Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 19

"ఉంది. ఆ భవనం చాలా అందంగా వుంటుంది. వివిధ దేశాల పెయింటింగ్స్ తో అలంకరించబడింది. భవనం ముందు చక్కటి గార్డెన్. ఆ గార్డెన్ లో పౌంటెన్స్ ఉన్నాయి.
ఆ గార్డెన్ ను బేగం గార్డెన్ అనేవారు. ఆమె పూర్తిగా పరదా పాటించేది. ఆమెను రెసిడెన్సీకి సంబంధించిన మరో వ్యక్తి ఎవరూ చూడలేదు. కొత్తగా రెసిడెన్సీ నిర్మించినప్పుడు ఆమె చూడటానికి కూడా రాలేదు."
"పాపం ఆమెకు కొత్తగా కట్టిన రెసిడెన్సీ చూడాలనే కోరిక వుండే వుంటుంది."
"ఆమెకు అలాంటి కోరిక వుంటే ఎవరడ్డు వెళతారు? ఆమె తన కుటుంబ సాంప్రదాయాలను పాటించేది. కిర్క్ పాట్రిక్ మోడల్ రెసిడెన్సీ తయారుచేయించి ఆమె గార్డెన్ లో పెట్టించాడు."
"రియల్లీ?"
"యస్"
"నాకు చూడాలనివుంది."
"అక్కడ ఇప్పుడు శిథిలాలు మాత్రమే కన్పిస్తాయి. పైగా చుట్టూ మొలిచిన తుప్పలూ, చెట్లూ-చేమలకు, పాములకు ఆలవాలుగా అయ్యాయి. అక్కడకు వెళ్ళడం మంచిది కాదు."
"బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మిస్టర్ కిర్క్ పాట్రిక్ వైఫ్ తో ఎంజాయ్ చేసి వుంటాడు." కలల్లో పోతూ తనకుతనే చెప్పుకొంతున్నట్టుగా అన్నది.
అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళముందు షిప్ మీద కన్పించిన వ్యక్తి నిల్చున్నట్టుగా అన్పించింది.
"నిజాం రెసిడెన్సీకి వస్తుంటారా?"
"వస్తారు. ఏనుగు ఎక్కి వస్తారు. ఆయనకు ఇరువైపులా ఇద్దరు రక్షక భటులు కూడా వుంటారు. వాళ్ళూ ఏనుగు మీదే వుంటారు."
"నాకు చూడాలని వుంది నేను ఇక్కడ వుండగా నైజాం వస్తారని ఆశిస్తున్నాను" అన్నది సీత ఉత్సాహంగా.
మిష్టర్ బర్నెస్ చిరునవ్వు నవ్వాడు.
"రావచ్చు. నైజాం ఇంకా మైనరే. త్వరలో మేజర్ కాబోతున్నాడు. వైస్ రాయ్ నిజాంను సింహాసనం మీద కూర్చో బెడతారు. అప్పుడు పెద్ద ఫంక్షన్ చేస్తారు."
"నేను చూస్తాను" సీత ఆనందంతో చిన్నపిల్లలా చప్పట్లు కొట్టింది.
ఆ పిల్ల సంతోషాన్ని చూస్తూ ముసిముసిగా నవ్వుకొన్నాడు మిస్టర్ బర్నెస్.
"బాబాయ్! ఈ సమయంలో మనం ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాను."
"వైస్ రాయ్ అదేమాట అన్నారు. నేను సమయానికి రావడం వల్ల వాళ్ళకెంతో మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. కలకత్తాలో కొన్ని విషయాలే చర్చించడం, ఆయన ఇక్కడకు వస్తే ఆ బిల్లు మీద కూలంకషంగా చర్చించడానికి అవకాశం వుంటుంది." తాపీగా సమాధానం ఇచ్చాడు మిస్టర్ హారే.
సీతకు మిష్టర్ హారేను ప్రశ్నించే ధైర్యం ఇండియాకు రాకముందు వుండేది కాదు.
అవసరమయ్యి ఏదైనా అడిగితే మిస్టర్ హారే కసురుకొనేవాడు. సీతకు తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నది. అకస్మాత్తుగా తన వ్యక్తిత్వం కూడా పెరిగిపోయినట్టుగా అన్పించసాగింది.
