"మేజర్ కిర్క్ ప్రాట్రిక్ ప్లాను నిజాంకు చూపించాడు కాని నిజాం అంత స్థలం కేటాయించడానికి అంగీకరించలేదు.
"ఎందుకని?"
"నిజాం మినిస్టర్ ఆ ప్లాను చూసి జడుసుకున్నాడు" అన్నాడు పకపక నవ్వుతూ.
ఆమె కూడా అతని నవ్వుతో జత కలిపింది.
ఆ తర్వాత ఏం జరిగింది?"
"అదే ప్లానును మళ్ళీ చిన్న పేపరు మీద చిన్నదిగా గీయించి నిజాంకు చూపించాడు. వెంటనే నిజాం గ్రాంటు చేశాడు.
ఆమె పకపక నవ్వింది.
"చాలా తెలివైనవాడు."
"ఆ తర్వాత భవనం చూసి నిజాం ఏమన్నాడో ఎక్కడా నోట్ చెయ్యలేదు."
సీతకు ఇంకా నవ్వు వస్తూనే ఉన్నది. బలవంతంగా దిగమింగుకోవటానికి ప్రయత్నిస్తోంది.
"అతని రెండో ప్రియురాల్ని గురించి తెలుసుకోవాలని లేదా?"
"ఎందుకు లేదూ? చెప్పండి" మోచెయ్యి డైనింగ్ టేబుల్ మీద ఉంచి, అరచేతి మీద గడ్డం ఉంచి, తమాషాగా చూస్తూ అన్నది ఆమె.
"డ రెసిడెంటు రెండవసారి ఒక ముస్లిం బ్యూటీ మోహంలో పడిపోయాడు. ఆమెపేరు "ఖేర్ ఉన్నిసా భేగమ్"
ఆమె కనురెప్పలు టపటపలాడించి బర్నెస్ ముఖంలోకి చూసింది.
"ఖైర్ ఉన్నిసాబేగం అంటే స్త్రీ జాతికే తలమానికం లాంటిదని అర్థం. ద రెసిడెంటు కూడా చాలా అందంగా ఉండేవాడు. అతన్ని "హస్మత్ జంగ్" అంటే "గ్లోరియస్ ఇన్ బాటిల్" అనేవారు.
"కాని నిజాం కుటుంబంలోని స్త్రీలు పరదాలో వుండేవారుగా?"
"అవును అన్నాడు మిస్టర్ బర్నెస్" కాని ఆమె ఒక పర్మిషన్ గోబుల్ కూతురు.
"అనుకోకుండా ఆమె రెసిడెంటును చూసింది- ప్రేమించింది."
"ఊ ఆ తరువాత?"
"ఆమె సాహసి, ఎవరికీ భయపడేది కాదు. ఆమె వ్యక్తిత్వమే అంత. తను చెయ్యదల్చుకున్న పని ముందూ వెనకా ఆలోచించకుండా చేసేది. ఒకనాటి సాయంత్రం రెసిడెంటు వంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గరకు వచ్చింది.
"బాబోయ్" ఆమె ఒక్కసారిగా భయపడినట్టుగా అన్నది.
బర్నెస్ ఆమెను చూసి నవ్వాడు.
"ఆమె పిరికిది కాదు. అతనితో "నిన్ను ప్రేమిస్తున్నాను" పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితంగానే ఇది జరిగింది. కర్మ మనమధ్య విడదీయరానిబంధాన్ని ఏర్పరచింది. మీదగ్గర ఉండనివ్వండి. నన్ను మీరు ప్రత్యేకంగా చూడనక్కరలేదు. పదిమందిలో ఒకదానిగానైనా వుండిపోతాను. అంతేగాని- మీకు దూరంగా మాత్రం వుండలేను." అన్నది.
"ఆమె మేకర్ కిర్క్ పాట్రిక్ ను చాలా ప్రేమించి వుండాలి. అందుకే అంత సాహసం చెయ్యగలిగింది." అన్నది సీత తనకుతనే చెప్పుకొంటున్నట్లు.
సీతకు డెక్ మీద కన్పించిన వ్యక్తి గుర్తొచ్చాడు. తనకు తెలియకుండానే నిట్టూర్చింది.
