Previous Page Next Page 
తృప్తి పేజి 16


    "మళ్ళీ అడ్డొస్తున్నావు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఈరేగింపు కలంకరించిన పెళ్ళికారులా ఉంది. తలలో ఓ బుట్టెడు చేమంతిపూలు, వాటి చుట్టూ కనకాంబరాలు, మధ్యలో మల్లెపూలు, జడపొడుగునా ఈతాకు చాపలా మొగలిరేకులూ, వాట్ నాట్! దొరికిన పూలన్నీ పెట్టారు ఒక్క అరటిపువ్వు తప్ప!"
    "నేనడిగింది అమ్మాయి మొహం గురించి"
    "ఇంకేం కనపడుతుంది చెప్పు! ఈ బరువుకి తల ఎప్పుడో భూమిలో కుంగిపోయింది.
    "బహుశా! ఇప్పటివరకూ మళ్ళీ ఆ మెడ పైకి లేచుండదు. ఇక పాట పాడమన్నారెవరో వాళ్ళవైపువారే. కాసేపు బతిమాలించుకుంది. చక్కని సినిమా పాట పాడు అంటూ పురమాయించాడు ఇంకా బుద్ధిరాని మా పేరయ్య. అంతే ఠపీమని అందుకుంది."
    "ఏమిటి జనగణమనా"
    "అదయినా బానే వుండేది. పాడు జీవితమూ యవ్వనం, మూడునాళ్ళ ముచ్చటలేరా! అని. ఆ పాట వినగానే నాకూ ఈ యవ్వనం మీదా, బతుకు మీదా విరక్తి పుట్టి ఎదురుగుండా పెట్టిన ఓ సున్నుండ తీసుకుని అమాంతం కొరికాను. అంతే మళ్ళీ మర్నాటివరకూ నోరు తెరవలేకపోయాను."
    "ఎందుకూ?"
    "ఫెవికాల్ లా నోటికి అతుక్కుపోయిందిలే. అదంతా కరిగి లోపలికెళ్ళడానికి ఒకరోజున్నర పట్టింది."
    "చాల్లే! అబద్ధాలు" నవ్వుతూ అంది యమున.
    "అబద్ధాలేమిటి! ఇవేళ పొద్దుట కూడా అమ్మ ధనంపేట సుబ్బలక్ష్మి సంబంధం ఖాయం చేయమంటావురా అనడిగింది తెలుసా?"
    "చేసుకోమరి! చక్కచక్కని పిండివంటలవీ తింటుండొచ్చు."
    "పిండివంటల సంగతొదిలెయ్. ఒక రైస్ మిల్లు, సినిమాహాలూ సుబ్బులు పేరిట రాసేస్తానన్నాడు వాళ్ళ నాన్న!"
    "అయితే ఇకనేం! మహారాజులా చేసుకోక?" ఈసారి నిజంగానే కోపమొచ్చింది యమునకి.
    "ఎన్నిచ్చినా వాళ్ళ నాన్నని మాత్రం భరించలేం బాబూ! అన్నిటికీ ముక్కున వేలుంచుకుని "భలే, భలే" అంటాడు.
    "నీపేరేమిటన్నావు?" అని అడిగాడు రైలు దిగగానే. "చంద్రశేఖర్" అనగానే "భలే భలే" అన్నాడు ముక్కున వేలుంచుకుని.
    "ఏం చదివావు నాయనా?" అని అడిగాడు మళ్ళీ. "బిఇ" అండీ అన్నాను. మళ్ళీ "భలే భలే" అన్నాడు బానేవుంది.
    "తాతగారు ఏం చేస్తున్నారు?" అని అడిగాడు. "పోయారండి" అని చెప్పగానే "భలే భలే" అన్నాడు ముక్కున వేలుంచుకుని. దాంతో నాకొళ్ళు మండిపోయిందనుకో"
    అతని అభినయం చూసి నవ్వాపుకోలేక పకపకా నవ్వేసింది యమున. "నల్లపిల్ల" అంటూ ముక్కు పట్టుకునూపి ఆమె కోపంగా చూడగానే "తమిళంలో చెప్పాను" అన్నాడు నవ్వుతూ.
    "బయల్దేరదాం!" అంది లేచి నిలబడి. ఆమె చెయ్యందుకుని "జాణవులే! మృదుపాణివిలే!" అంటూ పాడ్తూ లేచి నిలబడి చెప్పాడు_
    "రేపు మా ఇంటిల్లిపాదీ గుర్తుంచుకునే రోజు!"
