"అప్పటికి మీరు నాకు అంకుల్ కాలేదు. అధికారిమాత్రమే."
అంకుల్ గతుక్కుమన్నాడు.
కృష్ణ డ్యూటీ మైండెడ్ నెస్ కు మనసులోనే అభినందించాడు పైకి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో.
"వెల్ మైబాయ్! బాస్ ఐతేమాత్రం ఏం? నా పెళ్ళిరోజు పైగా నా భార్య పుట్టినరోజు, నెక్ స్ట్ డే వెళతానని చెప్పే ధైర్యంలేదు నీకు?"
"అలా అడగండి అంకుల్."
భర్త ముఖంలోకి చూసి మూతి గుండ్రంగా తిప్పింది సుధ.
"ఓకే మై చిల్ద్రెన్! ఫర్ గెట్ అండ్ ఫర్ గివ్!" ఇద్దరినీ మార్చి మార్చి చూశాడు.
"రేపు మా ఇంట్లో మీ పెళ్ళిరోజు, సుధ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుందాం. నాలుగురోజులు పోస్టు ఫోన్ చేశాం! అంతేగా?"
"అలాకాదు అంకుల్, ఆంటీ, మీరూ ముందు మా ఇంటికి భోజనానికి రండి. తర్వాత మేమొస్తాం అంకుల్" అంది సుధ.
"అవునుసర్!" భార్యను సమర్ధించాడు కృష్ణ.
"టట్! అలాకాదు. పెళ్ళిరోజు భార్యాభర్తలిని విడదీసిన పాపం నాకు చుట్టుకొంటుంది. ముందు మీరే రావాలి. సుధా పుట్టినరోజు, మారేజ్ యానివర్సరీ ఝమ్మని జరగాలి. నాలుగురోజులు ఆలస్యమైతే అయింది. ఓకే చిల్డ్రన్ ఐయామ్ ఆఫ్ బై,"
బాస్ వెనకే కృష్ణ నడిచాడు.
భర్త వెనకే సుధ నడిచింది.
ఇద్దరూ కారుదాకా వెళ్ళి ఆయనను సాగనంపారు.
11
"సుధా!"
"ఊఁ"
సుధ ముభావంగా భర్తకేసి చూసింది.
"ఇంకా కోపం తగ్గలేదు కదూ?"
"కోపమా? ఎవరిమీద?" ఎందుకు?" ముఖం పక్కకు తిప్పుకొంది సుధ.
"నన్ను క్షమించు" మురళీకృష్ణ గొంతు పూడిపోయింది.
సుధా అమాంతం వచ్చి భర్త మీద వాలిపోయింది. గట్టిగా కౌగలించుకొని బావురుమని ఏడ్చింది.
"ఛ! ఛ! ఏమిటిది? ఊరుకో ప్లీజ్ సారీ చెప్పానుగా?"
ఆమె ముఖం పైకెత్తి ముంగురులను వెనక్కు తోస్తూ అన్నాడు.
"మ....మరెందుకలా చేశారు?" చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడుస్తూ అంది.
"సారీ సుధా! మద్రాసునుండి వస్తూనే నా మూడ్ బాగా లేదు మద్రాసులో నేను తీసికొనిన నిర్ణయాన్ని మా బాస్ ఎలా రిసీవ్ చేసుకుంటాడోననే ఆదుర్దాలో వున్నాను. మనసు మనసులో లేదు."
"ఎందుకండీ అంత భయపడ్డారూ? అంకుల్ చాలా మంచివాడు. ఒకవేళ మీవలన పొరపాటు జరిగినా అంకుల్ ఈజీగానే తీసుకొనేవాడు. మీరే అనవసరంగా అంకుల్ గురించి...."
"అప్పటికి నా బాస్ నీ అంకుల్ అని నాకు తెలియదుగా?"
ఆమె చెంపలమీద కన్నీటితడిని తుడిచాడు.
"అంకుల్ స్వభావం చాలా మంచిదండీ!"
సుధ గుండెల్లో గూడుకట్టుకొన్న బాధ కరిగి కన్నీరయి కరిగిపోగా, హాయిగా నవ్వింది.
"అమ్మో! మీ అంకుల్ స్వభావమూ? చౌదరిగారంటే మా డిపార్టుమెంట్ లో అందరికీ హడల్. సాయంకాలం మన ఇంటిలో చూసిన అంకుల్ షణ్ముఖరావు వేరు. ఆఫీస్ లో బాస్-చౌదరీసాబ్ వేరు."
"ఏం కాదు" తల అడ్డంగా తిప్పింది సుధ.
"నిజం సుధా. నువ్వాయన్ని ఆఫీసులో చూడాలి. నాకు ఆయనను చూస్తుంటే పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి వేషంలో వున్న రంగారావు గుర్తుకొస్తాడు. వడ్డూ, పొడుగూ, కళ్ళూ, మాటా, ఆ గడ్డం, అచ్చం అలాగే...."
