Read more!
Next Page 
రక్త సింధూరం పేజి 1

                                 


                                              రక్త సింధూరం
                                         _ యండమూరి వీరేంద్రనాథ్


                             నాంది
    నాకు పని చేసే శక్తిలేదు... పనిచేయాలన్న ఇష్టంలేదు!
    శ్రమకి నేను ఆమడదూరం.. విశ్రమించడం సదా నా ఆచారం.
        కానీ నేనూ బ్రతకాలికదా!
        అందరికన్నా హాయిగా సరదాగా!!
    అందుకు దేవుడు నా కిచ్చిన వరం- తెలివితేటలు.
    దాన్తో నేను సృష్టించిన ఆయుధం- 'రూపాయి- పైసలు'
    నా పెట్టుబడి పది రూపాయలు
        ఇటుపక్క అడవి - అటుపక్క పొలం
        మధ్యలో పల్లె అమాయకం.
    అదిగదిగో వస్తున్నాడో గిరిజనుడు
    రోజంతా అడవిలో చెమటతో తడిసినవాడు
    నెత్తిన కర్రల్తో యింటికి పోతున్నాడు.
        "అన్నా - ఓరన్నా' అన్నా,
        వేగాన్నాపి 'ఏందన్నా' అన్నాడు.
    "ఇస్తావా, నువ్విస్తావా? అయిదు రూపాయలిస్తాను
    నెత్తిమీద కట్టల్లో సగం కట్టెలిస్తావా"
        "అన్నా సూరుడికి ముందే లేచిన
        సూరుడెళ్ళాక ఎల్తున్న
        ఇంతకష్టానికి అయిదురూపాయలా"
    "ఇన్ని కట్టెలు నువ్వేం జేసుకుంటావ్ రా?
    తింటావా తాగుతావా- పొయ్యిమీద ఏం బెడ్తవు?
    పప్పుకూర- అప్పుజేస్తావా?
    సగం ఇయ్యరాదూ- అయిదిస్తా"
        ఆలోచించుకున్నాడు వాడు
        కట్టలోంచి సగమిచ్చి
        అయిదునోటు అచ్చుకున్నాడు.
    నా చేతిలో ఇంకో అయిదునోటుంది
    కాళ్ళదగ్గిర సగం కట్టెలమూటుంది.
        అదిగదిగో వస్తున్నాడో కర్షకుడు
        బ్రతుకు పొలంలో సంతోషం పంటకోసం
        జీవాతాంతం దున్నుతున్నవాడు.
    ఏమిటీ - అదేమిటీ?
    వాడి బండి వెనుక రెండు
    ధాన్యంమూటలున్నట్టున్నాయి.
        'అన్నా - ఓకన్నా, ఇస్తావా నువ్విస్తావా?
        అయిదు రూపాయలిస్తాను-
        బస్తా మూటిస్తావా?'
    ఆలోచించుకున్నాడు వాడు
    రెండు బస్తాల్లో సగమిచ్చి
    అయిదునోటు అచ్చుకున్నాడు.
        చేతిలో డబ్బులు ఖాళీ అయితేనేం?
        నా ముందు బియ్యంబస్తా!
        దానితో నే ఓ ఆలోచన చేస్తా!!
    అదిగదిగో తిరిగి వస్తున్నాడు గిరిజనుడు మళ్ళీ
    పాపం ఏంపనో అడగాలి ఎదురెళ్ళి.
        'అన్నా! ఏమైందన్నా- ఎక్కడికీ ప్రయాణం
        నేనొక అయిదిచ్చా- నీకాడ కట్టెలున్నాయి
        అయినా ఎక్కడకీ ప్రయాణం?'
     "కట్టెవుంది, పొయ్యివుంది. కానీ
    బియ్యంలేక బువ్వలేదు
    అందుకే వెళ్తున్న
    ఉన్నాడు పక్కవీధిలో రైతన్న"
        "అన్నా! అన్నన్నా!! ఎంతమాటన్నా!
        నేనున్నాక అంతదూరం ఎందుకన్నా" అన్నా.
    అర్ధంకానట్టు చూశాడు
    బియ్యంబస్తా చూపించా
    పదిరూకలకు సగం బస్తా పంచా
        అయిదు నోటిచ్చాడు. మిగతా
        అయిదుకి నోటు రాశాడు
        ఇంటికి బియ్యం పట్టుకెళ్ళాడు.
    అంతలోనే ఇట్నుంచి వచ్చాడు కర్షకుడు
    గచ్ఛత్ శవాకార వీరుడు
    బియ్యం వున్నాయి కానీ కట్టెలు లేవన్నాడు.
    అయిదిచ్చి మరో అయిదుకి నోటువ్రాసి
    సగంకట్ట పట్టుకెళ్ళాడు. ఆకలి అవసరంతో
    ఆలోచన అవసరాన్ని చంపుకున్నాడు.
ఇప్పుడు నా దగ్గిర
    సగంబస్తా బియ్యం వున్నాయి. సగం కట్ట కట్టెలున్నాయి
    ఇద్దరూ వ్రాసిన ప్రామిసరీ నోట్లున్నాయి.
    పైగా -
    నా పదీ నాకున్నాయి.
        ఈ వ్యవస్థ ఇలా సాగినంత కాలం
        వడ్డీగా కర్షకుడు.
        భక్తిగా గిరిజనుడు తమ
        శ్రమశక్తిలో సగం సగం
        సమర్పించుకుంటారు ప్రతి సంవత్సరం.
    ఈ వ్యవస్థ ఇలా సాగటం కోసం
    దీనికి 'ప్రజాస్వామ్యం' అని పేరు పెట్టాను.
    రాజకీయ నాయకుణ్ణి సృష్టించాను.
        ఈ వ్యవస్థ ఇలా సాగటం కోసం
        ప్రభుత్వాన్ని సృష్టించాను.
        కోర్టు నెలకొల్పాను. చట్టం
        అని పేరు పెట్టాను.
    వీటన్నిటినీ దాటి ఎవరైనా ఎదురు తిరుగుతారేమో అని
    గూండాల్నీ, దాదాల్నీ పోషిస్తున్నాను.
        కార్మికులు, కర్షకులు, గిరిజనులు,
        హరిజనులు-నేను సృష్టించిన
        ఈ వ్యవస్థలో పావులు - నాకు
        బియ్యాన్నీ, కట్టెల్నీ ఇచ్చే శ్రమజీవులు.
    వాళ్ళు వ్రాసిచ్చిన నోట్లు పది ఇరవై-
    ఇరవై నలభై- నలభై ఎనభై అవుతాయి.
    నా పెట్టుబడి పదీ- లక్షా కోటీ అవుతుంది.
        ఈ వ్యవస్థలో
        ఇంత పకడ్భందీ సంస్థలో
        నన్నెదుర్కొనేదీ ఎవరు?
    ఎవరు ?
    ఎవరు??
    ఎవరు???     

Next Page