అంతలో తల్లి లోపలకు వచ్చింది.
"మీరంతా ఒకసారి బయటకు వెళ్ళండమ్మా. నేను అమూతో మాట్లాడాలి" అన్నది.
అందరూ ముఖాలు చూసుకున్నారు. మరుక్షణంలో గదిలో ఎవరూ లేరు.
"అమూ" తల్లి కంఠంలోని వణుకుని గమనించింది అమూల్య.
"మరోసారి ఆలోచించుకో?"
"సమయం లేదు మమ్మీ"
"ఫర్వాలేదు. ముహూర్తానికి మరో అర్థగంట టైం వుంది. నేను ఈ పెళ్ళి ఆపించగలను."
"నీ కూతురి పెళ్ళి, పెళ్ళి పీటలమీద ఆగిపోయిందంటే నీకు అవమానం కాదా?"
"నీ పెళ్ళికి పీటలు కూడానా."
"పోనియ్ కుర్చీలలోని పెళ్ళి అనుకో."
"నీకోసం అవమానాన్ని భరిస్తాను."
"నాకోసం కోరికను చంపుకొని సంతోషంగా తిరగొచ్చుగా?"
"నీ జీవితం నాశనం అవుతూ వుంటే నన్ను సంతోషంగా పెళ్ళి పెత్తనం చెయ్యమంటావా?"
"పిచ్చి మమ్మీ నా జీవితం నాశనం అవుతుందని నువ్వు అనుకుంటున్నావ్? కాని ఇది నేను కోరి వరించిన జీవితం."
"నేను నీకు శత్రువుని కాదు. కని పెంచిన తల్లిని. తల్లి మనసును అర్థం చేసుకో"
"నీ మనసును అర్థం చేసుకున్నాను. కాని నువ్వే నా మనసును అర్థం చేసుకోవడం లేదు. నీ కోరికలకు అనుకూలంగా నా జీవితాన్ని బలిచెయ్యాలని చూస్తున్నావ్."
"ఎంత మాట అన్నావే"
"నన్ను క్షమించు మమ్మీ"
"ఆ దరిద్రాన్ని భరించలేవు తల్లీ."
"ప్లీజ్ మమ్మీ"
"నీ భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నానో?"
"ప్రతి తల్లీ కలలు కంటుంది. తన కలలు నిజం కావాలనే తాపత్రయంలో వాళ్ళ పిల్లల మనసుల్ని, వాళ్ళ కలల్నీ అర్థం చేసుకోరు."
"ఎన్ని మాటలు నేర్చావే?"
అమూల్య మాట్లాడలేదు.
"మాట్లాడవేమే?"
"మాట్లాడాల్సింది ఏమీ లేదు. అంతస్తూ, పరువూ అంటావు. నీ కూతురి పెళ్ళి ఆగిపోతే నలుగురూ మరి నవ్వరూ?"
"నీకోసం ఏమైనా భరిస్తాను."
"ఇది కూడా భరించు."
"నా మాట వినడంలేదు నాకు తెలుసు- ఒకరోజు నువ్వు ఏడుస్తూ వస్తావు ఈ ఇంటికి. నన్ను కౌగలించుకొని నామాట విననందుకు విచారిస్తావు. పశ్చాత్తాపంతో కుమిలిపోతావు.
"దీవిస్తున్నావా మమ్మీ?" అదోలా నవ్వింది అమూల్య.
"ఆ రాస్కెల్ ఇంతపని చేస్తాడనుకుంటే గడపలో కాలు పెట్టనిచ్చేదాన్ని కాదు. పిల్లిలా వచ్చాడు. ఈ ఐశ్వర్యం మీద కళ్ళు పడ్డాయి. నీ అందం మీద మోజు పుట్టింది. నిన్ను వలలో వేసుకున్నాడు. అందుకే చిల్లి కానీ ఇవ్వను. నీకిచ్చే కట్నంతో తన చెల్లెళ్ళ పెళ్ళి చేసుకోవాలని ప్లాను వేశాడు.
"నువ్వు పొరబడుతున్నావ్ మమ్మీ" శ్రీధర్ అలాంటివాడు కాదు.
