శబరి జాన్ ముఖంలోకి చూసింది.
"బేబీ! మళ్లీ ఎప్పుడొస్తావ్?"
"ఇక రాదు!" అన్నది జ్యోతి తీవ్రంగా చూస్తూ.
"ఎందుకురాదూ? వస్తుంది. ఏం బేబీ?" అడిగాడు జాన్.
శబరికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు. అసహాయంగా చూసింది. "మళ్లీ వస్తావా?" జ్యోతి అడిగింది. శబరి సమాధానం చెప్పలేదు.
"ఏమిటి అలా చూస్తావ్? పద మీ నాన్నగారు వచ్చే టైమయింది!" హెచ్చరించింది జ్యోతి.
"మళ్లీరా బేబీ! ఈసారి మాతో వుండిపోవడానికే వచ్చేయి!"
జ్యోతి వెనకే నడుస్తున్న శబరిని ఉద్దేశించి అన్నాడు జాన్. తిరిగి తిరిగి చూస్తూ జ్యోతి వెనకే నడిచింది శబరి.
10
జ్యోతి శబరిని రిక్షాలో ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికి శబరి తల్లీతండ్రీ పార్టీనుంచి తిరిగి రాలేదు. జ్యోతి శబరికి మళ్ళీ బోధించసాగింది. జీవితపు విలువల్ని గురించి చెప్పింది. జీవితంలో జారిపోయిన ప్రతిక్షణం ఎంత అమూల్యమయిందో చెప్పింది. మానవ ధర్మాన్ని గురించి తనకు తెలిసిన మేరకు బోధించసాగింది. శబరి వింటూ కూర్చుంది.
గోడగడియారం తొమ్మిది కొట్టింది. జ్యోతి లేచి నిల్చుంది.
"చాలా పొద్దుపోయింది. వస్తాను" అన్నది.
"ఇంత ఆలస్యంగా వెడితే మీ మమ్మీ డాడీ ఏమీ అనరా?" శబరి అడిగింది.
"నాన్నకు నామీద ఎంతో నమ్మకం వుంది. పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తాడు. అమ్మ పాతకాలం మనిషి. ఆడపిల్లలకు పెద్ద చదువులెందుకంటుంది. త్వరగా పెళ్లి చేసి ఒక యింటికి ఇల్లాలిని చెయ్యాలని అయే ఆరాటం! ఎప్పుడయినా గొణుగుతుంది. నేనూ, నాన్నా నవ్వి ఊరుకుంటాము. ఆమె అభిప్రాయాలను ఖండించడానికి ప్రయత్నించం. ఎందుకంటే ఆమెకు మా భావాలు అర్థం కావు. అసలు వినిపించుకోదు."
"మీ మమ్మీ డాడీలు పార్టీలకూ, క్లబ్బులకూ వెళ్ళరా?"
"వెళ్లరు. మా నాన్నకు క్లబ్బులకు వెళ్ళే తీరిక ఉండదు. తీరిక సమయాల్లో ఏదయినా పుస్తకం చదువుకుంటారు. మా అమ్మకు అవేవీ పట్టవు. ఇక పార్టీల సంగతి, బంధువుల, స్నేహితుల ఇళ్ళలోని శుభకార్యాలకు వెళుతూనే వుంటారు."
"నువ్వూ వాళ్ళవెంట వెడతావా?"
"మరీ దగ్గిర బంధువులయితే వెడతాను."
"నీ బట్టలు ఎవరు ఎంపిక చేస్తారు?"
జ్యోతి ఆశ్చర్యంగా శబరి ముఖంలోకి చూసింది. "నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ నాకు కావాల్సిన బట్టలు నేను కొనుక్కుంటాను. నాన్నగార్ని అప్పుడప్పుడు కూడా తీసుకెళతాను."
"నువ్వు అదృష్టవంతురాలివి!" శబరి నిట్టూర్చింది.
"ఏం నీకు మాత్రం ఏం తక్కువా?"
అంతలో కారు డోర్ వేసిన శబ్దం అయింది.
"మీ మమ్మీ డాడీ వచ్చినట్టున్నారు. నేను వెడుతున్నాను!" అంటూ కిందకు నడిచింది జ్యోతి. శబరి కిందదాకా జ్యోతిని పంపించటానికి బయలుదేరింది. మెట్లమీద శబరి తల్లీ తండ్రి ఎదురైనారు. రుక్మిణి జ్యోతికేసి నిరసనగా చూసింది. పలకరించలేదు. జ్యోతికి వళ్ళు మండిపోయింది. ఆమె వేషం ఏవగింపు కలిగింది.
"ఏమ్మా! బాగున్నావా?" రంగారావు ఆప్యాయంగా పలకరించాడు.
"బాగానే వున్నాను బాబాయ్!"
రుక్మిణి చిరచిరలాడుతూ చరచర మెట్లెక్కి వెళ్ళింది. ఏదో అడగాలని నోరు తెరిచిన రంగారావు భార్యకు కోపం వచ్చిందని తెలుసుకొని అడక్కుండానే గబగబ పైకి వెళ్ళిపోయాడు. జ్యోతి ముసిముసిగా నవ్వుకుంది.
11
"ఏమ్మా ఇంత ఆలస్యం అయింది? ఇవ్వాళ కొంచెం త్వరగా రమ్మని చెప్పలేదా?"
