Previous Page Next Page 
బంధితుడు పేజి 18


    పద్మకు వళ్ళు మండిపోయింది.

    "ఎవరు రాసింది; మీ చెల్లెలేనా? చెప్పరేం"

    "ఆఁ" అంటూ ఈ లోకంలోకి వచ్చాడు సత్యనారాయణ

    "ఏమిటంత పరథ్యాన్నం? ఏం రాసిందేం? ఇంతలోనే మళ్ళీ ఉపద్రవం ఏ మొచ్చి పడింది?"

    "ఏం రాసిందా? తనింకా ఉత్తరం పూర్తిగా చదవందే? దీనికి చెప్పాలా?" అనుకున్నాడు పద్మను చూస్తూ.

    "మాట్లాడరేం? ఏం రాసింది?" రెట్టించింది పద్మ.

    "ఏదో రాసిందిలే! నువ్వెళ్ళిపనిచూసుకో" విసుక్కున్నాడు సత్యనారాయణ.

    పద్మ కోపం తారస్థాయిని అందుకుంది.

    విసురుగా గొణుక్కుంటూ వెళ్ళిపోయింది.

    తన చెల్లెల్ని తను 'బరువు' అని కలలోనైనా అనుకున్నాడా? సరోజ ఎందుకు ఇలా రాసింది?

    తను పూర్తీ ఉత్తరం చదవనే లేదు. ఏం జరిగిందో ఏమిటో? బలమైన కారణం లేకుండా ఇలాంటి ఉత్తరం రాయదు సరోజ.

    సత్యనారాయణ ఆతృతగా ఉత్తరం చదవసాగాడు.

    'కట్నం లేకుండా నీ చెల్లెల్నిపెళ్ళిచేసుకున్నాడుగా! అందుకే ఆయన నీ దృష్టిలో మంచివాడు.

    సంఘ సంస్కర్త.

    లోకం దృష్టిలో కూడా ఆయన ఆదర్శపురుషుడు. కట్నం లేకుండా చేసుకున్నాడుగా? పైగా అభ్య్దయభావాలుగల రచయిత! గొప్ప రచయిత.

    ఆయన మీద ఏం చెప్పినా నమ్మవు.

    ఎందుకు నమ్ముతావు?

    నమ్మవు.

    వదిన అసలే నమ్మదు.

    నీచేత దమ్మిడీ ఖర్చు చేయించకుండా నీ నెత్తిమీద బరువు దించాడుగా?

    నీ రొమ్ములమీద కుంపటిని తీసి నీకు సంతృప్తిని ఇచ్చాడుగా?

    అందుకే నువ్వు నమ్మవు.

    ఆయన మాటలమీదే నీకు గౌరవం! జీవితమంతా నువ్వు ఆయనకు కృతజ్ఞుడిగా వుంటావనికూడా నాకు తెలుసు.

    ఆయన త్యాగానికి నీ మనసు జోహార్లు అర్పిస్తూ వుండవచ్చు!

    కాని ఆ త్యాగానికి ఫలితం ఎంత దారుణంగా వుంటుందో అనుభవిస్తున్న నాకు తెలుసు.

    నీకేం తెలుస్తుందిరా అన్నయ్యా?

    నీ చెల్లెలు సుఖపడుతుందని నీ భావం. నేను లేనిపోనివి ఊహించుకుంటూ అనవసరంగా బాధపడుతున్నావని నీ వేన్నిసార్లో మందలించావు కూడా.

    ఆయన కూడా నన్ను 'శాడిస్టు' అంటారు! ఎందుకనడూ? రచయితగా మరి?

    అర్థం తెలియక ముందు ఆ మాటను పట్టించుకోలేదు. ఒకరోజు అర్థం కూడా చెప్పాడు. ఇతరులు బాధపడుతుంటే చూడటం నా కిష్టమట. ఇతర్ల బాధల్లో నాకు ఆనందం కలుగుతుందట!

    విన్నావురా  అన్నయ్య? నన్ను ఎంతమాటన్నారో? నన్ను ఎంత నీచంగా చిత్రించారో! కథలు రాస్తారుగదూ!"

    పద్మ చూస్తూ నిల్చుంది. కసిగా అన్నది-

    "ఏమిటా ఉత్తరం పెట్టుకొని ఎంతసేపు కూర్చుంటారు? ఆఫీసుక్కూడా వెళ్ళారా  ఏమిటి? అయ్యో సంబడం! మీ చెల్లెలు అందరిలా...."

    "నువ్వు నోరు మూస్తావా లేదా?" చివ్వున లేచి నిల్చున్నాడు సత్యనారాయణ.

    "నా రాత!" నెత్తి బాదుకుంది పద్మ.

    సత్యనారాయణ ఉత్తరం మీదకు చూపులు మరలిచాడు. చెల్లెలు రాసిన వాక్యాలు చదవసాగాడు.

