నా శరీరం ఒక్కసారి పులకరించింది.
ఏనాడూ తెలియని ఏదో వింత అనుభవానికి నా మనసు లొంగిపోతున్నది.
ఏమైంది నాకు?
రహమాన్ కేసి చూశాను. రహమాన్ గుర్రంమీదగా తల వంచి దేన్నో గమనించే ప్రయత్నంలో ఉన్నాడు.
రెక్కలు టపటప లాడిస్తూ, వింత వింతధ్వనులు చేస్తూ పక్షులు ఒక్కసారిగా చెట్లమీద నుంచి లేచాయి.
దూరంగా ఏవేవో అరుపులు!
రెండు ఆబోతులు ఢీకొన్నట్టుగా రంకెలు!
మధ్యమధ్య ఏనుగుల ఘీంకారాలు లీలగా విన్పిస్తున్నాయి.
నాచెవి పక్కనే నల్లపిల్లీ నోటికి చిక్కిన పావురం రెక్కల చప్పుడులాంటి చప్పుడు.
నేను తృళ్లిపడ్డాను.
అంతలో బల్లి నోటికి చిక్కిన పురుగు రెక్కల సన్నని చప్పుడు రెండో చెవి పక్కగా!
ఏమిటిది?
ఏమైంది నాకు?
ఎక్కడున్నాను ?"
"బాబుగారు వింటున్నారా?"
"ఊఁ" అంతకంటే మాట్లాడాలని అనిపించలేదు.
నేను మాట్లాడక పోయినా వాడు అంత తేలిగ్గా వదుల్తాడా?
"మీకు విన్పించడం లేదా బాబూ?"
"లేదు." కావాలనే అన్నాను.
వాడు గిర్రున తలతిప్పి చూశాడు నాకేసి విస్మయంగా.
రకరకాల జంతువుల అరుపులు నాకూ విన్పిస్తున్నాయి. అరుస్తూ అవన్నీ మా వైపుకే వస్తున్నట్టు క్రమంగా అరుపులు పెద్దవవుతున్నాయి.
"బాబుగారూ వింటున్నారా ?"
"ఆఁ వింటున్నాను. కొండలమీదున్న అరణ్యంలో జంతువులు పోట్లాడుకొంటున్నట్టున్నాయి." నిర్లక్ష్యంగా అన్నాను.
"కాదు బాబుగారూ ! ఈ ప్రాంతాల్లో క్రూరమృగాలు లేవు. ఇంతవరకు ఈ ప్రాంతాల్లో క్రూరమృగాలున్నట్టుగానీ, ఎవర్నయినా చంపినట్టుగానీ విన్నారా?"
"లేదు !" సాలోచనగా అన్నాను.
"ఈ అల్లరంతా పిశాచాలు చేస్తున్నదే బాబూ !"
శరీరమంతా ఏదో జరజర పాకుతున్నట్టు ఝల్లుమన్నది.
"బాబుగారూ అలా చూడండి. మన బండి వెనకే..."
నేను గిర్రున తల తిప్పి చూశాను. అంతెత్తున ఆకాశంలో దేదీప్యమానమైన ఒక వెలుగు చక్రం మాకేసే వస్తోంది.
ఆ వెలుగు చక్రం అగ్నిగోళంగా మారింది.
ఆ అగ్నిగోళం కణకణలాడుతూ వేగంగా వస్తోంది.
అది క్రమంగా పెద్దదవుతోంది.
దగ్గరగా వస్తోంది.
దగ్గరగా వచ్చింది.
అప్పుడు ఆ వెలుగు రెండు కేంద్ర బిందువులనుంచి వస్తున్నట్టుగా కన్పించింది.
నాకు భయంగా లేదు.
వింతగా ఉంది. కుతూహలంగా చూడసాగాను.
"బాబుగారూ ! పుర్రె ! అస్థిపంజరం తాలూకు పుర్రె !" గావుకేక పెట్టాడు రహమాన్.
నేను గావుకేకలు పెట్టడం మానేశాను.
ఇప్పుడు వాడు పెడ్తున్నాడు.
నేను పరిశీలనగా చూశాను.
అవును ! అది పుర్రే !
దాని కళ్లు ఉండే గుంటల్లోనుంచి ఆ వెలుగులు చిమ్ముతున్నాయి.
"చాలా చిత్రంగా ఉందే!" అనాయాసంగా నా పెదవులు ఉచ్చరించాయి.
వెయ్యి క్యాండిల్స్ బల్బుల్లా ఆ పుర్రెకు సంబంధించిన కళ్ల గుంటలు వెలుగులు చిమ్ముతున్నాయి.
నా కళ్ళు మిరిమిట్లు గొల్పుతున్నాయి. చికిలించుకొంటూనే ఆ పుర్రెను స్పష్టంగా చూడటానికి ప్రయత్నిస్తున్నాను.
ఆ పుర్రె నోటి కన్నంనుంచి తెల్లటి పొగ వస్తున్నట్టుగా గమనించాను. క్రమంగా పొగలు వ్యాపించసాగాయి. కళ్ల వెలుగు ఆగి ఆరిపోయింది. వెన్నెల్లో పొగ మాత్రమే వ్యాపిస్తూ కన్పించింది. ఆ పొగ దట్టంగా పేరుకొంటూ నీడలాంటి ఆకారంగా మారింది.
నేను ఆశ్చర్యంగా ఆ అద్భుతాన్ని చూస్తున్నాను. బండి ఆగిపోయిందనే విషయం కూడా గమనించలేదు.
ఆ నీడ ఒక్కసారిగా మానవాకారాన్ని ధరించింది.
నాకు భయం అన్పించలేదు.
ఆ ఆకారాన్ని చూస్తుంటే నా మనస్సు విలక్షణమైన అనుభూతిని పొందసాగింది.
ఆ అనుభూతి మానవుడు నేర్చిన భాషకు అందనిది.
ఏ భాష్యకారుడికీ లొంగనిది.
నేను తన్మయత్వంతో చూస్తున్నాను.
నా కళ్లముందు జగదేక సుందరి నిలబడి ఉంది.
"యువరాణి హెలన్!" ఒక్కసారి అరిచాడు రహమాన్. గుర్రం బండి దిగి సలాం చేశాడు వంగి.
ఆమె నన్ను చూసి చిరు నవ్వింది. చుట్టూ ఉన్న ప్రకృతి స్తబ్ధంగా నిలిచిపోయినట్టయింది. చంద్రుడు నన్ను చూసి ఈర్ష్య పడ్డాడు. ముఖం చూపించలేక పక్కనే ఉన్న మబ్బుతునకలో దాక్కున్నాడు.
నేను తన్మయత్వం పొందాను. గుండె వేగం పెరిగింది.
"ప్రియా! ఏమిటలా చూస్తావు. దిగిరా!"
నేను విన్నది వీణానాదం. అది మనిషి నోట్లోనుంచి వచ్చిన మాటల్లా లేవు. నాదబ్రహ్మ స్వయంగా వీణలో ఆ మాటల్ని పలికించినట్టన్పించింది నా చెవులకు.