ఆ తరువాత వివేక్ తో-
"వివేక్! మీ ఆవిడది చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం సుమా!" అన్నాడు.
వివేక్ కనుబొమలెగరేసి
"వ్యక్తిత్వమా?" అని నవ్వాడు.
నాకు ఎదురుగుండా టేబుల్ మీదున్న రూళ్ళ కర్రతో వివేక్ తలమీద బాదాలనిపించింది. డాక్టర్ పరశురాం అన్న నేమ్ ప్లేట్ వైపు చూశాను. డాక్టర్ గారి మీద గౌరవం పెరిగిపోయింది.
"నేను ఆఫర్ చేసిన కాఫీ, టీ కాకుండా మూడోది అడగడంలోనే ఆవిడ ప్రత్యేకత తెలిసిపోతోంది" అన్నాడు డాక్టర్ పరశురాం.
నేను వివేక్ వైపు గర్వంగా చూశాను.
"ఆవిడకి ఏం కావాలో ఆవిడకే తెలియదులెండి" పేపర్ వెయిట్ ని తిప్పుతూ అన్నాడు వివేక్.
అదే...అదే నాకు ఒళ్ళుమండేది కోత్తమనిషి ముందుకూడా నన్ను తీసిపారీసి మాట్లాడడం!
ఇంతలోకి కాఫీలోచ్చాయి, తీసుకున్నాం.
ఆయన- "ఏమ్మా! పెళ్ళయినప్పటి నుండీ ఈయన్ని ఎప్పుడూ అది తెండీ...అని సాధించలేదా" అని అడిగాడు.
నేను , తల అడ్డంగా ఊపాను.
"పోనీ ! నీ ఇష్టాలేమిటో అతనికి తెలిసేట్లు ప్రవర్తించావా?" మళ్ళీ అడిగాడు.
నేను వివేక్ వైపు తీక్షణంగా చూశాను.
వివేక్ వెంటనే "నా అయిష్టాలన్నీ తన ఇష్టాలుగా మార్చేసుకుంటుందిలెండి" అన్నాడు.
నేను ఊరుకోలేదు. "నా ఇష్టాలన్నీ ఆయనే తన అయిష్టాలుగా మార్చుకుంటారు" అన్నాను.
వివేక్ నా వైపు చూస్తూ- "నేను దీనికి ఒప్పుకోను నాకు చిన్నపటినుండీ వంకాయ అంటే పడదు. పనసపండు వాసన నచ్చదు. ఇవన్నీ నువ్వు వచ్చాక వచ్చిన మార్పులు కావు!" అన్నాడు.
నేనూ తగ్గకుండా-
"అలాగే నాకూ చిన్నప్పటి నుండీ అవంటే ఇష్టం అని ఎందుకు అనుకోరూ!" అన్నాను.
"ఇవన్నీ చాలా చిన్నవిషయాలు! తన ఇష్టాలు తనవీ, నా ఇష్టాలు నావీ, ఈ సంగతి పెళ్ళికి ముందే స్పష్టంగా చెప్పాను" అన్నాడు వివేక్.
తన ఇష్టాల్లా నా ఇష్టాలు పొగడంలేదు!" కన్నీళ్ళతో అన్నాను. ఒక కొత్తవ్యక్తి ముందు మేము ఇలా బయట పడిపోవడమే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తోంది.
ముసలాయన కలగాజేసుకుంటూ-" సరే...ఇద్దరికీ సంబంధించిన విషయాల మాటేమిటీ? మీ ఇద్దరికీ పిల్లలంటే ఇష్టమేనా?" అని వివేక్ వైపు చూశాడు.
వివేక్ తల ఎగరేసి-" ఇష్టమే...ఇన్నాళ్ళూ, ఎందుకోసం ఆగాలనుకున్నాను. ఇప్పుడు మాత్రం కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్ధితి!" అన్నాను.
ఆయన వివేక్ తో "వివేక్! క్రింద గార్డెన్ లో రక రకాల రోజెస్ వున్నాయి. వెళ్ళి నీకు ఇష్టమైనది కోసుకొచ్చి అమ్మాయికీవ్వు" అన్నాడు.
నేను ఒంటరిగా ఆయనముందు మిగిలాను.
వివేక్ అక్కడినుండి పంపించడానికే ఆయన అలా అన్నాడని నాకు తెలిసింది.
డాక్టర్ పరశురాం బాగా ముందుకి వంగి, "అనూహ్యా , ప్పుడు చెప్పండి. డాక్టర్ వివేక్ తో మీ దాంపత్యం ఎలా వుందీ?" అన్నాడు.
అలా మా పెళ్ళయ్యాక మొదటిసారిగా ఓ మనిషి ఆప్యాయంగా అడగడంతో నాకు చాలా ఏడుపొచ్చేసింది. నేను నిజంగానే కష్టాల ఊబిలో చిక్కుకున్నా నన్న భావన కలిగింది.
