Read more!
 Previous Page Next Page 
రక్త సింధూరం పేజి 2


                        రక్త సింధూరం
    జైలంటే నా కిష్టం!
    ముఖ్యంగా ఈ జైలంటే...
    దాదాపు పదిహేను అడుగుల ఎత్తుగోడ... ఆపైన ఎలక్ట్రికల్ వైరింగూ... దూరం నుంచి చూస్తే ఒక కోటలా వుంటుంది అది. మూడు వైపులా లోతైన కందకం... బురుజుల మీద తుపాకుల్తో జవాన్లు. విసిరేసిన కాంపస్ లా వుంటుంది. అయిదు సంవత్సాల్నుంచీ ఆ జైల్లో పనిచేస్తున్నాను నేను-
    సబ్ జైలరుగా!
    అంతకు ముందునుంచి కూడా ఆ జైలు నాకు తెలుసు. నాకు వూహ వచ్చినప్పటినుంచీ, అంటే ఇరవై సంవత్సరాలుగా ఆ జైలు పరిసరాల్తో నాకు పరిచయం వుంది. అమ్మ అక్కడనే పనిచేస్తుంది. ముందు స్వీపర్ గా చేసేది. తరువాత స్త్రీల వార్డ్ కి కేర్ -టేకర్ అయ్యింది.
    మా ఇల్లు జైలు బయట వుండేది. అక్కడే ఆడుకునే వాళ్ళం. అప్పుడప్పుడు ఖైదీలు బయటకు వచ్చేవారు. వాళ్ళని చూస్తూ వుంటే చిత్రంగా వుండేది. నేలమీద గోళీలు జేబులో పెట్టేసుకుని గబగబా పరుగెత్తుకు వెళ్ళి దూరంగా నిలబడేవాళ్ళం. వాళ్ళు నిశ్శబ్దంగా నడుస్తూ వెళ్ళి వ్యాన్ ఎక్కటాన్ని కుతూహలంతో చూసేవాళ్ళం. వ్యాన్ కదిలి వెళ్ళి పోయేది.
    అమ్మకి ఆ రోజుల్లో ఎనభై రూపాయలు ఇచ్చేవారు. కానీ డబ్బు ఇబ్బంది వున్నట్టే నాకు తెలియనిచ్చేదికాదు అమ్మ. ఆమె ఎప్పుడూ పెదవులమీద చిరునవ్వే తప్ప- పళ్ళబిగువున కష్టాన్ని కనపడనివ్వలేదు.   
    అమ్మంటే నాకు చాలా ఇష్టం! ఆ మాటకొస్తే- ఇష్టం కానిది ఎవరికి అని మీరనుకుంటారు.
    మా స్నేహితుల అమ్మలు నాకు చాలామంది తెలుసు. వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా చిరునవ్వుతో పలకరిస్తారు. కానీ, డబ్బుండీ- జీవితం సమస్య కాకపోతే, ఆప్యాయతలు ఒక రేంజిలో వాటంతట అవే వస్తాయని నా వుద్దేశ్యం. బజారుకెళ్ళి చీరలు కొనుక్కొని వచ్చేటప్పుడు, మర్చిపోకుండా కొడుక్కి చాక్లెట్లు తేవటం... పుట్టినరోజుకి బట్టలు కుట్టించటం, ఇవే ఆప్యాయతకి నిదర్శనాలయితే, చాలామంది వాటినే చూపిస్తున్నారనిపించేది.
    అమ్మ అలా కాదు.
    జైలర్ గారింటిలో అంట్లు తోమేది. సూపర్నెంటెండెంట్ గారింటిలో బట్టలుతికేది. ప్రొద్దున్నుంచి రాత్రివరకూ యంత్రంలా కష్టపడేది.
    నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను. జర్మనీ అనుకుంటాను- యుద్ధం వచ్చి ఒక గ్రామం సర్వనాశనం అయిపోతుంది. కుటుంబాలు చెదరిన విస్తరాకుల్లా వలస బయల్దేరతాయి. ఒక తండ్రీ కొడుకూ దక్షిణం దిక్కుకి ప్రయాణం చేస్తూవుంటారు. కొంతదూరం ప్రయాణం చేసేసరికి ఇద్దరూ చావుకి దగ్గిరవుతారు. గొంతు ఎండిపోతుంది. అంతలో ఆ మైదానంలో చావుకి సిద్ధమై, శవాల్లా పడిపోయిన మరొక కుటుంబం కనిపిస్తుంది. వాళ్ళ దగ్గిర నీటి బాటిల్ ఆ చీకట్లో తస్కరిస్తాడు. అందులో కేవలం గుక్కెడు నీళ్ళే వుంటాయి. నీళ్ళు గొంతులో పడకపోతే ప్రాణం పోయే పరిస్థితి. కొడుకుది అదే. బాటిల్ లో నీళ్ళు గొంతులో పోసుకుని ప్రయాణం ముందుకు సాగిస్తాడు తండ్రి.