జ్యోతికి అప్పుడుగాని గుర్తుకురాలేదు ఆరోజు శేఖరం బావ వస్తాడనే విషయం, "సారీ! నాన్నా! మర్చేపోయాను! బావ వచ్చాడా?"
రమణమూర్తి కూతురి ముఖంలోకి లోతుగా చూశాడు. "ఏమిటోనమ్మా ఈ మధ్య నువ్వు బొత్తిగా మారిపోయావు. నాకేం అర్థం కావడం లేదు."
"నాన్నా భయపడకు! నీకు బాధకలిగించే పనులు నేనేమీ చెయ్యడం లేదు."
"అది కాదమ్మా... నీలో ఏదో మార్పు కన్పిస్తున్నది. నానుంచి ఏదో దాస్తున్నావు!"
"హల్లో! జ్యోతీ!" రమణమూర్తి మేనల్లుడు శేఖరం బయటికి వచ్చాడు.
"హల్లో బావా! ఎప్పుడొచ్చావ్?" లేచి ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటూ పలకరించింది. జ్యోతి శేఖరాన్ని ఎగాదిగా చూసింది. మనిషి బాగా మారిపోయాడు. అమెరికా నీళ్ళు బాగానే పట్టినట్టున్నాయ్ అనుకుంది. రమణమూర్తి వాళ్ళ మధ్యనుండి తప్పుకున్నాడు.
"డియర్! ఇంత ఆలస్యంగానా రావడం? నేను ఉదయం పదిగంటలకే వచ్చాను. అసలు ఇవ్వాళ సెలవు పెడ్తావనుకున్నాను. బోర్ కొట్టి కాలేజీకి వచ్చాను. నువ్వు ఇవ్వాళ కాలేజీకి రాలేదన్నారు. ఎక్కడికెళ్ళావ్?" అప్పుడే పెళ్లాం అయిపోయినట్టు అధికారం చేస్తున్నాడు! బావతత్త్వమే అంత!
"మాట్లాడవేం జ్యోతీ?"
"సారీ! బావా! ఏదో ఆలస్యం అయింది!"
"కాలేజీకి కూడా వెళ్ళకుండా ఇంతసేపు ఎక్కడికెళ్ళావ్?"
జ్యోతికి చిరాకు వేసింది. "ఏం నీకు చెప్పాలా?" అని అడగాలనుకుంది. కాని తమాయించుకుంది.
"జ్యోతీ డియర్! యూ ఆర్ వెరీ క్రూయల్!" అంటూ రెండు చేతులూ జ్యోతి భుజాలమీదవేసి దగ్గిరకు లాక్కున్నాడు.
జ్యోతి చిరాగ్గా విడిపించుకుంటూ "ఏమిటిది? వదులు!" అన్నది.
"ఇప్పుడైతే తోసేశావ్? వారం రోజుల తర్వాత ఎలా తోసేస్తావో చూస్తాగా?" ముసిముసిగా నవ్వుతూ అన్నాడు శేఖరం.
జ్యోతికి చాచి కొట్టాలనిపించింది.
"అబ్బ! రెండేళ్ళయింది నిన్ను చూసి. నిన్ను తల్చుకుంటూ వింత విరహం..."
"బావా! అలాంటి మాటలు నాకు ఇష్టం ఉండవని నీకూ తెలుసు!" కరుకుగా అన్నది జ్యోతి.
"ఇప్పుడలాగే అంటావ్! పదిరోజుల్లో నేను మళ్ళీ వెళ్ళిపోతాను! అప్పుడు నువ్వు ఎలాంటి లెటర్స్ రాస్తావో... ఎంత విరహాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తావో..."
'నీ ఎక్స్ ప్రెషన్ మండినట్టే వుంది' అనాలనుకుంది.
"పదిరోజుల్లో వెళ్ళిపోతున్నాను. మరో రెండు రోజులు ఉండమని బతిమాలినా వీలుండదు తెలుసా?" బెదిరిస్తున్నట్టు అన్నాడు.
జ్యోతి బావ ముఖంలోకి చిరాగ్గా చూసింది.
"వచ్చే శుక్రవారమే అమ్మాయిగార్ని తాడుతో బంధించబోతున్నాను. ఇప్పుడు నన్ను ఏడిపించావా జాగ్రత్త! అప్పుడు వడ్డీతోసహా వసూలు చేసుకుంటాను."
జ్యోతి శేఖరం ముఖంలోకి అయోమయంగా చూసింది.
"ఏమిటలా చూస్తావ్? అర్థం కాలేదూ? వచ్చే శుక్రవారమే మన పెళ్ళి!" అంటూ మళ్లీ భుజాలమీద చేతులు వేశాడు.
జ్యోతి కోపంగా చేతుల్ని నెట్టేసింది.
"శుక్రవారం మన పెళ్ళా? అంతా నీ ఇష్టమేనా? నా ఇష్టాయిష్టాలతో పని లేదా?" తీవ్రంగా అన్నది జ్యోతి.
శేఖరం జ్యోతి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
"నీకు ఇష్టంలేదా జ్యోతీ! నేనంటే నీకు యిష్టంలేదా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను నా భార్యగానే చూశారు అందరూ!"