Previous Page Next Page 
మగబుద్ధి  పేజి 2


    "ఏం బాబూ! అప్పుడే నిద్రలేచావ్! ఎక్కడైనా ఇంటర్వ్యూ వుందా?" అని అడిగాడు పూర్ణానందం ఆయాసాన్ని దిగమింగుకుంటూ.

 

    "అవును సార్. స్మిత ఎక్స్ పోర్టింగ్ కంపెనీలో పదిగంటలకు ఇంటర్వ్యూ. అందుకే తయారవుతున్నాను."

 

    "మంచిది బాబూ. ఈ ఉద్యోగం అయినా వస్తే అద్దె బకాయి తీర్చుదువుగానీ" అని ఆయన జుబ్బా జేబులోంచి సిగరెట్ అందుకున్నాడు. అప్పటివరకు తాగుతున్న సిగరెట్ తోనే మరో సిగరెట్ అంటించుకున్నాడు. అయిపోయిన సిగరెట్ ను ఓ మూలకు గిరాటేశాడు.

 

    ఆయన చేతిలో ఎప్పుడూ సిగరెట్ కాలుతుంటుంది. భక్తులకు దర్శనమిచ్చేటప్పుడు శ్రీ మహావిష్ణువు శంఖుచక్రాలు లేకుండా ఎలా కనిపించడో ఆయన కూడా చేతిలోని సిగరెట్ లేకుండా కనిపించడు.     

 

    ఆయన్ను చూస్తూనే ఎవరికైనా 'ధూమకేతువు' అన్న పేరు స్ఫురిస్తుంది. చిన్న పిల్లలకయితే పొగబండి గుర్తుకొస్తుంది.

 

    రోజుకి అయిదు ప్యాకెట్ల చార్మినార్ సిగరెట్లను వూదిపారేస్తాడు. అరవయేళ్ళ వయసులో అన్ని సిగరెట్లు తాగుతున్నా ఇంకా చార్మినార్ కట్టడంలా వున్న ఆయన్ను చూస్తే నరేష్ కి ఆశ్చర్యంగా వుంటుంది. దీనికి జవాబు కనుగొనాలని చాలాసార్లు ప్రయత్నం చేసినా అడగలేకపోయాడు. కానీ ఇప్పుడు టాపిక్ ని అద్దె బకాయి నుంచి మార్చాల్సిన అవసరం వచ్చింది.  

 

    "ఏం సార్! సిగరెట్లు తాగితే కాన్సర్ వస్తుందని అంటారు కదా. మరి మీరు ఇన్ని సిగరెట్లు కాలుస్తున్నా జలుబైనా రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు?" అని అడిగాడు దగ్గరగా వెళ్ళి.

 

    "అదే చిదంబర రహస్యం. ఈ డాక్టర్లు, శాస్త్రజ్ఞులు ఏం పని లేకుండా సిగరెట్లు తగలేస్తూ ఇలా అర్థంపర్థం లేని భయాలను లోకం మీద రుద్దుతున్నారు. పొట్లకాయ తింటే మధుమేహం, పప్పు దినుసులు తింటే వాతం, వంకాయ తింటే ఊష్ణం, బంగాళాదుంప తింటే వాయువు... ఇలా అన్నిటికీ అన్నీ చెబుతారు. ఇవన్నీ తినకుండా ఓ పూటైనా గడుస్తుందా? డాక్టర్ల మాట వింటే ఆరోగ్యం కాదుగదా శాల్తీనే గల్లంతైపోతుంది. అసలు ఏ అలవాటూ లేకుండా వుండడం మనిషి లక్షణం కాదు. పశువులు పాన్ పరాగ్ తినవు కదా. మేకలు మేకమార్కు బీడీలు తాగవు కదా. చిరుతపులులు సిగరెట్లు కాల్చవుగదా" అని బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు ఆయన.

 

    "మీరు చెప్పింది నిజమే సార్. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడికి సృష్టి చేసే అలవాటు వుంది కదా" వంత పాడాడు నరేష్.

 

    "ఈ మాటే మా అబ్బాయి ప్రసాద్ తో చెప్పవయ్యా, నేను సిగరెట్లు తాగుతున్నానని రోజూ నామీద ఫైర్ అయిపోతున్నాడు" అని బతిమాలుతున్నట్టు ముఖం పెట్టాడు.

 

    "అలానే సార్"

 

    పూర్ణానందం అద్దెబకాయి అడక్కుండానే వెళ్ళిపోయాడు.

 

    నరేష్ లోపలికెళ్ళి ముఖం కడుక్కుని తయారయ్యాడు.

 

    అప్పటికి టైమ్ ఎనిమిది దాటింది.