    అదీ కథ.
    ఈ కథని నేను చాలామందికి చెప్పాను. చాలామంది నావైపు చిత్రంగా చూసేవారు. 'అలా ఎన్నటికీ జరగదు' అనేవారు. కానీ ఎందుకో ఈ కథంటే నాకోవిధమైన ఇష్టం ఏర్పడిపోయింది. చాలాసార్లు మననం చేసుకునే వాడిని. గోపాల్ తో పరిచయమూ, ఆ సంఘటనా, తరువాత నా అభిప్రాయం మరింత బలపడింది.
    మాజైలు వూరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అడవిలాటి తుప్పల మధ్య వుంది. అందువల్ల నా డిగ్రీ చదువు హాస్టల్లో జరిగింది. అక్కడే పరిచయమయ్యాడు గోపాల్. అతడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్. నాకూ ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇద్దరం పై చదువులకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాం.
    అమ్మకి చెప్తే 'సరేలేరా దానికేం' అంది నవ్వుతూ.
    అంతలోనే ఘోరమైన వార్త తెలిసింది-
    గోపాల్ ఆత్మహత్య చేసుకున్నాడని.
    కారణం చాలా చిన్నదని చూసినవాళ్ళు అన్నారు. గోపాల్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. చిన్నవాళ్ళిద్దరూ ఇంకా చదువుకుంటున్నారు. తండ్రి ఏదో ఆఫీసులో హెడ్ క్లర్క్.
    "ఇప్పటికే అన్ని ఆశలూ చంపుకుని నిన్నింతవరకూ చదివించాం. ఇంక చదివించలేం. ఇంకా వెనక ఇద్దరున్నారు" అందట వాళ్ళమ్మ. అందరూ అనుకున్నట్టే గోపాల్ చచ్చిపోవలసినంత పెద్ద కారణమేమీ కాదు. కానీ వాడికి చదువంటే ఎంత ఇంటరెస్టో నాకు తెలుసు. ఈ మాటలకి ఎంత కదిలిపోయి వుంటాడో నాకు తెలుసు. గోపాల్ లాటివాడు నా కొడుకై వుంటే (చాలా చిత్రమైన ఆలోచన) భిక్షమెత్తయినా వాణ్ణి చదివించి వుండేవాడిని. గోపాల్ ఆత్మహత్యకి కారణం చదువు ఆగిపోయిందనికాదు. తన తెలివితేటల్నీ, చదువుపట్ల తన ఆసక్తినీ తన స్వంత తల్లిదండ్రులు గుర్తించలేదని! అదీ చాలమందికి చిన్న కారణంగా కనపడవచ్చు. కానీ అర్ధం చేసుకోగలిగే వాళ్ళకి అంతకన్నా పెద్ద కారణం మరొకటి వుండదు. అదే తల్లి 'ఇంకొంచెం' జాగ్రత్తగా అతడికి పరిస్థితి వివరించి వుంటే బహుశా ఇలా జరక్కపోయి వుండేదేమో.
    అమ్మ దగ్గిరకి వెళ్ళి ఉద్యోగంలో చేరదల్చుకున్నానని చెప్పేసేను. అమ్మ ఆశ్చర్యపోయింది. "అదేమిట్రా పైకి చదవ్వూ" అని అడిగింది.
    "ఊహో, బోరుకొడుతూందమ్మా."
    అమ్మ తెలివైంది. నవ్వి "నేను కష్టపడతానని అలా అంటున్నావు కదూ" అంది.
    చుట్టూచేతులు వేసి చిన్నపిల్లాడిలా వళ్ళో మొహం దాచుకున్నాను. "ఇంకా చదవాలన్న ఆలోచన వచ్చినందుకే నాకు సిగ్గేస్తూందమ్మా. ఎంత మూర్ఖుణ్ని నేను. ఈ వయసులో ఇంకా నిన్ను కష్టపెట్టకూడదన్న ఆలోచనే రాలేదు నాకు."
    అమ్మ ఎదో వారించబోయింది. విన్లేదు నేను.
    ఫలితమే జైల్లో ఈ ఉద్యోగం!
    ఉద్యోగం వచ్చాక నేను చాలా మారిపోయానని అమ్మ అంటూ వుండేది.
    నిజమే... ఆ జైలు అలాంటిది... అక్కడ ఒక్కొక్కడూ ఎన్నో హత్యల్ని అవలీలగా చేసినవాడు. మళ్ళీ బయట ప్రపంచంలోకి వెళ్తే రక్తం తాగటానికి ఉవ్విళ్ళూరుతున్నవాడు. అలాటివాళ్ళ దగ్గిర ఎంత కర్కశంగా వుంటే అంత మంచిది. రాక్షసత్వాన్ని అణిచేది రాక్షసత్వమే.

 Previous Page Next Page