Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 18


    "నన్నేం చెయ్యమంటావ్. నేను అమ్మాయికి ఎన్నో విధాల చెప్పి చూశాను. నా స్నేహితుడి కొడుకైతే ఉద్యోగం ఇప్పిస్తాను.అంతేగాని నా పిల్లను నేను కావాలని బీదవాడికి ఇచ్చి చేస్తానా?"


    "వెంటనే ముహూర్తాలు పెట్టించండి."


    "నిజంగా"


    "అవును ఆదిత్యకు ఇచ్చి చేద్దాం. ముందు మారాం చేస్తుంది. ఆ తర్వాత అదే అర్థం చేసుకుంటుంది."


    "అమూల్య పెళ్ళిపీటల మీద కూర్చుంటుందనుకుంటున్నావా? పదిమందిలో మన పరువు తీసి పీటల మీద నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడేం చేస్తావ్?"


    "నాలుగు తనని కూర్చో బెడతాను."


    "పిచ్చిదానిలా మాట్లాడకు"


    "మీ అయ్యా కూతుళ్ళ వాలకం చూస్తుంటే నాకు పిచ్చి పట్టేలాగుంది."


    "వివాహం నూరేళ్ళ పంట. బలవంతంగా మనసుల్ని కలపలేం"


    "వాడు...వాడ్ని పిలిచి నాలుగు వాతలు పెట్టండి. అతనిచేత చేసుకోనని చెప్పించండి. వాడు నా బిడ్డను వల్లో వేసుకున్నాడు."


    "శ్రీధర్ బుద్ధిమంతుడు. నా బలవంతం మీదే అతను ఈ పెళ్ళికి అంగీకరించాడు."


    "అబద్ధం నా పిల్లకు ఏం తక్కువని ఆ దరుద్రుణ్ని బలవంతం చేసి పెళ్ళికి ఒప్పించారు?"


    "అమ్మాయి అతన్ని తప్ప వేరొకర్ని చేసుకోనంటోంది. అతని భయాలు అతనికి ఉన్నాయ్. అందుకే ఒక పట్టాన అంగీకరించలేదు."


    "నా శవం ఈ ఇంట్లో నుంచి వెళ్లాకే ఈ పెళ్ళి జరుగుతుంది."


    "మనం జీవితాన్ని అనుభవించాం. బతికినన్ని రోజులు బతికాం. పెద్దవాళ్ళు ఇలా బెదిరించే పిల్లల జీవితాలతో చలగాటాలు ఆడతారు."


    "అంటే నేను చచ్చిపోయినా సరే ఈ పెళ్ళి జరిగి తీరుతుందంటారు?"


    "నువ్వు చచ్చిపోవాలని నాకు లేదు. కాని ఈ పెళ్ళి జరిగితీరుతుంది.


    భర్త ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.


    తను కాపరానికి వచ్చిన ముప్పయ్ ఏళ్ళలో ఏనాడూ తన భర్త తన మాట కాదనలేదు. ఈరోజు తను చస్తానని బెదిరించినా నిబ్బరంగా ఉన్నాడు.


    సరళకు దుఃఖం పొర్లుకొచ్చింది. భోరున ఏడవసాగింది.


    కృష్ణారావు గాభరా పడ్డాడు.


    కాని ఓదార్చడానికి ప్రయత్నించలేదు.


    "మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాకెందుకు? అది నాబిడ్డ కాదనుకుంటాను. నాకు పుట్టనే లేదనుకుంటాను. నాకు పుట్టగానే చచ్చిందనుకుంటాను. ఏడుస్తూనే మాట్లాడుతున్నది.


    కృష్ణారావు ఉలకలేదు. పలకలేదు. వినిపించుకోనట్టు కేసు స్టడీ చేస్తున్నట్టు నటించసాగాడు.


    సరళ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.


    "అమూ"


    పుస్తకంలోంచి తలెత్తి చూసింది అమూల్య.


    ఎదురుగా ఆదిత్య టిప్ టాప్ గా తయారై నిల్చుని ఉన్నాడు.


    అమూల్య ముఖం చిట్లించుకుంది.


    "నేను విన్నది నిజమేనా?" ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.


    "ఏమిటి?"


    "అదే మీ ఇంట్లో ఉద్యోగం కోసం వచ్చి ఒదిగి ఒదిగి పడి వుండేవాడు...అదే శ్రీధర్ కదూ అతని పేరు?"


    "అవును"


    "నీకు మతిపోయింది."


    హాయిగా నవ్వింది అమూల్య.


    "ఆ దరిద్రుణ్ని చేసుకొని ఏం సుఖపడ్తావ్?"


    "ఆ విషయం గురించి ఆలోచించుకోవల్సింది నేను."


    "మరి నాకు ఎందుకు ఆశలు చూపించావ్?"


    "ఆశలు చూపించానా? నిన్ను పెళ్ళిచేసుకుంటానని నీతో ఎప్పుడైనా అన్నానా?"


    "ఆ మాట అనలేదు. కాని నాతో తిరిగావ్. క్లబ్బుల్లో డ్యాన్సులు చేశాం. సినిమాలకు వెళ్ళాం. నాకోసం ఎదురుచూస్తూ కూర్చునే దానివి. ఎందుకు చేశావ్ ఇవన్నీ? నాలో ఆశల్ని రేపి ఇప్పుడు మరొకడ్ని చేసుకుంటావా? ఏ విషయంలో నేను అతనికంటే తీసిపోయాను?"


    "చాలా మందితో క్లబ్బుల్లో డ్యాన్సు చేశాను. శేఖర్ తో...హనుమంతరావుతో... సుధాకర్ తో..."


    "అందరూ మనం పెళ్ళిచేసుకుంటామనుకొనేవాళ్ళు."


    "ఎవరో అనుకున్నదానికి నేను బాధ్యురాల్నా?"


    "ప్లీజ్ అమూ నువ్వు లేకపోతే నేను బతకలేను." అమూల్య రెండు చేతులూ పట్టుకున్నాడు.


    "నా చేతులు వదులు" అమూల్య విసురుగా చేతులు లాక్కుంది.


    "నాతో డ్యాన్సులు చేశావ్ ఇప్పుడు చేతులు పట్టుకున్నంత మాత్రంతోనే నీ పాతివ్రత్యం పోయినట్టు ప్రవర్తిస్తున్నావ్" వ్యంగ్యంగా అన్నాడు ఆదిత్య.


    "యూ స్టుపిడ్" అమూల్య అరిచింది.


    "నేను వాడికీ, వాడి నాన్నకూ ఉత్తరాలు రాశాను."


    "ఎవరికీ?"


    "ఇంకెవరికి? నీ ప్రియుడికీ, వాడి తండ్రికీ"


    "వాడూ వీడూ అనకు. ఏం రాశావ్?"

 Previous Page Next Page