నాకు ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. పెళ్ళయినరోజునుండి అతను నన్ను చేసిన అవమానాలూ, హేళనలూ, కొట్టడం, చివరికి ఇంకో అమ్మాయితో రిలేషన్ పెట్టుకుని నాకు హోల్దింగ్ కెపాసిటీ లేడనడం... అంతా పూసాగుచ్చినట్లుగా చెప్పి మానసికంగా వేధిస్తూన్నందుకు కేసు పెట్టాలని వచ్చాను. కానీ ఎందుకో గొంతు పెగలడంలేదు.
ప్రొద్దుట లేవగానే నేను కళ్ళకి అద్దుకునే మంగళ సూత్రాలు ఎదమీద భారంగా కుంపట్లలా వున్నాయి!
"చెప్పమ్మా" దయగా అంది ఇనస్పెక్టర్.
ఆ ఖాకీబట్టల వెనుక హృదయం ఇంకా కరడు కట్టినట్లుగా లేదు పాపం!
"మా ఆయన...." అన్నాను. తర్వాత ఏ సంగతి ముందుగా చెప్పాలో తెలీక ఆగిపోయాను.
ఆవిడ ఓ రిజిస్టర్ తీసి- "నీ పేరూ, ఏం చదువుకున్నావో, ఏంచేస్తున్నావో ...అన్నీ చెప్పమ్మా" అంది.
"నా పేరు అనూహ్య గ్రాడ్యుయేట్ ని. పెళ్ళయి నిన్నటికి ఓ సంవత్సరం గడిచింది. వయసు ఇరవై రెండు సంవత్సరాలు. హౌస్ వైఫ్ ని... అంటే అక్షరాలా ఇంట్లో అతని భార్యని" ఉక్రోషంగా అన్నాను.
ఈసారి ఆవిడ మరింత సానుభూతిగా చూసింది. తలమీద కేప్ తీసి టేబుల్ మీద పెట్టి తల గోక్కుంటూ- "దుర్మార్గుడా?" అంది.
"అంటే?" అన్నాను.
ఆవిడ నా వైపు 'తెలుగు అర్ధం కాదా' అన్నట్లుచూసి-" శాడిస్టా?" అంది.
'అంటే?' అని మళ్ళీ అడగబోయి, అంతలోనే నేను శాడిస్టులని గురించి విన్నవీ, చదివినవీ గుర్తొచ్చి "ఉహూ!" అన్నాను. నాకు వివేక్ సున్నితంగా పెట్టె ముద్దు గుర్తొచ్చింది. తప్పు! అలాంటివన్నీ గుర్తుచేసుకోకూడదు అని మనసులోంచి తీసేశాను.
"కట్నంవిషయంలో నిన్ను హెరాస్ చేస్తున్నాడా?"
"ఉహూ!"
"తాగివచ్చి కొడ్తాడా?"
"ఉహూ!"
"నిన్నుఅనుమానంతో కాల్చుకుతింటున్నాడా?"
"ఉహూ!"
ఆవిడ కళ్ళు పెద్దవి చేసి గొంతు చిన్నది చేసి, దగ్గరగా వంగి -" నపుంసకూడా?" అంది.
"ఉహూ! ఉహూ!" అన్నాను కంగారుగా
దాంతో ఆవిడ విసుగ్గా-" నిన్ను పోషించడా? ఎదురునిన్నేసంపాదించి తనని పోషించమంటాడా? ఏవిటి దీనికీ ఉహూయేనా? ఇంకనేను చెప్పలేనమ్మా! నాకు తెలిసిన భారత స్త్రీ కి వచ్చే కష్టాలన్నీ చెప్పాను. ఇంక నావల్ల కాదు... నువ్వే చెప్పు...నేను వింటాను!" అని టేబుల్ మీదున్న మంచినీళ్ళు గ్లాసు అందుకుని గటగటా త్రాగింది.
నేను నెమ్మదిగా గొంతు సవరించుకుని- " అతను నన్ను చాలా క్షోభపెడ్తున్నాడు" అన్నాను.
ఆవిడ కనుబొమలు ముడివేసి" అంటే?" అంది.
నేను వెంటనే "నా వ్యక్తిత్వాన్నీ, అభిరుచుల్నీ గుర్తించడు! నన్ను ప్రతివిషయంలో హేళన చేసి నీకేం తెలీదు అంటాడు. నా ఇష్టల్ని గౌరవించడు. అన్నీ తన ఇష్టప్రకారమే జరగాలనుకుంటాడు. నిన్నఏం జరిగిందో తెలుసా?" అని అగాను.
పులకేశి ఆత్రుతగా నే చెప్పబోయేదానికోసం ఎదురుచూస్తోంది!
"మా మేరేజ్ ఫస్ట్ ఏనివర్సిరీ! రాత్రంతా రాలేదు. నన్ను ఒంటరిగావదలి తన మానాన తను ఎంజాయ్ చేశాడు" అన్నాను.
"అతను ఏంచేస్తాడూ? అదే ప్రోఫెషన్!"
"డాక్టర్ స్వంత నర్సింగ్ హోమ్ వుంది"
"ఆయన పేరూ?"
