Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 20

"ఆంగ్లో ఇండియన్స్ గురించి ఎందుకంతగా ఆలోచించారో నాకు అర్థం కావడం లేదు." బ్లంట్ విసుగ్గా అనడం సీత విన్నది. అతని మాటల్ని ఎవరూ ఖండించక పోవడం ఆమెకు ఆశ్చర్యంగానే అనిపించింది.
"అందువల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువ" అని సీత సందేహానికి సమాధానం వచ్చింది.
బ్లంట్ ఇండియన్ సివిల్ సర్వీస్ లో వుండటం ఇష్టంలేదు ఎందుకని?
సీత బుర్రలో ఎన్నో సందేహాలు!
ఆమెకు షిప్ తాలూకు స్నేహితుడు గుర్తుకు వచ్చాడు.
ఆరోజు డిన్నర్ లో బ్లన్ చాలా ఉద్రేకంగా మాట్లాడటం చూసింది. ఒక డ్రామాలోని పాత్రలా మాట్లాడుతున్నాడు అనుకున్నది.
అతను అలా ప్రవర్తించడానికి కారణం బర్నెస్ ని అడిగింది.
"మన కవిగారు ఇవాళ ఏదేదో వాగాడు. భారతీయుల్ని కించపరుస్తూ మాట్లాడాడు" అతనికి ఇండియన్స్ అంటే అసహ్యం అని అర్థం చేసుకున్నది. మిస్టర్ హారే చాలా బిజీగా వున్నాడు. సీత గురించి పట్టించుకునే తీరిక లేదు.
ఆమెకు నగరం చూడాలనిపించింది. మిస్టర్ బర్నెస్ తో చెప్పింది.
తనకు గుర్రపుస్వారీ బాగా వచ్చునని, నగరం వెలుపలవున్న చారిత్రాత్మక స్థలాలను చూడటానికి గుర్రాన్ని సిద్ధం చేయమని అడిగింది. బర్నెస్ వెంటనే అంగీకరించాడు.
"తప్పకుండా! కుతుబ్ షాహివంశీయుల సమాధుల్ని చూపిస్తాను. నేను కూడా వస్తాను. అవి చూసినప్పుడు థ్రిల్ అవుతావని నాకు తెలుసు" అన్నాడు బర్నెస్.
"వండర్ ఫుల్!" పసిపిల్లలా కేరింతలు కొట్టింది సీత. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు.
అన్ని ఏర్పాట్లు చేశాడు బర్నెస్. అతను ఆమెతో వెళ్ళలేకపోయాడు. ఇద్దరు సైనికులను ఇచ్చిపంపించాడు మరునాడు టూంబ్స్ చూడటానికి.
సీత గుర్రం ఎక్కింది. ఆనందంతో ఆమె ముఖం విప్పారింది. మనసు ఉరకలు వేసింది.
ఆమె తను అలా వెళుతున్నట్టు మిస్టర్ హారేకు చెప్పలేదు. చెబితే అతను అంగీకరించడని తెలుసు. అంగీకరించినా తను కూడా వుండి ఏ బండిమీదో తీసుకెళతాడని ఆమెకు తెలుసు.
సీతకు గుర్రపుస్వారీలో మంచి ప్రావీణ్యత వున్నది. తండ్రి బ్రతికున్నరోజుల్లో రోజూ మూడు గంటలు గుర్రంమీద స్వారీ చేసేది. ఆమె తనకోసం ఏర్పాటు చేసిన గుర్రాన్ని చూసింది. మంచి ట్రైనింగ్ ఇవ్వబడిన గుర్రం కావడం వలన ఆమెకు దాన్ని మచ్చిక చేసుకోవడానికి అట్టే కష్టపడాల్సిన అవసరం లేకపోయింది.
ఆమెతోపాటు ఇరుపక్కల ఇద్దరు రక్షక అధికారులు కూడా బయలుదేరారు. వారిలో వయసు మళ్ళిన వ్యక్తి సీతకు ఒక్కొక్కటీ వివరంగా చెబుతున్నాడు. గోల్కొండ కోట దూరంగా కన్పించింది. టైపు వుంటే అదికూడా చూడాలనుకున్నది ఆమె.
"ఆ కోట అజేయం! అపూర్వం! మేమ్ సాహెబ్" ఆ ముస్లిం వృద్ధుడి కంఠ స్వరంలో నుంచి గర్వం తొంగిచూసింది.
"ఒకే ఒక్కసారి మోసంతో ఆ కోటను శత్రువులు జయించగలిగారు" మళ్ళీ అతనే అన్నాడు.
