"నేను మాధవిని.. మీ కోడల్ని మామగారు" అంది ఎలాగో మాట పెకిలించుకుని, దుఃఖాన్నాపుకుంటూ.
"ఆ...కోడలివా? ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఒక్క నిమిషం ఇద్దరిమధ్యా నిశ్శబ్దం తాండవం చేసింది.
"ఏమిటమ్మా నువ్వంటున్నది? నా జీవితంలో కోడలే కాదు, కొడుకు కూడా లేడమ్మా" బాధగా అన్నారు.
మామగారూ... ఏదో చెప్పబోయింది మాధవి.
"అన్ని బంధాలూ తెంచుకుని ఈ ప్రపంచం నుంచే వెళ్ళిపోయిన వాడిమీద ఎందుకమ్మా అభాండాలు వేస్తావు? నీకేమయినా బాధలుంటే చెప్పు - ఏ సహాయమైనా చేస్తాను. నా ఆస్థినీ, ఐశ్వర్యాన్నీ దానధర్మాలు చేస్తున్నా, నీకేం కావాలో చెప్పు."
మాధవి అహం దెబ్బతింది. కొరడాతో ఛెళ్ళున కొట్టినట్లనిపించింది. "నేను ముష్టెత్తడానికి రాలేదు. అభాండాలు వెయ్యవలసిన అవసరమూ నాకు లేదు. ఈ ఇంట్లో కోడలిగా నాకుండే స్థానాన్ని పొందడానికే వచ్చాను."
"ఎవరిచ్చారా స్థానం నీకు?"
"ఏనాడయితే అజయ్ కి భార్యనయ్యానో, ఆనాడే మీ కోడలినయ్యాను. ఈ స్థానాన్ని పొందాను."
"లేని మనిషి మీద నిందలు మోపి, నాటకం బాగానే ఆడుతున్నావ్?"
"నాటకం ఆడుతున్నది నేనా? మీరా? అన్నీ తెలిసి ఏమీ తెలీనివారిలాగా ప్రవర్తిస్తున్నారు. పైగా సానుభూతి చూపిస్తున్నట్టు ఏ సహాయమైనా చేస్తానూ అంటూ హామీ ఇస్తున్నారు. ఇదంతా ఎందుకోసం? మీ స్వార్థం కోసం. పెద్ద ధర్మదాత అని పేరు తెచ్చుకోవడం కోసం. చనిపోయిన వారి భార్యగా ఆస్థిని ఎక్కడ అడుగుతానో అని మీ భయం. అందుకే అన్నీ తెలిసి కూడా, ఏమీ తెలీనివారిలాగా నాటకం ఆడుతున్నారు" ఆవేశంతో చెప్పుకుపోయింది మాధవి.
"ఓహో! అయితే నీ పన్నాగం చనిపోయిన నా కొడుకుకి భార్యగా ఈ యింట్లో హక్కు పొంది ఆస్థిని రాబట్టుకోవడమన్నమాట."
శూలాల్లా గుచ్చుకున్నాయా మాటలు మాధవికి. కోపంతో వొణికిపోతూ, కాదు. మీ ఆస్థికోసం గడ్డితినే అవసరం నాకు లేదు. చదువుకున్నాను, ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నాను."
"అయితే ఎందుకిలా నా యింటి మీద పడ్డావ్?"
"చెబుతా వినండి. నా కడుపులో పెరుగుతూన్న మీ వంశాంకురాన్ని మీ నీడలో పెంచాలనే ఆశతో ఈ గడప తొక్కాను.
"ఏ...ఏకంగా వారసత్వాన్నే అంటగడదామనుకున్నావా? పెద్ద ప్లానే! తెల్లారి లేస్తే లక్షమందొస్తారు. ఇదొక రకం ముష్టి! ఛీ...ఛీ..."
"అనవసరంగా నోరు పారేసుకోకండి. మీ అంతస్థులో నేను పేదరాలినే. కానీ కన్నబిడ్డని పోషించుకోలేనంత దరిద్రురాలను కాను. నా కాళ్ళమీద నేను నిలబడగలను. నా బిడ్డను నేను పోషించుకోగలను."
ఐతే పరువుగా బతకడం కూడా నేర్చుకో!
అజయ్ భార్యగా నేనెప్పుడూ పరువుగానే బతుకుతాను. అనవసరంగా నోరుజారితే మీరే బాధపడతారు. పుట్టబోయే బిడ్డ గురించి చెప్పడం నా ధర్మం కాబట్టి ఇక్కడికొచ్చాను. అంతేకాదు. ఇటువంటి పరిస్థితి సంభవిస్తే ఈ విషయం మీతో చెప్పమన్నవారి ఆజ్ఞ పాటించడానికే ఇంకా మీ ముందు నిలుచున్నాను అంది దుఃఖాన్ని ఆపుకుంటూ మాధవి.