"వివేక్"
"నర్సింగ్ హోమ్ పేరూ?"
"అనూహ్యా నర్సింగ్ హోమ్"
"ఆ! వివేక్ మీ ఆయనా?"
"ఏం? ఆయన మీకు తెలుసా?" అన్నాను.
ఆవిడ ఔను అన్నట్లుగా చూసి- "నాకు చాలా బాధగా వుంది" అంది ఇన్ స్పెక్టర్ పులకేశా.
నా గుండె దడదడలాడింది, నాకు తెలీని భయంకరమైన సత్యాలేమైనా అతని గురించి చెప్పదుకదా అనిపించింది.
"ఆయన చాలా మంచి పేరున్న బిజీ డాక్టర్. మొన్నా మధ్య మా పిన్నికి హార్ట్ ఎటాక్ వస్తే మీ నర్సింగ్ హోమ్ లోనే చేర్పించాం. ఆయన హస్త వాసి మంచిది. పోయిందనుకున్న ఆవిడ మళ్ళీ బ్రతికి బట్ట కట్టింది. అయినా...మరీ భార్యని పట్టించుకోకపోతే ఎలా?"
నేనావిడవంక కృతజ్ఞతగా చూశాను.
"ఏమనీ?" ఆత్రుతగా అడిగాను.
"మీ ఆవిడ్ని త్వరగా ఓ మంచి సైకియాట్రిస్ట్ కి చూపించమనీ!" అంది.
"ఏవిటి మీరంటున్నది?" అన్నాను.
ఆవిడ నవ్వి- "ఈ కాలం పిల్లల్లో ఈ సమస్య చాలామంది పిల్లలకి వుంటోంది. తమకేం కావాలో తమకే తెలీదు! వేనకాల చెప్పే పెద్ద దిక్కు వుండదు. చిన్న విషయాల్నే భూతద్దాలలోంచి చూసి విడాకుల దాకానో లేక ఆత్మహత్యల దాకానో వెళ్లిపోతారు" అంది.
నేను వెళ్లిపోవడానికి లేచి నిలబడ్డాను.
"నామాటలు పూర్తిగావిని వెళ్లమ్మా... ఇందాక నేను వరుసగా చదివిన కష్టాల్లో నీకు ఒక్కటి కూడా లేదు! అయినా స్త్రీ సంక్షేమ ఫిర్యాదులశాఖదాకా వచ్చి అతని మీద కంప్లైంట్ ఇవ్వాలనుకున్నావ్! ఇదంతా నీ అమాయకత్వాన్నీ, తొందర పాటుతనాన్నీ చూపుతోంది.
మ్యారేజ్ డే రోజున అతను నీతో గడపకపోవడం తప్పే అనుకో! కానీ... అతను ఓ డాక్టర్! డాక్టర్లంటే ప్రాణదాతలు. ఏ సమయంలోనైనా వృత్తికి నిబద్ధులై వుండాలి! అంతమాత్రానికే అతని నుంచి విడిపోతావా? ఈ సెల్ పెట్టిందీ, కష్టాల్లో వున్న ఆడపిల్లలకి న్యాయం, రక్షణా అందించడంకోసం కానీ నిజంగా భర్తలవల్ల కష్టాలుపడ్తున్న ఏ ఇల్లాలూ దైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వడంలేదు. తర్వాత వచ్చే పరిణామాల గురించి భయపడి కాబోలు!" అంది.
నేను ఆశ్చర్యంగా "ఇన్ని కష్టాలుపడ్తూ కూడా ఎవరూ ముందుకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంలేదా?" అన్నాను.
ఆవిడ నవ్వి "ఉహో! నేను మాత్రం ఇచ్చానా? ఇందాకా నిన్ను అడిగిన దుర్గుణాలన్నీ మా ఆయనలో వున్నాయి. ఉన్నాయికదా అని కంప్లైంట్ వ్రాసిచ్చి జైల్లో తోయిస్తే ఈ నవభారతంలో పెళ్ళికి ఎదిగిన నా కూతుళ్ళకి సంబంధలెలా కుదుర్తాయి? అని ఆలోచించి ఊరుకున్నాను" అంది.
ఆవిడవైపు సానుభూతిగా చూశాను.
"వెళ్ళమ్మా....వెళ్ళు...నా మాట విని ఓసారి మానసికవైద్యుడ్ని సంప్రదించు... మనసు ప్రశాంతంగా వుంటుంది" అని వెనక్కి తిరగబోయింది.
ఆవిడ చెయ్యిపట్టుకుని- "మీ నాన్నగారు హిస్టరీ మేస్టారుకదూ!" అన్నాను.
"ఔను...ఎలా తెలుసూ?"
"ఊహించాను ఇప్పుడు చెప్పండి నా మతిస్దిమితంగా లేదంటారా?" అన్నాను.
ఆవిడ నవ్వి-" నా అభిప్రాయంలో ఏమీ మార్పు లేదు" అని వెళ్ళిపోయింది.
నన్ను చాచి లెంపకాయకొట్టినట్లుగా అనిపించింది.