చలపతి చేతిలోని కండువాను కొయ్యపెట్టెలోకి విసిరికొట్టాడు. మంగమ్మ విజయగర్వంతో కొడుకు జేబులో వంద రూపాయల నోటు కుక్కింది.
కళ్ళలో వత్తులు వేసుకొని భర్తకోసం ఎదురుచూస్తున్న గంగాభవానికి చలపతి తల వంచుకొని బస్ స్టాండు కేసి నడవడం కనిపించింది.
అంతే! కాళ్ళలో సత్తువ ఎవరో లాగేసినట్లు అయింది.
* * *
పోలేరమ్మ గుడి దగ్గర - మహాలక్ష్మమ్మ చెట్టుకింద-
"అద్దద్దా! అల్లల్లల్లా! ఆఁ __హూఁ!" మునివేళ్ళ మీద నిల్చుని జుట్టు విరగబోసుకొని ఊగుతున్న స్త్రీ చుట్టూ జనం చేరారు. కడవలకొద్దీ నీళ్ళూ__సాంబ్రాణి పొగా__జనం రాదా తిరణాలలా వుంది.
"తల్లీ, నువ్వు ఎవరివో చెప్పు?" అడిగాడు ఊరి పెద్ద.
"నీ కళ్ళు పోయినయ్యట్రా? నే నెవరో తెలియడంలా? అద్దద్డా! విరుచుకు తింటా! నలుచుకు తింటా!"
'తెలిసింది తల్లీ. శాంతించు. మొన్ననేగా కొలువులు కొలుచుకున్నాం' అన్నాడు ఒక పెద్దమనిషి.
'నా భక్తురాలికి అన్యాయం జరుగుతూ వుంటే చూస్తూ ఊరుకుంటానా! మీ గొడ్డూ గోదా నమిలేస్తాను.'
'క్షమించు తల్లీ. ఇప్పటికే ఊళ్ళో ఎన్నో పశువులు గాలికుంటు వ్యాధికి బలి అయ్యాయి. చెప్పు తల్లి. నీ భక్తురాలు ఎవరు?' అడిగాడు జనంలోనుంచి మరో పెద్దమనిషి. 'అద్దద్దా! ఆఁ-హూఁ !' పూనకం తారాస్థాయిని అందుకొన్నది.
ఇదంతా చూస్తున్న నాంచారమ్మకు మతిపోయినంత పని అయింది. అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది.
"అమ్మా! పోలేరమ్మ తల్లీ! నీ భక్తురాలు ఎవరు చెప్పు తల్లీ!" నాంచారమ్మ తెప్పరిల్లి అడిగింది.
"గంగాభవాని!" పళ్ళు పటపట కొరికింది.
చాలామంది ముఖముఖాలు చూసుకొన్నారు.
'ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పు తల్లీ అడిగింది నాంచారమ్మ.
'ఏడీ? వాడేడే? ఆ చలపతి ఏడీ? ఆ మంగమ్మ ఏదీ? ఎక్కడ?'
జనాన్ని తోసుకుంటూ భద్రయ్య ముందుకు వచ్చాడు.
'ఏమిటిది? రా ఇంటికి పోదాం' అన్నాడు.
"ఆఁ-ఎవడివిరా నువ్వు? నువ్వా? నీ ఇంట్లోపడి తినడం మొదలుపెట్టానురా! నీ గొడ్లు రెండు చచ్చాయి. ఇంకా చస్తాయి. నన్ను ఇంటికి పిలుస్తున్నావా?" గుడ్లు ఉరిమింది గణం పెరిగిన గంగాభవాని.
భద్రయ్యకు ఒళ్ళు జలదరించింది.
"తల్లీ, శాంతించు." చేతులు జోడించాడు భద్రయ్య.
"ఇంకెక్కడి శాంతిరా? ఆ చలపతిగాడిని ఈడ్చుకురండి. నలుచుకు తింటా."
జనంలోనుంచి ఒక్కొక్కరే చిన్నగా తప్పుకున్నారు.
మూడు రోజులనుంచి పోలేరమ్మ గుడిముందు చెట్టుకింద దిమ్మెమీద బైఠాయించింది గణం పెరిగిన గంగాభవాని.
గణాచారి నాన్చారమా, తల్లీ, తండ్రీ ఆమెను కనిపెట్టుకొని వున్నారు.
మొదటి మూడు రోజులూ ఊళ్ళో వాళ్ళు గంగాభవాని గురించి చిత్రంగా, హేళనగా చెప్పుకొన్నారు.
ఈ వార్త పక్క ఊళ్ళకు పాకింది. ఊళ్ళో వాళ్ళకంటే పొరుగూళ్లో వారికే భక్తిశ్రద్దలు ఎక్కువయ్యాయి.
ఊళ్లోను, చుట్టుపక్కల ఊళ్లలోను గొడ్ల జబ్బులు ఎక్కువయ్యాయి.
గంగాభవాని సహాయంగా చుట్టుపక్కల ఊళ్ళ గణాచారులంతా అక్కడా చేరారు. ప్రతి నిమిషం వాళ్ళలో ఎవరో ఒకరికి గణం పెరుగుతూనే వుంది. ఊళ్ళో వాళ్ళు భయపడిపోయారు. పోలేరమ్మ గుడికి సరఫరాలు చేరుతున్నాయి. అక్కడే వంటలూ, నైవేద్యాలూ చెల్లిపోతున్నాయి.
గణాచార్ల మధ్యలో గంగాభవాని కూర్చుని వున్నది. దిమ్మెమీద ఎత్తుగా కూర్చున్న ఆమె గ్రామ దేవతల పెద్దలా కనిపిస్తున్నది.
నాలుగో రోజు వూళ్ళో పెద్దలంతా వెళ్ళారు.
"ఏం చెయ్యమంటావు తల్లీ?" చేతులు జోడించి అడిగారు.
"వాణ్ణి - ఆ చలపతిగాణ్ణి లాక్కొచ్చి నా కాళ్ళమీద పడెయ్యండి..." అన్నది. ఊరు వూరంతా ఏకమై మంగమ్మ ఇంటిమీద పడింది.
'అన్నీ దొంగ ఎత్తులు. టక్కులమారి ముండ.' మొదటి రెండు రోజులూ మంగమ్మ కోడల్ని దుమ్మెత్తి పోసింది. మూడో రోజుకు మంగమ్మ నోటికి తాళం పడింది. ఆ రాత్రి మంగమ్మకు జ్వరం వచ్చింది గొడ్లు చచ్చిపోయిన వాళ్ళంతా మంగమ్మను శాపనార్ధాలు పెట్టారు.
ఇక చలపతి పని సరేసరి! మతిపోయినట్లయింది. ఇంట్లో దూరి, బయటి ముఖం చూడకుండా నిండా ముసుగు పెట్టుకొని పడుకున్నాడు.