Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 20


    "నా దురదృష్టం ఇంకా వెంటాడి నాకేమయినా అయిపోతే, నా బిడ్డ దిక్కులేనిది కాకూడదు. మీరు చూసుకుంటానని మాటివ్వండి ప్లీజ్."
    రుక్మిణి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సుశీలమ్మ కూడా చాటుగా కళ్ళు తుడుచుకుంటుంది.
    "అలాగేనమ్మా, నువ్వు దిగులు పడకు. అన్నీ సవ్యంగానే జరుగుతాయి."
    నర్సులు మాధవిని మెల్లగా స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళతారు. లేడీ డాక్టరున్నా జయరాం కూడా సిద్ధంగా వుంటాడు.
    దాదాపు రెండు గంటలసేపు భయమూ, అందోళనా అందరి మధ్యన గూడు కట్టుకున్నాయి.
    "క్యారు, క్యారు" మని ఏడుపు వినిపించగానే అందరి మనసులూ తేలికపడ్డాయి.
    నర్సొచ్చి చెప్పింది. "ఆడపిల్ల" అని. మరి కాసేపటికి అందరూ లోపలికెళ్ళారు. మాధవి మత్తుగా వుంది. అయినా కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. రుక్మిణి బేబీని ఎత్తుకుంది. మాధవికి చూపించి అందంగా వుంది. నీలాగే" అంది.
    గత స్మృతులు కళ్ళముందు కదలుతూంటే భరించలేక కళ్ళు మూసుకుంది మాధవి.
                                                          *    *    *
    గౌరి తెల్లారుఝామున లేచి పాచిపనులు చేస్తూ వుంటుంది. గోపీ పరుగెత్తుకొస్తాడు.
    "ఏయ్! ఎన్నిసార్లు చెప్పాను. ఈ పనులన్నీ చెయ్యొద్దని" కోపంగా అంటాడు. "ఏం చెయ్యనండీ! అన్ని పనులూ పాపం అత్తయ్యే చేసుకుంటూ వుంటే నాకేదో బాధగా వుంది. పైగా కోటీశ్వరినని మభ్యపెట్టి ఆవిడ చేత నేను చాకిరీ చేయించుకోవడం మరీ సిగ్గుగా వుంది" అని ఏడుస్తుంది.
    "నీ ఖర్మ. నీకు సుఖపడే రాత లేదు. ఈ వంకనైనా అమ్మ కొంచెం పనిచేస్తోంది. అదీ మంచిదే కదా! పైగా నువ్విప్పుడిలా బాధపడుతూ పనులు చేసేస్తే అమ్మకి గుణపాఠం ఎలా చెబుతాం? అసలు మన ప్లానేమవుతుందీ? పద చెయ్యిపట్టి లాక్కెళ్ళి పడుకోబెట్టాడు గోపీ.
    బాధగా ముత్యుంజయరావుగారు మూలగడం విని గోపీ, గౌరి అతని గదిలోకెళ్ళారు. "అజయ్! అజయ్!" అంటూ అతని కలవరింతలు! నిద్దట్లోనే ఏడుపు! గోపీకి, గౌరీకి దుఃఖం ముంచుకొచ్చింది.
    మెల్లగా భుజం తట్టి "మామయ్యా" అంటూ లేపాడు గోపీ.
    "మామయ్యా! ఒంట్లో బాగోలేదా?" అడిగాడు.
    "నాకేమయిందిరా! బాగానే వున్నాను."
    "ఏమిటి బాబాయ్ మీరు మరీను. అజయ్ కి ఆయుష్షు ఇవ్వలేదు భగవంతుడు అంతే! మీరేం చేస్తారు. గతాన్ని మరిచిపోండి" ఓదార్చింది.
    "ఎలా మర్చిపోనమ్మా! ఇవాళెందుకో అనుక్షణం జ్ఞాపకం వస్తున్నాడమ్మా నా బాబు. దురదృష్టవంతుణ్ణి ఆ మృత్యువుకి నేను పనికిరాకపోయానమ్మా" పసిపిల్లాడిలా ఏడ్చారు.
                                     *    *    *
    "పాపకి మూడో నెల వచ్చింది. నేను ఆఫీసుకి కూడా వెళ్ళాలి. ఇక వెళతాను పిన్నీ" అంది మాధవి.
    "నీ పట్టు నీదే కానీ, ఎంత చెప్పినా వినడం లేదు" అంది రుక్మిణి బాధగా.