"అవును! మీరు సమయానికి ఇక్కడకు రావడంవల్లే వాళ్ళకు ఎంతో అండదొరికినట్టు అయింది." అన్నది సీత తన బాబాయి ముందు తన అభిప్రాయం చెప్పే అవకాశాన్ని జారవిడుచుకోకుండా. మిస్టర్ హారేతో తను ఆధరంగా మాట్లాడగలగడం ఓ గొప్ప థ్రిల్ గా అనిపిస్తోంది ఆమెకు.
"అవును!" మిస్టర్ హారే గంభీరంగా తలవంచాడు.
ఇంత అదృష్టం బాబాయికి పట్టడానికి కారణం అతను పూర్వజన్మలో చేసిన కర్మకు ప్రతిఫలమని భావించింది.
కర్మ గురించి ప్రత్యేకంగా తెలియకపోయినా ఆమెకు ఆ మాట హిప్నటిక్ నైజేషన్ లా పనిచేస్తున్నది.
బాబాయ్ చెడ్డవాడు కాడు. ఇక్కడకు వచ్చినప్పటినుంచి ఎంతో సంతోషంగా వున్నాడు. అందుకే తనతో అంత ఆప్యాయంగా వుంటున్నాడు. అక్కడ ఏదో పోగొట్టుకున్నవాడిలా వుండేవాడు. అందుకే మాటకుముందు చిరాకు పడేవాడు. దీన్ని కూడా కర్మ అనే అంటారు.
అతను అదే కర్మ గురించి చెప్పిన స్నేహితుడు కన్పిస్తే బాబాయి ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి చెప్పాలి. అతను సంతోషిస్తాడు. అతనికి ముందే తెలుసేమో!
అన్ని విషయాలు అతను ముందుగానే ఊహించి చెబుతున్నాడుగా. మిస్టర్ హారే ఇక తనని బాధించడని కూడా చెప్పాడు. ఎలా చెప్పగలడు? అతనిలో ఏవో అతీత శక్తులున్నాయి.
మనిషి తను సంతృప్తిగా, సుఖంగా ఉన్నప్పుడే చుట్టూ వాళ్ళను ప్రేమిస్తాడు.
ప్రేమ చాలా గొప్పది.
ఈ రెసిడెన్సీని కట్టించిన కిర్క్ పాట్రిక్ కు ప్రేమించడం తెలుసు. అందుకే అతని గురించీ, అతని వైఫ్ గురించి కథలు చెప్పుకుంటూ ఈనాటికీ ఆనందిస్తున్నారు. వాళ్ళ ప్రేమ అక్షయం, అమరం. అలాంటి ప్రేమ తనకు లభిస్తుందా?
వంటరిగా ఉన్నప్పుడు సీత ఎక్కువగా కిర్క్ పాట్రిక్ ప్రేమకథను మననం చేసుకుంటూ వుంటుంది.
ఆ రెసిడెన్సీలో చాలామంది అంధులు వున్నారు. అందులో విలబర్డ్ స్కావెన్ బస్ అనే అతను కవి. అతని భార్య పేరు అనీ. ఆమె లార్డు బెరన్ మనుమరాలు. ఆమె ధనవంతురాలు. బ్లన్ కు పెద్దగా డబ్బులేదు. ఒకప్పుడున్న ఆకాస్త కూడా తగలేశాడు. పొగరుగా కన్పిస్తాడు. బ్రిటిష్ ఆధీనంలో వున్న అన్ని దేశాలకూ హోంరూలును అమలు పరచాలని అంటూ వుంటాడు.
అతను ఈజిప్టు పొలిటికల్ పరిస్థితుల్లో కలుగజేసుకొని అభాసుపాలయ్యాడు. ప్రస్తుతం ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ పరపతిని పెంచటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇండియన్స్ ను హీనంగా చూస్తాడు. బానిసలకూ పశువులకూ భేదం లేదంటాడు.
టీపూ సాహెబ్ మనుమడు జడ్జిగా వుండి కూడా బ్లన్ అంటే భయపడేవాడు.
అవును! మరి! అతను జడ్జిగా వుండకపోవటం ఇంగ్లీషువాడి ఇష్టాల మీద ఆధారపడి వున్నదాయె!
అసలు ఇండియన్ సివిల్ సర్వీసును అబాలిష్ చెయ్యాలని బ్లన్ సలహా ఇచ్చాడు. అతని సలహాకు కొందరు చాటుగా నవ్వుకున్నారు.
మిస్టర్ హారే ఇండియాకు ఎందుకు వచ్చాడో అతనికి తెలుసు. వస్తూవస్తూ రాయ్ ఆతిథ్యాన్ని పొంది వచ్చాడని తెలుసు.

 Previous Page Next Page