"కుతుబ్ షాహీ రాజుల రాజధాని కదూ?" ఆమె ప్రశ్నించింది.
"అవును"
"మరోరోజు వచ్చి ఆ కోట వివరంగా చూస్తాను."
"అలాగే మేమ్ సాహెబ్! నేనే వస్తాను. నాకు ఆ కోటను గురించి అంగుళం అంగుళం తెలుసు" గర్వంగా అన్నాడు వృద్ధసాయిబు
సీత అతన్ని చూస్తూ చిరునవ్వు నవ్వింది.
అల్లంతదూరం కుతుబ్ షాహి సమాధుల గుమ్మటాలు కన్పిస్తున్నాయి. ఆమె మనసు చిత్రమైన అనుభవంతో నిండిపోయింది.
సమాధుల దగ్గర సీత తన గుర్రాన్ని సిపాయిలకు అప్పగించింది.
"మీరు ఇక్కడే వుండండి. నేను వంటరిగా వెళ్ళి చూసి వస్తాను" అన్నది.
"మేమ్ సాహెబ్ మీరు....."
"ఎవరూ చెప్పక్కర్లేదు. నేనే చూస్తాను" సీతకు ఆ వాతావరణంలో మరొకరితో మాట్లాడాలని లేదు.
వంటరిగా ముందుకు నడిచింది.
ఆ సమాధులు చిన్నపాటి ఇళ్ళలా వున్నాయి. వాటి మీద చెక్కిన లతలనూ, పూలనూ కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది. సమాధులు కూడా ఇంత శిల్ప నైపుణ్యాన్ని కలిగి వున్నాయి. అద్భుతం!
మొదటిసమాధి తెరిచివున్న వాకిటిద్వారా లోపలకు అడుగుపెట్టింది. చల్లగా వున్నది లోపలి వాతావరణం. వెనక్కి తిరిగి చూసింది. దూరంగా సిపాయిలు చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు.
సమాధి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆమెకు చిత్రమైన భావం కలిగింది. అక్కడ తను ఒంటరిగా ఏదో అతీతమయిన శక్తి తనను చూస్తున్నట్టుగా అన్పించింది.
సమాధి దగ్గరగా వెళ్ళి నిల్చుంది. ఈ బండకింద ఓ మహారాజు తాలూకు శిథిలాలు వున్నాయి. ఆ భావం రాగానే ఆమె మనసులో ఏదో దిగులు పొడచూపింది. భయం మాత్రం కలగలేదు.
ఆమె మెట్లు దిగి వచ్చింది.
రెండో సమాధి భవనం మెట్లు ఎక్కసాగింది. ఆ సమాధి నుంచి వెనక్కి చూస్తే సిపాయిలు కన్పించలేదు. అయినా ఆమెకు తను వంటరిగా వున్నట్టుగా అన్పించడంలేదు. ఎవరో కూడా వున్నట్టుగా అన్పించింది. ఎవరు? చనిపోయిన వారి ఆత్మలా? అవును! సమాధుల్లో వున్న వారి తాలూకు ఆత్మలు ఇంకా అక్కడ తిరుగుతూనే వున్నట్టుగా అన్పించింది. అయినా ఆమెకు భయం కలగలేదు.
మూడో సమాధి దగ్గిరకు వెళ్ళింది. అది అన్నిటికంటే కొంచెం దూరంలో ప్రత్యేకంగా ఉన్నది. ఆ కట్టడం కూడా మిగతా వాటికంటే ఆకర్షణీయంగా ఉన్నది, పెద్దగా ఉన్నది. ఆనాటి శిల్పులు తమ నైపుణ్యాన్నంతా దానిమీద ఖర్చు చేశారా అన్నట్టుగా ఉంది. ఆమె లోపలకు అడుగుపెట్టింది. అలాగే చిత్రంగా నిలిచిపోయింది.
ఒకమూల నీడలో ఆకారం కన్పించింది. సీతకు వెన్నెముకలో నుంచి ఏదో జరజరపాకినట్టుగా అయింది. అరవాలనుకొన్నది. గొంతు పెగలడం లేదు. పెదవులు ఎండిపోయాయి. నాలుకతో తడుపుకొన్నది. వెనక్కు పరుగుతియ్యాలనుకొన్నది. కాని కాళ్ళు స్వాధీనంలో లేవు. ఆ ఆకారం కదిలింది. నో!నో! అది దెయ్యంకాదు! మనిషే! అవును! పొడవుగా వున్న మగవాడు! ఇటే వస్తున్నాడు. సీతకు వళ్ళంతా చెమట్లు పట్టాయి. కళ్ళు తిరిగాయి. ముందుకు తూలింది.

 Previous Page Next Page