8
అనసూయ వంటింట్లో వున్నది.
సావిత్రి స్నానంచేసి బట్టలు మార్చుకుంది. హాండ్ బ్యాగ్ తీసుకుని వంటింటివైపుకు వచ్చింది.
గడపలో నిల్చుంది.
అనసూయ వెనక్కి తిరిగిచూసింది.
"ఎక్కడికే తయారయావ్?"
"యూనివర్శిటీకి. అటునుంచి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కు కూడా వెళ్ళొస్తాను."
"హాస్టల్ కు ఎందుకే?"
"సీటుకోసం."
"నేను ఇక్కడుండగా హాస్టల్ కు వెళతావా?"
"బలేదానివే అనూ! ఒకరోజూ రెండు రోజులా రెండేళ్ళు ఉండాలి."
"అయితేనేం?"
"ఇంకానయం మీవారు కర్ర తీసుకుంటారు."
"ఛ అదేం కాదు. మావారు చాలా మంచివారు."
"అబ్బ ఏం పొగడ్తలే. అందరు పెళ్ళాలు ఇదే మాటంటారు. ఆడవాళ్ళు నిజంగానే పిచ్చివాళ్ళు. ఏ మొగుడూ పెళ్ళాన్ని ప్రేమించడు. అయినా పెళ్ళాన్ని ప్రేమించడమేమిటి? బయట వేసే వేషాలు ఇంటిలో కూర్చున్న పిచ్చి ముండలకు తెలియదు. మా ఆయన ఋష్యశృంగుడు, సాక్షాత్తూ రామచంద్రమూర్తి అనుకుంటారు."
అనసూయ "నీకేం తెలుసులే" అన్నట్టు నవ్వింది. ఈ విషయంలో వాదించడం అనవసరమనుకుంది.
"అయితే నువ్వు మా ఇంట్లో ఉండనంటావ్."
"ఉంటానే అనుకో నీ మొగుడు నన్ను ప్రేమించడం మొదలుపెడితే? నాకోసం మొగుణ్ణికూడా త్యాగంచేస్తావా?"
అనసూయ సావిత్రి ముఖంలోకి విస్మయంగా చూసింది.
"ఏమిటి అలా చూస్తున్నావ్? భయపడకు. నీకు నేను ద్రోహం చెయ్యను."
"ఏమిటే ఆ పిచ్చిమాటలూ నువ్వూనూ!"
సావిత్రి ముఖం సీరియస్ గా అయింది. కళ్ళెర్రబడ్డాయి.
"నీక్కూడా నేను పిచ్చిదాన్నిగా కన్పిస్తున్నానా? అమ్మ ఎప్పుడూ ఆ మాటే అంటుంది."
"సారీ! నేను మాటవరసకన్నానే."
"సరే వస్తాను."
"త్వరగా వచ్చెయ్ నీకోసం ఎదురు చూస్తూంటాను."
"అలాగే ఒకవేళ ఆలస్యం అయితే నువ్వు భోజనం చెయ్. నా కోసం కూర్చోకు."
"అదేం కుదరదు. నీకోసం ఎదురుచూస్తూంటాను. మర్చిపోకు."
"నువ్వు మొండిదానివే. పెళ్ళయాకకూడా మారలేదన్నమాట. అలాగే వస్తాలే" అంటూ సావిత్రి బయటికి వెళ్ళిపోయింది.
సావిత్రి పూర్తిగా మారిపోయింది. దానిమాటలు ఒకోసారి అసాధారణంగా ఉంటున్నయ్. ప్రేమించినవాడు మోసం చేశాడు. బాగా ఫస్ట్రేషన్ వచ్చినట్టుంది. మగవాళ్ళంతా మోసగాళ్ళనే భ్రమలో పడింది. తన భర్తను చూశాక అది తప్పక తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. మంచివాణ్ణి చూసి దాన్ని ఒక ఇంటిదాన్ని చెయ్యాలి.
ఒకోసారి కారణం లేకుండా ఉద్రేకపడుతుంది. అప్పుడు దాని ముఖం వికృతంగా వుంటుంది. కళ్ళలో ఏదో భయం కన్పిస్తుంది. మానసికంగా బాగా దెబ్బతిన్నట్టుగా ఉన్నది పాపం! ప్రపంచంలోని మగవాళ్ళంతా రామకృష్ణలే అనుకుంటున్నది.
దాదాపు మధ్యాహ్నం రెండుగంటలకు సావిత్రి వచ్చింది. ఉత్సాహంగా ఉన్నది. వస్తూ వస్తూ యాపిల్ పళ్ళు కొనుక్కొచ్చింది.
"ఇవెందుకే?"
"తినడానికి" పకపక నవ్వింది.
"సీటు దొరికిందా?"
"ఆఁ అడ్వాన్సు కూడా కట్టివచ్చాను. రేపు వెళ్ళిపోతాను."
"రేపు వెళతావా? వీల్లేదు మావారు వచ్చాకనే నువ్వు వెళ్ళాలి. తెలిసిందా?"
"అలాగేలే."
ఇద్దరూ భోజనాలుచేసి కొంచెంసేపు పడుకున్నారు. ఆరుగంటల సినిమాకు వెళ్ళారు.
"సావీ! గుర్తుందా? మనం మనఊళ్ళో టూరింగ్ టాకీసుకు వచ్చేవాళ్ళం. ఆ గేటుకుర్రాడు మనదగ్గర డబ్బులు తీసుకొనేవాడు కాదు.
"అవును. పైగా సోడాలుకూడా ఇప్పించేవాడు."
"అతనికి నువ్వంటేనే ఇష్టం. ఎర్రగా అందంగా వుండేదానివి."
"ఇప్పుడు లేనా?"
"ఆ వయసే వేరు. చీకూ చింతా లేని వయసు. ఆ రోజులు మళ్ళీ రావు" అన్నది అనసూయ మాట మారుస్తూ.
"నీకు గుర్తుందా? ఒకసారి చీమచింతకాయలకు ఊరి బయటికి వెళ్ళాం. చీకటి పడుతుందనే ధ్యాసకూడా మనకులేదు. తీరా ఇంటిముఖం పట్టేసరికి చీకటిపడింది. తాటి తోపునుంచి వస్తుంటే దూరంగా నీకు దెయ్యం కన్పించింది."
అనసూయ పకపక నవ్వింది. "దూరంగా మిణుగురు పురుగుల్ని చూసి కొరివిదెయ్యం అని భయపడ్డాను."
"ఇద్దరం పరుగు లంకించుకున్నాం. పడుతూ లేస్తూ ఇంటికి చేరాం. ఆ తర్వాత నీకు జ్వరంకూడా వచ్చింది" అన్నది సావిత్రి.
"మన ఊళ్ళో సురభివాళ్ళు వచ్చి డ్రామాలు వేశారు."
"అవును. కృష్ణలీలల్లో చిన్నకృష్ణుడు వేషం వేసిన అమ్మాయితో స్నేహం చేశాం"
"మా ఇంట్లో పాలూ, పెరుగు పట్టుకెళ్ళేది."
"నేను లంగాకూడా ఇచ్చాను"
"ఆ పిల్లు పేరు ఏమిటే?"
"నాగమణి."
"అవును. సీతారావమ్మా, సుబ్బమ్మా ఆ పిల్లను తమవైపు లాక్కోవాలని చూశారు."
"అయినా నాగమణి మనతోనే స్నేహంగా వుండేది."