Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 17

    ఇద్దరు వ్యక్తులు చలపతిని రెక్క పట్టుకొని లాగి నిల్చోపెట్టారు. చలపతి వూరేగింపులో ముందు వరసలో పిల్లిలా నడుస్తున్నాడు. గుంపులో పడి మంగమ్మ నడుస్తున్నది. ఊరేగింపు పోలేరమ్మ గుడి ముందుకు వచ్చింది.

    ముందు వరసలోవున్న చలపతిని చూసి గంగాభవాని అపరకాళిలా లేచి నిల్చుంది. కళ్ళు ఎర్ర చేసింది. పళ్ళు పటపట కొరికింది.

    పక్కన వున్నవాళ్ళు చలపతి చేతికి నీళ్ళ కడవలు అందిస్తున్నారు. చలపతి పైపంచె నడుముకు బిగించి ఐదు కడవల నీళ్ళు ఆమె నెత్తిన పోశాడు. సాంబ్రాణి పొగవేసి, వేపమండలతో విసిరాడు.

    గంగాభవానిలో ఉధృతం తగ్గింది. గట్టిగ గాలిపీల్చి "ఎవడ్రా నువ్వు?" అన్నది.

    "నేనే! చలపతిని. నీ భర్తను."

    "ఏం కూశావురా? నువ్వు నా భర్తవా?" పళ్ళు కొరికింది గంగాభవాని.

    "కాదులే. గంగాభవాని భర్తను__చలపతిని."

    'అట్టా చెప్పరా. గంగాభవాని నా భక్తురాలు. దాన్ని ఎందుకురా వదిలేశావ్?" గుడ్లు ఉరిమింది.

    "తప్పే! క్షమించు. ఇకనుంచి నా భార్యను ప్రేమగా చూసుకుంటాను. మా ఇంటికి తీసుకెళ్తాను. అన్నాడు చలపతి భయం భయంగా.

    'మాట తప్పావా నాలుక చీరేస్తా!"

    'శాంతించు తల్లీ. మా గొడ్డూ గోదను సల్లగా చూడు. ఇకనుంచి చలపతి నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాడు.' జనంలోనుంచి అనేక కంఠాలు వినిపించాయి.

    'ఏయ్ చలపతీ! మీ అమ్మ - ఆ మంగిముండ ఏదిరా?' బుసలు కొట్టింది గంగాభవాని.

    జనం మంగమ్మను ముందుకు తోశారు.

    మంగమ్మ కోడలి నెత్తిన రెండు కడవల నీళ్ళుపోసి, సాంబ్రాణి పోగావేసి, వేపమండలతో విసిరింది.

    ఓరకంటితో అత్తను ఓసారి చూసి సొమ్మసిల్లి పడిపోయింది గంగాభవాని.

    జనం వెంటరాగా మంగమ్మా, చలపతీ గంగాభవానిని ఇంటికి తీసుకొచ్చారు.

    రెండు రోజులుగా వెటర్నరీ డాక్టర్లు గొడ్లకు చికిత్స ప్రారంభించారు. అంటువ్యాధులు చాలావరకు అప్పటికే తగ్గుముఖం పట్టాయి.

    సంవత్సరం గిర్రున తిరిగింది.

    పండంటి కొడుకును ఎత్తుకుంది గంగాభవాని.

    పండుగరోజు గణాచారి నాంచారమ్మకు ఒడినిండా పిండివంటలు పెట్టి, కొత్త చీర కూడా ఇచ్చింది గంగాభవాని.

    "ఇదేమిటమ్మాయిగోరూ! ఈ గణాచారిముండమీద ఇంత దయ పుట్టుకొచ్చింది?"

    "నిజమే నాన్చారీ! ఇదంతా నీ చలవే!"

    "మధ్య నేనేం చేశాను తల్లి?"

    'అట్టా అనకు."

    "అమ్మాయిగోరూ! మీరు చాలా బాగా....."

    'నువ్వూ అంతేనా?'

    గణాచారి సమాధానం చెప్పకుండా ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.  (ఇండియా టుడే - 1991)

 

 Previous Page Next Page