"చూశారుగా! అతనికి నాకో వ్యక్తిత్వం వుందనే నమ్మకం లేదు. నాకు కొన్ని ఇష్టాలూ, అభిరుచులూ వుంటాయనే అతనికి తెలీదు" అన్నాను.
"అదిసరే... ఆ విషయంలో ఎలా వుంటాడూ?" ఆయన గొంతు బాగా తగ్గించి అడిగాడు.
"ఏ విషయం?" నాకు నిజంగానే అర్ధంకాలేదు ఆయన భావం ఏమిటో.
"అదే... బెడ్ లో ఎలా ప్రవర్తిస్తాడూ?" కళ్ళద్దాలు ముక్కుమీదకి జారిపోతుండగా అడిగాడు.
నాకు కోపం వచ్చింది. 'ఓరి వీడి దుంపతెగా! కన్నతల్లితో కూడా చెప్పుకోలేని విషయాల గురించి అడుగుతాడేమిటీ?' అనుకున్నాను.
"నీతో బాగా సంతృప్తి చెందుతాడా? అప్పుడేం మాట్లాడ్తాడు" అన్నాడు.
'మీ ఆవిడ్ని పిలవండీ! ఇదే ప్రశ్న మీ గురించి అడుగుదామనుందీ' అనాలానుకున్నా అనలేకపోయాను. అసలు ఈ పరిస్ధితి కల్పించిన వివేక్ మీద పడి పీక నులిమెయ్యాలన్నంత కసి కలిగింది.
"వివేక్ కి ఆ విషయంలో ఏదైనా అసంతృప్తి వున్నట్లు మీకనిపించిందా? లేక మీకు అతనితో ఏదైనా అసంతృప్తి... అయినా ఈ యంగ్ ఫెలోస్ అలాగే వుంటార్లే! సహసం , శాంతం లేక భార్యల్ని తప్పుపడ్తారు" అని నవ్వాడు.
నాకు ముళ్ళమీద కూర్చున్నట్లుంది. వివేక్ వస్తే బావుండ్ను అని తలుపువైపు చూశాను.
"నా దగ్గర అలా బిగిసిపోనఖ్ఖర్లేదు! కాస్త ఫ్రీగా ఫీలవవచ్చు" అన్నాడు.
'నేను ఈ విషయంలో ఇంతవరకూ నా భర్తతోనే ఫ్రీగా మాట్లాడలేదు అటువంటిది నీతో ఎందుకు మాట్లాడ్తానూ!' అనుకున్నాను.
ఆయన ఓసారి తల సవరించుకుని, కళ్ళద్దాల్లోంచి అదోరకంగా చూస్తూ- "ఇప్పటి కుర్రాళ్ళకి నిరసం తెలీదు. అంతా తొందరే... అక్కడకూడా రూడ్ గా వుంటారు. అసలు నన్ను అడిగితే ఎప్పుడూ యాబై ఏళ్ళు పై బడ్డవాడ్నే చూసుకోవాలి" అన్నాడు.
నాకు ఏం అనాలో అర్ధంగాక ఆయనవంక వింతగా చూస్తూ వుండిపోయాను.
ఆయన కాస్త సిగ్గుగా తల వంచుకుని-" నా వయసు యాబై ఆరు" అన్నాడు.
నాకు మొట్టమొదటిసారిగా ఆయన మానసికస్ధితి మీద అనుమానం వచ్చింది. గోడలకున్న పెయింటింగ్స్, ఆయన ఆహార్యం, మాటలూ, చేతలూ అన్నీ ఆయన మానసిక అస్తవ్యస్తతని పట్టించేస్తున్నట్లుగా అనిపించాయి!
"ఐ లైక్ యూ... ఆ కట్టూ బొట్టూ, ఒద్దికా అన్నీ నాకు విపరీతంగా నచ్చాయి" అన్నాడు.
నేను కాస్త కంగారుపడ్డాను.
"మీలోని ప్రత్యేకతలని వివేక్ లోపాలనుకుంటున్నాడు. మనం నచ్చనివాళ్ళని వదిలేసి, మనని వచ్చుకున్న వాళ్ళతో వుండడమే జీవితంఅంటే!" అన్నాడు.
నేను విసురుగా లేచి-
"థాంక్స్ ఫర్ యువర్ ఆఫర్ అన్నాను.
ఆయన కంగారుగా-" అది కాదు ...నే చెప్పేదేమిటంటే...ఒక్క నిమిషం కూర్చోమ్మా!" అన్నాడు.
నేను కూర్చోలేదు తలుపు తోసుకుని బయటికి వచ్చేశాను.
అక్కడ వివేక్ సిగరెట్ కాలుస్తూ నిలబడివున్నాడు. అతని చేతిలో తెల్లగులాబీ! తెలుపు శాంతికి చిహ్నం! కానీ నా మనసు చాలా అశాంతిగా వుంది.