Previous Page Next Page 
మానిని మనసు పేజి 17


    తలుపులు వేశాను.
    అతడు విన్నాడో లేడో తెలియదు.
    వళ్ళంతా విరగ్గొట్టినట్టు ఉంది.
    రెండు గార్డినల్ వేసుకొని మంచినీళ్ళు గ్లాసుడు తాగి పడుకున్నాను.
    తెల్లవారి పనిమనిషి వచ్చి తలుపులు దబదబా బాదేవరకూ మెలుకువ రాలేదు.
    మత్తు మత్తుగా వుంది.
    కళ్ళు తెలిపిడి పడడంలేదు.
    మళ్ళీ తలుపులు బాదిన చప్పుడు.
    విసురుగా వెళ్ళి తలుపులు తీశాను.
    "ఏమిటే నీ పెడబొబ్బలూ నువ్వూనూ?"
    "అమ్మగారూ! మరే..."
    "ఏమిటే నీ గోల?"
    పనిమనిషి గుండెలు బాదుకోసాగింది.
    ఊడిన ముడికూడా వేసుకోలేదు.
    "ఏం జరిగింది?" గాభరాగా అడిగాను.
    "ఎంతపని జరిగిపోయింది అమ్మగారూ?"
    "చెప్పిచావు."
    "గోరం జరిగినాది."
    "అబ్బబ్బ ప్రాణం తియ్యక ఏమి జరిగిందో చెప్పు" విసుక్కున్నాను.
    "అయ్యో ఏం చెప్పను తల్లీ. ఇటొచ్చి చూడండి" పనిమనిషి వెనకే పక్కవాటాకేసి నడిచాను అయోమయంగా.
    అప్పటికే అక్కడ చాలామంది చేరారు.
    వాళ్ళను తోసుకుంటూ ముందుకెళ్ళాను.
    నిలువునా కాలిన శవం వంటగదిలో పడివుంది.
    నా తల గిర్రున తిరిగింది. కళ్ళు బైర్లుకమ్మాయి.
    "అయ్యో! నా బిడ్డా" అంటూ పనిమనిషి నన్ను పట్టుకోవడం నాకు తెలియదు.
    అంతవరకూ చెప్పిన సావిత్రి ఎవరో గొంతు నొక్కేస్తున్నట్టు చూడసాగింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి.
    అనసూయ కంగారుగా లేచి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది. కాఫీ తాగాక సావిత్రి కొంత తేరుకుంది.
    "ఇది జరిగి దాదాపు రెండేళ్ళయిందా?"
    "అవును. అయినా నాకు నిన్న జరిగినట్టే అన్పిస్తూ ఉంటుంది ఏ రోజుకారోజు."
    "ఇక నువ్వెందుకంత బాధపడడం?"
    "నాకే తెలియదు. ఇదంతా కళ్ళముందే జరిగింది చంద్రవదన ముఖాన్ని మరవలేకుండా ఉన్నాను. అంతలోనే నిలువునా కాలిపోయిన శరీరం కన్పిస్తుంది. కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆ రాక్షసుడే వస్తాడు."
    "ఇంతకీ భార్యను అతడే చంపాడంటావా?" సందేహం వెలిబుచ్చిందనసూయ.
    "రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందంటావేమే?"
    "అది కాదే"
    "ఏది కాదు? ఇంత చెప్పినా నీకు నమ్మకంగా లేదా?"
    "అయితే ఆ అమ్మాయి తరపువాళ్ళు అతనిమీద కేసు పెట్టలేదా?"
    "కేసా పాడా. స్టౌ వెలిగిస్తూ పైటకొంగు కాలి చచ్చిపోయిందని చెప్పాడు. అందరూ నమ్మారు. పోలీసులూ నమ్మారు. లంచంకూడా ఇచ్చాడేమో ఎవరికి తెలుసు."
    "అది సరేగాని ఎవడో ఒక దుర్మార్గుడు భార్యను చంపాడని ప్రతి మగవాణ్ణీ అనుమానిస్తే ఎలాగే? పిచ్చి ఆలోచనలు మానుకో. నీకు నచ్చినవాణ్ణి చేసుకో."
    సావిత్రి మాట్లాడలేదు. అసలు ఈ లోకంలో వున్నట్టే లేదు.
    "ఆ రామకృష్ణ ఏమయ్యాడే?"
    "వాడు దొంగ వెధవలే. ఫారెన్ వెళ్ళిపోయాడు చెప్పాపెట్టకుండా."
    "మంచివాళ్ళు ఉంటారే. మా ఆయన్ని చూశాక నీ మనసు మార్చుకుంటావు చూడు."
    సావిత్రి అదోలా నవ్వింది.
    "నా మాటవిని నీకు నచ్చినవాణ్ణి చేసుకో."
    "ఏం నచ్చడమో ఏం పాడో" తనకుతానే చెప్పుకుంటున్నట్టు అన్నది.
    "మా వారిని చూడమంటాను నీకు తగినవాణ్ణి."
    "చాల్లేవే. నేను ఈ ఊరు మొగుణ్ణి వెతుక్కుంటూ వచ్చాననుకున్నావా?"
    "అబ్బే అదికాదే."
    "నేను సైకాలజీలో డాక్టరేట్ చెయ్యాలని వచ్చాను. ఉస్మానియాలో సీటు వచ్చింది."
    "సావిత్రి మావారు ఉస్మానియా అంటే ఏమంటారో తెలుసా?"
    "ఏమంటారూ?" సాగదీసింది సావిత్రి. సావిత్రికి అనసూయ ప్రతిసారీ మావారు, మావారు అంటూంటే వళ్ళు మండిపోతున్నది.
    "హూజ్ మేనియా యూనివర్శిటీ అంటారు" అనసూయ  పకపక నవ్వింది.
    సావిత్రి నవ్వలేదు.

 Previous Page Next Page