చంద్రున్ని చూసి వికసించిన తెల్లకలువలా ఆమె వదనం విప్పారింది.
"సుధా! మా బాస్ వచ్చాడు కాఫీ ఇస్తావా?"
కృష్ణ గొంతు నూతిలోనుంచి వస్తున్నట్టుగా వుంది.
"ఉదయంనుంచి ఏమీ తినలేదు మీరు."
"ఆ సంగతి తర్వాత. ముందాయనకు కాఫీ తీసుకురా" అని గది లోనుంచి సుధవెనకే బయటికొచ్చాడు.
అవును తను ఇవ్వాళ అన్నం తినలేదు. అంటే సుధకూడా తినలేదు, తను తింటేగాని తినదు. తనకోసం ఎదురుచూస్తూ కూర్చుంది. కనీసం తను ఆమెకు ఫోన్ కూడా చెయ్యలేదు, చాలా దారుణంగా ప్రవర్తించాడు తను.
ఆలోచిస్తూ కృష్ణ నీరుకారిపోయాడు.
ఆఫీసర్, కృష్ణ డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చేసరికి రిసీవర్ పెట్టేసి లేవబోతున్నాడు.
"ఓ కె. థాంక్యూ! వెళతాను!!" అంటూ చెయ్యి ముందుకు చూచాడు.
"సర్ ఒక్క నిముషం!"
"ఓ! నో ఫార్మాలిటీస్. డోన్టు బాదర్!" అంటూ అడుగు ముందుకేశాడు,
ఎదురుగా ట్రేలో స్వీటూ, హాతూ ఉన్నప్లేట్లు, మంచినీళ్ళగ్లాస్ లూ పెట్టుకొనివస్తున్న సుధను చూసి ఆగిపోయాడు ఆఫీసర్.
"షి ఈజ్ మై వైఫ్ సుధ. వీరు మాబాస్...."పరిచయంచేస్తున్న కృష్ణ బాస్ ముఖం చూసి ఆగిపోయాడు.
సుధ ట్రే పట్టుకొని కన్నార్పకుండా బాస్ ముఖంలోకి చూస్తూంది.
"వాటె సర్ ప్రైజ్!" బిగ్గరగా, అరిచినట్టే అన్నాడు బాస్.
"అంకుల్!" సుధచేతిలో ఉన్న ట్రే కదిలి గ్లాసులోని నీళ్ళు తొణికినై.
కృష్ణకు చెమట్లు పట్టినై.
సుధ వంగి టీపాయ్ మీద ట్రే పెట్టింది.
"యూ బేబీ!" అంటూ బాస్ సుధ భుజం తట్టి ఆమెను సోఫాలో తనపక్కన కూర్చోబెట్టుకున్నాడు.
"సర్! సుధ మీకు ఇదివరకే...." నీళ్ళు నములుతూ అన్నాడు కృష్ణ.
"తెలియడమేమిటోయ్. షి ఈజ్ మై చైల్డు!" ఆప్యాయంగా సుధని చూస్తున్నాడు.
"సుధ మీకు బంధువులా సర్?"
"అంతకంటే ఎక్కువేనోయ్ కృష్ణా. సుధ ఫాదర్__ఐయామ్ సారీ! మీ ఫాదర్-ఇన్-లా, నా డియరెస్టు ఫ్రెండ్. ఉయ్ ఆర్ ఫామిలీ ఫ్రెండ్సు ఫర్ ఇయర్స్. మీ పెళ్ళికి నేను రావాలని ప్రయత్నించాను. కానీ వీలుకాలేదు. యు. యన్. ఓ. యసైన్ మెంట్ మీద నైజీరియాలో ఉన్నాను. నైజీరియానుంచి వచ్చాక ఇంకా మీ మామగార్ని కలుసుకోవడం పడలేదు.
"మూడునెలలేగా అయింది మీరొచ్చి" అన్నాడు కృష్ణ సాలోచనగా.
"చూడు బేబీ మంచి అల్లుడు దొరికాడు. సమర్ధుడు. మొన్న మద్రాస్ చాలా ముఖ్యమైన పనిమీద పంపించాను. ముందు నేనే వెళదామనుకున్నాను. కృష్ణ శక్తిసామర్ధ్యాలు తెలుసుకుందామని, జూనియర్ ఐనా పంపించాను. అల్లుడు అసాధ్యుడు. పని పూర్తిచేసికొని వచ్చాడు. త్వరలోనే కృష్ణ సీనియర్ గా గ్రేడ్ రికమెండ్ చేస్తాను. అల్లుడనికాదు సుమా! షి యర్ ఆన్ హిస్ మెరిట్."
"థాంక్యూ సర్!" కృష్ణ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు.
"సర్ గిర్ ఏమిటేయ్! అదంతా ఆఫీస్ లో, ఆఫీస్ ఆవరణ దాటాక అంకుల్. అర్ధమైందా?" అతడి వీపుమీద చరుస్తూ బిగ్గరగా నవ్వాడు బాస్.
"అంకుల్ మీరా మద్రాస్ పంపించింది?" తనలో తనే అనుకుంటున్నట్టుగా అంది సుధ.
"యస్ బేబీ! నేనేను" అంటూ సుధ ముఖంలోకి చూస్తూ ఆగిపోయాడు.
"వాటీజ్ ద మేటర్? సుధా ఏమైంది?" మళ్ళీ అడిగాడు,
"ఏమీలేదు అంకుల్, ఏమీలేదు" ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది.
"నో! నో! నువ్వేదో దాస్తున్నావమ్మాయ్!" అని గిర్రున కృష్ణవైపు తిరిగాడు.
