Previous Page Next Page 
ఆలింగనం పేజి 17


    అతని ధీమాకీ ఆశ్చర్యంగా చూశాను. సందీప్ నవ్వు బావుంటుంది!

 

    ఔను. ఈ నవ్వుని దగ్గరనుండి చూడడానికి బహుశా ఇతన్నే ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారు అనుకున్నాను.

 

    "మీరు డిఫరెంటుగా వుంటారు"

 

    అది కాంప్లిమెంటో, కామెంతో నాకు తెలీలేదు. జీన్స్, టైటు టీ షర్టులలో వున్న ఆడపిల్లలతో తిరిగే ఇతనికి లంగా ఓణీలు వేసుకునే నేను వింతగా కనిపిస్తున్నానేమో అనిపించి "మేము మొదటనుండి సిటీలో లేము. ఇక్కడ అలవాట్లూ, పద్ధతులు నాకు పెద్దగా తెలీవు!" అన్నాను.

 

    "అందుకే నాకు నచ్చారు" అన్నాడు.

 

    నా వళ్ళు ఆ మాటకి పులకరించింది.

 

    "ఓణీలో ఉన్న మిమ్మల్ని మొదటిరోజే పలకరించలేక ఇన్నాళ్ళు ఆగాను ఎందుకో తెలుసా?" అన్నాడు సందీప్.

 

    నేను చిన్నగా నవ్వి "మోడ్రెన్ గా ఉండే అమ్మాయిలతో మాట్లాడ్డమే ఎక్కువ ఇంట్రెస్టు కాబట్టీ!" అన్నాను.

 

    "యూ ఆర్ రాంగ్" అన్నాడు.

 

    "ఏం!?" ఆశ్చర్యంగా అన్నాను.

 

    "మీ లాంటి అందమైన అమ్మాయిలని పలకరించడానికి బెరుకు! ఇంట్రెస్టులేక కాదు. మీరు సహజమైన పారిజాతంలా ఉన్నారు" అన్నాడు.

 

    "చాలా పొగుడుతున్నారు" అన్నాను.

 

    సందీప్ ఠక్కున నా చేతిని తన చేతిలోకి తీసుకుని "యూ ఆర్ ప్రెట్టీ...వెరీ ప్రెట్టీ" అని చిన్నగా వదిలాడు.

 

    నేను షాక్ తిన్నట్లుగా చూశాను.

 

    "లుక్ ఆముక్త... నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఇలా స్వచ్చంగా అమాయకంగా ఉండే అమ్మాయిలెవరూ అందులోలేరు. నాకు మీరు నచ్చారు. నాతో ఫ్రెండ్ షిప్ చెయ్యకూడదూ!" అన్నాడు.

 

    "అంటే..." అన్నాను.

 

    "అంటే ఇదీ..." నా భుజం చుట్టూ తన చేతిని వేసి నన్ను దగ్గరికి తీసుకుని "వీ ఆర్ క్లోజ్! అనే ఫీలింగ్" అన్నాడు.

 

    నేను సున్నితంగా విడిపించుకుని దూరంగా జరిగాను. అప్పటికే నా బుగ్గల్లో గులాబీలు పూసినట్లు కందిపోయాయి.

 

    "కమ్. అంతా వెళ్ళిపోయారు మనమూ వెళ్దాం" అంటూ లేచాడు సందీప్.

 

    "ఎక్కడికి?" అని అడిగాను. అతను తన చేతిని నావైపు చాపాడు.


                                  *  *  *


    మర్నాడు కాలేజీకి వెళ్ళాక చిత్ర, వైజయంతీ నేను సినిమాకి రానందుకు తిట్టారు.

 

    రఫీకీ వెంకట్ కీ నేను సందీప్ తో వెళ్లడం తెలుసు. అయినా పెదవి విప్పకుండా ఊరుకున్నారు. కొన్నిసార్లు మగాళ్ళే మంచి స్నేహితులు అనిపిస్తారు.

 

    లంచ్ టైంలో క్యాంటిన్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సందీప్ వచ్చాడు.