అంతవరకూ సంభాషనంతా చాటునుంచి వింటూన్న గోవిందమ్మ రావుగారెక్కడ మెత్తబడి సరేనంటారో, పరిస్థితి అంతవరకూ తేకూడదన్న ఆలోచన రాగానే లోపలికొచ్చింది.
తల వంచుకుని నుంచున్న మాధవిని చూసి "అమ్మా తల్లీ నువ్వెవరివో కానీ అతని మనసు పాడు చేస్తున్నావ్. అసలే అతని ఆరోగ్యం బాగోలేదు పద బయటికి. పద అంటూ దాదాపు గెంటినంతపనీ చేసింది.
పోతాను. ఒక్క విషయం చెప్పి మరీ పోతాను. ముత్యుంజయరావుగారూ! వినండి. ఏదో ఒకరోజు బాంధవ్యం బయటపడి మమకారం పీకుతూ వుంటే మనసు విలవిలలాడిపోతూ ప్రాణాలు తల్లడిల్లిపోతూంటే ఈ ఆస్థీ, అంతస్తూ, ఐశ్వర్యం, హోదా అన్నీ మిమ్మల్ని చూసి వెక్కిరిస్తూ పిచ్సివాణ్ణి చేస్తాయి. అభిమానం నరనరాన్ని కోసి చిత్రహింస పెడుతుంది. అప్పుడు... ఈ డబ్బుతో మీరు ఏదీ సాధించలేరు. జ్ఞాపకం ఉంచుకోండి అంటూ రివ్వున తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.
మాధవి తిరిగిరావడం చూసింది సుశీలమ్మ. చేతిలో పనినాపి ఏం జరిగిందోనన్న కుతూహలంతో పరుగెత్తుకొచ్చింది. మంచం మీద బోర్లాపడి ఏడుస్తున్న మాధవిని చూసి విషయం గ్రహించుకుంది.
"ఏడవకు మాధవే౧ లే. ఉత్తమనిషివి కూడా కాదు. ఇలా ఏడ్చి ఏడ్చి ఆరోగ్యం పాడుచేసుకుంటే ఎలా?"
"ఇంకా ఏం చూసుకుని బ్రతకమంటావ్ పిన్నీ? వెళ్ళమన్నావుగా అత్తారింటికి, వెళ్ళొచ్చాను. అన్ని మర్యాదలూ పొందొచ్చాను. దిండులో మొహం దాచుకుని వెక్కివెక్కి ఏడుస్తుంది.
"మధూ! ఊరుకో" అని నుదుటిమీద చెయ్యి వేసిన సుశీలమ్మ "అబ్బ ఒళ్ళు కాలిపోతోంది! లే. డాక్టరు దగ్గరకెళ్ళి మందు తెచ్చుకుందువుగానీ" అంటూ లేవనెత్తింది.
"మందొద్దు పిన్నీ! కాస్త విషం తెప్పించు, నీకు పుణ్యం వుంటుంది."
"ఛ... పిచ్చిదానా! అవేం మాటలు? జీవితం జీవించడానికి కానీ చావడానికి కాదమ్మా. లే. నువ్వు లేచి మొహం కడుక్కుని రాకపోతే నామీదొట్టే" బలవంతం చేసింది.
మెల్లగా లేచి మొహం కడుక్కుని, బట్టలు మార్చుకుంది మాధవి. సుశీలమ్మ వేడి వేడి టీ చేసి తెచ్చింది. మాధవి టీ తాగుతూంటే బోసిగా వున్న మొహంమీద నల్లటి చుక్క బొట్టు పెట్టింది.
"పిన్నీ? ఏమిటి నువ్వు చేస్తున్నది?" కాఫీ కప్పు కింద పెట్టి అరిచింది మాధవి.
"ఏంలేదు మధూ! నీ మొహం అలా బోడిగ చూళ్ళేకపోతున్నాను. బొట్టు కాటుక భగవంతుడు ఆడదానికి జన్మతో ఇచ్చినవమ్మా. మట్టెలూ, మాంగల్యం మాత్రమే పెళ్ళయ్యాక భర్త వల్ల వచ్చేవి. అతను పోతే అతనితోపాటు పోవలసినవి కూడా ఆ రెండేనమ్మా. బొట్టూ జుట్టూ తీసేసి ఆడది అంద వికారంగ తయారఖ్ఖర్లేదు. చిన్నదానివి! నలుగురిలో తిరిగి ఉద్యోగం చెయ్యవలసినదానివి. అనాకారి వేషం పనికిరాదమ్మా..వేషంలో ఏముంది? మాటపడకుండా మను పవిత్రంగా వుంచుకో" అంది గుక్కతిప్పుకోకుండా ఆవేశంతో సుశీలమ్మ.