"పోండీ! మీరు మరీనూ? మనిషి ఆకారంలో అలా వున్నా మనసు వెన్న- ఊరికె కరిగిపోతాడు. మానాన్నగారు ఆయనను ఎప్పుడూ ఎగతాళి పట్టిస్తుండేవారు. వట్టి మేకపోతు గాంభీర్యం అని. అందుకాయన- పోరా! మీ పోలీసోళ్ళలా నాది రాతిగుండె కాదురా! నేను సైంటిస్టును అనేవారు."
సుధ బెడ్ మీదినుంచి దిగి ట్యూబ్ లైటు తీసేసింది. బెడ్ లైట్ ఆన్ చేసి తిరిగి వచ్చింది.
"సుధా?"
సుధ జడముందుకు వేసుకొని విప్పుకోసాగింది.
"సుధా!"
అతనికి మనసులో ఏదో పురుగు తొలుస్తున్నట్టుగా వుంది.
"ఊఁ చెప్పండి."
విప్పిన జుట్టును మళ్ళీ జడ అల్లుకొంటూ అంది.
"మీ నాన్న పోలీసాఫీసారు గదూ?"
సుధ జడను వెనక్కు వేసికొని భర్తకేసి ఆశ్చర్యంగా చూసింది.
"అదేమిటి కొత్తగా అడుగుతున్నారూ?"
"ఐ మీన్ చౌదరిగారూ, మీ నాన్న ఫ్రెండ్స్ కదూ?"
"అవునూ!"
"ఎప్పటినుంచీ?"
"ఫ్రెండ్సే కాదు. వాళ్ళిద్దరూ క్లాస్ మేట్సు కూడా. మేము వైజాగ్ లో ఉన్నప్పుడు అంకుల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా వుండేవారు. నాన్న యస్.పి.గా ఉన్నారు. యస్పీ బంగళాల దగ్గరలోనే అంకుల్ వుండేవారు. దాదాపు మా ఫామిలీస్ కలిసే వుండేవి. వారానికి రెండు రోజులు మా ఇంట్లో డిన్నర్ అయితే మరో రెండురోజులు వాళ్ళింట్లో డిన్నర్ ఆయనాకూ ఒక్కరితే కూతురు" సుధ ఆగి భర్తను చూసింది.
"ఏమండీ వింటున్నారా? లేక నిద్రపోతున్నారా?" అని అడిగింది.
"ఆఁ ఆఁ వింటున్నానోయ్ చెప్పూ?" ఆలోచిస్తున్న మనసును అదుపులోకి తెచ్చుకున్నాడు.
"పొండి! నాకు నిద్రొస్తోంది" ఆవలించి పక్కకు తిరిగి పడుకుంది సుధ.
"సుధా! ప్లీజ్ చెప్పు వింటున్నాగా" అంటూ కృష్ణ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు.
"విమల నాకు ఒక సంవత్సరం సీనియర్."
"విమలా? ఎవరూ?"
"అదేనండీ బాబు! బోర్ కొట్టకండి."
"ప్లీజ్ సుధా? చెప్పు. విమల ఎవరూ!"
"అంకుల్ డాటరండీ."
"యూ మీన్ విమలాచౌదరా?"
అతను అరిచినట్టుగా అన్నాడు.
సుధ అదిరిపడి లేచి కూర్చుంది.
"మీకు తెలుసా?"
నొసలు విరిచి భర్త కేసి చూసింది సుధ.
"ఎయిర్ హోస్టెస్ విమలాచౌదరేనా?"
కృష్ణ గొంతు ఎవరో నొక్కుతున్నట్టుగా అయింది.
కళ్ళు చిట్లించి భర్తకేసి చూసింది సుధ.
"విమల మీకు తెలుసా?"
"తెలుసు."
"ఎలా? ఎప్పట్నుంచీ?"
"ఈరోజు ఉదయంనుంచి. ఇంకా పదహారుగంటలు దాటలేదు."
"మార్నింగ్ ఫ్లయిట్ లో కన్పించిందా?"
నిట్టూర్చి గుండెల నిండుగా గాలి పీల్చుకుంది సుధ.
"అవును. ఉదయం విమానంలో వుంది. మద్రాసునుంచి ఢిల్లీ వెళ్ళే విమానంలో."
"నేను నమ్మను."
ముఖంమీద గుద్దినట్టుగా అంది.
"ఇందులో నమ్మకపోవడానికేముంది?" అయోమయంగా చూశాడు భార్యకేసి.
"సరిగ్గా మీరొచ్చిన విమానంలోనే విమల డ్యూటీలో వుందంటారా? ఒకవేళ వున్నదే అనుకోండి."
"అనుకోవడమేమిటి? ఉంటేను? లేకపోతే ఆమె పేరు నాకెలా తెలిసిందీ?"
"అదే నేనడుగుతున్నాను."
"ఏమిటడుగుతున్నావ్?" చిరాకుపడ్డాడు కృష్ణ.
"అదేనండీ! దాని పేరు మీకెలా తెలిసిందీ అని!"
"అడిగాను."
"చెప్పింది."
"అవును."
"అంతేనా?"