Previous Page Next Page 
ఆలింగనం పేజి 16


    నన్ను పడేసిన అమ్మాయి తల ఎగరేసి నవ్వింది. కార్లలో వచ్చే చాలామంది అమ్మాయిలు కాళ్లతో నడిచే అమ్మాయిల్ని చులకనగా చూడడం కాలేజీలో పరిపాటే!

 

    "సో...ది విన్నర్ ఈజ్" అని సందీప్ నా ముఖంలోకి చూశాడు.

 

    నా చెయ్యి ఇంకా అతని చేతిలోనే ఉండటం నేను అప్పుడే గమనించి వెనక్కి తీసుకోబోయాను.

 

    అతను ఇంకా గట్టిగా పట్టుబిగిస్తూ నా చేతిని పైకిలేపి "మిస్..." అని పేరుకోసం ఆగాడు.

 

    "ఆముక్త!" అన్నాను.

 

    "ఆ...ము...క్త" అని ఎనౌన్స్ జేశాడు.

 

    అప్పటిదాకా నా పేరు కాలేజీలో ఓ పదిమందికి తప్ప తెలీదు. ఇప్పుడు అందరికీ తెలిసింది.

 

    నాకు చాలా గర్వంగా అనిపించింది.

 

    సందీప్ నా చేతిని ఒదిలిపెడుతూ "వెరీ స్వీట్ నేమ్" అన్నాడు.

 

    థాంక్యూ చెప్పాలని కూడా నాకు తోచలేదు.

 

    సందీప్ ఓ పెద్ద గిఫ్ట్ ప్యాక్ తియ్యగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు.

 

    "ఆముక్తకి మనందరి తరపునా... ఈ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్..." అన్నాడు.

 

    నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను.

 

    చిన్నతనం నుండి తీరని కోరిక...వెన్నెల రాత్రుల్లో డాబామీద పడుకుని... మంద్రంగా "ఎహేసాన్ తేరా...హోగా ముఝ్ ఫల్..." అనే తీయని పాటలు వినాలని.

 

    ఆ కోరికవల్లే సుబ్బులూ వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని.

 

    ఆ కోరికవల్లే శివా మీద ఈర్ష్యపడేదాన్ని!

 

    అలాంటిది... ఇప్పుడు అవన్నీ నా స్వంతం! నాకు ఇష్టమైనప్పుడు వినచ్చు! నిజంగానా...గిచ్చుకొని చూసుకోవాలనిపించింది. నా జీవితంలో ఎవరూ అంత విలువైన కానుక ఇవ్వలేదు. అతనివైపు కృతజ్ఞతగా చూశాను.

 

    అతని కళ్ళు నా కళ్ళతో కలవగానే నవ్వాయి.

 

    నేను కదుల్తుండగా అతను నా ఓణీ అంచు పట్టుకున్నాడు. నా గుండె జల్లుమంది!

 

    అతను నా ఓణీ అంచుకు చిక్కుకున్న కర్రపుల్లని జాగ్రత్తగా విడదీసి పారేశాడు.

 

    ఆ అనుభూతి అనుభవించాలేకానీ నేను వర్ణించలేను. బహుశా డయానా కూడా ఛార్లెస్ తనను పెళ్ళి చేసుకుంటానన్న రోజున పొందలేదేమో అనుకున్నాను కానీ... ప్రతి ఆడపిల్లకీ బహుశా అది అనుభవమే అనుకుంట! వైజయంతి ఇట్టే పట్టేసింది.

 

    "కాళ్ళు భూమిమీద నిలవడంలేదేం?" అంది.

 

    నేను గిఫ్ట్ ని గుండెల దగ్గరగా పట్టుకుని గర్వంగా క్లాస్ వైపు నడిచాను.

 

    "ఆగు... ఇంకా చాలా గేమ్స్ వున్నాయి" అంది చిత్ర.

 

    "ఉహూ!" అని వెళ్ళిపోయాను.