"ఈ వయసులో ఉన్న ప్రతి ఆడపిల్లా ఇలాగే అంటుంది. ఇది నీ తప్పుకాదు. తప్పు నీ వయసుది. తప్పు మీ నాన్నది. ఆ రాస్కెల్ కుట్రను మీ నాన్న కూడా అర్థం చేసుకోలేకుండా ఉన్నాడు. పెళ్ళయిన తెల్లవారి నుంచి వాళ్లు నిన్ను డబ్బు తెమ్మని సతాయిస్తారు. నువ్వొచ్చి ఏడుస్తావ్? అయినా నీకు ఒక్క నయాపైసా ఇవ్వను."
"మీరు ఇచ్చినా శ్రీధర్ తీసుకోడు"
"చూస్తాగా? నువ్వెంత కాలం ఆ దరిద్రంలో ఉంటావో?"
"మమ్మీ ప్లీజ్ ఇక మాట్లాడకు" దాదాపు అరిచినట్టే అన్నది అమూల్య.
"అరవకు అందరూ అంటారు" అంటూ అమూల్య తల్లి చరచర బయటికి వెళ్ళిపోయింది.
అమూల్య మూడు నిద్రలకు అత్తవారింటికి వచ్చింది.
జడ్జిగారి అమ్మాయిగా ఆ ఊరు చూడటానికి వచ్చినప్పుడు పల్లె వాతావరణంలో లభించిన థ్రిల్ కోడలిగా వచ్చినప్పుడు లభించలేదు.
తడికలు కట్టిన బాత్ రూంలో స్నానం చెయ్యాలంటే చిరాకు వేసింది. తలుపుగా అమర్చిన తడిక సగం వరకే వస్తున్నది. అమూల్య దానిని దగ్గరకు లాగడానికి సతమతమౌతోంది.
"వదినా అది అంతే బండలు జారిపోయినయ్. పూర్తిగా రాదు. ఎవరూ ఇటు రారులే స్నానం చెయ్యి" అన్నది ఆడబిడ్డ.
ఏం మనుషులు కొడుకు పెళ్ళి చేశారు. కోడలు కాపురానికి వస్తుందని తెలుసు. ఆ మాత్రం తడిక బాగు చేయించలేరా? వీళ్ళకు తెలియకపోతే శ్రీధర్ కు తెలియనక్కరలేదా?
రాతిమీద కూర్చుంది. కాళ్ళకింద మట్టి. అమూల్యకు మెజాయిక్ ఫ్లోర్ మీద కూడా చెప్పులతో అలవాటు. స్నానం చేస్తుంటే కాళ్ళకు బురద అంటుతున్నది. చిరాకు వేసింది. నాలుగు నాప బండలు పరిపించి గోడలు పెట్టించకూడదూ? శ్రీధర్ తో చెప్పాలి అనుకుంటూ స్నానం ముగించింది. చీర కట్టుకుంటుంటే కొత్త జరీ చీర కుచ్చెళ్లకు బురద అంటింది.
అమూల్యకు ఏడుపు వచ్చినంత పని అయింది. అంతలో తల్లి మాటలు గుర్తొచ్చాయి. ఛ. ఇంత చిన్న విషయానికే తన బాధపడితే ఎలా? తనను తనే సముదాయించుకుంది.
జడ్జిగారి అమ్మాయిగా వచ్చినప్పటి ఊళ్ళో వాళ్ళ పలకరింపులు కూడా వేరుగానే ఉన్నాయ్.
"బంగారమ్మ అదృష్టవంతురాలివే. కోటలో పాగా వేశావ్"
"ఎన్ని లక్షలు కట్నం ఇచ్చారేమిటి?"
"అయ్యో మా వాడికి అంత తెలివి కూడానా? కాణి కట్నం పుచ్చుకోలేదు" బంగారమ్మ గుణుస్తూ అన్నది.
అక్కడే ఉన్న అమూల్య చివ్వున తలెత్తి అత్తగారి ముఖంలోకి చూసింది.
"అదేమిటే మరీ చిత్రం. అంత ధనవంతుల బిడ్డను చేసుకున్నారు. కట్నం ఇవ్వక పోవడం ఏమిటి?"