"అయితే నేనంటే నీకు ఇష్టంలేదా?"
"వుంది"
"మరయితే నేను చెప్పినట్లు చెయ్యి"
"పెదనాన్న ఏమంటారో?"
"నేను చెబుతాగా అసలు విషయం మామయ్యకి"
"ఏమో?"
"ఏమో లేదు గీమో లేదు. పెట్టే బేడా తీసుకుని సిద్ధంగా వుండు. ఈ సంగతి మామయ్యకి చెప్పి వచ్చేస్తా. ఓ..కే..."
"ఊ...."
* * *
'హారన్ వేశాడు డ్రైవరు. ఇంటికి తాళం పెట్టొచ్చి కారులో కూర్చుంది మాధవి. ఆమె ఆలోచనలలాగే వేగంతో పోతోంది.
కారు దిగుతున్న ఆమెకు ఎదురొచ్చింది రుక్మిణి. "రా...అమ్మా!" అంటూ.
"ఎందుకు పిన్నీ ఈ శ్రమంతా ఇప్పుడు?"
"శ్రమేముందమ్మా. మేం భోంచెయ్యమూ? మాతో పాటు నువ్వూ కలిసి భోజనం చేయాలనే కోరికతో పిల్చాను."
"మందులన్నీ జాగ్రత్తగా వేసుకుంటున్నావా అమ్మా" అంటూ పలకరించారు జయరాంగారు.
"మీ ఆప్యాయతా, పిన్ని ఆదరణా మందులకన్నా ఎక్కువగా పనిచేస్తున్నాయ్ బాబాయ్" నవ్వుతూ అంది మాధవి.
"అంతకన్నా కావలసిందేముందమ్మా తరుచూ వస్తూ వుండు"
"తరచు ఏమిటండీ? రోజూ వస్తే మంచిది"
"ఇంకానయం. ఇక్కడే వుండిపోమన్నావు కాదు"
"ఎప్పుడో అన్నాను. ఒప్పుకుంటేనా? మాధవి. మీరడిగి చూడకూడదూ? కనీసం డాక్టర్ గా నయినా మీ మాట వింటుందేమో?" అంది రుక్మిణి జయరాంకేసి చూసి.
"ఉహూ! నేను ఓడిపోయాను" అన్నారు జయరాం.
"పిన్నీ! మీరూ, బాబాయి నాపై కురిపిస్తున్న ప్రేమని జన్మజన్మలకీ మరిచిపోలేను. మరో జన్మంటూ వుంటే మీ కడుపున జన్మించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. అమ్మా, నాన్నా అంటే ఏమిటో తెలీకుండా అమ్మమ్మ ఒళ్ళో పెరిగిన నాకు మిమ్మల్ని చూశాక వాళ్ళే కనబడుతున్నారు. పిన్నీ! ఎప్పుడయినా, నేనక్కడయినా వుండవలసిన పరిస్థితి వస్తే, తప్పకుండా మీ దగ్గరే వుంటా" అనురాగంతో చెబుతుంది మాధవి.
"తప్పకుండా. ఈ ఇల్లు నీ సొంతం అనుకో. నువ్వేమో జోత్స్నవని మేమేనాడో అనుకున్నాం" ఆనందంతో అంటుంది రుక్మిణి.
"తప్పకుండా పిన్నీ..." అందరి మనసులలో ఏదో పొందామన్న తృప్తి హాయినిచ్చింది.
దిక్కులేనివారికి దేవుడేదో ఒక మార్గం ఇలా చూపిస్తాడేమో? అమ్మాయి పోయిన దిగులుతో జయరాం దంపతులు అయినవాళ్ళు కరువై ఆలంబన లేక అలమటిస్తున్న మాధవి మమతానురాగాలతో ఒకరి కొకరు చేరువయ్యారు. ఎవరికి కావలసిన ఆనందాన్ని వారు పొందుతున్నారు.
భోజనాలయ్యాక జయరాం దంపతులు మాధవిని ఇంటిదగ్గర దింపి వచ్చారు. రోజులు గడిచిపోతున్నాయ్.
* * *
"నేను చెప్పిందంతా జ్ఞాపకం వుందా?" టాక్సీ దిగుతూ అడిగాడు గోపీ.
"నాకు భయంగా వుంది"
"నో!నో! మళ్ళీ మొదటికి రాకు. పద" గోపీ ముందు నడిచాడు "అమ్మా! అమ్మా" అంటూ.
హాలులో నుంచి గోవిందమ్మ రెండడుగులు ముందుకు వేసింది. గోపీ వెనకాలే ఉన్న అమ్మాయిని చూసి ఆగిపోయింది.
"ఎవర్రా? ఈ దొరసాని పిల్ల?"
"అమ్మా సింగపూర్ లో వాళ్ళబ్బ సముద్రంలో పనిచేస్తాడు. లక్షలు... కాదు... కోట్లు గడించి కోటేశ్వరుడయ్యాడు. ఇదొక్కటే కూతురు. అంటే 'కోటీశ్వరి' అన్నమాట"
"నిజంగానే! గుడ్లప్పగించి చూస్తూ "నా మతి మండ! మొహం చూస్తే తెలియట్లేదు. ఆ కళ్ళూ, ఆ ముక్కూ, అన్నిటినీ మించి ఆ దర్జా, ఆ దర్పం, దొండపండులా వుంది."
"ఊ...దొండపండే" కిలకిలా నవ్వుతాడు.
"ఒరేయ్! సముద్రంలో ఉద్యోగమేమిట్రా?"
"చేపలు... చేపలు"
"ఏమిటీ? చేపలు పడతాడా?"
"ఛీ... ఛీ... చేపలు పట్టించి, విదేశాలకు ఎగుమతి చేస్తారు. లండన్, ఫ్రాన్స్, అమెరికా అన్ని దేశాలకీ వెళ్ళేవి వీళ్ళ చేపలే? ఈ మధ్యనే చంద్రమండలానికి కూడా పంపాలని ఆలోచిస్తున్నారు."
"నిజమే!" ఆశ్చర్యంతో గుడ్లప్పగిస్తుంది.
"మమ్మీ! ఈ అమ్మాయి ఖరీదెంతో చెప్పుకో?" కొంటెగా నవ్వుతూ అన్నాడు గోపీ.
"ఖరీదేమిట్రా? ఏమైనా బొమ్మా ఏంటి?"