Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 17

   
    నువ్వు తిరిగి రావనీ గోవిందరామా,
    కైకమ్మ తలచింది గోవిందా....
    అత్తయ్యా...తలుపు తియ్యి.
    "తన కొడుకు భరతుడికి గోవిందరామా, పట్టం కట్టాలంది గోవిందా..."
    "అత్తయ్యా... అత్తయ్యా..."
    "అబ్బబ్బ...దీని అమ్మకడుపు మాడ. పూజైనా చేసుకోనివ్వదు. రా...తగలడు" తలుపు దభాల్న తీసింది. గౌరి లోపలికెళ్ళబోతుంది. "ఆగు, నువ్వు లోపలికి రాకు. నేనే తీసిస్తాను. ఈ గదిలో అడుగుపెడితే ఇదీ నాశనమవుతుంది" పంచదార డబ్బా కోసం వెతుకుతూ వుంటుంది.
    "ఆహాహా...చెప్పేవి శ్రీరంగనీతులూ, దూరేవి దొమ్మరి కొంపలూనా, అన్నట్లు చదివేది గోవింద నామాలు చేసేవి వెధవ పన్లూ ఎందుకా పూజ" గబగబా పంచదార డబ్బా తీసుకుని పోబోయింది.
    "ఏం కూశావే ముదనష్టపు ముండా, జుట్టు పట్టి లాగి నెత్తిమీద మొట్టికాయలు మొడుతుంది.
    అమ్మో! బాబోయ్! చంపేస్తోంది.
    ఆ కేకలు విని పరుగెత్తుకొచ్చారు గోపీ, రావుగారూ.
    "చూడరా గతిలేని ముండ కదా అని తీసుకొచ్చి ఇంత ముద్ద పెడుతుంటే నన్నే ఎగతాళి చేసి ఎదిరిస్తోంది. గెంటెయ్ ఇంట్లోంచి. ఎక్కడ ఛస్తుందో చూస్తా, ఇల్లిల్లూ తిరిగి బిచ్చమెత్తు కుంటుంది."
    "నీ దగ్గర పడుండడం కన్నా బిచ్చమెత్తుకోవడమే నయం."
    గోవిందూ! ఏమిటే ఈ గొడవంతా. చిన్నపిల్ల దాంతో ఏమిటే నీకు.
    నువ్వూరుకో అన్నయ్యా. అసలు నీ అలుసు చూసుకునే అది నా నెత్తెక్కి కూర్చుంది. అదెవతి అసలు నాయింట్లో వుండడానికి. ఇది నా పుట్టినిల్లు. దాన్ని కూడా తీసుకచ్చి ఇక్కడ ఉంచుకోడానికి ఇదేం ధర్మసత్రం కాదు.
    "మామయ్యా! నువ్వెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను." మామయ్య చెయ్యి పుచ్చుకుని లోపలికి తీసుకెళ్ళి కూర్చోమని వస్తాడు.
    "చూడరా...చూడరా! ఎన్ని మాటలంటోందో! నా ముందు ఇంత వరకూ నోరెత్తలేదు. ఇదొచ్చి నన్నంటుందా దరిద్రపు ముండ"
    "ఏయ్! అస్తమానం ముండా ముండా అంటావే? జాగ్రత్త. ముండ అనడానికి నాకేం పెళ్ళీ కాలేదూ, మొగుడూ పోలేదు..."
    "చూశావట్రా! నన్నెలా ఎత్తిపొడుస్తోందో"
    "అమ్మా నువ్వూరుకో. దానిపని నేచెప్తాను. గౌరీ... అవతలకి వెళ్ళు..వెళ్ళు" అని అరిచాడు.
    "అవతలకే కాదు. ఇంటినుంచే పోతాను."
    "పో!...ఎక్కడికి పోతావో!"
    "ఇంత జరిగాక చచ్చినా ఇక్కడ వుండను. తప్పకుండా పోతాను" రివ్వున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన గదిలోకి.
    "అలా బుద్ధి చెప్పు నాయనా! ఎన్నాళ్ళకి కళ్ళు తెరిచావురా గోపీ. హమ్మయ్య, ఆస్తిపాస్తులన్నీ చూసుకోగలవనే ధైర్యం ఇప్పుడొచ్చింది నాకు. మా నాయనే!" పొంగిపోయింది గోవిందమ్మ.
    "ఆఫ్ట్రాల్ నేను నీ కొడుకునే. నాన్న కొడుకుని కాను."
    "అవున్నాయనా! నాన్న కొడుకైతే సన్యాసిలా వుండేవాడివి"
    "వెళ్ళమ్మా! పూజ చేసుకో"
    గోవిందమ్మ పూజ గదిలోకెళ్ళి తలుపు వేసుకుంటుంది.
    గోపి నెమ్మదిగా గౌరి దగ్గరికెళతాడు. గౌరి సామాన్లు సర్దుకుంటూ వుంటుంది.
    "గౌరీ!" చెవి దగ్గర నోరుంచి పిలిచాడు.
    "ఛీ...పో... నాతో మాట్లాడకు. ఆ తల్లి కొడుకువేగా ఎక్కడికి పోతాయి పోలికలు. నే పోతున్నాను హాయిగా వుండండి. నా బాధలు బాబాయి గురించే" కాళ్ళొత్తుకుంటూ అంది.
    "గౌరీ! ఏడుస్తున్నావా? ఆ సమయంలో ఆ గొడవ నచ్చక అమ్మని సమర్ధిస్తూ నిన్ను కోప్పడ్డాను కానీ, అది నిజం కాదు."
    "ఏమయితేనేం? పోమ్మన్నావుగా? సిగ్గులేక పడుండాలా ఇంకా?
    "నేవెళతానంటే బాబాయి ఒక్కడే బాధపడుతున్నాడు. ఇంకెవరికీ నేనక్కరలేదు" వెక్కి వెక్కి ఏడుస్తూ చెబుతుంది.
    "మామయ్యతో నువ్వెళ్ళిపోతున్నావని చెప్పావా! అరెరే! అరెరే! అదికాదు. గౌరీ నేనెందుకు నిన్ను పొమ్మన్నానో తెలుసా! ఒక పెద్ద ప్లాను వేశాను. దాంతో అమ్మ నోరు మూత పడుతుంది" అని చెవిలో ఏదో చెబుతాడు.
    "అమ్మో! నాకు భయం వేస్తోంది" అంతా విని.
    "ఏం పర్వాలేదు. నేనున్నాగా?"
    "ఉహూ...."

 Previous Page Next Page