అతని మాటల్లో గర్వం లేదు. మాటల్లో నిజాయితీ ఉన్నది. గౌతమ్ కు అతని మీద మొదట ఏర్పడిన ఏహ్య భావం తొలగిపోయింది.
"మీరు మళ్ళీ వెళ్తారా?" గౌతమ్ అడిగాడు.
"వెళ్ళను"
"ఇక్కడ మీ ప్రావిణ్యతను ప్రయోగించి మరో తాజ్ మహల్ కడ్తారా?" వేణు సరదాగా అడిగాడు.
"తాజ్ మహల్ గోరీ! నేను ఈ దేశం గోరీలు కట్టాలని రాలేదు. ఇళ్ళు కట్టాలని వచ్చాను"
"గొప్ప భవనాలు నిర్మిస్తారా! లక్షాధికారులూ, కోటీశ్వరులూ ఈ దేశంలోనూ చాలా మంది ఉన్నారు" అన్నాడు గౌతమ్.
"కాదు వీలైనంత తక్కువ ఖర్చుతో సామాన్యుల కోసం కట్టడానికి ప్రయత్నిస్తాను. నేను విదేశాలలో సంపాదించిన డబ్బు నాకు చాలు. దానిమీద వచ్చే వడ్డీతో బ్రతగ్గలను"
గౌతమ్ సురేశ్ ముఖంలో గౌరవపూర్వకంగా చూశాడు. ఇంత సంస్కారం, మంచి భావాలు గల యువకుడు స్త్రీలను గురించి ఎందుకు అంత చులకనగా మాట్లాడాడు? విదేశీ ప్రభావమా?
"ఒక సందేహం?" అన్నాడు గౌతమ్.
"అడగండి"
"మీకు స్త్రీలంటే గౌరవం లేదు కదూ!"
సురేశ్ గౌతమ్ ముఖంలోకి చూశాడు.
"మా అమ్మ అంటే నాకు చాలా గౌరవం" అన్నాడు సురేశ్.
"కాని పరాయి స్త్రీలంటే నాకు చులకన భావం లేదు. స్త్రీలను నేను గౌరవిస్తాను. కానీ మిసెస్ దత్తా లాంటి స్త్రీలను నేను భరించలేను. గౌరవించలేను"
ఏమిటి సురేశ్ నువ్వక్కడే కూర్చుండిపోయావ్? కుమార్ రాజావారు నీతో మాట్లాడాలంటున్నారు!" హనుమంతరావు తండ్రి అన్నాడు.
హనుమంతరావు తన తండ్రికి గౌతమ్ నూ, వేణునూ రాగానే పరిచయం చేశాడు.
వాళ్ళ నమస్కారాలకు తలపంకించి దూరంగా ఎవర్నో "రండి! రండి!" అంటూ ఆహ్వానించడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆ ఇద్దరి ఉనికినీ గుర్తించనట్టే ప్రవర్తించాడు. వేణు మనసు చివుక్కు మన్నది.
గౌతమ్ అదేమీ పట్టనట్టే నిర్లక్ష్యంగా కూర్చుండిపోయాడు.
"వస్తానులెండి" అని సమాధానం ఇచ్చి
"ఇంకా ఈ దేశంలో రాజ్యాలూ రాజులూ ఉన్నారా?" అన్నాడు సురేశ్ నవ్వుతూ.
హనుమంతరావు తండ్రి ఆముదం తాగినట్టు ముఖంపెట్టి గౌతమ్ కేసి, వేణు కేసి చులకనగా ఒక చూపు చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
"రాజ్యాలు పోయాయి. కాని ఇంకా కుమారా రాజాలు ఉన్నారు" అన్నాడు గౌతమ్.
"సరే వస్తానందీ! మిమ్మల్ని చూడగానే ఎందుకో మీతో పరిచయం పెంచుకోవాలనిపించింది. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను మళ్ళీ కల్సుకుందాం!"
"ఓకే!"
సురేశ్ గౌతమ్ తోనూ వేణుతూనూ కరచాలనం చేసి హనుమంతరావు తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళాడు.
"ఇలాంటి పార్టీలకు మనలాంటి వాళ్ళు రావడం అంత బుద్ధితక్కువ మరోటి లేదు"
గౌతమ్ వేణు ముఖంలోకి చూశాడు.
"హనుమంతుగాడి నాన్న చూశావా మనకేసి ఎలా చూశాడో?"
"ఎలా చూశాడు?"
"బొద్దింకల్ని చూసినట్టు చూశాడు"
"అనెలా చెప్పగలవు. గొంగళిపురుగుల్ని చూసినట్టు చూసి ఉండొచ్చుగా!" జాలిగా వేణును చూస్తూ అన్నాడు గౌతమ్.
"గౌతమ్ ఇలా రా?" గాభరాగా హనుమంతరావు గౌతమ్ ను పిల్చాడు.
గౌతమ్ తాపీగా లేచి వెళ్లాడు.
అందరికీ దూరంగా తీసుకెళ్ళాడు.
"ఏమిటి ఏమైంది? ఎందుకంత గాభరా పడ్తున్నావ్?"
"కొంప మీద కొచ్చింది"
"ఏమిటి? ఎవరి కొంప మీదకు?"
"నీ కొంప మీదకే!"
"నాకు కొంప వుంటేగదా ఏ ప్రమాదమైనా రావడానికి" పకపక నవ్వాడు.
"ఇది నవ్వులకు సమయంకాదు!"
"అదేదో మరీ చంపకుండా చెప్పు!"
నువ్వేమైనా ఉత్తరాలు సుధారాణికి రాశావా?"
గౌతమ్ తృళ్ళిపడ్డాడు హనుమంతరావు ముఖంలోకి విస్మయంగా చూశాడు.
"చెప్పరా నాయనా! అసలు ఆవిడతో నీకు స్నేహం ఎప్పటి నుంచి?"
"నాకా? ఆవిడతో స్నేహమా? నీకేమైనా మతిపోయిందా?"
"ఉత్తరాలు ఏమీ రాయలేదా?"
"ఛ! నేను సుధారాణికి ఉత్తరాలు రాయడం ఏమిటి?"
"బ్రతికాం పో!" రిలీఫ్ గా అన్నాడు హనుమంతరావు.
"చంపక అసలు విషయం ఏమిటో చెప్పరా?"
"సుధారాణి ఆత్మహత్య చేసుకుందట!"
"ఆత్మహత్య చేసుకుందా?"
"ప్రయత్నం చేసింది. ఇంకా చావలేదు. అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేర్పించారట. నీకోసం పోలీసులు హాస్టల్ కు వచ్చారట. శంకర్ ఫోన్ చేశాడు. నువ్వు హాస్టల్ కు వెళ్ళకు. నేను ఎక్కడైనా రహస్యంగా ఉంచే ఏర్పాటు చేస్తాను"
హనుమంతరావు గబగబా చెప్పుకుపోతున్నాడు.