    "పిన్నే౧ నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయినప్పుడు మీ దగ్గరికిరాక ఇంకెక్కడికి పోతాను" అంది కాళ్ళకి నమస్కరిస్తూ.
    "ఏయ్ శాంతీ! మళ్ళా ఎప్పుడొస్తావ్? పాపని బుగ్గ మీద చిటికవేస్తూ పలకరించారు."
    "మీరు మాత్రం పాపని 'శాంతీ' అని పిలిచేస్తున్నారు. మాధవి ఏ పేరు పెట్టాలనుకుందో ఏమో" అంది రుక్మిణి జయరాం కేసి చూస్తూ.
    "జీవితం అంతా అశాంతితో నిండిపోయిన నాకు ఇదొక్కటే కాస్త శాంతినిస్తోందమ్మా. దాని బ్రతుకైనా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటూ 'శాంతీ' అనే పిలుస్తాను. నాకా పేరు నచ్చింది పిన్నీ" - కళ్ళు తుడుచుకుంటూ అంది.
    "పదండి" అన్నారు జయరాం. కారులో కూర్చుంటూ పాపకోసం అమర్చిన పనిమనిషితో సహా అందరూ కారులో కూర్చున్నారు.
    అమ్మమ్మ వున్నంతవరకూ మాధవి సుశీలమ్మతో సరిగ్గా మాట్లాడేది కాదు. సుశీలమ్మకూడా ఏదో అమ్మమ్మతో పిచ్చాపాటి మాట్లాడిపోతూ వుండేది. అటువంటిదీ, అమ్మమ్మ పోయాక, సుశీలమ్మ ఆ లోటు పూర్తిచేస్తూ మాధవిని కంటికి రెప్పలా కాపాడుతోంది. ఎవరికి ఎవరు ఎప్పుడు ఎలా దగ్గరవుతారో ఎవరికీ తెలీదు గదా!
    ఆ రాత్రికి భోజనాలు చేసి వెళ్ళిపోయారు జయరాం దంపతులు. సుశీలమ్మా వెళ్ళిపోయింది.
    మళ్ళీ ఆ యింట్లో పాత జ్ఞాపకాల మధ్య కొత్తపాపతో ఆ ఇంట్లో వుండలేకపోయింది మాధవి. క్షణం ఒక నరకంగా గడిచింది. ఇల్లు మార్చడానికి నిశ్చయించుకుంది.
    జయరాంగారి సహకారంతో వారికి దగ్గరలోనే ఇల్లు కుదుర్చుకుని, ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది మాధవి. కొత్త ఆశలతో కొత్త ఇంటికి.
    కాలచక్రం తిరుగుతోంది. అప్పుడే అయిదు క్యాలెండర్లు దాటాయి. పాప పసిడి పలుకులలో దాని ఊసులతో బోలెడంత కాలక్షేపం మాధవికి. పాపని స్కూల్లో వెయ్యాలనుకుంటోంది.
    డాక్టర్ జయరాంగారి సిఫార్సుతో అక్కడి కాన్వెంట్ స్కూల్ కి తీసుకెళ్ళింది ఆమె శాంతిని. అప్లికేషన్ ఫారాలు చూస్తున్న ప్రిన్సిపాల్ శాంతి ఫారం చూస్తూ ఒక్క నిమిషం ఆగిపోయాడు. 'డాటర్ ఆఫ్ లేట్ డాక్టర్ అజయ్. డాక్టర్ ఇన్ ది...ఆర్మీ' మాధవికేసి శాంతికేసి మార్చి మార్చి చూశాడు. "డాక్టర్ అజయ్ అంటే హైదరాబాదు అతనేనా? వారి నాన్నగారు ముత్యుం...."
    "అవును మీకు తెలుసా?" మాట మధ్యలోనే ఆపి అడిగింది మాధవి. ఆమె గొంతులోని కాఠిన్యానికి, అడిగిన ఆ తీరుకీ కొంచెం ఆశ్చర్యపోయి ఒక్కక్షణం ఆలోచించి అతను తెలీదమ్మా, పేరు విన్నానంతే. డాక్టర్ అజయ్ తో కొంచెం పరిచయం వుంది" అన్నాడు జాన్.
    "అలాగా! మరి నే వస్తాను. థాంక్సండీ" లేచి నమస్కారం పెట్టింది.
    "వెల్ కమ్" అంటూ మరో అప్లికేషన్ ఫారం చూడ్డంలో నిమగ్నుడయ్యాడు ప్రిన్సిపాల్.

 Previous Page Next Page