"పదండి పోదాం" అన్నాను.
"డాక్టర్ గారికి చెప్పి వస్తాను" అతను లోపలికి వెళ్ళాడు.
ఆ డాక్టర్ నాతో మాట్లాడిన మాటలు వివేక్ తో చెప్తెనో అని తలెత్తి చూశాను. అప్పుడు కనబడింది నాకు రూమ్ తలుపు మీద 'డాక్టర్ పరశురాం, ఎమ్.డి. సైకియాట్రీ' అనే బోర్డు.
నేను నిలబడ్డ నెల భూమిలోకి కృంగిపోతోంది అనిపించింది. అయా నిమిషంలోనే గట్టిగా నిశ్చయించుకున్నాను ఇతనితో విడిపోక తప్పదని!
ఎవరి భార్తలైనా వాళ్ళని సరదాగా పిచ్చి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి పరీక్ష చేయిస్తే వాళ్ళకి అర్ధమౌతుంది, నేను ఈ నిర్ణయం అంత హఠాత్తుగా ఎందుకు తీసుకోవలసి వచ్చిందో!
* * *
రాత్రి బెడ్ మీద పడుకొని పుస్తకం చదువుకుంటున్న అతన్ని చూడగానే, ఉక్రోషం ఆపుకోలేకపోయాను.
"ఇంక మీతో కలిసివుండటంలో అర్ధంలేదు, విడిపోదాం" అని పెద్దగా అరిచాను.
"ప్రొద్దుట చూద్దాంలే!" అతను ఆవలిస్తూ అని లైట్ ఆఫ్ చేసేయ్యబోయాడు.
నేను సివంగిలా వెళ్ళి అతని చెయ్యిపట్టుకుని- "ఏవిటి ప్రొద్దుట చూసేది? నాకు పిచ్చేక్కిందని డాక్టర్ చేత పరీక్ష చేయిస్తారా? ఇంత జరిగాక కూడా నేనింకా మీతో కలిసుండాలా?" అన్నాను.
అతను ఒక్క విదిలింపుతో తన చెయ్యి వదిలించుకుంటూ "తిన్నది అరక్క స్త్రీ సంక్షేమ శాఖకి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చేదాన్నీ, ఇద్దరు మనుషులకోసం నాలుగు కిలోల వంకాయలు కొన్ని ప్రోద్దుటా, రాత్రీ అదే చేసే దాన్నీ, హక్కులు గురించి మాట్లాడటం తప్ప చెయ్యాల్సిన విధులు తెలియని దాన్నీ, పిచ్చిడాక్టర్ కి చూపించడం కాదు... అసలు బయటికి రాకుండా పిచ్చాసుపత్రిలో వేయించెయ్యాలి!" అన్నాడు.
అంటే...పులకేశి చెప్పిందన్న మాట! అందుకని నాకు పిచ్చి అనుకుంటున్నాడా? తన తప్పేం లేదని నిజంగా నమ్ముతున్నాడా?
అతను సన్నగా గురకపెడుతున్నాడు.
ఎంతనిశ్చింతగా నిద్రపోతున్నాడూ? అంటే విడిపోవడం అతనికి ఇష్టమనేగా? కేళ అనడం తప్ప నేను నిజంగా చెయ్యలేననా? లేదు... వెంటనే విడాకులు తీసేసుకోవాలి, తప్పదు.
విడాకులు అనుకోగానే విజయ గుర్తొచ్చింది. అమ్మా, అమ్మమ్మలతో ఈ విషయాలు మాట్లాడలేను. విజయ నా ఆప్తమిత్రురాలు. పైగా లాయర్. రేపే దానికి ఫోన్ చెయ్యాలి అనుకున్నాను.
ప్రొద్దుట విజయకి ఫోన్ చేసి-
"నీతో అర్జెంట్ గా మాట్లాడాలి వైజాగ్ వస్తున్నాను" అన్నాను.
"వద్దు" అంది వెంటనే.
"ఏం?"
"నేనే సాయంత్రం బయల్దేరి హైదరాబాద్ వస్తున్నాను. ఇంక కొన్నాళ్ళు అక్కడే వుంటాను బై ది బై రేపు శీఖా వాళ్లింట్లో పార్టీకి వస్తావుగా!" అంది.
"ఏమో... వస్తానో రానో" అన్నాను.
"రా" అంది విజయ.
"సరే..." అని పెట్టేశాను.
నామీద నాకే పెద్ద నియంత్రణ లేకుండా పోతోంది ప్రతివాళ్ళూ ఆర్డర్ చేసేవాళ్ళూ విజయ హైద్రాబాద్ రావడం అన్న విషయం మనసుకి ఊరటనిచ్చింది.
* * *
విజయ నా దగ్గర దిగలేదు. ఫోన్ చేసి పార్టిలో కలుద్దామంది. దానితో అంతా హడావుడె!
సాయంత్రం నాకు ఇష్టమైన వంగపండు రంగు బెనారస్ సిల్క్ చీర కట్టుకున్నాను. అద్దంలో చూసుకుంటే ఎందుకో కళ్ళల్లో జీవం లేనట్లుగా అనిపించాయి. కళ్ళక్రింద నల్లని చారలు... ఎంతో అనుభవించేసి నిర్లప్తత చెందనదాన్లా వున్నాను.