"ఏమిటోయ్ కృష్ణా! ఏం జరిగింది?"
"నథింగ్ సర్! ఏమీలేదు సర్!"
"సే అంకుల్!"
"యస్ అంకుల్ ఏమీ జరగలేదు."
"నేను నమ్మను. సుధ హఠాత్తుగా ఎందుకలా ఐపోయింది?"
"మీ అమ్మాయినే అడగండి."
"ఏం సుధా? నాకు చెప్పడానికి సందేహమెందుకమ్మా? మీ ఫాదర్ కి ఫోన్ చేసి పిలిపించమంటావా?"
"నో! నో! ప్లీజ్ అంకుల్!"
"ఐతే చెప్పుమరి!"
"ఆయన మద్రాస్ వెళ్ళొచ్చినప్పటినుంచీ అదోలా వుంటున్నారు" బెరుకు బెరుగ్గా అంది.
"ఓ ఐసీ!"
"ఆఫీస్ పనిమీద వెళ్ళారు, అక్కడేమన్నా జరిగిందేమో? ఆఫీస్ లో తనకు ఏదైనా మాటవస్తుందని చిరాగ్గా వున్నారనుకున్నాను."
"నో! నో! అలాంటిదేమీ లేదు. హి హాజ్ డన్ ఏ వండరఫుల్ జాబ్!"
"మరెందుకలా ఉన్నారు?"
"ఏమైంది సుధా? వివరంగా చెప్పు" అనునయిస్తూ అడిగాడు అంకుల్.
సుధ కృష్ణకేసి ఓసారి చూసి తలదించుకొంది.
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
అంకుల్ కంగారుపడ్డాడు.
సుధను రెండు చేతులతో పట్టుకొని "ఏమైందమ్మా చెప్పు! కృష్ణ ఏమీ అనుకోడు, హి ఈజ్ ఏ నైస్ బాయ్ అన్నాడు.
"సుధా చెప్పరాదా! అక్కడికి నేను నిన్ను ఎన్నో రకాల కాల్చుకు తిన్నట్టు ఆ ఏడుపూ నువ్వూనూ__" కసిరినట్టు అన్నాడు కృష్ణ,
"ఉదయం రాగానే నాతో....మీరు రాగానే నాతో ఎందుకు మాట్లాడలేదు? భోజనంకూడా తినకుండా ఎందుకు వెళ్ళిపోయారూ?" నేరుగా కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సుధ.
బాస్ కు నవ్వాగిందికాదు, విరగబడి నవ్వసాగాడు.
"నవ్వుతారేం అంకుల్? ఆయనని చెప్పమనండి" చిన్నపిల్ల మారాం చేస్తున్నట్టు అనిపించింది అంకుల్ కు.
"యస్! యస్!" బలవంతంగా నవ్వు ఆపుకొని అతడివైపు తిరిగి "చెప్పవోయ్ నీ సంజాయిషీ ఏమిటో చెప్పు" అన్నాడు.
"ఫ్లయిట్ లో హెవీ బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు. ఆకలిగాలేదు. త్వరగా ఆఫీస్ కొచ్చి మీకు రిపోర్ట్ ఇవ్వాలనే ఆదుర్దాలో వున్నానుసర్! మద్రాస్ లో మన ఇన్స్టిట్యూట్ తరపున నేను కమిట్ అయ్యాను. నా నిర్ణయాన్ని మీరు ఎలా తీసుకుంటారోనన్న వర్రీలో వున్నాను. అందువల్ల హడావుడిగా ఆఫీస్ కు వచ్చేశాను. అంతే జరిగింది."
అంకుల్ పగలబడి నవ్వాడు.
"ఓ పిచ్చమ్మాయీ! విన్నావా? ఇప్పుడేం చెబుతావ్? అంత కంగారైతే ఎలాగమ్మా? నువ్వు చాలా బోల్డు గరల్ వనుకున్నాను. పెళ్ళయాక ఇలా అయిపోయావేమిటి? అవునూ! మీ పెళ్ళయి సంవత్సరం అయింది కదూ?"
"ఐంది. మొన్న వారు మద్రాస్ కు వెళ్ళినరోజు సరిగ్గా సంవత్సరం పూర్తైంది."
"యూ మీన్ అది మీ పెళ్ళిరోజా?" బాస్ గుబురు కనుబొమలు ముడిపడ్డాయి.
"అంతేకాదు. నా పుట్టినరోజుకూడా" సాగదీస్తూ చెప్పిందామె.
"పుట్టినరోజు__పెళ్ళిరోజు! వాట ఏ కో ఇన్సి డెన్స్!"
"అయినా ఈయన నన్నిక్కడ వదిలేసి మద్రాస్ వెళ్ళిపోయారు అంకుల్!"
సుధా తన మనసులో వున్న బరువును దించేసుకుంది.
"నీ పుట్టినరోజూ__పెళ్ళిరోజూ ముఖ్యమా? నా ఆఫీస్ పని ముఖ్యమా? ఏదో కొంప మునిగిపోయినట్టు ఏడుపు ముఖం పెట్టుకొని కంప్లయింట్ చేస్తున్నావ్!" కృష్ణ గొంతు పరుషంగా వుంది.
"స్టాపిట్ కృష్ణా! ఏది ముఖ్యమో కాదో నీకు తెలియదు. యూ ఫూలిష్ బాయ్. ఆరోజే మద్రాస్ వెళ్ళకపోతే ఏమైంది? ఇలాంటి సందర్భం అని నాతో ఎందుకు చెప్పలేదు?"