Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 19

 "అదేనే ఆ అమ్మాయి ఆస్తి ఎంతుంటుందో చెప్పు చూద్దాం"
    "ఓ నాలుగయిదు కోట్లుంటుందా?"
    "ఛీ...ఛీ...ఇన్సల్ట్? నాలుగయిదు కోట్లు వాళ్ళింటిలో పనివాళ్ళకున్నాయి. వీళ్ళ ఆస్తి నలభై కోట్లు. ఇంచుమించు మన జనాభా అంత"
    "ఆ...నలభై కోట్లే?" షాక్ తిన్నట్లు మాట్లాడకుండా కూర్చుంది.
    "అమ్మా! అలా అయిపోయావేం? చూడు! ఇక్కడికెందుకొచ్చిందో తెలుసా? మనదేశం చూద్దామని వచ్చింది. వాళ్ళ నాన్న చంద్రమండలంలో బ్రాంచి ఓపెన్ చెయ్యడానికి వెళ్ళారు.
    "ఈ అమ్మాయి ఇక్కడే హోటల్ లో దిగింది."
    "హోటల్ లోనా? అయ్యో అయ్యో... అదేం ఖర్మరా. మనింటిలో వుండమను"
    "మనింటిలోనా?"
    "ఆ....ఏం"
    "గౌరీ వెళ్ళిపోయినప్పటినుంచీ మనమే తిండిలేక చచ్చిపోతున్నాం. ఇంక ఈ అమ్మాయిని కూడా వుంచుకుంటే..."
    "ఏం ఫరవాలేదు. నేను వంట చేసి పెడతానుగా?"
    "నువ్వా? నీకు పూజా, మడీ... తీరికేదమ్మా...ఒద్దులే. ఈ పిల్లని హోటల్ లోనే వుండనీ"
    "ఒద్దురా! పూజా పునస్కారం తరువాత చూసుకోవచ్చు" ముందు ఈ 'కోటీశ్వరి'ని ఇక్కడ వుంచరా. ఆ పూజేదో, దీనికి చేస్తాను పాపం! ఆడపిల్ల ఒంటరిగా హోటల్లో ఎందుకురా?"
    "నాకు తెలుసు మమ్మీ. డబ్బున్న వాళ్ళంటే నీకెంతో జాలి. అందుకే తీసుకొచ్చా మనింటికి." 'ఇంటికి రమ్మంటే పరాయి వాళ్ళింటికి నేను రాను' అంది. పెళ్ళి చేసేసుకుని నాదాన్ని చేసుకుని ఇంటికి తీసుకొచ్చా. ఇదుగో ఈ ఫోటో చూడు" దండలు వేసుకుని తీసుకున్న ఫోటోలు చూపిస్తాడు.
    "ఓరి పిడుగా! నీకెంత తెలివొచ్చిందిరా! కోటీశ్వరినే కోడలుగా తెచ్చావ్. నా నాయనే అన్నట్టు అమ్మాయి పేరేమిటిరా?"
    "గంగ"    
    "గంగా! మంచి పేరు. కానీ ఒరేయ్ నీ నెత్తినెక్కి కూర్చోకుండా చూసుకో, పేరుకి తగ్గట్టు."
    "నువ్వున్నావు కదమ్మా. అన్నీ ఎప్పటికప్పుడు చెప్పడానికి"
    "అవున్నాయనా అమ్మా గంగా... రా... లోపలికిరా..." గంగ వెనకాలే నడుస్తుంది.
    "అమ్మా ఒక చిన్న మాట. ఈ పెట్టె నిండా గంగ నగలూ, ఈ పెట్టెనిండా నోట్లు వున్నాయి. బీరువాలో దాచిపెట్టు. పైకి తీసి ఎవరికైనా చూపించావో పోలీసులు పట్టుకుపోతారు. సింగపూర్ నుంచి వచ్చిన నగలవి. నోట్లు కూడా అంతే. ఎవరికైనా తెలిస్తే 'టాక్స్' వాళ్ళు తీసుకుపోతారు జాగ్రత్త."
    "అబ్బే... బ్రహ్మదేముడికి కూడా తెలీకుండా దాస్తాను" సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ తీసుకుంటుంది.
    "జాగ్రత్తమ్మా" మరోసారి హెచ్చరిస్తాడు గోపీ.
    "అన్నిసార్లు చెప్పాల్రా. నాకు తెలీదూ. నీకు అచ్చం నా బుర్రే వచ్చింది. గబగబా లోపలికెళ్ళి బీరువాలో దాచి పెడుతుంది.
    ఇదంతా విన్న రావుగారు "ఏమిట్రా ఇదంతా, అయినా గోవిందు గౌరిని గుర్తుపట్టలేదూ" అన్నారు.
    "లేదు మామయ్యా. 'బాబ్ హెయిరూ, గౌనూ ఈ వేషంలో పోల్చుకోలేదు. పైగా డబ్బు గొడవల్లో ఇవేవి అంతగా పట్టించుకోలేదు. "మామయ్యా! నిజంగానే నేనూ, గౌరీ గుళ్ళో పెళ్ళి చేసుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించు మామయ్యా."
    ఇద్దరూ కాళ్ళకి నమస్కారం చేస్తారు.
    "బాబూ! గుళ్ళో పెళ్లెందుకు చేసుకున్నారు. లక్షణంగా మీ పెళ్ళయినా నా చేతుల మీదుగా జరిపించి వుండేవాణ్ణి" బాధగా అన్నారు రావుగారు.
    "ఒద్దులే మామయ్యా! నువ్వు ఈ పరిస్థితిలో వుంటే అసలు మాకు పెళ్ళేమిటి? కానీ అమ్మను దారిలోకి తేవడానికి మరో మార్గం లేక ఇలా చెయ్యవలసొచ్చింది."
    "కానివ్వండి. జీవితమే ఒక పెద్ద నాటకమయితే, ఇవన్నీ అంతర్నాటకాలు. కలకాలం చల్లగా, నూరేళ్ళాయుష్షుతో హాయిగా వుండండి" ఆశీర్వదించారు రావుగారు.
    మాధవిని థియేటర్ లోకి తీసుకెళుతున్నారు. సుశీలమ్మ, రుక్మిణి మాధవికి దగ్గరగా నుంచున్నారు. బాధతో మూలుగుతోంది మాధవి.
    "పిన్నీ!" పిలిచింది.
    "ఏమ్మా?" మాధవికి దగ్గరగా వంగుతుంది.
    "నాకొక మాటిస్తావా పిన్నీ?"
    "ఏమిటో చెప్పమ్మా. తప్పకుండా ఇస్తాను."
    "నాకేమయినా అయితే..."
    "నీకేమీ అవదు, అధైర్య పడకు" మధ్యలోనే మాట తుంచేసింది రుక్మిణి. మాధవి చెప్పబోయేదేమిటో అర్థం చేసుకుని...

 Previous Page Next Page