    "ఏం?" అడిగింది యమున.
    "మా అమ్మా నాన్నగారూ పాతికేళ్ళక్రితం చేసిన తప్పుకు రూపం వచ్చినరోజు!"
    "అబ్బా! నా మట్టిబుర్రకు అర్థమయ్యేలా చెప్పు!" అంది విసుగ్గా.
    "అంటే నా పుట్టినరోజన్న మాట" గబగబా చెప్పేశాడు.
    యమున బుగ్గలు ఎర్రబడ్డాయి. "ఇప్పుడా చెప్పడం?" అంది అలకగా.
    "ఇందాక చెప్పుంటే ముద్దు పెట్టుకోనిచ్చేదానివా?" అడిగాడు కొంటెగా.
    "ఛీ పో! ఎప్పుడూ అదే" మళ్ళీ సిగ్గుపడింది.
    "రేపు మాత్రం తప్పదు! అదే నా పుట్టినరోజు కానుకనుకుంటాను" ఆమె చేతిని గట్టిగా నొక్కుతూ చెప్పాడు.
    "రేపు కూడా ఇలా వస్తే ఆలస్యమైపోతుంది శేఖర్! రోజూ ఐతే ఇంట్లో కూడా అనుమానమొస్తుంది. అయినా ఈవేళ ఈ సినిమా ప్రోగ్రామ్ ఎందుకు పెట్టినట్లు?" అడిగింది చిరుకోపంగా.
    "రేపు నా పుట్టినరోజు కాబట్టి హీరోయిన్ లీవ్ పెట్టాలి. అది చెప్పడం కోసం ఇవేళ ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను తప్పా!"
    ఆమెకి కోపమొచ్చిందని తెలిసి బతిమాలుతున్నట్లు అడిగాడు. "ప్లీజ్! లీవ్ పెడ్తావు కదూ! గోల్కొండ వెళ్దాం"
    "అమ్మో!" గుండెల మీద చెయ్యేసుకుంది యమున.
    "గోల్కొండకే అమ్మో అంటావేంటి? పెళ్ళయితే గ్లోబుమీదున్నవన్నీ తిప్పేస్తాను" చెప్పాడు సీరియస్ గా శేఖర్.
    "నీ ధోరణి నీదేగానీ నా సంగతాలోచించవు. ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా వుంటుంది? మనం పెళ్ళి చేసుకోబోతున్నట్లు వూళ్ళో అందరికీ తెలియదుగా! ఈ అమ్మాయి అందరితో ఇలాగే తిరుగుతుందేమో అనుకుంటే! తెలిసినవాళ్ళు చూసి, అమ్మకీ, నాన్నగారికి తెలిస్తే అంత తొందరగా వుందా దానికి అనుకుంటే! ఛీ! సిగ్గుతో నా ప్రాణాలు పోవూ!" అడిగింది బాధగా.
    శేఖరేం మాట్లాడలేదు కాసేపు. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. "నావల్లే కదా ఇదంతా" అంటున్నట్లుగా ఉంది అతని మౌనం. బస్టాపు చేరాక కూడా అతను మాట్లాడలేదు. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి నవ్విస్తుండే అతను అలా అయిపోవడం చాలా బాధగా అనిపించింది యమునకి. దూరంనుండి బస్ వస్తున్నట్టు కనిపించింది. ఏమైనా చెప్తాడేమో అని శేఖర్ వైపు చూసింది. అతను తల తిప్పుకున్నాడు. బస్ చాలా దగ్గరకొచ్చేసింది. "శేఖర్" అంది. అతను ఆమెవైపు చూడలేదు. బస్ ఆగింది. కళ్ళనిండా నీళ్ళతో ఎక్కేసింది. మనసంతా చేదుగా అయిపోయింది. పుట్టినరోజని చెప్తే బాధపెట్టానేమో! అయినా అంత మొండితనమా? మాట్లాడకుండా శిక్షిస్తాడా? రేపు కలుస్తాడో లేదో! చూసి మామూలుగా మాట్లాడేదాకా మనసు మనసులో వుండదు. తనకు మాత్రం తెలీదా? ఆలోచిస్తుండగానే తన స్టేజ్ వచ్చేసింది. దిగి అన్యమనస్కంగా అడుగులు వెయ్యసాగింది.

 Previous Page Next Page