Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 16


    భూతరాజు దయ్యంకాదు.

 

    కోతిచేష్ట సహజమైందే!

 

    అసలే భయపడుతుండడంవల్ల అది దూకగానే భయపడ్డాను. అది మామూలు కోతిచేష్టే.

 

    ఈ పిల్లనుకూడా వీళ్ళే కుట్రపన్ని తనను భయపెట్టడానికి ఉపయోగించి ఉంటారు. దాంతోపాటు మరొకడెవడైనా ఉండే ఉంటాడు. లేకపోతే ఆ పిల్లకు పిచ్చేమిటి? ఆ కళ్ళలో తనకు పిచ్చితనం ఎక్కడా కన్పించడం లేదు.

 

    మళ్ళీ దూరంనుంచి వస్తున్నట్టుగా ఉన్న గాజులమోత, వెండి గజ్జలు మొజాయిక్ ఫ్లోర్ మీద పడినట్టు మధురమైన నవ్వు.

 

    నాకుకూడా నవ్వొచ్చింది. ఆ పిల్లే పొదల్లోంచి గాజులు మోగిస్తుందనీ, నవ్వుతోందనీ అర్థం చేసుకొన్నాను.

 

    ఇక ఊరు చేరేంతవరకూ వీడ్ని పలకరించకూడదు.

 

    నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

 

    అది ఆరోజు రాత్రి పదిగంటలకు టెలిగ్రాం మోసుకొచ్చిన ఒక దారుణమైన వార్త. ఈ టెలిగ్రాములు ఎప్పుడూ రాత్రిపూటే వస్తాయి.

 

    నా చెల్లెలి భర్త పొలంలో పాము కరాచీ చనిపోయాడనే వార్త.

 

    11 గంటల బస్ లో బయలుదేరాను. మనసంతా ముసురుపట్టిన ఆకాశంలా ఉంది. నా చెల్లెలి ముఖం కళ్ళలో మెదలుతోంది. మనసు తరుక్కుపోతున్నది. నా చెల్లిని తల్చుకుంటూ ఉంటే, కళ్ళవెంట నీరు కారుతోంది. తుడుచుకోవడంకూడా మర్చిపోయి కూర్చున్నాను. మూడు గంటల ప్రాంతంలో బస్సు కర్నూలు చేరింది. బస్సు దిగి మైలుదూరంలో ఉన్న ఆ చిన్న గ్రామం వెళ్ళాలి. నడక సాగింది. చీకటి రాత్రి. పైగా వర్షం సన్నగా పడుతోంది. మనసులో బాధ. ఉండీ ఉండీ కళ్ళు నీరు చిప్పిస్తున్నాయి.

 

    చల్లటి గాలి వీస్తోంది. వర్షం ఆగిపోయింది. బట్టలు తడిసిపోయాయి. మబ్బులు మెల్లమెల్లగా విచ్చుకొంటున్నాయి. కాలిబాటన నడుస్తున్నాను. అక్కడక్కడ బాటలోని గుంటలోని నీరు నా కాలు పడినప్పుడల్లా చిందుతున్నాయి.

 

    నా దృష్టి చుట్టూ ఉన్న వాతావరణం మీద లేదు.

 

    ఎప్పుడెప్పుడెళ్ళి నాచెల్లిని అక్కున చేర్చుకొని ఊరడిద్దామా అనే ఆదుర్దాలో ఉన్నాను.

 

    అల్లంత దూరంలో ఊరి పొలిమేరలో రెండు ఆకారాలు కొంచెం దూరంలో నిల్చుని ఉన్నాయి. నడుస్తూనే కళ్ళు తుడుచుకొని చూచాను. ఇద్దరు లంబాడా యువతులు నిల్చుని ఉన్నారు. అనుకోకుండా తృళ్లిపడ్డాను. ఇక్కడ ఈ చీకట్లో వాళ్లెందుకు నిల్చున్నట్టు ? కళ్ళు తుడుచుకున్నాను. ఓ క్షణం నిల్చున్నాను. వాళ్ళు అలాగే నిల్చుని ఉన్నారు.

 

    నాకు దయ్యాలమీద నమ్మకం లేదని చెప్పాను గదూ ?

 

    అవి దయ్యాలని నమ్మలేకుండా ఉన్నాను. అయినా ఎవరో అర్థం కావడంలేదు.

 

    "ఎవరక్కడ ?" గట్టిగానే అరిచాను.

 

    వాళ్లు ఉలకలేదు, పలకలేదు. అక్కడ్నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు.

