెస్ విశ్వలాపురం జమీందారుగారికి స్టేటు డాక్టర్నవుతాను.
రాజే: ఒరే బాబూ! నారాయుడు! నన్ను కూడా కాస్త కనిపెట్టి ఉండాలిరా. మామగారికి సిఫార్సు చేసి నన్ను కూడా స్టేటు ఇంజనీరుగా పారేయించు.
నారా: ఏడిశారులే వెధవల్లారా! మీలో ఒకడూ ఇంకా పరీక్షకైనా కూర్చోలేదు. అప్పుడే ఉద్యోగాలు! మామగారి ఎస్టేట్ లో మిమ్మల్నెవళ్లనీ అడుగైనా పెట్టనివ్వను, ఒక్క పరమేశ్వరుణ్ణి మట్టుకు ఆస్థానకవిని చేస్తాను.
రాజే: సెబాస్! చూస్తావేమిరా ఇంకా, పరమేశ్వరుడూ! ఏదీ రాజ జామాతమీద ఒక కీర్తన పాడరా!
పరమేశ్వరమూర్తి లేచిని లిచి ఆశీర్వచనముద్ర పట్టి గొంతు సవరించుకొంటూ వుండగా, రాజేశ్వరరావు 'ఆగ్రా పరమాయి! మరచిపోయాను. బంగారపు బొమ్మ, పచ్చ కర్పూరపు బరిణలాంటి పెళ్ళికూతుర్ని విడిచిపెట్టి, యీ మొరటు నారాయుడిమీద పాట పాడటానికి వల్లగాదు. చేయరా, ముందు వధుకీర్తనం చేయి' అన్నాడు.
'అచ్చా! సభవారి అనుజ్ఞా?' అని అడిగి పరమేశ్వరమూర్తి.
'యెంకివంటి పిల్లలేదోయి, లేదోయి!
యెంకి నావంకింక రాదోయి, రాదోయి!'
అని పాడునప్పటికి రాజారావు, 'చాల్లేవోయ్, నీ అశుభప్పాటలు' అని వారించినాడు. పరమేశ్వరుడు తెల్లబోయి,
'నీతోటె ఉంటాను నాయుడు బావా!
నీమాటె ఇంటాను నాయుడు బావా!' అని అందుకున్నాడు.
'బాగుందిరా. 'మంగళాంతాని కావ్యాని' అన్నారు. తథాస్తు అనండోయ్ సభవారు' అన్నాడు రాజారావు.
సభవారితోపాటు రైలుబండికూడ 'తథాస్తు' అన్నట్లుగా కూత కూసింది. గార్డు కూడా ఈల వేసి జెండాతోడి చెయ్యెత్తి దీవించినాడు. సమయానికి ఊడిపడినట్లుగా జమీందారుగూడా పరుగుపరుగున వచ్చి బండిలో నెక్కినాడు.
కేకిసలు కొట్టుచున్న మన మిత్రులందఱు నదరుపాటుగ గనులప్పగించి చూచుచుండ, రాజేశ్వరరావు లేచి నిలిచి 'దయ చేయండి, దయ చేయండి' అంటూ చోటుచేసినాడు. జమీందారుగారు కూర్చుండి 'నాబోటి వృద్ధులు చెదలుపట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మీవంటి పడుచు వాళ్ళతో సాహసం చెయ్యాలి. మిమ్మల్నందరినీ చూస్తే నాకు తిరిగి యౌవనం వచ్చినట్లుగా ఉంది. మీరంతా ఒక్కసారిగా బయల్దేరారు. అందరూ ఒక కాలేజీలోనే చదువుతున్నారు కాబోలు. రాజేశ్వరరావుగారు మా ఊరివాడు కావడంచేత నే నెఱుగుదును. తక్కిన అందరూ కూడా రాజమండ్రికేనా? ఇంకా పైకి పోయేవారా?' అన్నారు.
రాజే: లేదండీ, అందరూ తలో ఊరి వాళ్ళూ, తలో కాలేజీ వాళ్ళూను. ఇదిగో, మా నారాయుడు ఎఫ్.ఎల్. పరీక్షకు వెళ్ళాడు. ఆలంసాహెబు కూడా ఎఫ్.ఎల్.కే.వెళ్ళాడు. అతడు రాజారావని, వేమూరివారు. వారిది కాకినాడ. అతను ఎమ్.బి.బి.ఎస్. నాల్గోయేటి పరీక్షకు హాజరైనాడు. అడుగో అతడు పరమేశ్వరమూర్తి, వాడ్రేవువారి చిన్నవాడు. ఆయన గ్రాడ్యుయేటు. కవి, చిత్రకారుడు, గాయకుడూను.
ఇందాక మీకు కనిపించిన లక్ష్మీపతిది నిడమర్రు. ఇంటిపేరు నిడమర్తి వారే. ఆయన మా నారాయుడి బావగారు. ప్రైవేటుగా ఎఫ్.ఎ.పరీక్షకు హాజరైనారు. ఒక్క లక్ష్మీపతి తప్ప తక్కిన అందరమూ ఒక్కసారే రాజమండ్రిలో ఇంటరు చదివాము.