 

    "ఎక్స్యూజ్ మీ ఫ్రెండ్స్...నేను నాతో ఆముక్తని తీసుకెళ్ళచ్చా?" అని మిగతావాళ్ళని అడిగాడు.

 

    నా అరిచేతుల్లో చెమటలు పట్టాయి. ఏదో తెలియని ఉద్వేగం, ఆనందం కలిసికట్టుగా కలిగాయి.

 

    అందరికంటే ముందుగా ప్రతాప్ తేరుకుని "ష్యూర్...ముక్తా వేళ్ళు" అన్నాడు.

 

    వైజయంతి తెరిచిన నోరు తెరిచినట్టే నిశ్చేష్టురాలై బొమ్మలాచూస్తూ వుండిపోయింది.

 

    చిత్ర నన్ను చూసి 'అర్థమైంది' అన్నట్లు నవ్వింది.

 

    బోయ్ ఫ్రెండ్స్ పక్కన కబుర్లు చెప్తూ నడవడం, సినిమాకి వెళ్ళడం, అతనేం చెప్పినా చెవులు రిక్కించి మరీ శ్రద్ధగా వినడం, తల వెనక్కి వాల్చి కిలకిలా నవ్వడం... ఇవన్నీ శరత్కాల మేఘాల్లాంటి థ్రిల్స్!

 

    సందీప్ నన్ను లైబ్రరీ వెనక్కి తీసుకెళ్ళాడు. అక్కడ చాలామంది ఆడపిల్లలూ, మగపిల్లలూ సందీప్ పేరున్న పాంప్లెట్స్ గోడలమీద అతికిస్తున్నారు.

 

    "షీ ఈజ్ ఆముక్త" అని నన్ను పరిచయం చేశాడు.

 

    ఆడపిల్లలు నావైపు ఈర్ష్యగా చూశారు.

 

    సందీప్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుని మెట్లమీద కూర్చున్నాడు.

 

    "రేపటి తర్వాత కేన్వాస్ చెయ్యకూడదట" అన్నాడు అక్కడున్న వాళ్ళలో ఓ అబ్బాయి.

 

    సందీప్ తన పక్కన నన్ను కూర్చోపెట్టుకున్నాడు.

 

    "ఇంగ్లీషు క్లాస్ వుంది..." నసిగాను.

 

    "ఉష్ ష్..." సందీప్ విసుగ్గా చూశాడు.

 

    ఒక అమ్మాయి మంచి ఉషారుగా వుండే పాట అందుకుంది. దానికి తగినట్లుగా అందరూ క్లాప్స్ కొడుతూ ఆ అమ్మాయిని ఫాలో చేశారు.

 

    సందీప్ నా భుజంచుట్టూ చేయిపోనిచ్చి ఉషారుగా ఊగుతున్నాడు. నాకు అంతా కొత్తగా, సందడిగా వుంది. వీళ్ళు క్లాసులు మిస్సవరా? అనుకున్నాను.

 

    పాట పాడ్తున్న అమ్మాయివచ్చి సందీప్ నోట్లోంచి సిగరెట్ తీసి రెండుసార్లు పీల్చి అతని నోట్లో పెట్టేసింది. అది చూసి నాకు కాస్త చివుక్కుమంది.

 

    సందీప్ చిన్నగా నవ్వుతున్నాడు.

 

    ఓ గంట తర్వాత "నే వెళ్తాను" అన్నాను.

 

    "ఓ.కే...పద అని తనూ లేచాడు.

 

    సందీప్ తో కారు ఎక్కడం లెక్చరర్స్ ఎవరయినా చూస్తారేమోనని తెగకంగారు పడ్డాను. కానీ నేను ఆపాటికే మానసికంగా అతనితో చాలా దూరం వెళ్ళిపోవడం వలన ఇవన్నీ లక్ష్యపెట్టే స్థితిలో లేను.

 

    ఈ రోజు సందీప్ నన్ను దగ్గరికి తీసుకోగానే అలవాటుగా పెదవులు అందించాను.

 Previous Page Next Page