Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 19


    "నువ్వు ఇంతకుముందే అనేకమందిని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడావనీ, ప్రస్తుతం నాతో తిరుగుతూ..."


    "షటప్"


    "వాడెటూ నిన్ను పెళ్ళి చేసుకోడు."


    "శ్రీధర్ నీలాంటి తుచ్చుడు కాడు. నీ ఉత్తరం చింపిపారేస్తాడు."


    "ఎలా తెలుసు?"


    "అతనిలో మనల్ని అర్థం చేసుకోగల సంస్కారం వుంది. ఒకవేళ ఈ పెళ్ళి ఆగిపోయినా నిన్ను మాత్రం చేసుకోను. వెళ్ళు"


    "నన్ను అవమానైస్తున్నావ్"


    "బెదిరిస్తున్నావా"


    నీమాత్రం పెళ్ళాం నాకు దొరక్కపోదు. "మీ అమ్మ నన్ను పిలిపించి కాళ్ళావేళ్ళా పడింది. అందుకే"


    "యూ ఫూల్ గెట్ అవుట్"


    "వెళ్తాను. వాడు నిన్ను తిరస్కరించాక నా కాళ్ళు పట్టుకున్నా నీముఖం చూడను. చరచర వెళ్ళిపోయాడు ఆదిత్య"


    "యూ స్కౌండ్రల్ కసిగా అరిచింది."


    "నీ నోటికి హద్దూ ఆపూ లేదా" తల్లి అన్నది వెనకనుంచి.


    అమూల్య వెనక్కు తిరిగి చూసింది.


    ఏదో అనాలని నోరు తెరిచి చర్రున లేచి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది.


    "వాడు...వాడు" మనసులోనే కసిగా తిట్టుకుంది ఆదిత్యను.


    శ్రీధర్ కు ఉత్తరం రాశాడా? ఏం రాశాడో, శ్రీధర్ ఆ ఉత్తరం చదివి మనసు మార్చుకుంటే? ఎన్ని అబద్ధాలు రాశాడో? వాళ్ళ నాన్నకు కూడా రాశాడట. ఆయన తప్పక నమ్ముతాడు. శ్రీధర్ కూడా నమ్ముతాడేమో?


    అమూల్య చివ్వున లేచి తండ్రి గదిలోకి వెళ్ళింది.


    తండ్రికి ఆదిత్యకూ తనకూ మధ్య జరిగిన ఘర్షణ గురించి చెప్పింది.


    "ఆ ఉత్తరాల్లో ఏం రాశాడో?"


    "ఫర్వాలేదమ్మా శ్రీధర్ అంత ఆలోచనలేనివాడు కాదు. క్లబ్బులకు వెళ్ళడం, డ్యాన్సులు చెయ్యడం తప్పుగా అతను భావిస్తాడనుకోను. అతను మనింట్లో చాలా రోజులు వున్నాడు. నువ్వు ఆదిత్య వాళ్ళతో కారులో వెళ్ళడం చాలాసార్లు చూశాడు. అయినా నీతో పెళ్ళికి అంగీకరించాడు. పట్టణాల్లో నివశించే శ్రీమంతుల బిడ్డలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతారో అతనికి తెలుసు.


    "అయినా....."


    "నేను శ్రీధర్ కు ఉత్తరం రాస్తాలే ఆ విషయం గురించి మర్చిపో"


    "మమ్మీ...."


    "మీ మమ్మీ మాటల్ని పట్టించుకోకు. తల్లికంటే బిడ్డల క్షేమాన్ని కోరేవారుంటారమ్మా? మీ మమ్మీకి నిన్ను పెద్ద ఉద్యోగం చేసేవాడి భార్యగా శ్రీమంతుల ఇంటి కోడలుగా చూసుకోవాలని కోరిక. ఆమె కట్టుకున్న ఊహా సౌధం ఆమెకళ్ళముందే పెళ్ళలు పెళ్ళలుగా విరిగిపడిపోతూ వుంటే భరించలేకుండా వున్నది. అంతే ఆమెను అర్థం చేసుకో"


    "శ్రీధర్ కు నేనే రాస్తాను డాడీ"


    "అలాగేనమ్మా"


    ఆ రాత్రి కూర్చుని అమూల్య శ్రీధర్ కు ఉత్తరం రాసింది. ఆదిత్య రాసిన తప్పుడు రాతల్ని నమ్మవద్దని ప్రాధేయపడుతూ రాసింది.


    మూడో నాటికి సమాధానం వచ్చింది.


    అమూల్య వణుకుతున్న చేతుల్తో ఉత్తరం తీసుకొని తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది.


    ఉత్తరం తెరిచి చదవసాగింది.


    "అమూ"


    నీ ఉత్తరం అందింది. ఆదిత్య చాలా అసహ్యకరంగానూ, జుగుప్సాకరంగానూ రాశాడు. నాన్న ఆరోజు ఊళ్ళోలేరు. ఉత్తరం కూడా నేనే చింపేశాను.


    ఆ ఉత్తరాలు గురించి నీవేం బాధపడకు. ఇలాంటి పిచ్చిరాతల్ని నేను అర్థం చేసుకోగలను. అతను నిన్ను బెదిరిస్తూ కూడా రాశాడు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక నన్నెవరూ మార్చలేరు.


    ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది రాక్షసులు మన మధ్య అడ్డువచ్చినా, నా అందాల బాలను నేను రక్షించుకోగలననే ధైర్యం నాకుంది.


    మరి ఉండనా.


                                                                            నీ
                                                                          శ్రీధర్


    అమూల్య ఆ ఉత్తరాన్ని ఎన్నోసార్లు చదువుకుంది.


    కళ్ళు మూసుకుని ఊహాలోకంలో విహరించసాగింది.


    ఆ లోకంలో ఆమె...శ్రీధర్...ఇద్దరే...


    కృష్ణారావుకీ అతని భార్యకూ రోజూ అమూల్య పెళ్ళి విషయంలో ఘర్షణ జరుగుతూనే ఉన్నది.


    పెళ్ళికి ముహూర్తం పెట్టించాడు కృష్ణారావు.


    తల్లి పట్టించుకోవడంలేదు.


    అమూల్య పెళ్ళి ఎంతో వైభవంగా చెయ్యాలని భార్యభర్తలు అనుకునేవారు.


    సింపుల్ గా దండల పెళ్ళి ఏర్పాడు చేశాడు కృష్ణారావు. వియ్యాల వారిని పలకరించినవారు లేరు. ఆ సంగతి తెలిసే కృష్ణారావు వారి విడిదిలో తన ఆఫీసువాళ్ళను పెట్టాడు. వాళ్ళే పెళ్ళివారి మంచిచెడ్డలు చూస్తున్నారు.


    అమూల్య అన్న ఐ.పి.యస్. ట్రైనింగ్ లో వున్నాడు. తల్లి రాసిన ఉత్తరం చూసి బాధపడ్డాడు. పెళ్ళికి రాలేనని తండ్రికి లెటరు వ్రాశాడు.

 Previous Page Next Page