"అవును. ఆమె ప్రేమ ప్రచండమైనది. ఆమెను ఎవరూ ఆ ప్రేమ నుంచి వెనక్కు మరల్చలేకపోయారు. కిర్క్ పాట్రిక్ సరదా పురుషుడు. ఆమె పవిత్ర ప్రేమముందు వినయంగా తలవంచాడు. ఆమె ప్రేమను తిరస్కరించే శక్తి అతనికి లేదు."
"తర్వాత ఏం జరిగింది?" ఆతృతగా అడిగింది సీత.
బర్నెస్ ఆమె ముఖంలోకి లోతుగా చూశాడు. "ఈ కథ ఈ వయసు ఆడపిల్లల ముందు చెప్పతగింది కాదేమో!" అని మనసులో అనుకొన్నాడు.
"ప్లీజ్ చెప్పండి."
"ఒకబిడ్డ పుట్టాక మేజర్ ఆమెను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకొన్నాడు. ఆమెకు రెసిడెన్సీలో ఒక ఇల్లు కూడా కట్టించాలనుకొన్నాడు.
"మరి అలా చేశాడా?" సాలోచనగా ప్రశ్నించింది.
ఆమెకు తండ్రి చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. ఇంగ్లీషు ఆఫీసర్లు భారతీయ స్త్రీలతో సంబంధముండరాదని ఈస్టిండియా కంపెనీ నిషేధం - భారతీయ ప్రభావానికి లొంగిపోతారనే భయం అది.
"అతను - అంటే ముస్లింల వైపునించి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు నవాబు కిర్క్ పాట్రిక్ ను దత్తపుత్రుడిగా స్వీకరించాడు.
"అప్పుడు ఇంగ్లీషువాళ్ళేం చేశారు?"
బర్నెస్ పెదవుల మీద చిరునవ్వు రేఖామాత్రం వెలిగింది.
"ఎందుకు ఊరుకుంటారు? ఈస్టిండియా కంపెనీ రెసిడెంటును అనేకవిధాల చిరాకులకు గురిచేశారు. అప్పటి గవర్నర్ జనరల్ ఎంక్వయిరీ జరిపించారు.
"ఆ ఎంక్వయిరీ రెసిడెంటును బాధలకు గురిచేసి వుండాలి." సీత సాలోచనగా అన్నది.
"లేదు. మేజర్ కిర్క్ పాట్రిక్ చాలా తెలివైనవాడు. ముందే చెప్పానుగదూ? ఎంక్వయిరీకి బొంబాయి గవర్నర్ ను వేశారు. అతను హైదరాబాద్ చేరేలోపలే రెసిడెంటు పర్సనల్ సెక్రటరీ బొంబాయి వెళ్ళి అతన్ని కలుసుకొన్నాడు. రెసిడెంటు మీద ఎంక్వయిరీ చెయ్యడం వల్ల ఇంగ్లీషు వాళ్ళకు ఇప్పుడు గౌరవం. ఇలాంటి పనులవల్ల తుడుచుపోతుందని నచ్చచెప్పాడు."
"ఊ, ఆ తర్వాత?"
"ఎంక్వయిరీ ఆగిపోయింది. కేవలం రెసిడెంటును రహస్యంగా సంజాయిషీ అడిగారు. కిర్క్ పాట్రిక్ తన సంజాయిషీని ఇచ్చాడు. ఆ సంజాయిషీ చూశాక యింకెలాంటి చర్యా తీసుకోవడానికి ఆస్కారం లేకపోయింది. తను చేసినదాన్ని అంత చక్కగా సమర్థించుకొన్నాడు."
"చాలా థ్రిల్లింగ్ గా వుంది. చాలా చక్కని ప్రేమకథ. తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారా? వాళ్ళమధ్య ఎలాంటి కలతలు రేగలేదుగా?"
"వారు చాలా అన్యోన్యంగా జీవితం గడిపారు. ఆమెకొరకు కిర్క్ పాట్రిక్ ఒక జవానాను కూడా నిర్మించాడు."
"అది ఇంకా ఇక్కడ వుందా?"