"అంతే, మరి?"
"ఇహ పడుకోండి, నాకు నిద్రొస్తోంది" దుప్పటి తీసి ముసుగుతనని పడుకుంది సుధ.
"ఏయ్! ఏయ్!" కప్పుకొన్న దుప్పటిని లాగివేశాడు.
"మీ ఇద్దరికీ పోలికలున్నాయి కదూ?"
"ఓహో! అందుకని అడిగారా?" ఉషారుగా భర్తకేసి తిరిగింది.
"అవును సుధా! అందుకే అడిగాను."
ఆమాట అన్న కృష్ణకు గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది.
తను ఎందుకు అడిగాడు?
జగన్మోహనరావు ప్రియురాలు ఆమె కావచ్చునని!
మోనా తల్లి ఆమేనేమోనని!
అలా అయితే ఎంత బాగుండేది?
"అవునండీ! మా ఇద్దరికీ పోలికలున్నాయని అనేవారు. కాలేజీలో చాలామంది అడిగేవారు విమల మీ అక్కయ్యా అని."
"మీ ఇద్దరికీ బంధుత్వంకూడా లేదుకదా? అంతదగ్గిర పోలికలు ఎలా వచ్చాయో?"
"అదే తమాషా! మనిషిని పోలిన మనిషి ఉంటారంటారు. నిజానికి నిమ్మీ నాకంటే బాగుంటుంది. దాని పోలికలు నాకెక్కడున్నాయో నా కర్ధం కాదు. కాని అందరూ అంటుండేవారు."
"విమల పెళ్ళయిందా?" సాలోచనగా అడిగాడతడు.
"లేదండీ! పెళ్ళయితే హోస్టెస్ గా ఎలా చేస్తుందండీ?"
"అవునవును. మర్చిపోయాను. పెళ్ళయితే హోస్టెస్ ఉద్యోగానికి అర్హత కోల్పోతారుగదూ?"
"అది చాలా అన్యాయం కదండీ!"
"ఏదీ?"
ఎక్కడో చూస్తూ యధాలాపంగా అన్నాడు కృష్ణ.
"అదేనండీ! పెళ్ళయితే ఉద్యోగం చేయడానికి వీల్లేదనే రూలు. ఇది చాలా అన్యాయం. మగవాడికి లేని రూలు ఆడదానికి ఎందుకుండాలో?" కసిగా అంది సుధ.
"ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి ఏ అప్పలమ్మ పడితే ఆ అప్పలమ్మ పనికిరాదు. అందం ఉండాలి. పెళ్ళయి పిల్లల్నికంటె ఆడదాని అందం తరిగిపోతుందని ఆ రూలు పెట్టారనుకుంటాను."
"ఏం రూలండీ బోడిరూలు? పిల్లలని కన్నంతమాత్రాన ఆడదాని అందం తరిగిపోతుందంటారా!"
కృష్ణకు కడుపులో దేవినట్టయింది.
"ఏమిటండీ అలా చూస్తారూ?"
కృష్ణ మాట్లాడలేదు.
"మాట్లాడరేం?"
రెట్టించి అడిగింది సుధ.
"కొంతమంది పిల్లలు పుట్టినా అందంగా వుంటారు. ఉదాహరణకు నీలాంటివాళ్ళు-"
తర్వాత నాలుక మెలికపడినట్టు ఐంది.
ఉండి పడిన గొడ్డులా ఐపోయాడు కృష్ణ.
"మీకెలా తెలిసింది?" ఆమె చెక్కిళ్ళు ఎరుపెక్కాయి.
కృష్ణ మనసు చెదిరిపోయింది.
చూపులు నిలవడంలేదు.
ఎంత ధైర్యంగా చెబుతుంది? అదేదో చీరమార్చు చీర కట్టుకున్నట్టే....
ఎనిమిది నెలలతర్వాత చెబుదురుగాని నా అందం తరిగిందో పెరిగిందో, ఇప్పుడెందుకూ? ఇక పడుకోండి."
"సుధా! ఏమిటి నువ్వనేది?"
భార్యకేసి అయోమయంగా చూశాడు.
"ఏం మగవాళ్ళండీ? ఇంకా అర్ధంకాలేదా!"
మూతి సున్నా చుట్టింది సుధ.
"యూ-మీన్-నువ్వు-"
"ఊఁ అవునండీ! పక్కింటి బామ్మగారు ఖచ్చితంగా చెప్పారు. గుడికి తీసుకెళ్ళి పూజలుకూడా చేయించారు. తొలికాన్పు సుఖంగాజరగాలనీ పండంటి మగబిడ్డ కలగాలనీ మొక్కుకున్నాను. ఆ మాటే ఉదయం మీరు రాగానే చెప్పాలని ఉబలాటపడిపోయాను. కాని మీరు"ఆమె కంఠం పూడిపోయింది.
"సుధా!"
అమాంతం ఆమెను దగ్గిరకు తీసుకున్నాడు.