    "ఆయన ప్రతి నిముషం తనేదో పెద్ద త్యాగంచేసి నన్ను ఉద్ధరించినట్టు ప్రవర్తిస్తూ వుంటారు!

    తాను త్యాగంచేసి నష్టపోయారట. అమ్మా నాన్నా లేని నన్ను కానీ కట్నం తీసుకోకుండా ఉద్దరించారట. స్నేహితుడి చెల్లెలు కదా అని జాలిపడి నన్ను చేసుకున్నాడట!

    ఆయన దృష్టిలో నేను ఒక అల్పమైన ఆడపురుగును!

    అదృష్టహీనురాల్ని!

    అభాగ్యురాల్ని!

    అనాథను!

    డస్టుబిన్ లో పారేసిన నా జీవితానికి ఒక అంతస్తు ఇచ్చాడట. తాను వివాహం చేసుకోకపోతే నాకు పెళ్ళే అయేది కాదట!

    ఆ మాటలు అంటున్నప్పుడు ఆయన కంఠంలో, ముఖంలో, కళ్ళల్లో ఎంత అహంకారం తొంగి చూస్తుందనుకున్నావు?

    ఎంత గర్వమో చెప్పలేను.

    నేనన్నా, నువ్వన్నా ఎంత తేలిక భావమో ఎలా  రాయమంటావు? చాలా హీనంగా చూస్తాడు.

    నా గోడంతా చెప్పడం సుఖంగా వున్న నిన్ను కష్టపెట్టాలని కాదు అన్నయ్యా!

    అవును! వదిన అనుకోవచ్చు! ఆ మాటకొస్తే నువ్వు అనుకోవచ్చు! ఎవరి బాధ వాళ్ళు పడాలిగాని ఎదుటివాళ్ళ మీద రుద్దడం ఎందుకని? నాకూ అలాగే అనిపిస్తుంది.
   
    అందుకే ఇంతకాలం అగ్ని పర్వతం గుండెల్లోనే దాచుకున్నాను.

    నాలో నేనే దహించిపోతూ కూడా ఒక్క విషయం కూడా నీకు చెప్పలేదు.

    ఏవేవో మామూలు విషయాలు అప్పుడప్పుడూ చెబుతూ వచ్చాను.

    ఉత్తరాల్లో కూడా రాశాను.

    నా బాధ ఎవరికి చెప్పుకోను నీకు కాకపోతే? నువ్వే చెప్పు!

    నేను చెప్పేవి నీ మనసుకు నాటేవి కాదు. తేలిగ్గా తీసి పారేసేవాడివి! అవును! నీ తప్పు మాత్రం ఏముందిలే! ఆయన మీద నీకున్న అభిమానం అటువంటిది!

    ఆయన నీ దృష్టిలో ఆదర్శమూర్తి!

    నేనో పిచ్చి మొద్దుని!

    అవునా అన్నయ్యా!

    నాతోపాటు నువ్వు కూడా బాధపడడం ఇష్టంలేక ఎన్నో విషయాలు మనసులోనే దాచుకున్నాను.

    నీ బాధ నా బాధ కాదా అన్నయ్యా?

    నిన్ను బాధపెట్టటం ఇష్టంలేక ఇంతకాలం మౌనంగా  అన్నీ భరించాను. అదీకాక  వదిన నా మాటలు నమ్మదనే భయం!

    ఓర్పు వహించమని నువ్వు ఎన్ని ఉత్తరాల్లోనో రాశావు. జ్ఞాపకం వుందికదూ? ఓర్పుకు కూడా హద్దులు వుంటాయి. చెప్పటం తేలిక. భరించడం కష్టం.

    ఓర్పు !  ఓర్పు !

    ఎంతకాలం ఓర్పు సహించమంటావ్ అన్నయ్యా ఒక వైపు గుండెలు రగిలిపోతూవుంటే?

    కనుచూపుమేరలో ణా కష్టాలకు అవతలిగట్టు కన్పించడం లేదు! మరి ఓర్పు ఎలా వహించమంటావ్?

    నేను నష్టజాతకురాల్ని.

    చిన్నప్పటినుంచి చేదునే జీవితంలో రుచిచూశాను.

    ఇప్పుడు తిరస్కారాన్నీ, చీదరింపును కూడా రుచి చూస్తూన్నాను.

    ఇంత విషాన్ని మింగుతూ నేను ఎంతో కాలం బ్రతకలేను. ఇంత నికృష్టంగా ఇక బతకలేను.

    ఇన్నాళ్ళూ ఆయన శూలాల్లాంటి మాటలతో ణా హృదయాన్ని గాయపర్చారు ఇప్పుడు చేతులతో శరీరాన్నే -ఎందుకులే చెప్పుకుంటే సిగ్గుచేటు!"

    "రాస్కెల్! పశువు!" సత్యనారాయణ పళ్ళుకొరికాడు. పిడికిళ్ళు బిగించాడు.

    వాడు తన చెల్లెల్ని కొడ్తున్నాడా? 

 Previous Page Next Page