6 వవారం సీరియల్
'నాకు పిచ్చెక్కిందా?' ఈ ప్రశ్న నా మనసుని దొలిచేస్తోంది. అతని నిర్లక్ష్యం, తిరుగుళ్ళూ, దురుసుగా వాడే మాటలూ ఎలా భరించాలి? ప్రతివిషయంలో నన్నే తప్పు పడ్తుంటాడు. చివరికి బెడ్ మీద కూడా... అతని మాటలు గుర్తుకువస్తేనే అభిమానంతో దుఃఖం వస్తుంది. పెళ్ళయిన ఈ ఏడాది కాలంలో మా మధ్య జరిగిన మధురమైన ఘట్టాల కన్నా బాధాకరమైన సంగతులే ఎక్కువ!
భార్యని సిగరెట్టుతో కాల్చడం, శీలాన్ని అనుమానించి అవమానించడం, అవసరాలు తీర్చకపోవడం, ఇంట్లోనే బందీని చేసి స్వేచ్చని హరించడం, రెండో సెటప్ పెట్టి సంపాదించినదంతా వాళ్ళకే పెట్టడం... ఇవన్నీ కష్టాలుగా లోకం ఒప్పుకుంటుంది.
కానీ ఓ ఆడపిల్లకి వివాహత్పూర్వం కొన్ని కలలుంటాయనీ, ఓ అభిమానం అనేది వుంటుందనీ ఆ 'ఈగొని' కొట్టకూడదనీ ఎదురుతిరిగి భర్తనుంచి విడిపోవడమో లేక పిరికిగా ఆత్మహత్య చేసుకోవడమో చేస్తుందనీ ఎంతమందికి తెలుసు?
విన్నా అర్ధం చేసుకోకుండా...'ఓ! ఇవన్నీ కష్టాలా? తిన్నది అరగక చేసే విపరీత చేష్టలు' అని కొట్టిపారేస్తారు. కానీ అనుభవించేవాళ్లకి తెలుస్తుంది ఆ బాధ!
నాకూ ఓ డిగ్రీ వుందని కూడా మరిచిపోయాను. 'నీకేం తెలీదు' అంటే నిజమనుకుంటున్నాను. నా సంగీతం, సాహిత్యం ఏనాడో అతకెక్కేశాయి .
పెళ్ళైన కొత్తల్లో గోరింటాకు పెట్టుకున్న చేతుల్తో అన్నం వడ్డిస్తూవుంటే విసుగ్గా మొహం చిట్లించి-' నాకు ఆ వాసన పడదు' అన్నాడు. అంతే! మళ్ళీ నా అరచేతుల్లో నాకు ఇష్టమైన గోరింటాకు పండలేదు.
అతనికి ఏమాత్రం ఇష్టంలేని మొగలిపూలనీ, వంకాయకూరనీ, నచ్చనీ వంగపండు రంగునీ, పాత సినిమాలనీ, వారపత్రికలనీ, తలత్ మహమూద్ పాటనీ ఇలా అన్నింటినీ వదిలేసుకున్నాను.
ఆ!! అతను వదులుకోమనలేదు పాపం. నేనే వదిలేసుకున్నాను. నాకు ఇష్టమైన వాటిని అతను విమర్శించడం విని సహించలేక. మనకు అత్యంత ప్రియమైన విషయం గురించి ఎదుటివారు మొహం చిట్లిస్తే వుండే బాధ.... వన్ కెనాట్ డి ఫైన్! ఔను...నాకు పిచ్చెక్కుతోంది!
ఓ మనిషిని మనిషిలా కాకుండా మరబోమ్మాలా చూస్తూ, ఆ మనిషి భావాల్ని, స్పందనల్నీ, నిర్లక్ష్యం చేస్తుంటే పిచ్చేక్కదూ మరి! ఇంకా కొన్నాళ్ళు పోతే...
నో! అలా జరగకముందే నేనీ సాలెగూడులాంటి సంసారం నుండి తప్పించుకోవాలి! లోకులకేం... నానా రకాలుగా అంటారు. అన్నీ అమర్చివున్న కాపురం వదులుకోవడానికి తీపరమా? అంటారు. అవనీగాక వాళ్ళకి నా బాధ వర్ణించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పెళ్ళయిన సంవత్సర కాలంలో ఎంత మథనపడితే ఓ స్త్రీ 'విమెన్ ప్రొటెక్షన్ సెల్' వరకూ వెళ్తుంది?
నేనేం చెయ్యలేననేగా ఒక్కసారిగా ఇల్లు అదిరిపోయే బీట్స్ రికార్డ్ ప్లేయర్ లోంచి వినిపించసాగాయి. వివేక్ వచ్చినట్లున్నాడు!
హూ! నాకీష్టమైన హీందుస్దానీ సంగీతం సన్నగా పెట్టుకున్నా విసుక్కుంటాడు. నేను ఉక్రోషంగా బెడ్ మీద నుండి లేచి హాల్లోకి వెళ్ళాను.
వివేక్ సోఫాలో కూర్చుని షూస్ విప్పుతున్నాడు.
"మనం విడిపోదాం...కలిసి వుండలేము "అన్నాను.
అతను తల కూడా ఎత్తలేదు.
నా గొంతు నాకే వినిపించలెదు!
స్టీరియో మోతలో కలిసిపోయింది.
నేను గొంతు ఇంకొంచెం పెంచి-"మిమ్మల్నే! నాకు విడాకులు కావాలి" అన్నాను.
