బహుశా స్వర్గంలో సౌఖ్యాలు ఇంత ఆనందాన్నిస్తాయేమో! అందుకే యోగులు అంతంతకాలం ముక్కులు మూసుకుని తపస్సులు చేస్తారు.
'ఈ లోకం కాదు. ఆ లోకంలో స్వర్గం సాధించడమే పరమావధి అని కొందరు చేతులలో వున్నదేదో వొదులుకుని లేనిదేదో కావాలని ఆశలు పడి పరిగెత్తుతారు... ఎదుటనున్న ఆనందాన్ననుభవించు!
తక్కింది ఎట్లా పోతే మనకేం? అంటాడు చలం.
ఆ వయసులో చలం పుస్తకాల్లోని విషయాలు అర్థమయ్యేది అంతవరకే మరి!
"మా ఇంటి కెళ్దామా?" అడిగాడు.
"ఇప్పుడా...అమ్మ ఎదురు చూస్తుంటుంది."
"ఫరవాలేదు. గంటలో మళ్ళీ డ్రాప్ చేసేస్తాను"
"ఒద్దు. ఇంకోసారి వస్తాను" అన్నాను.
"ప్రామిస్!" అన్నాడు సందీప్.
"ప్రామిస్!" గట్టిగా అన్నాను నేను.
అతను పెద్దగా బలవంతం చెయ్యలేదు. సందుచివర వదులుతూ మళ్ళీ ముద్దుపెట్టుకున్నాడు.
నేను కారు దిగి, ఒళ్ళంతా మేఘాల్లో తేలిపోతుండగా నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాను.
"ఎవరతను?"
ఆ ప్రశ్నకి ఆశ్చర్యంగా చూశాను.
గుమ్మంలో కాళింది నిలబడివుంది.
"అక్కా...ఎప్పుడొచ్చావు?" అన్నాను.
"ముందు అతనెవరో చెప్పు" కళ్ళద్దాలు పైకి తోసుకుంటూ సీరియస్ గా అడిగింది.
"క్లాస్ మేట్" అబద్దం చెప్పాను.
"ఎంతదాకా వచ్చింది?" ఘాటుగా అడిగింది.
"అది కాదక్కా..." ఏదో చెప్పబోయాను.
"ఇవాళ బస్సులు స్ట్రైక్ లేం లేవే? అతని కార్లో తప్ప ఇంటికి రాలేని కర్ఫ్యూ పరిస్థితి కూడా లేదే?" టీచర్ హోం వర్క్ చెయ్యని పిల్లల్ని దండించినట్లు అడిగింది.
"వాళ్ళ ఇల్లు ఇటు వైపే...అందుకనీ!" చిన్నగా నసిగాను.
"నీ పుస్తకాలు చూశాను. అందులో నీ మంత్లీ టెస్టుల మార్కులే చెప్తున్నాయి. ఏం జరుగుతుందో...ఈ ఏడు కూడా మెడిసిన్ ఎంట్రెన్స్ కి ప్రిపేర్ అయ్యేదిలేదా?" అంది. ఊరునుంచి రాగానే చిన్నక్క చేసిన తనిఖీకి నాకు కోపం వచ్చింది.
"నువ్వు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏం జరగడంలేదు. అసలు నీ డామినేషన్ నాకు ఇష్టంలేదు" అని ఖచ్చితంగా చెప్పేశాను.
"ముక్తా...అంత పెద్ద దాని వయ్యాననుకుంటున్నావా? స్కూల్ దాటి ఎన్ని రోజులయిందే? నీకేం తెలుసు ఈ మగపిల్లల సంగతీ? అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. మనం గీసుకున్న గీత దాటి మనమే బయటికి వెళ్ళి మోసపోయేట్లు చేస్తారు" అరిచింది.
నేను భయంగా చుట్టూ చూశాను.
"అమ్మా నాన్నా ఇంట్లో లేరులే. బయటకెళ్ళారు. నా మాట విను. ఈ స్నేహాలవీ మనకొద్దు. బుద్ధిగా చదువుకో" అంటూ మా ఆర్ధిక పరిస్థితి గురించీ అమ్మా నాన్నా మా చదువులకోసం పడ్తున్న ఇబ్బందుల గురించీ చాలాసేపు చెప్పింది.
నేనేం మాట్లాడలేక కళ్ళనిండా నీళ్ళు పెట్టుకుంటే దగ్గరకు తీసుకుని ఓదార్చింది.
"ఇంకా నువ్వు పసిపిల్లవి. ఈ లోకం సంగతి నీకు తెలీదు. అందమైనదనే అనుకుంటున్నావుగానీ ప్రమాదకరమైనదని నీకు తెలీదు. మోసపోకు!" అంది.
'రేపు సందీప్ తనతో రమ్మనగానే వెళ్ళకూడదు' అని గట్టిగా నిశ్చయించుకున్నాను.
ఆ రాత్రి అన్నం సహించలేదు.
సందీప్ తో రేపు 'నన్ను మర్చిపో' అని ఎలా చెప్పాలో రిహార్సల్స్ వేసుకున్నాను. తలుచుకుంటేనే చాలా ఏడుపొస్తోంది. పక్క మంచం మీద చిన్నక్క నిద్రపోతోంది. ఆమె ముఖం చాలా ప్రశాంతంగా వుంది!
పెద్దక్కకీ, చిన్నక్కకీ ఎంత వ్యత్యాసం? పెద్దక్క పిల్లలతో వస్తే ఇంట్లో ప్రశాంతత అనే మాటే ఉండదు. అమ్మనీ, నాన్ననీ అన్నింటికీ బాధిస్తుంటుంది.
బావగారికి ఈ మధ్య షుగర్ వచ్చిందట. దాంతో ఆయనకి కోపం ఎక్కువైపోయి దీన్ని చీటికీ మాటికీ తిడ్తాడట. అవన్నీ పూసగుచ్చినట్లు అమ్మకీ నాన్నకీ చెప్తుంది. చిర్రున ముక్కు చీది 'నా ఖర్మ...అందరూ బావున్నారు. నేను తప్ప!' అని ఏడుస్తుంది.
కన్నవాళ్ళకి పిల్లల కష్టాలు వినడం ఎంత నరకమో దాని పిల్లలు పెద్దయితే కానీ దానికి తెలియదు.
చిన్నక్క వస్తే ఇంట్లో అందరం సంతోషంగా ఉంటాం. తాతయ్యకి బీ.పీ. చూసి మందులిస్తుంది. 'పైకి ఎప్పుడు పంపిస్తావే నన్నూ?" అనడిగితే.
'రద్దీ ఎక్కువైందట. టిక్కెట్లు దొరకడం లేదు తాతయ్య ఓ పదేళ్ళు ఆగు!' అంటుంది.
అమ్మని వంటింటి చాయలకి రానివ్వదు. నాన్నగారితో కష్టం, సుఖం చర్చించి సలహాలిస్తుంది.
నాకు అర్థంకాని పాఠాలు చెపుతుంది. ఇవన్నీ చేస్తూనే ఇల్లంతా శుభ్రం చేస్తుంది. అన్నీ ఓ క్రమ పద్ధతిలో అమరుస్తుంది. క్రమశిక్షణ దాని మారు పేరు!
తెల్లవారి లేచి చూస్తే దాని కళ్ళద్దాలు టేబుల్ మీద కనిపించకపోతే అది వెళ్ళిపోయినట్లు లెక్క.
ఇంట్లోని ఆనందాన్నంతా కడకొంగున ముడేసుకుని వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది.