అడివి బాపిరాజు రచనలు
నారాయణరావు (నవల)
ప్రథమ భాగము
"నీకు పెండ్లి అయినదా?"
"ఏదియో పడిపోయినట్లు అలుపెరుగని మహావేగమున ఈ లోకమంతయు ఎచటి కిట్లు పరుగెత్తిపోవుచున్నది! కనులు మూసికొన్నచో వెనుక కేగుచున్నట్లు తోచు నీ లోకము నిజముగా ముందుకే పోవుచున్నదా? ఈ ధూమశకట మతిరయమున బరువిడుచుండ, ఆ వృక్షములు, పొదలు వెనుక కేగుట యేమి! ఆ తారకలతోడి, మబ్బులతోడి మహాగగనము కదలకుండుటయేమి! ఇది యంతయు భ్రమయనుకొని నవ్వుదమా, నిజమనుకొని అచ్చెరువందుదమా!"
"అనేక కోటి యోజనముల దవ్వున దీపకళికలవలె మినుకుమినుకుమను నా నక్షత్రములు, ఈ గ్రహగోళములు, ఈ మట్టిముద్దపై ప్రాకులాడు మనుజ కీటకములకొఱకే దివ్వటీలు పట్టుచున్నవా! కోటి సూర్యోజ్జ్వలములగు తారకలు, వాని నాశ్రయించిన గ్రహములు నివియెల్ల ఎవరినిట్లు వెదకికొనుచు పోవుచున్నవి? ఛందస్సులను దర్శించిన మన మహర్షులు ఈ పరమార్ధమును ఎంత చక్కగా దానము చేసిరి!
"ఈ తారకలు కూడా సంగీతము పాడునట. అవి ఏ మహాభావమును గానము చేయుచున్నవో! బెథోవిన్, త్యాగరాజు మొదలైన గాయకులూ ఆ మహాభావమునేనా తను గాంధర్వమున ప్రతిఫలింపజేయుచున్నది?"
వ్యక్తావ్యక్తమగు తన యాలోచనముల నుండి మరలి నారాయణరావు రైలు కిటికీ నుండి తల వెనుకకు దీసి, ఆ ఇంటర్ తరగతిలో మైమరచి నిద్రించుచున్న స్నేహితుల పారజూచినా. మెయిలు అమిత వేగముతో కృష్ణానది వంతెన దాటి బెజవాడ స్టేషను సమీపించినది.
'ఒరే సుషుప్తి కుమాళ్లు! లండి! బెజవాడ వచ్చాము. ఒకటే నిద్రా! లెండర్రా!' అని నారాయణరావు తన స్నేహితుల నిద్దురలేపినాడు. కన్నులు నులుముకొని, చిరునవ్వు నవ్వుచు పరమేశ్వరమూర్తి లేచి, ఇటు నటు పరికించి, ఆవులింత లడచుకొనుచు, ఒడలు విరిచికొనుచు 'ఓహో డాక్టరుగారు! లేవరోయి! నిద్ర పారిపోయేందుకు కాఫీ అరఖు, ఇడ్లీ మాత్ర సేవిద్దువు గాని' అని రాజారావును ఒక చరపు చరచినాడు.
రాజారావు లేచి, కోపము నభినయించుచు, 'ఓయి బక్కవాడా నీవటోయి!' అని పరమేశ్వరుని ప్రక్కమీద పడవైచి యదిమిపట్టినాడు.
'ఓరి పాపిష్టిగ్రహం! బక్కాళ్ల,మీదా నీ బాహుబలం!' అని ప్రక్కమీద దొర్లుచున్న రాజేశ్వరుడు లేచి, రాజారావును గబగబా రైలు తలుపు వైపుకు గెంటుకొనిపోయినాడు. 'నారాయణా! అలారం లాగరా! హత్య, హత్య! పోలీసు పోలీసు' అంటూ లక్ష్మీపతి గొలుసును లాగాబోయినట్లు నటించినాడు.
'మీరంతా ద్వంద్వ యుద్ధాలలో వీరధర్మం నిర్వర్తించండి. నేను ముఖప్రక్షాళనాది ప్రాతఃకాలోచిత కృత్యంబుల నిర్వర్తించెదను గాక!' అని నవ్వుచు నారాయణరావు బిఱ్ఱబిగిసికొని గుర్రుపెట్టి నిద్రపోవుచున్న మరియొక మిత్రుని 'అరే మహమ్మదు ఇబిన్ ఆలం సుల్తాన్ అబ్దుల్ రజాక్ పాదుషాహా సాహెబు వారూ! లెండి. మీకీ వైతాళికులు లేరు! రాజ్యం గీజ్యం బూది అవుతున్నాయి జహాఁపనాహ!' అని లేపినాడు.