అతను నా వైపు చూసి కళ్లు చిట్లించాడు. ఆ తర్వాత లేచి మ్యూజిక్ ఆఫ్ చేసి - "ఏం కావాలో... డబ్బు తీసుకెళ్లి కొనుక్కో...అన్నీ నాకు చెప్తే ఎలా? అసలే టైమ్ లేక చస్తున్నాను. ముందు అన్నం వడ్డించు... ఎమర్జెన్సీ కేసులున్నాయి" అంటూ బట్టలు మార్చుకోవడానికి రూమ్ లోకి వెళ్ళాడు.
నా మాటలు అతను ఎప్పటి మాదిరిగానే వినిపించుకోలేదు. నేను పెదవి మునిపంటబిగపట్టి అలాగే చూస్తుండిపోయాను.
* * *
అతనికి భోజనం వడ్డించి, అతని రియాక్షన్ కోసం ఆత్రుతగా చూడసాగాను. "ఏవిటిది? వంకాయకూరా?" అంటూ ఆశ్చర్యంగా అడిగాడు.
"ఔను! ఇందాకే మార్కెట్టునుంచి నాలుగు కిలోలు తెచ్చాను. రాత్రికి వేపుడు చేస్తాను. మిగిలినవి ఒరుగులు చేసి దాచి రోజూవేయిస్తుంటాను..." అక్కనుగా ఇంకా ఏదో అనబోయాను. అతన్ని రెచ్చగోట్టడమే నా ప్రధాన కర్తవ్యంగా తోచింది. అప్పుడు కానీ నాతో మాట్లాడడు. నే చెప్పేది వినిపించుకోడు!
వివేక్ కూర తీసి పక్కన పెట్టి, పెరుగు వడ్డించుకుంటూ- "సాయంత్రం మనం ఓ చోటికి వెళ్లాలి. రెడీగా వుండు" అన్నాడు.
నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఇదెక్కడి మొగుడూ! పడకమీద కొట్టినా, కడుపుమీద కొట్టినా ఉలకడూ... పలకడూ! 'వంకాయ నేను తిననని తెలీదా? ఎందుకు చేశావు?' అని తిట్టచ్చుగా! ఉహూ...అనడు ఇంట్లో కడుపు నింపకపోతే హోటళ్లున్నాయి. ఇంకోటి సరిగ్గా లేకపోతే...ఛ! వాటికీ ప్రత్యామ్నాయాలున్నాయి. అందుకే అంత పొగరు.
'సాయంత్రం మనం ఎక్కడికి తీసుకెళ్తాడబ్బా?' అనిపించినా మళ్ళీ అంతలోనే, "ఏముందీ...ఏదో పంక్షన్ లో భార్యని ఎగ్జిబిట్ చేసుకోవడానికి అయ్యుంటుందిలే' మనసులో అనుకున్నాను.
ఫోన్ మ్రోగింది.
అతనే తీశాడు "ఆఁ...బయల్దేరుతున్నాను. టెన్ మినిట్స్ లో వుంటాను" అని హడావుడిగా బయటికి నడిచాడు తన్మయి దగ్గర్నుంచేనేమో!
'అనూహ్యా వెళ్ళొస్తా' అనలేదు.
ఎందుకు చెప్తాడూ?
పెళ్ళయిన ఏడాదికే పెళ్లాన్ని పాతసామన్ల జాబితాలోకి చేర్చేశాడుకదా మరి!
కొత్తబండిని కొనుకున్నప్పుడు తళతళలాడేట్లు వుంచుకుని, చూసి మురుసిపోతుంటారు
తరువాత తరువాత అది దుమ్ము కొట్టుకుపోయి వుంటే చిరాగ్గా చూస్తారు. అంతేకానీ, మెయిన్ టెనెన్స్ వాళ్ళ చేతుల్లో పనే అని తెలుసుకోరు!
* * *
ఆ రోజు సాయంత్రం...
నన్ను అక్కడికి ఎందుకు తీసుకుకోచ్చాడో నాకు అర్ధంకాలేదు. మమ్మల్ని చూడగానే నవ్వుతూ ఆహ్వానించాడు ఆ ముసలాయన.
ఆ తరువాత తన భార్య గుండెజబ్బు గురించి వివేక్ తో మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఆ గదినీ, గదిలో అలంకరణనీ పరీక్షిస్తూ కూర్చున్నాను.
చిన్నపాప కళ్ళజోడు పెట్టుకుని, పెద్దపెద్ద చెప్పు లేసుకుంటున్న బొమ్మ గోడకి ఓ వైపున వుంది. ఓ అమ్మాయీ, ఓ అబ్బాయీ సెమీ నేక్ డ్ గా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ఇంకోవైపున వుంది!
ఆయన వెనకాల వైపున వున్న గోడకి ఒళ్ళంతా ముడతలు పడిపోయిన ఓ వృద్దురాలి పెయింటింగ్ వుంది! వాళ్ళమాటలు సరిగ్గా వినపడకుండా 'జల... జల...' మని చప్పుడు చిన్నవాటర్ పౌంటెన్ ఒకటి గదిలో ఓ మూలకి వుంది.
నేను ఆయన టెస్ట్ ని అంచనా వేస్తుండగా ఆయన నా వైపు చూస్తూ- "ఏం తీసుకుంటారూ? కాఫీనా టీనా?" అని అడిగాడు.
"మంచినీళ్ళు" అన్నాను.
ఆయన పెద్దగా నవ్వాడు. బట్టతలతో, ఎర్రని టీ షర్ట్ వేసుకుని, తెల్లగా , బొద్దుగా, గుండ్రంగా ఆయన చాలా తమాషాగా వున్నాడు.