ఆమె చుట్టు చేతులువేసి ముఖంలో ముఖంపెట్టి, కళ్ళలో కళ్ళు కలిపాడు. అనురాగపూరితమైన ఆమె వెచ్చటి కౌగిలిలో కరిగిపోయాడు. సర్వం మరిచిపోయాడు. అలా యెంతసేపు వున్నాడో అతనికే తెలియదు.
అంతలో ఏదో, ఎక్కడో అంతరాంతరాల్లో అసహ్యంగా కదిలింది.
తెల్లగా, పల్చగా, అతిసూక్ష్మమైన పురుగు ఏదో పాకుతూ మెదడులో ప్రవేశించింది.
ఒక్క సూక్ష్మజీవి రెండు ఐంది. రెండురెళ్ళు నాలుగు, నాలుగు నాలుగులు పదహారు. పదహారు పదహార్లు__గుంపులు గుంపులుగా, గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్నాయి. చెదపురుగులు, తొలిచివేస్తూంటే మనసు తూట్లుపడిపోతూ ఉంది.
ఆమెచుట్టు ఉన్న అతడి చేతులు పట్టుతప్పాయి. ఆమె స్పర్శను భరించలేకుండా ఉన్నాడు. ఒళ్ళంతా మండిపోతూంది.
మనసులో నిప్పులు చెరుగుతున్నట్టుగా వుంది.
హఠాత్తుగా ఆమెను వెనక్కు తోశాడు.
చివాలున మంచం దిగాడు.
"ఏమైందండీ?"
బిగ్గరగా అరిచింది సుధ.
పామో, తేలో వారిమధ్య పారుకాడినట్టే అనిపించింది సుధకు.
గాభరాగా లేచి నిలబడింది.
కంగారుగ భర్తదగ్గిరకు పరిగెత్తుకొచ్చింది.
లైట్ స్విచ్ వేసి భర్తకేసి చూసింది.
"ఏదీ! ఇటు తిరగండీ!" సుధ భర్తచెయ్యి పట్టుకొని అతడి శరీరాన్ని పరీక్షగ చూసింది.
ఏమీ లేదుగదండీ? ఎందుకంత హడావిడి చేశారూ?"
"ఏదో పారుకాడినట్టుంటేనూ__"నసిగాడు కృష్ణ.
"ఎక్కడా?"
కళ్ళు గుండ్రంగా తిప్పింది సుధ.
బుర్రలో-మనసులో-ఇంకేదో అనాలనే అనిపించింది. కాని పెదవులు కదల్లేదు. దవడలు బిగుసుకుపోయాయి.
"ఏమీ లేదండి. ఊరికే మీరు కంగారుపడి నన్ను హడల్ గొట్టారు."
"అంతే! అంతే!" కృష్ణ మాటలు తేలిపోతున్నట్టుగా వున్నాయి.
"సుధా! మంచినీళ్ళు తీసుకురా."
"ఉండండి! తెస్తాను!"
సుధ గదిలోనుంచి బయటికెళ్ళింది.
కృష్ణ తేలిగ్గా గాలిపీల్చుకున్నాడు.
సుధ వాటర్ బాటిలూ, ఖాళీగ్లాసూ తీసుకొచ్చింది.
గ్లాసుడు నీళ్ళు గడగడ తాగాడు.
కొన్ని నీళ్ళు అరచేతిలో పోసుకొని ముఖంమీద చల్లుకున్నాడు.
బెడ్ మీదకు చేరుకున్నాడు.
సుధ వాటర్ బాటిలూ, గ్లాసూ పక్క టేబుల్ మీద పెట్టి స్విచ్ ఆఫ్ చేసి వచ్చింది.
"సుధా!"
"నాకు నిద్ర వస్తోందండీ!"
"ఐదునిముషాలు. జస్ట్ ఫైవ్ మినిట్స్."
"ఊఁ చెప్పండి" పక్కకు తిరిగి భర్తమీదకు వంగి, బెడ్ లైట్ వెలుగులో అతడికేసి చూసింది.
"మా బాస్....అదే మీ అంకుల్ కు-విమల ఒక్కర్తె కూతురన్నావు గదూ?"
"అవును. చెప్పానుగదండీ!"
"పెళ్ళి చేసుకోకుండా ఆమెకు అలాంటి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చిందీ?"
"అంకుల్ కూడా ఆమాటే అంటారు."
"మరెందుకు చేసుకోలేదూ?"
"ఏం? మీరు చేసుకుంటారా?" కొంటెగా అడిగింది.
"ఛ! ఛ! అదికాదు సుధా. ఉద్యోగం చెయ్యాల్సిన అవసరంలేదు. అందముంది. తండ్రి మంచి పొజిషన్ లో వున్నాడు. పైగా ఏకైక సంతానం. హాయిగా పెళ్ళిచేసికొని-"
"అదికాదండి__"సుధ అతని మాటకడ్డు పడింది.