ఆలం నిద్దుర లేచి 'ఏమి తొందర రా!' అనుచు మొగము కడుగుకొనుటకు సిద్ధమయ్యెను. నారాయణరావు తన పనులు నిర్వర్తించుకొని ఉపహారములు కొనిరా వెడలిపోయినాడు.
ఆ యువకమండలి అంతయు పక్కలు చుట్టుకొని, సామాను సద్దుకొను లోపల నారాయణ వచ్చి 'ఏమర్రో ఇడ్లీ, ఉప్మా, కాఫీ, పూరీ, ఉర్లకళంగ్ ప్రత్యక్షమౌతున్నాయి. సేవించటానికి భక్తులందరూ సిద్ధంగా ఉన్నారా?' అని హెచ్చరించి, అవి తెచ్చిన కూలీకడ నుండి అందిపుచ్చుకొని, ఆయా సరకులను బల్లలపై నమరింప ప్రారంభించినాడు.
లక్ష్మీ: నాకు 'చా' తెచ్చువురా?
రాజా: లేదురా, 'చీ' తెచ్చావు.
ఆలం: తురకవాణ్ణి నాకే 'చా' అక్కర్లేదు. యీడికి ఎందుకోయ్ 'చా?' తుమ్ చీనావాడా ఏమిరా భాయ్?
పక్కబండివాడు మెయిలిక్కడ అరగంటవరకు ఆగుననియు, గవర్నరు గారి స్పెషలు చెన్నపట్టణము వెళ్లుచున్నదనియు చెప్పుకొనుట విని, 'ఓరి నాయనా! చెట్టు మొలవాలి రా, బాబూ!' అనుకొనుచు మన మిత్రులందరు ఉపాహారముల నారగించి కాఫీ తాగినారు. 'త్రీకాజిల్సూ సిగరెట్ల డబ్బాలు తీసి, సిగరెట్లు వెలిగించి ధూమపానలోలు లైనారు.
నారాయణరావు పుస్తకాలు ఏమన్నా పట్టుకువస్తానురా? అని హిగిన్ బాదమ్ పుస్తక విక్రయశాలకడకు విసవిస నడచిపోయినాడు. గవర్నరు గారి ప్రయాణ సందర్భమున గావలియున్న పోలీసు వారు ఆయుధోపేతులై అన్నివైపుల పహరా ఇచ్చుచున్నారు. ఫలహారపు శాలకడ వారిబండి ఆగును. కాన అచ్చట నేరును రాకుండ బందోబస్తు చేసినారు. గవర్నరు గారికి స్వాగత మిచ్చుటకు కృష్ణా కలెక్టరుగారు, పుర ప్రముఖులు, ఉద్యోగస్థులు మొదలగువారు పూలదండలతో, సన్మాన పత్రములతో నిరీక్షించుచున్నారు.
నారాయణరావీ దృశ్యమంతయు జూచుచు పుస్తకశాలకడ నాలోచనా నిమగ్నుడై నిలుచుండిపోయినాడు. నారాయణరావాజానుబాహుడు, అయిదడుగుల పదనొకండంగుళముల పొడవువాడు. బలసంపదకు నెలవైనవాడు ఉజ్జ్వల శ్యామలుడు. చిన్నవై, తీక్షమైన లోచనములు. తీరె, సమమై కొంచెము పొడుగైన ముక్కు దూరస్థలములగు నా కన్నుల మధ్య ప్రవహించి, ధనుస్సువలె తిరిగిపోయిన పై పదవికి నాతికూరమున నాగింది. అతని నోరు సుందరమై పద్మినీ జాతి లలనా రత్నమునకు వన్నె తీర్చునట్టిదైయున్నది. ఆ లోపమును ఉత్తమనాయక లక్షణమగు నామ్రచిబుకము దృఢరేఖాచకితమై ధీరత్వము పుంజీభవింప జేయుచు తీర్చివేసినది.
నారాయణరావు కుడిచేతి చూపుడు వ్రేలితో నడుగు పెదవిని నొక్కుకొనుచు, బొమలు ముడిచి, విశాలఫాలము, వీచికల నిండిన పాలసముద్రమట్లయి పోవ, పరధ్యానములో మునిగిపోయినాడు.
ఉన్నట్లుండి తన్ను ఎవరో తీక్ష దృష్టుల చూచుచున్నట్లు కాగా, ఆలోచనలు మరల్చుకొని ఎదుట నిలుచుండి తన్ను వింత చూపులతో గమనించు నొక పెద్దమనుష్యుని పరికించినాడు. నారాయణరావు తనలో నవ్వుకొనుచు ప్రక్కనున్న పుస్తకముల గమనించుచుండ, ఆ నూతన వ్యక్తి 'ఆగండి' అని చేయియెత్తినాడు. బంగారపు పొన్ను కర్ర విలాసముగ నాడించుకొనుచు ఆ మూర్తి నారాయణరావు కడకు వచ్చెను.