లక్ష్మీ: రాజేశ్వరరావునాయుడుగారు మీకు తెలిసిన వారే కదండి. బి.ఇ. పరీక్షకు హాజరైనాడు. చాలా సంపన్న గృహస్థుడూ, సరసుడూనూ.
జమీం: సరి సరి. ఆయన్ని నేను ఇంత నాటినుంచీ యెఱుగుదును. కాలేజీలు మూసి చాలారోజులైనట్లుంది, ఇంత ఆలస్యంగా బయలుదేరినారేమి?
ఆలం: రాజారావు పరీక్షలు మొన్ననే ఆఖరైనాయండి. అందుకోసం మేమంతా మరి నాల్గు దినాలు నిలిచి ఏవో సినిమాలతో కాలక్షేపం చేసి బయల్దేరాము.
జమీం: తక్కిన పరీక్షల్లో ఎట్లా ఉన్నా మనవాళ్ళు లా కాలేజీలో చాలా మేటిలనిపించుకొంటున్నారు.
రాజే: మా నారాయణరావు 'లా' ఆత్మవికాసానికి పరమ శత్రువంటాడు.
జమీం: ఏమండీ నారాయణరావుగారూ! అయితే మీరు గాంధీ మతస్థులా? నారాయణరావు సంభాషణ ప్రియుడయ్యు మితభాషి. తన హృదయానికి పలకరాలు కలిగించు చర్చ వచ్చినచో పట్టుదలతో యుక్తులతో గంభీరమైన విద్యాప్రౌఢితో కవిత్వమువలె, గీతమువలె ఉపన్యసింపగలడు. సంభాషణలో నెదుటి వానిని చెరిగివేయగలడు. అప్పుడతని సహజవినయసంపద మాయమగుట కూడ నొకచో సంభవించును. కొరడా కొసల వలె చురుక్కుమనిపించును. అపహాస్యరసము నంజుడు చూపును. ఎన్ని విషయములైనను అలంకారములతో, ఉదాహరణలతో, భావనాపథములకు నెత్తి వేయుచు మాట్లాడగలడు. కాని తనకు గౌరవాస్పదులగు పెద్దలన్న యెట్టి వాదములకు బోడు.
లక్ష్మీ: మా బావగారి తరఫున నన్ను కొంచెం వాదించనీయండి. అతని అభిప్రాయాల్నే నేను మనవిచేస్తాను. అతననేది...ఇప్పుడు దేశంలో విజృంభించియున్న 'లా' ధర్మదూరమంటాడు. సత్యానికి చాలా దూరమంటాడు. అసత్యం కలపందే నిజం కూడా నెగ్గదంటాడు. సాధారణంగా నిజం అసలు నెగ్గదంటాడు. ఇప్పుడుండే సాక్ష్య చట్టము, వ్యావహారిక చట్టాలూ చాలా దోషభూయిష్టాలనీ, అసలు ఆ తప్పు ప్రస్తుత కాలంలో 'లా' యొక్క తత్వంలోనే ఉందనీ, అలా ఉన్నంతకాలం 'లా' సత్యానికి వేలకొలది మైళ్ళ దూరంలో ఉంటుందనీ వాదిస్తాడు.
జమీందారుగారు తన హృదయము గ్రహించి నారాయణరావు సిగ్గుపడుచున్నాడని భావించుకొని, అతని మాట్లాడించక, ఇతరులతో ననేక విషయములు సంభాషించినారు.
మెయిలు వాయువేగముతో ఏలూరు వచ్చినది. జమీందారుగారు దిగిపోవుచు అందరితో తాను సెలవు తీసుకొనుచున్నాననియు, ఆనాటి స్నేహము మరల మరల తనకా యువకమండలి ప్రసాదించవలెననియు గోరినాడు.
'నేను మిమ్మల్ని ప్రార్థించేది మీరంతా ఈరోజున మా ఊరిలో మా ఇంటికాడ నా ఆతిథ్యం స్వీకరించాలని.
ఆలం: అయ్యా, నేను సంతోషముతో వచ్చేదే. మాది ఏలూరు. నేను వస్తున్నానని మా తమ్ముళ్ళు, చిన్న చెల్లెలు స్టేషనుకు వచ్చారదుగో. మా అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి.
జమీం: మిమ్మల్నెవర్నీ నేను బలవంతపెట్టను. ఎవరికి వీలుంటే వారు వస్తే చాలా సంతోషిస్తాను. నాకు ఏ సంగతీ గోదావరి స్టేషనులో చెప్పాలని కోరిక.
అని జమీందారుగారు లేచి, వారందఱు తనకొనర్చిన నమస్కారములకు ప్రతినమస్కారము లిడి, వెడలిపోవుచు, 'లక్ష్మీపతిగారూ, ఒకసారి నాతో వస్తారా, ఒక చిన్న పని ఉంది' అని పిలిచినారు.
లక్ష్మీపతి 'చిత్త'మని ఆయన వెంట వెళ్ళినాడు. దారిలో కనబడిన గార్డును చూచి జమీందారుగారు 'గార్డ్! వీరు నాతో మొదటితరగతిలో వస్తారు. కూడా వచ్చే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ తో టికెట్టు విషయం చూడండి. నమస్కారము' అని లక్ష్మీపతి చేయిపట్టుకొని తన పెట్టెలోనికి గొనిపోయినాడు.