బీరువాలోంచి షాల్ తీసుకుంటూ అనుకున్నాను. 'శీతాకాలం త్వరగా చీకటిపడిపోతుందని' నాకు చీకటంటే చిన్నప్పటినుండీ భయం!
బయటికి వచ్చి ప్లాట్ లాక్ చేస్తుంటే ఉషాబాలా, సుధాకర్ లు ఒకళ్ళని ఒకళ్ళు హత్తుకుని, పైకి వెళ్తూ కనిపించారు. వాళ్ళూ నన్ను పట్టించుకోలేదు. వాళ్ళు సామాన్యంగా ఎవర్నీ పట్టించుకోరు వాళ్ళ లోకం వాళ్ళదే! సుధాకర్ మెడికల్ రిప్రజెంటేటివ్. వారానికి నాలుగురోజులు ఊళ్ళో వుండడు.
ఊళ్ళోవుంటే తలుపులు తీయకుండా హత్తుకుని వుంటారని, పనిమనిషి చెప్పిందని మామీ, పక్కింటి సుమతీ చెవులు కొరుక్కుంటూవుంటారు. 'అదృష్టవంతులు అసలు పోట్లాడుకునే టైమే వుండదు' అని నిట్టూర్చాను.
నేను మెట్లు దిగుతూ 'చీకటిపడకుండా వచ్చెయ్యాలి' అనుకున్నాను నా జీవితంలో నేను అమితంగా భయపడే పరిస్ధితి ఆ రాత్రి రాబోతోందని నాకా నిమిషం తెలీదుగా!
* * *
శీఖా అమెరికా వెళ్ళిపోతున్న సందర్భంగా ఇస్తున్న పార్టీ అది. శీఖా మాకు కాలేజిలో క్లాస్ మెట్.
నేను ఆటో దిగి, గేట్లోకి ఎంటర్ అవగానే వాళ్ళ చెల్లెలు ఎదురొచ్చి- "రండి ఆంటీ" అని ఆహ్వానించింది. నాకు ఆ పిలుపు అలవాటే!
శీఖా నన్ను చూడగానే చాలా సంతోషించింది. "వివేక్ హాస్పిటల్ నుండి డైరెక్టుగా వస్తానన్నారు" అంది.
నేను తెలుసు అన్నట్లుగా నవ్వాను.
మేము కాలేజి సంగతులు మాట్లాడ్తూ వుండగానే విజయ వచ్చింది.
మెడ క్రిందవరకూ జుట్టు పెంచి 'యూ' షేప్ లో కట్ చేయించి, ఆకుపచ్చ సల్వార్ కామీజ్ లో సన్నజాజి రెమ్మాలా వుంది! చివరికి స్కూల్ పిల్లాడు కూడా దాన్ని 'ఆంటి' అనే దైర్యం చెయ్యడు అదీ నా ఈడుదే !
విజయ సుడిగాలిలా వస్తూనే అందర్నీ పలకరించింది. ఓ పాతికమంది దానిచుట్టూ చేరారు. అసి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిపోయింది.
మేము కాలేజిలో వున్నప్పుడు అందరూ నా చుట్టూ తిరుగుతూ, నాకన్నా ఛాయ తక్కువగా వుండి, పీలగా కనిపించే విజయని ఎవరూ పట్టించుకునేవారే కాదు! అంతా కాలమహిమ.
విజయ నా దగ్గరకి వచ్చి నా బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకుని-" హౌ ఆర్ యూ మై ఏంజిల్?" అంది.
"నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి త్వరగా ఇక్కడ్నుంచి పోదాం" అన్నాను.
విజయ ఎవరికో చెయ్యి ఊపి పలకరిస్తూ -" ఈ రోజు కాదు రేపు ఉదయం మీ ఇంటికోస్తాను . ఔనూ...వివేక్ ఏడి?" అంది.
నేను నిట్టూర్చాను.
"అరె... మాటల్లోనే వచ్చేశాడు. హండ్రెడ్ ఇయర్స్ " అంది.
నేను విస్మయంగా చూశాను!
వివేక్ లోపలికి వస్తూ కనిపించాడు. అతని వెనకాల తన్మయి వస్తోందేమోనని చూశాను , రాలేదు.
వివేక్ శీఖావాళ్ళ అన్నయ్యకి క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం నాకు అప్పుడే గుర్తోచ్చింది.
వివేక్ ని చేత్తో పిలిచింది విజయ.
వస్తూనే అతను, నా వైపు చూడనన్నా చూడకుండా దానితో "ఎలా వుంది ప్రాక్టీసు?" అన్నాడు.
"ఆహ! మూడు పెళ్ళిళ్ళూ ఆరు విడాకులూగా వుంది! ఏదో ముంచుకుపోయినట్లు పెళ్లిళ్లు చేసేసుకోవడం, సంవత్సరం తిరగకుండా వీడాకుల కోసం పరిగెత్తుకు రావడం... దివ్యంగా సాగుతోంది ప్రాక్టీసు!" అని నవ్వింది.
నేను గతుక్కుమన్నట్లు వారిద్దరి వంక చూశాను.