Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 17


    "నిజమా?"


    "నిజమే"


    "అయితే నన్ను తప్పించుకు తిరిగేవారేం?"


    "చుక్కల్లోని చందమామను కావాలనుకోవడం మూర్ఖత్వం అని నాకు తెలుసు?"


    అమూల్య ముఖం విప్పారింది.


    కళ్ళు తళతళ మెరిశాయి.


    "కొన్నింటి సౌందర్యాన్ని చూసి ఆనందిస్తాం. తాజ్ మహల్ ను చూసి ఆనందిస్తాం. అంతేకాని దాన్ని స్వంతం చేసుకోవాలని కోరుకోం."


    "పోలిక బొత్తిగా బాగాలేదు. తాజ్ మహల్ గోరీ."


    "దాని సౌందర్యాన్ని గురించి మాట్లాడుతున్నాను"


    "డాడీతో చెప్పేస్తాను."


    "వద్దు తొందరపడుతున్నావ్. మీ డాడీ అన్నట్టు ఈ వయసుకు ముందుకు దూకడం తప్ప మరో ఆలోచన... ముఖ్యంగా శ్రీమంతుల బిడ్డలకు ఉండదు."


    "ఇక మీ లెక్చర్సు వినదల్చుకోలేదు."


    శ్రీధర్ మాట్లాడలేదు.


    అమూల్య శ్రీధర్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. శ్రీధర్ ఆమె చేతిలో వున్న తన చేతికేసి అదోలా చూశాడు. అమూల్య చటుక్కున చెయ్యి వదిలేసింది.


    "నువ్వు చాలా చెడ్డవాడివి" గోముగా అన్నది.


    "అందుకే అర్థం పర్థం లేని ఆలోచనల్ని మానేయమంటున్నాను.


    ఇక మీరు నాకేసి చెప్పవద్దు. నువ్వు అంగీకరించకపోతే...


    "చచ్చిపోతానంటావ్?"


    "అనడం కాదు... ఆ తర్వాత జీవితమంతా ఒక ఆడపిల్లని చంపేశానని బాధపడతారు."


    "అమూల్యా" శ్రీధర్ అమూల్య చేతిమీద చెయ్యి వేశాడు.


    "ఈ పెళ్ళి జరుగుతుందని చెప్పండి."


    "మీ డాడీతో మాట్లాడతాను."


    "నన్ను చూస్తుంటే మీకేమనిపించేది?"


    "మనిద్దరి మధ్య జన్మజన్మల బంధం ఏదో వున్నట్టు."


    "ఊ ఇంకా?"


    "నా నుంచి అతి ముఖ్యమైన భాగం ఏదో వేరైనట్టు. ఇంతకాలం దాని కోసమే పరితపిస్తున్నట్టు..."


    "ఊ ఇంకా?"


    "నిన్ను చూడగానే నేను ఇంతకాలం పరితపిస్తున్నది నీకోసమే ననీ- నువ్వూ నేనూ వేరుకాదనీ..."


    అమూల్య కళ్ళు పెద్దవి చేసుకొని ఆనందంగా శ్రీధర్ చూస్తున్నది.


    "బాగుందా నా కవిత్వం?"


    "చాలా బాగుంది."


    "ఇంకా వినాలని వుందా?"


    "చెప్పండి వినాలని ఉంది. ఎంతకాలం అయినా మీరు ఇలా మాట్లాడుతూ వుంటే వింటూ వుండాలనిపిస్తోంది."


    "నిన్ను చూడగానే... ఈ అమ్మాయి చాలా అందంగా ఉన్నది అనుకున్నాను"


    "అంతేనా? ఇంకేమీ అనుకోలేదా?"


    "లేదు."


    అమూల్య ముఖం ఎర్రబడింది.


    కళ్ళలో నీరు తిరిగింది.


    "బాధపడుతున్నావా?"


    అమూల్య సమాధానం ఇవ్వలేదు.


    "అందులో బాధపడాల్సిందేమీలేదు. నా అంతస్థు నాకు తెలుసు అందుకే నీకేసి చూడటానికి కూడా భయం వేసేది. ఇక నేనేం చెప్పాల్సింది లేదు. మరోసారి బాగా ఆలోచించుకో. తీరా పెళ్ళి చేసుకున్న తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు."


    "ఇక ఆలోచించాల్సిందేమీ లేదు."


    "శ్రీధర్ అమూల్య చేతి గాజుల్ని వెనక్కు ముందుకూ కదిలిస్తూ ఆలోచిస్తున్నాడు.


    శ్రీధర్ తన అంగీకారాన్ని తెలియజేసినట్టు అర్థం చేసుకుంది అమూల్య. కాకపోతే అతను అంత చనువుగా తనచేతిని పట్టుకోడని తెలుసు.


                                          * * *


    "దానికి బుద్ధి లేదు. చిన్నపిల్ల. మీ తెలివి ఏమైంది. కస్సున లేచింది అమూల్య తల్లి భర్త మీదకు.


    "పెళ్ళి చేసుకొనేది నీ కూతురు. చేతనైతే దాని మనసు మార్చు" అన్నాడు జడ్జి కృష్ణారావు.


    "అది నామాట వింటుందా? ఎన్నో చెప్పాను."


    "అందుకే....."


    "ఏమిటి అందుకే? చిన్నపిల్ల ఏదో అందని ఆ అష్టదరిద్రుడికి కట్టబెడ్తావా? ఏ అఘాయిత్యానికో..."


    "ఈ పెళ్ళి కంటే అదేనయం"


    "ఛ ఏమిటా మాటలు? నువ్వు తల్లివేనా?"


    "ఈ పెళ్ళి బొందిలో ప్రాణం ఉండగా జరగడానికి వీల్లేదు."


    "నీ బెదిరింపులకు అమ్మాయి లొంగదు."


    "అసలు మీరే చేశారు. ముచ్చులా ఇంట్లో చేరి త్రాష్టుడు ఇంతపని చేస్తాడా? పైగా కారిచ్చి వాళ్ళ ఊరు పంపించారు. అమాయకురాల్ని వల్లో వేసుకున్నారు. దీనికంతకు కారణం మీరే. నీ స్నేహితుడి కొడుకని..."

 Previous Page Next Page