"ఏంటి బాబూ! అంతగా ఆలోచిస్తున్నారూ?"
నా ఆలోచన దారం పుటుక్కున తెగింది.
"ఆఁ ఏమీలేదు. నీకు పుణ్యం ఉంటుంది. కాసేపు మాట్లాడకుండా కూర్చో!" అన్నాను రహమాన్ తో.
వాడు చిరునవ్వు నవ్వాడు.
వెధవ నవ్వుతున్నాడు.
నేను భయపడటాన్ని గుర్తుచేసుకొని, తన విజయంమీద గర్వంగా నవ్వుతున్నాడు.
"బాబుగారూ వాళ్ళిద్దరూ ఏంచెయ్యాలో తోచక తికమక పడ్తున్నారు!"
"ఎవరూ?" వాడిమాటల్లో పడకూడదనుకొంటూనే యాంత్రికంగా అడిగాను.
"నీలకంఠశాస్త్రీ, ఆనందరావులు బాబూ!"
"వాళ్ళెవరు?"
"ఏప్రిల్ 14 వ తేదీ 'ఈనాడు' చదవలేదా బాబూ!"
"చదివానేమో! కాణీ ఆ పేర్లు గుర్తులేవు. అసలు సంగతి చెప్పు."
"అదే బాబూ! ప్రభుత్వంవారు అంటే విద్యాశాఖవారు వారికి స్పాట్ వాల్యుయేషన్ ఆర్డర్లు పంపించారు."
"అయితే!" వాడేం చెప్పాలనుకొంటున్నాడో అర్థం కాలేదు.
"అందులో ఒకాయన ఐదేళ్ళక్రితం, రెండో ఆయన రెండేళ్ళ క్రితం చనిపోయారు."
నేను అయోమయంగా చూశాను.
"ఆ చెట్టుమీద వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఎంత దిగులుగా ఉన్నారనుకొన్నారు? ఆర్డర్లు వచ్చాయని తెలుసు. సర్దాగా వెళ్ళాలనుకొన్నారు. మధ్యలో ఈ పేపరు వాళ్ళు, తాము చచ్చిపోయినట్టు రాసి ఆ ఛాన్సు కాస్తా చెడగొట్టారని బాధపడుతున్నారు."
రహమాన్ ను లాగి గూబ పగలగొట్టాలనిపించింది.
ఆ న్యూస్ నేనూ చదివాను.
ఇలాంటి న్యూస్ వస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరితోపాటు మరొక చనిపోయిన వ్యక్తికికూడా ఆర్డర్లు పంపినట్టుకూడా చదివాను. విద్యాశాఖ వింతలని ఒక గ్రంథం రాసి డాక్టరేట్ సంపాదించుకోవచ్చు. ఈ వెధవకు వాళ్ళ ఆత్మలు కన్పిస్తున్నాయట!
అవి దిగులుగా ఉన్నాయట!
"రహమాన్!"
"అయ్యా!"
"నీకు తెలుగు చదవడం వచ్చా?"
"వచ్చు బాబూ!"
"తెలుగు నవలలు చదువుతావా?"
"అందరివీ చదవను."
"ఎవరివి చదువుతావ్?"
అతను కొన్ని పేర్లు చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అదీ సంగతి! అందుకే వీడికి మతిపోయింది. హెల్యూసినేషన్స్ ఎక్కువయ్యాయి.
"ఉయ్యాలా జంపాలా చదివారా బాబూ?"
"లేదు."
"మీరు రచయిత అని విన్నాను. మరి మీతోటిరచయితలు రాసేవి చదవకపోతే ఎలా ?"
"చదువుతాను. కాని దయ్యాలూ-భూతాలూ అంటూ మూఢనమ్మకాలను నూరిపోసే ట్రాష్-అదే చెత్త-చదవను." ఖచ్చితంగా అన్నాను.
"ఇంత అనుభవం అయ్యాక కూడా మీకు నమ్మకం కుదర్లేదా బాబూ?" వాడి కంఠం అదోలా పలికింది.
తను ఊహించింది కరక్టే! 'ఉయ్యాల జంపాల' గూడా చదివాడట.
"బాబూ! అందులో హీరోకి ఆత్మలూ, దయ్యాలూ కన్పిస్తాయి. అతనితో మాట్లాడతాయి. మామూలువాడు చూడలేనివి అతను చూస్తాడు. ఏ నక్షత్రంలో పుట్టాడో రచయితకే తెలియదు. కాని నేను ఆ నక్షత్రంలో పుట్టి ఉంటాను బాబు! చిన్నప్పుడు నేను చెప్పేమాటలు విని మా పెద్దోళ్లు బెంబేలెత్తి పోయేవాళ్లు బాబూ! ఎన్ని పుణ్య క్షేత్రాలకో తిప్పారు. తాయెత్తులు కట్టించారు. దాదాపు మహత్తుగల దర్గాలన్నిటి దగ్గరకూ తీసుకెళ్ళారు."
"అయితే ఈ పిచ్చి నీకు ఇప్పుడొచ్చింది కాదన్నమాట? చిన్నప్పట్నుంచీ ఉన్నదే."
"పిచ్చికాదు బాబూ!"
"పిచ్చే! పిచ్చే! మహాపిచ్చి! ఆ పిచ్చి చాలా భయంకరమైంది. అది ఆ ఎక్కిన వాడితోనే ఉండిపోదు. చుట్టూవాళ్లకుగూడా ఎక్కిస్తుంది. ఇలాంటి పిచ్చి వాళ్లకోసం వేరే పిచ్చాసుపత్రులు కట్టించాలి." ఆవేశంగా అరచినట్టే అన్నాను.
రహమాన్ మొహం చిన్నబోయింది.
ఏదో అనబోయాడు.
"రహమాన్ ప్లీజ్! ఇక ఆ విషయాలను గురించి మాట్లాడకు. నేను అలిసిపోయాను. కాసేపు కళ్లుమూసుకుంటాను. డిస్ట్రబ్ చెయ్యకు." ఆజ్ఞాపిస్తూన్నట్లుగా అని బండి తడికకు తల ఆనించి చేరబడి కళ్లుమూసుకొన్నాను.
వెధవ నవ్వుకొంటున్నాడు!
నవ్వు! నవ్వు!
ఇంకెంతసేపులే!
ఊళ్ళోకి పద! నీపనిచెప్తా!
నిజం కక్కిస్తా! మళ్ళీ ఇలా ఎవర్నీ భయపెట్టకుండా పిచ్చాసుపత్రిలో పెట్టిస్తా!
కల్పనకూ వాస్తవానికీ ఉన్న ఆ సున్నితమైన రేఖను కొందరుచెరిపేస్తుంటారు. కల్పనలో ఉన్నవాడు వాస్తవంలోకి రాకపోగా, వాస్తవంలో బతికేవాడు కూడా కల్పనలోకి జారిపోతాడు. రీజనింగ్ పోతుంది. బుద్ధిశక్తి క్షీణిస్తుంది. ఇటువంటి పిచ్చివాళ్ల మాటలవల్లా, రాతలవల్లా కల్పనకూ-వాస్తవానికీ మధ్య ఊగిసలాడే బలహీనులే దెబ్బ తింటారు.