 

    రాత్రి భోజనం చేయకపోవడంతో విపరీతంగా ఆకలేస్తోంది. నాలుగు ఇడ్లీలైనా తినకపోతే ప్రాణం పోతుందనిపించింది. ఇడ్లీలు తేవడానికి రాజా కోసం చూశాడు.

 

    వీధిలో నిల్చుని వున్న రాజాని కేకేసి పిలిచాడు.

 

    వాడికి పదేళ్లుంటాయి. రాళ్ళపల్లి కొడుకు.

 

    "వస్తున్నా మామయ్యా!" అని పూర్ణానందం ఇంటిగేటు తీసుకుని లోపలికి వచ్చాడు.

 

    నరేష్ జేబులో, పుస్తకాలన్నీ తడిమాడు. మొత్తం ఒక రూపాయి బిళ్ళ, రెండు అర్థరూపాయలు, ఒక ఐదుపైసలు బిళ్ళా దొరికాయి.

 

    ఈ రోజంతా ఆ డబ్బుతోనే సరిపెట్టుకోవాలని అనుకుంటూ వుండగా రాజు వచ్చాడు.

 

    "ఏం మామయ్యా! పిలిచావు" చేతుల్ని జేబుల్లోకి తోసుకుంటూ అడిగాడు.

 

    "ఓ నాలుగు ఇడ్లీలు పట్రారా."

 

    "ఆ పని చేయాలంటే నాకు లంచంగా ఎంతిస్తావ్?"

 

    ఎంతో కొంత ముట్టచెబితే తప్ప రాజా ఏ పనీ చేయడని తెలుసు గనుక వాడి చొక్కా జేబులో ఐదుపైసలు బిళ్ళవేసి చేతిలో రెండు అర్థరూపాయల బిళ్ళలు వుంచాడు నరేష్.

 

    "పట్టుమని పదేళ్ళు కూడా లేవు, ఈ లంచం గజ్జి ఎలా పట్టుకుందిరా నీకు?" ఒళ్ళు మండుతుంటే అడిగాడు.

 

    "లంచం లేకుండా ఏ పనీ జరగదు మామయ్యా. ఈ ఫిలాసఫీని ఒంటబట్టించు కోవడానికి వయసుతో పనిలేదు."

 

    "మొత్తానికి నీ శరీరం కన్నా నీ బుర్ర పెద్దదిరా."

 

    "నేను త్వరగా వెళ్ళాలి మామయ్య. ఇడ్లీలు తెచ్చేందుకు పదినిముషాలకన్నా ఎక్కువ పడితే ఐదుపైసలు లంచం గిట్టుబాటుకాదు" అంటూ బయటికి తుర్రుమన్నాడు వాడు.

 

    నరేష్ జనరల్ నాలెడ్జ్ బుక్ తెరిచాడు.

 

    కళ్ళు చూస్తున్నాయే తప్ప మనసు పుస్తకం మీద నిలవడం లేదు. జీవితం తాలూకు గజిబిజి బుర్రతో అల్లిబిల్లిగా తిరుగుతోంది.

 

    గత మూడేళ్ళుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నాడే తప్ప దొరకడం లేదు. ఎం.ఏ. ఫిలాసఫీ అయిపోయి యూనివర్శిటీవాళ్ళు బయటికి గెంటినప్పట్నుంచి పొట్ట కూటికోసం ఏవేవో పనులు చేస్తున్నాడు గానీ పర్మినెంట్ గా సెటిల్ కాలేకపోయాడు.

 

    పదోతరగతి వరకు అనాధశరణాలయంలో పెరిగాడు. ఆ తరువాత ట్యూషన్లు చెప్పుకుంటూ, పేద విద్యార్ధుల స్కాలర్ షిప్ ల మీద చదువు ముగించాడుగానీ నెలకి ఇంత జీతం రాళ్ళు చేతిలో పడేట్టు చేసుకోలేకపోయాడు.

 

    తను అనాధ కాకుండా అందర్లా అమ్మా, నాన్నా, వెనుక బోలెడంత ఆస్తి వుండుంటే జీవితం ఇంత దరిద్రంగా తయారయ్యేది కాదని అప్పుడప్పుడు వగస్తూ వుంటాడు.

 

    చిన్నప్పట్నుంచీ కష్టాలు అనుభవించినా, పెదవులమీద చిరునవ్వు ఎండిపోకుండా చూసుకోగలిగాడు. చలాకీతనాన్ని చంపేసుకోకుండా ఎప్పుడూ పూలరంగడిలా బతకడం నేర్చుకున్నాడు. భోజనానికి డబ్బు లేకపోయినా కిళ్ళీ నమిలి పెదవులు ఎర్రబడడాన్ని అద్దంలో చూసుకుంటూ బతికేయడం అలవాటు చేసుకున్నాడు.

 Previous Page Next Page