'మీ పేరేమిటండి?'
'నారాయణరావు.'
'ఇంటి పేరు?'
'తటవర్తి వారు.'
'మీ గోత్రం?'
"కౌండిన్యస.'
'మీకు వివాహమైందాండి?'
'........"
ఈ సంభాషణమంతయు ఇంగ్లీషులోనే జరిగినది.
'అయ్యా! నారాయణరావుగారూ! నాకీ అనవసరమైన చోద్యం ఎందుకని మీరనుకుంటున్నారేమో! మిమ్మల్ని చూడగానే మీకు వివాహం కాలేదని నా అంతరాత్మ చెప్పింది. అందుచేత ఈ వెర్రి ప్రశ్నలు వేసినాను. వీరెవరా అని మీరు అనుకోవచ్చు. గవర్నరుగారి రాకకు వేచి ఉన్న బృందంలో నేనొకణ్ణి. నన్ను తల్లాప్రగడ లక్ష్మీసుందర ప్రసాదరావు అంటారు. నేను మిమ్మల్ని అడిగిన ఆఖరిప్రశ్నకు జవాబు ఇవ్వవలెనని నా మనవి. నా ఊహ సరియైనదా కాదా అని తెలిసికొన కుతూహలపడుతున్నాను.'
'నాకు వివాహం కాలేదండి' అని చిరునవ్వుతో నారాయణరావు జవాబు చెప్పినాడు. ఈయనయేనా విశ్వలాపురం జమీందారుగారు, రాజధాని శాసనసభలో మెంబరు అనుకున్నాడు నారాయణరావు.
'గవర్నరుగారి బండి ఇంకా పదిహేను నిముషముల వరకూ రాదులెండి. ఇప్పుడెక్కడినుండి వస్తున్నారు?' అని జమిందారుగారు ప్రశ్నించారు.
'చెన్న పట్టణాన్నుంచి స్నేహితులూ నేనూ కలిసి వస్తున్నాం. సెలవిప్పిస్తారా?' అని నమస్కరించి, మర్యాదలు వెలుగుచూపులు మరలించి పుస్తకశాల చేరినాడు.
స్నేహితులందరును ప్లాటు ఫారంపై తిరుగుచున్నారు. గవర్నరుగారిని చూచుటకు రాజమహేంద్రవరంలో వీలులేకపోయినదో వీరికి? ఈయన శాసనసభలో స్వరాజ్యపార్టీలో జేరి, నిపుణతతో ప్రభుత్వ తంత్రమును చిందరవందర చేయుచు తనకు తోచినవిధమున దేశసేవ జేయుచున్నాడు. నిజమే కాని ఎవరయినను శాసనసభలకు వెళ్ళి చేయదగినదేమున్నది? ఈ రాజనీతి నిపుణుడు అంత అప్రౌఢముగా తన్ను ప్రశ్నించినాడేమి? అని అనుకొనుచు నారాయణరావేవో కొన్ని నవలలు, తదితర గ్రంథములు కొని తన పెట్టె జేరినాడు.
మిత్రులెవ్వరును పెట్టెలో లేరు. నారాయణునకు మనస్సు పుస్తకముల మీద లగ్నము కాదు. జమీందారుడు, ఆశాకాంతులు వెలుగు అతని కన్నులు, దీనమైన అతని ఆఖరిప్రశ్న తలంపుకు వచ్చినవి. ఆయనకడ ఎంత రాజఠీవి యున్నది! స్వార్థపరులై అపహాస్యపు జీవితముల జీవించు అనేకులవలె గాక, ఈయన స్వరాజ్య సముపార్జన మహాయజ్ఞమునందు తానును ఒక ఇంధనమును అప్పుడప్పుడు వేయుచునే యున్నాడు. మిత్రు లెవ్వరును పెట్టెలో లేరు. నారాయణునకు మనస్సు పుస్తకముల మీద లగ్నము కాదు. జమీందారుడు, ఆశాకాంతులు వెలుగు అతని కన్నులు, దీనమైన అతని ఆఖరిప్రశ్న తలంపుకు వచ్చినవి. ఆయనకడ ఎంత రాజఠీవి యున్నది! స్వార్థపరులై అపహాస్యపు జీవితముల జీవించు అనేకులవలె గాక, ఈయన స్వరాజ్య సముపార్జన మహాయజ్ఞమునందు తానును ఒక ఇంధనమును అప్పుడప్పుడు వేయుచునే యున్నాడు.
'ఏడీ నారాయడు! ఓరి ఇడుగోరా!' అని గబగబా స్నేహితులందరు వచ్చి పెట్టె నెక్కినారు.