Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 18

                                                        మారిపోయిన మనిషి
   
    "ఆ కూత మళ్ళీ కూశావంటే పళ్ళు రాల్తాయ్! ఆఁ ఏమనుకుంటున్నారో? మరీ వళ్ళు తెలియక చస్తున్నావ్?"

    "వళ్ళు తెలియక చస్తుందెవరో తెలుస్తూనే వుంది."

    'ముయ్ నోరు! మాటకు మాట ఎదురు చెప్తావా?' శేషయ్య చేతిలో వున్న వంకెకర్ర పెళ్ళాంమీదకు నిలువుగా లేచింది.

    'ఊఁ కొట్టండి! కూడు పెట్టడం చేతకాకపోయినా కొట్టడం మాత్రం తెలిసిందిలే! ఊఁ కొట్టండి చూస్తారేం?' రెండు చేతులూ అడ్డంపెట్టి ముందుకు ముందుకు జరుగుతూ అన్నది రామసుబ్బమ్మ.

    'ఏవిటి నాన్నా! అదీ?' అంటూ శేషయ్య కూతురు వంటింట్లోనుండి పరిగెత్తుకొచ్చింది.

    "ఛీ! ఛీ! మనిషిజన్మ ఎత్తేక కాస్త పరువూ మర్యాదా వుండాలి" అంటూ శేషయ్య ఎత్తిన కర్రను దూరంగా విసిరేసి, వసారాలోకి పోయి మంచం వాల్చుకుని మెను వాల్చాడు.

    పాతిక సంవత్సరాలు కాపరం చేసిన రామసుబ్బమ్మ భర్తకు తొలిసారిగా ఎదురు తిరిగింది. పతివ్రతా, పరమ సాధ్వీ అయినా రామసుబ్బమ్మ. భర్త గీచిన గీతును దాటి ఎరగని రామసుబ్బమ్మ ఈ లోక దైవాన్నే ధిక్కరించింది. సత్యకాలం కాకపోబట్టి సరిపోయింది. లేకపోతే అటు సూర్యుడు ఇటు పొడిచి, నక్షత్రాలు ఝల్లున నేలరాలి, భర్త శాపాగ్నిలో రామసుబ్బమ్మ మలమలా మాడి మసై వుండేది. లేకపోతే చిన్నసైజు నల్లరాతి బండైనా అయివుండేది.

    అదేమీ కాకపోగా రామసుబ్బమ్మ "ఏమాత్రం కొడతావో కొట్టూ?" అన్నట్టు భర్త మీద మీదకు వచ్చింది.

    దానికి తగ్గట్టు కమల ఒకతి! అమ్మకు తగ్గ కూతురే!

    అస్త్రసన్యాసం చేసివచ్చి పడుకున్న శేషయ్య మెదడు కుతకుతలాడిపోయింది. జరిగిన సంఘటనను గురించిన ఆలోచనల్లో మునిగిపోయాడు.

    ఛ! తను పొరపాటు చేశాడు! ఆ వజాన రెండు తగిలిస్తే పోయేది? దానికి రాను రానూ మంచీ చెడ్డా తెలియకుండా పోతూంది. దీనితోనేనా తను ఇన్నాళ్ళు కాపరం చేసింది? ఇంత బతుకూ బతికి ఇంటెనకాల చావమన్నట్టు ఇవ్వాళ ఇది ఇడ్డెన్ల వ్యాపారం చేస్తుందా! తన ఇంతా వంటా లేని ఇంత నీచపు పనిని తను ఎలా చూస్తూ ఊరుకుంటాడు? తమ కులమూ, వంశమూ, పరువూ, మర్యాదా__ఛీ!ఛీ! ఎంత కాకపోతే మట్టుకు తను ఇవ్వాళ ఇంత పరువు తక్కువ పనికి వొప్పుకుంటాడా? బుద్ధితక్కువ దానికి, ఆ మాత్రం జ్ఞానం వుండక్కర్లా? ఇడ్డెన్లు వొండుకొని ఇంటింటకెళ్ళి అమ్ముకోవడమా? కస్తూరివారి కోడలు ఇడ్డెన్ల పళ్ళెం ఎత్తుకొని ఇంటింటికీ తిరగడమా? అవ్వ!

    గతాన్ని తవ్వుకొని శేషయ్య వంశచరిత్ర అతని కళ్ళముందు గిర్రున తిరిగింది.

    శేషయ్యగారి తాత కస్తూరి అమరయ్యగారి పేరు వినని వాళ్ళు ఆ చుట్టుపక్కల నాలుగు ఆమడల్లో లేరు. అమరయ్యగా రేనాడో అంతరించినా ఆయనగారి కీర్తికి చిహ్నాలుగా, వూళ్ళో ఒక దేవాలయమూ, ఒక సత్రమూ, ఒక నుయ్యీ, మర్రిచెట్టూ, ఈనాటికీ వున్నాయ్. శేషయ్య తండ్రి సుక్షేత్రంలాంటి పదిహేనెకరాల మాగాణి కర్పూరంలా వెలిగించి తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకున్నాడు. పోతే శేషయ్య తండ్రి, తాతలు ఆర్జించిన అనంతమైన కీర్తికీ, గౌరవానికీ వారసుడై వుడతా భక్తినీ, మిగిలిపోయిన పదెకరాలనూ, కుటుంబ గౌరవం, కీర్తి ప్రతిష్టల క్రింద మార్చి, పితృ దేవతలకు కళంకం రాకుండా కాపాడి తన వారసత్వాన్ని నిలుపుకున్నాడు. ఆ వంశవృక్షంలోనివారు మనకు తెలిసినంతవరకు వొరులకు పెట్టేరేగాని 'దేహి' అని ఒకడిని అర్ధించలేదు.
    శేషయ్య జీవితంలో ఓ అర్ధ శతాబ్దం, చీకూ చింతా లేకుండా గడిచిపోయింది. కాని గత రెండు మూడు సంవత్సరాలుగా, ఆర్ధికమైన ఈతిబాధలు శేషయ్య ఆత్మకు కాకపోయినా దేహాన్ని పట్టి పీడించసాగాయి.

    ఉన్న స్థిరాస్తి, చరాస్తి, అప్పులవాళ్ళ పాలుకాగా ఓ ఇల్లు మాత్రం మిగిలివుంది. శేషయ్య స్వయంగా వ్యవసాయం చేసేవాడు కాదు. పోనీ ఏమైనా వ్యాపారం చేసేవాడా అంటే అదీ కాదు. అది వాళ్ళ వంశంలో లేని సంగతి. "గొప్పగా" "గౌరవంగా" బ్రతకడం వారి వంశంలో వారికి ఉగ్గుపాలతో వచ్చిన మాట.

    సత్రాలు కట్టించి, సమారాధనలు చేయించిన శేషయ్యగారి ఇంట్లో, ఈరోజు పొయిలో పిల్లి లేవడమే అంతంత మాత్రం అయిపోయింది. ఇంతకాలం భర్తకు ఒదిగి ఒదిగి బతికిన రామసుబ్బమ్మ కళ్ళు తెరిచింది. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఏదో ఒక జీవనాధారం కల్పించుకుంటేగాని భుక్తికి గడిచే మార్గం లేదని తెలుసుకున్న శేషయ్య పెళ్ళాం, ఇడ్డెన్ల వ్యాపారంచేసి పొట్టపోసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.

 Previous Page Next Page