 

    నాకు ఆ సమయంలో వీళ్ళంతా మాయమయిపోయి నేను ఏకాంతంగా మిగిలిపోవాలనిపించింది. క్లాస్ లో లాస్టుబెంచ్ లో కూర్చుని బ్లాక్ బోర్డువైపు చూస్తున్నా. నా కాలి బొటనవేలినుండి తలవెంట్రుక వరకూ ఇంకా కనిపిస్తోంది. చేతిమీద అతని స్పర్శ ఇంకా తాజాగా ఉంది! అప్రయత్నంగా పెదవులకి ఆనించుకున్నాను.

 

    "స్వీట్ నేమ్" అతని గొంతు నా చెవుల్లో ప్రతిధ్వనించింది. ఆ హాయిని మోయలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాను. మొహం ముందు ఎవరో గట్టిగా చిటికెలు వేస్తుంటే కళ్ళు తెరిచాను.

 

    వైజయంతి నవ్వుతూ "పడ్డావా...ప్రేమలో?" అంది.

 

    తల అడ్డంగా ఊపి "ఛీ" అనే హిపోక్రసీ చూపలేకపోయాను. "ఔను!" నిర్భయంగా చెప్పాను.


                                                          *  *  *


    ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నకొద్దీ ప్రచారం వూపందుకుంది. సందీప్ అపోనెంట్ తక్కువవాడేం కాదు. ఎవరో మినిస్టర్ గారి అబ్బాయట. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. ఒకరోజు అమ్మాయిలందరికీ కొత్త సినిమా టిక్కెట్లు కొనిపెట్టాడు.

 

    వైజయంతీ, చిత్రా చాలా సంతోషంగా నాతో "పదవే...అద్భుతమైన సినిమా" అన్నారు.

 

    నేను టికెట్ తీసుకెళ్ళి ఉదయ్ కి ఇచ్చేశాను.

 

    "ఏం, పిక్చర్ చూడరా?" అడిగాడు.

 

    "చూడను. ఇలా సినిమాకి అమ్ముడుపోయో చీరకి అమ్ముడుపోయో ఓటు హక్కు దుర్వినియోగపరుచుకోను" అన్నాను. అతను దెబ్బతిన్నట్లు చూశాడు.

 

    మధ్యాహ్నానికల్లా కాలేజీలోని అమ్మాయిలంతా సినిమాకి వెళ్ళిపోయారు. తెలుగు క్లాసులో అబ్బాయిలతోపాటు ఒక్కతెనే మిగిలాను.

 

    స్టూడెంట్స్ అంతా లేకపోవడంతో మేడమ్ క్లాసు రేపు తీసుకుంటానని వెళ్ళిపోయింది.

 

    అబ్బాయిలు కూడా బయటికి వెళ్తూ "ఈరోజు తెలుస్తోంది అమ్మాయిలు లేకపోతే క్లాసు ఎంత బోసిపోతుందో!" అన్నారు.

 

    నేను నవ్వుకున్నాను.

 

    తలవంచుకుని నోట్స్ రాసుకుంటుంటే "థాంక్స్ ఎలాట్" అని వినిపించింది.

 

    తల ఎత్తి చూస్తే సందీప్ నా పక్కనే కూర్చుని నవ్వుతూ కనిపించాడు.

 

    "ఎందుకూ" అన్నాను


    
    "ఉదయ్ ని దెబ్బ కొట్టినందుకు" అన్నాడు.

 

    అతను అంత దగ్గరగా కూర్చోవడంతో నేను ఇబ్బందిగా ఫీలయ్యాను.

 

    అతని ఒంటినుండి అదో రకమైన సుగంధం వస్తోంది. స్ప్రే అనుకుంట.

 

    'కానీ అమ్మాయిలంతా నాకే ఓటువేస్తారు" కాస్త గర్వంగా అన్నాడు సందీప్.

 Previous Page Next Page