 

    నా మనసు ఏదో శంకతో అంత బాధలోనూ భయపడింది.

 

    అటు చూడకూడదనుకొంటూనే చూశాను.

 

    జుట్టు ఎగురుతున్నది. రంగురంగుల పూసలు మెళ్లో. బట్టలకు అద్దాలు. మొదటికంటే స్పష్టంగా కన్పిస్తున్నారు.

 

    "ఎవరు మీరు?" మళ్ళీ కేకవేశాను.

 

    సమాధానం లేదు.

 

    నేను అటు చూడకుండా గబగబా ముందుకు దాటిపోయాను.

 

    కొంతదూరం నడిచి వెనక్కు తిరిగిచూశాను. వాళ్లు అలాగే ఉన్నారు. పైగా ముఖాలు నా వైపుకు తిప్పారు.

 

    సుబ్బారావు మాటలు గుర్తొచ్చాయి.

 

    "నీకు తెలియనివి, ఇంకా విజ్ఞానానికి అందనివీ లేవంటే లేకుండా పోతాయా ? చనిపోయాక ఇంకేమీ ఉండదంటారు మీవంటి కొద్దిమంది భౌతికవాదులు. కాని అనాదిగా మానవుడు దయ్యాల్ని నమ్ముతూ వచ్చాడు. ఇప్పటికీ నమ్మేవాళ్ల సమాఖ్య నమ్మని వాళ్లకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. నమ్మేవాళ్లంతా పిచ్చివాళ్లు కారు. పెద్దపెద్ద మేధావులు కూడా నమ్ముతున్నారు" అంటూ వాదిస్తాడు ఆవేశంగా. నేను వాడి మాటలకు నవ్వి ఊరుకుంటాను.

 

    మరి ఈ అనుభవం ఏమిటి ?

 

    గుండెలో పేరుకొంటున్న భయాన్ని లక్ష్యపెట్టనట్టు నాకు నేనే సర్దిచెప్పుకొంటూ వెళ్ళిపోయాను.

 

    తీరా ఊళ్లో ప్రవేశించేసరికి నా మనసు దుఃఖభారంలో ఆలోచనలతో భయం మరుగున పడిపోయింది.

 

    మనిషి మనసు అతనికి తెలియకుండా సుఖాన్ని కోరుకుంటుంది. ఎక్కువ రోజులు బాధపడటం ఇష్టపడదు. అందువల్లనే ఎంత దుఃఖం కూడా కాలక్రమేణా తన తీవ్రతను కోల్పోతుంది. అందుకే అంటారు కాలమే గాయాన్ని మాన్పుతుందని.

 

    అంత్యక్రియలు జరిగాయి. చిన్నదినం కూడా అయిపోయింది. అప్పుడే నా బావమర్ది పోయి మూడురోజులైంది. ముందు కార్యక్రమాన్ని గురించిన ఆలోచనలో పడ్డాను. చెల్లెలి భవిష్యత్తు గురించీ, పిల్లల భవిష్యత్తు గురించీ ఆలోచనలు సాగుతున్నాయి.

 

    అకస్మాత్తుగా ఆ రాత్రి నేను చూసిన లంబాడా యువతులు గుర్తొచ్చారు. అదేమిటో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా బయలుదేరాను. ఆ ప్రదేశానికి వచ్చి నిల్చుని నాలోనేను నవ్వుకున్నాను.

 

    అవి రెండు ఈతచెట్లు.

 

    వర్షం! చీకటి! తడిబట్టలు! ఈదురుగాలి!

 

    శరీరం బాధ పడుతోంది.

 

    కళ్ళల్లో నిముష నిముషానికీ ఉబికివస్తున్న నీరు!

 

    గుండెల్లో పేరుకుపోతున్న దిగులు!

 

    కన్ను చెదిరింది.

 

    దయ్యాలను నమ్మను కనుక కళ్ళు తుడుచుకొని మళ్లీ చూశాను. ఆ చెదిరిన రూపాలు ఇంకొంచెం స్పష్టంగా ఉన్నట్టు కన్పించాయి. చూసిన కొద్దీ- ముందు లంబాడా యువతులుగా భావన కలగడంవల్ల డిటైల్సు కన్పించసాగాయి. చిన్నప్పుడు ఆరుబయట నులకమంచంమీద పడుకొని మబ్బుల్ని చూస్తుంటే అవి రకరకాల ఆకారాలలో కన్పించేవి. మనం ఎలా భావిస్తే అలా కన్పించేవి.


                                     *    *    *

 Previous Page Next Page